
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ భవనాన్ని రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్‌విల్లే కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.
సోమర్‌విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.
రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్‌విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్‌విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్‌విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు.