ముంబైలోని బాంద్రావెస్ట్ నివాసంలో దాడికి పాల్పడిన దుండగుడు
దొంగతనం కోసం ఇంట్లోకి వచ్చి అఘాయిత్యం
సైఫ్ శరీరంపై ఆరుచోట్ల గాయాలు.. వెంటనే ఆసుపత్రికి తరలింపు
శస్త్రచికిత్స చేసి, వెన్నెముక నుంచి కత్తి మొన తొలగించిన వైద్యులు
తప్పిన ప్రాణాపాయం... నిలకడగా సైఫ్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు.
వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రత్యేక బృందాలతో గాలింపు
సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు.
వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
అసలేం జరిగింది?
దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు.
కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు.
నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు
మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment