Natarajan Chandrasekaran
-
సీఎం జగన్‌ను కలిసిన టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. ఏపీలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. చదవండి: (శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం) -
ఆ విషయమై నన్నెవరూ సంప్రదించలేదు: రతన్ టాటా
Tata Group New Chairman News: టాటా గ్రూప్ కొత్త చైర్మన్ ఎంపిక విషయంలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయనే ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం చైర్మన్ పదవిలో ఉన్న చంద్రశేఖరన్‌నే.. రెండోసారి కొనసాగించాలనే సంప్రదింపులు నడుస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా స్పందించారు. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్(58) పదవీకాలం వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ చర్చలు మొదలయ్యాయని, చంద్రశేఖరన్ పనితీరు ఫలితంగా రెండోసారి కొనసాగించే ప్రయత్నాలు బోర్డు చేస్తోందని ఓ జాతీయ మీడియా పత్రిక కథనం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే మీడియా, రతన్ టాటాను సంప్రదించింది. ‘‘ఈ విషయంపై నన్నెవరూ సంప్రదించలేదు. ఆ కథనంలో వాస్తవం లేదు. పైగా చంద్రశేఖరన్‌ను రెండోసారి కొనసాగించాలనే బోర్డు ప్రతిపాదనేదీ నా దృష్టికి రాలేదు కూడా. ఈ విషయంలో టాటా సన్స్ బోర్డ్, షేర్‌హోల్డర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నా’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. మరోవైపు ఆ కథనంపై చంద్రశేఖరన్ సైతం స్పందించారు. వారసత్వ విషయమై రతన్ టాటాగానీ, బోర్డుగానీ, ట్రస్ట్గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన జోక్యం ఉండని ఈ వ్యవహారంలో.. సరైన టైంలో బోర్డు సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని సోమవారం ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారాయన. చదవండి.. ఆ వ్యాఖ్యలు నావి కావు: రతన్ టాటా -
వాటాదారుల విలువ పెంచుదాం
⇒ ఉద్యోగులకు టాటా గ్రూప్ కొత్త చైర్మన్ చంద్రశేఖరన్ పిలుపు ⇒ రతన్ టాటాతో కలసి పనిచేయడం అదృష్టమని వ్యాఖ్య ముంబై: టాటా గ్రూప్ పగ్గాలను నటరాజన్ చంద్రశేఖరన్ మంగళవారం స్వీకరించారు. వాటాదారుల విలువ పెంచేలా ప్రయత్నాలు చేయాలని, గ్రూప్ కంపెనీలు తమ తమ రంగాల్లో అగ్రస్థానాల్లో నిలిచేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. టాటా సన్స్ చైర్మన్‌గా వాటాదారుల విలువ పెంచడం, చెప్పుకోదగ్గ, నిలిచి ఉండే సామాజిక ప్రభావాన్ని సాధించడం తన ప్రాధాన్యాలని ఆయన వివరించారు. బాంబే హౌస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో ఆయన ఉద్యోగులకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. కలసి పనిచేద్దాం.. మంచి స్థాయిని సాధించడానికి మనం అందరం కలసి పనిచేయాల్సిన అవసరముందని చంద్రశేఖరన్ ఉద్యోగులకు ఉద్బోధించారు. 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న గ్రూప్‌ను నడిపించే బాధ్యతను స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో టాటా బ్రాండ్‌కు ప్రత్యేక స్థానముందని, నమ్మకానికి, సామాజిక బాధ్యతకు మారుపేరుగా టాటా బ్రాండ్ నిలిచిందని వివరించారు. ఒక గ్రూప్‌గా ఎన్నో ఘనవిజయాలు సాధించినందుకు గర్వంగా ఉందని, అంతర్జాతీయంగా వ్యాపారంలో మంచి విజయాలు సాధించేందుకు రిస్క్ తీసుకున్నామని పేర్కొన్నారు. భారతదేశపు అతి పెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్‌ను నిలిపినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇది పెద్ద అవకాశం... ‘ఇతరులను అనుసరించడం కాకుండా, అందరినీ తన వెంట నడిపించే సత్తా టాటా గ్రూప్ సొంతం’ అని చంద్ర వివరించారు. ఒక గ్రూప్‌గా తమకెన్నో బలాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులందరూ కలసిమెలసి పనిచేస్తారని, గతంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్, మన కంపెనీలు, మంచి విజయాలను సాధించాయని తెలిపారు. వాటాదారులందరికీ మంచి విలువను అందించామని పేర్కొన్నారు. గతంలో సాధించిన ఘనవిజయాలను భవిష్యత్తులో కూడా పునరావృతం చేసే పెద్ద అవకాశం ఇప్పుడు వచ్చిందని వివరించారు. దీనిని సాధించడానికి వినియోగదారుడిపైననే దృష్టిని కేంద్రీకరించాలని ఆయన సూచించారు. వినియోగదారుల అవసరాలు, అభిరుచులకనుగుణమైన ఉత్పత్తు లను, సేవలను అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ రోజుల్లో వ్యాపారంలో విజయం సాధంచాలంటే సాంకేతికత కీలకమని తెలిపారు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలంటే నవకల్పనలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. టాటా ఉద్యోగులు ప్రతి పనిని పూర్తి అంకితభావంతో నిర్వర్తిస్తారని వివరించారు. మనందరికీ స్ఫూర్తినిచ్చే రతన్ టాటాతో కలసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమని పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో టాటా గ్రూప్‌ను ముందుకు తీసుకువెళ్తానని భరోసానిచ్చారు. -
టీసీఎస్ సీఈవోగా చివరి రోజు...బిగ్ అనౌన్స్మెంట్
ముంబై : దేశంలోనే అతిపెద్ద ఐటీ అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు ఇన్నిరోజులు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ మంగళవారం తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఈ కీలకమైన బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సమయంలో ఓ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో ఇన్వెస్టర్ల ముందుకు వెళ్లబోతున్నారు. షేర్ల బైబ్యాక్ ప్రకటనను నేడు చంద్రశేఖరన్ ప్రకటించనున్నారు. బైబ్యాక్ ప్రతిపాదనపై నేడు భేటీ అవుతున్న టీసీఎస్ బోర్డు, ఇందుకోసం ఎంతమొత్తాన్ని వెచ్చించాలి, ఎన్ని షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేయాలన్న దానిపై చర్చించనుంది. ఈ బిగ్ అనౌన్స్మెంట్ అనంతరం ఎన్. చంద్రశేఖరన్ తన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నారు. ఆయన పదవి స్థానంలో రాజేష్ గోపినాథ్‌ను టీసీఎస్ బోర్డు నియమించింది. కాగా, టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత, గ్రూప్‌కు తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించారు. అనంతరం టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ ను నియమించారు. కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేసి వారిని శాంతింపజేయాలనే నేపథ్యంలో టీసీఎస్ బైబ్యాక్ ప్రతిపాదనను బోర్డు ముందుకు తీసుకొచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.