బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్ కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా సల్మాన్‌పై నిఘా పెట్టింది. ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సల్మాన్ ఎక్కడెక్కడ ఉంటాడో నిత్యం ఆయన కదలికలపై నిఘా పెట్టింది.
కారుపై కాల్పులు జరిపేందుకు స్కెచ్
సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సమయం నుంచి ముంబై పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమయ్యే ఏకే-47 తుపాకులను పాకిస్థాన్‌కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారట.
వాటితో పాటు ఏకే-92, అధునాతనమైన ఆయుధాలను తెప్పించుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరపాలని స్కెచ్ వేశారట. ఒకవేళ ఆ అవకాశం కుదరకపోతే ఆయన ఉంటున్న ఫామ్‌హోస్‌లోకి చొచ్చుకుపోయి కాల్పులు జరపాలని బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ రచించిందట.
కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు ఆయన సోదరుడు అన్మోల్, గోల్డీబ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్‌కు చెందిన సుమారు 20 మంది పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఫామ్‌హోస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనపై దాడి చేసే ప్లాన్స్ వారు వేశారు కూడా.. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. కృష్ణజింకలను వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment