టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రతన్ టాటాతో ‘చంద్ర’హాసం!
⇒ ఉద్యోగులకు టాటా గ్రూప్ కొత్త చైర్మన్ చంద్రశేఖరన్ పిలుపు
⇒ రతన్ టాటాతో కలసి పనిచేయడం అదృష్టమని వ్యాఖ్య
ముంబై: టాటా గ్రూప్ పగ్గాలను నటరాజన్ చంద్రశేఖరన్ మంగళవారం స్వీకరించారు. వాటాదారుల విలువ పెంచేలా ప్రయత్నాలు చేయాలని, గ్రూప్ కంపెనీలు తమ తమ రంగాల్లో అగ్రస్థానాల్లో నిలిచేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. టాటా సన్స్ చైర్మన్‌గా వాటాదారుల విలువ పెంచడం, చెప్పుకోదగ్గ, నిలిచి ఉండే సామాజిక ప్రభావాన్ని సాధించడం తన ప్రాధాన్యాలని ఆయన వివరించారు. బాంబే హౌస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో ఆయన ఉద్యోగులకు ఈ మేరకు ఒక లేఖ రాశారు.
కలసి పనిచేద్దాం..
మంచి స్థాయిని సాధించడానికి మనం అందరం కలసి పనిచేయాల్సిన అవసరముందని చంద్రశేఖరన్ ఉద్యోగులకు ఉద్బోధించారు. 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న గ్రూప్‌ను నడిపించే బాధ్యతను స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో టాటా బ్రాండ్‌కు ప్రత్యేక స్థానముందని, నమ్మకానికి, సామాజిక బాధ్యతకు మారుపేరుగా టాటా బ్రాండ్ నిలిచిందని వివరించారు. ఒక గ్రూప్‌గా ఎన్నో ఘనవిజయాలు సాధించినందుకు గర్వంగా ఉందని, అంతర్జాతీయంగా వ్యాపారంలో మంచి విజయాలు సాధించేందుకు రిస్క్ తీసుకున్నామని పేర్కొన్నారు. భారతదేశపు అతి పెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్‌ను నిలిపినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
ఇది పెద్ద అవకాశం...
‘ఇతరులను అనుసరించడం కాకుండా, అందరినీ తన వెంట నడిపించే సత్తా టాటా గ్రూప్ సొంతం’ అని చంద్ర వివరించారు. ఒక గ్రూప్‌గా తమకెన్నో బలాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులందరూ కలసిమెలసి పనిచేస్తారని, గతంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్, మన కంపెనీలు, మంచి విజయాలను సాధించాయని తెలిపారు. వాటాదారులందరికీ మంచి విలువను అందించామని పేర్కొన్నారు. గతంలో సాధించిన ఘనవిజయాలను భవిష్యత్తులో కూడా పునరావృతం చేసే పెద్ద అవకాశం ఇప్పుడు వచ్చిందని వివరించారు. దీనిని సాధించడానికి వినియోగదారుడిపైననే దృష్టిని కేంద్రీకరించాలని ఆయన సూచించారు.
వినియోగదారుల అవసరాలు, అభిరుచులకనుగుణమైన ఉత్పత్తు లను, సేవలను అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ రోజుల్లో వ్యాపారంలో విజయం సాధంచాలంటే సాంకేతికత కీలకమని తెలిపారు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలంటే నవకల్పనలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. టాటా ఉద్యోగులు ప్రతి పనిని పూర్తి అంకితభావంతో నిర్వర్తిస్తారని వివరించారు. మనందరికీ స్ఫూర్తినిచ్చే రతన్ టాటాతో కలసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమని పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో టాటా గ్రూప్‌ను ముందుకు తీసుకువెళ్తానని భరోసానిచ్చారు.