
భారతదేశ జాబ్‌మార్కెట్, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్‌ఏఐ) ఎంతో కీలకమని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన టెక్‌వీక్‌లో పాల్గొని మాట్లాడారు. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందనే సాధారణ భయాలకు విరుద్ధంగా, జెన్‌ఏఐ ద్వారా కొలువులు పెరుగుతాయని నొక్కి చెప్పారు.
‘తక్కువ నైపుణ్యం కలిగిన సిబ్బంది అధిక స్థాయి సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పించడం ద్వారా జెఎన్ఏఐ ఉత్పాదకతను పెంచుతోంది. సంప్రదాయ వ్యాపార ప్రయోజనాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం కంటే కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై భారత్ దృష్టి సారించాలి. భారతదేశ సాంస్కృతిక, భాషాపరమైన అంశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కచ్చితంగా ప్రాతినిధ్యం వహించేలా, వాటిని నిశితంగా అర్థం చేసుకునేలా సార్వభౌమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను(sovereign AI capabilities) అభివృద్ధి చేయాలి. ఈ సామర్థ్యాలు లేకుండా దేశంలోని సంస్కృతులు, భాషలు, ప్రత్యేక సందర్భాలను పూర్తిగా అర్థం చేసుకోవడం వీలవ్వదు’ అన్నారు.
ఇదీ చదవండి: అంచనాల్లో 74.5 శాతానికి ద్రవ్యలోటు
‘టాటా గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చురుకుగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో ఏఐను వినియోగిస్తూ భారీ ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. టాటా గ్రూప్ ప్రస్తుతం 100కి పైగా జెన్ఏఐ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో తయారీ రంగంలో 5,00,000 ఉద్యోగాలు సృష్టించబడుతాయి. భారత ఐటీ సేవల రంగం స్థాయిని పోలిన శక్తివంతమైన రంగాన్ని సృష్టించేందుకు ఏఐకు సామర్థ్యం ఉంది’ అని చంద్రశేఖరన్ తెలిపారు.