టీవీల్లో తన ఫొటో రావడంతో హుతాశుడైన నిందితుడు షరీఫుల్
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్‌జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే.
విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు
తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు.
అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.
ఎలా పట్టుకోగలిగారు?
వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు.
బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు.
తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్‌క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment