
రతన్ టాటా మరణంపట్ల వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు, భవిష్యత్తు తరాలు తన జీవితం నుంచి గ్రహించాల్సిన అంశాల గురించి చెప్పారు.
చెరగని ముద్ర
రతన్‌టాటా మరణం బాధాకరం. అత్యుత్తమ నాయకత్వం, దార్శనికత కలిగిన వ్యాపారవేత్త, దాతృత్వవాదిగా ఆయన సేవలు మన సమాజంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆయన ప్రభావితం చేసిన వ్యక్తులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఆయన సేవలు అజరామరం
రతన్‌టాటాజీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గొప్ప జాతీయవాది, దార్శనిక వ్యాపారవేత్త, టాటా గ్రూప్ చైర్‌పర్సన్‌గా తన అసాధారణ విజయాలతో భారత్‌కు గొప్ప పేరు తీసుకొచ్చారు. చివరి శ్వాస వరకు సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి
(రోబో కారును ఆవిష్కరించిన టెస్లా)
శతాబ్దానికి ఒక్కరు..
టాటా ఓ గొప్ప వ్యాపార నాయకుడు. దేశాలు ఇలాంటి నేతలను శతాబ్దానికి ఒక్కరినే పొందుతాయి. టాటా గ్రూపు వృద్ధికి మించి ఆయన అభిరుచి కొనసాగింది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది భారతీయులకు సేవలు అందించారు – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్
ఆయన సేవలు అసమానం..
ప్రపంచం అచ్చమైన దార్శనికుడు, మానవతావాదిని కోల్పోయింది. వ్యాపారం, సమాజానికి ఆయన అందించిన అసమానమైన సేవలు ఆయన వారసత్వంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. – సంజీవ్ గోయెంకా, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చైర్మన్
పరిశ్రమలు, ప్రజా జీవితాలపై ముద్ర
వ్యాపారాలన్నవి ఆర్థికాభివృద్ధికే కాదు, సామాజిక పురోగతికి ఉ్రత్పేరకాలూ అని నిరూపించారు. ఆయన నిర్ణయాలు ఆర్థిక అంశాలకు మించి పరిశ్రమలు, ప్రజా జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. – కుమారమంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్
(ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా)
ఒక వ్యక్తి కాదు సంస్థ
రతన్ టాటా భారత్‌కు చెందిన ప్రముఖ, గొప్ప వ్యాపారవేత్తే కాదు, ఆయనొక సంస్థ. టాటాను అంతర్జాతీయంగా విస్తరించడం ద్వారా టాటా వారసత్వంలో ఎన్నో శాశ్వత అధ్యాయాలు లిఖించారు. భారతీయుల్లో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారు. – జీపీ హిందుజా, హిందుజా గ్రూప్ చైర్మన్
ఎయిర్‌ఇండియాతో కలసి నడుస్తాం
మిస్టర్ టాటాకు విమానయానం పట్ల ఉన్న ప్రేమ, భారత విమానయాన భవిష్యత్తు పట్ల ఆయన దూరదృష్టికి నివాళిగా, అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత్‌కు సముచిత స్థానం కోసం ఎయిర్ ఇండియాతో కలసి నడుస్తాం. – రాహుల్ భాటియా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండిగో) ఎండీ
ఆయన వారసత్వం శాశ్వతం
రతన్ టాటా మరణం పట్ల మేము ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన దార్శనిక నాయకత్వం, భారత పరిశ్రమలకు అందించిన సేవలతో ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. – ఉన్సూకిమ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ
ప్రపంచ శక్తిగా టాటా గ్రూప్‌ను నిలబెట్టారు
రతన్ టాటా అందించిన నాయక త్వం కార్పొరేట్ బాధ్యత, ఆవిష్కరణలను పునర్‌నిర్వచించింది. నైతిక విలువలే పునాదిగా టాటా గ్రూప్‌ను ప్రపంచశక్తిగా నిలిపింది. ఆయణ మరణం పట్ల చింతిస్తున ఈ వేళ.. భారత్ నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన ఆయన వారసత్వం, విలువలను గౌరవిస్తున్నాం. – సీఎస్ శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్
భారత ప్రగతిలో గొప్ప పాత్ర
భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రాత్మకంగా ముందుకు దూసుకుపోతున్న స్థితిలో ఉంది. టాటా జీవితం, పని ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడంలో గొప్ప పాత్ర పోషించాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్
ఆధునిక వ్యాపార మార్గదర్శి
అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వాన్ని ఆయన వదిలి వెళ్లారు. భారత్‌లో ఆధునిక వ్యాపారాలకు మార్గదర్శకత్వం, అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. – సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో
భారత స్ఫూర్తి ప్రదాత
రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు. భారత స్ఫూర్తి, సమగ్రత, కరుణ, గొప్ప మేలు కోసం తిరుగులేని నిబద్ధత మూర్తీ భవించిన నేత – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ అధినేత
రోల్ మోడల్
ప్రియమైన స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. విలువలతో కూడిన నాయకత్వం విషయంలో రతన్‌టాటా నాకు రోల్ మోడల్. నైతిక సమస్యల విషయంలో సందిగ్ధత ఎదుర్కొన్నప్పుడు ఆయన నాకు దిక్సూచిగా నిలిచారు. – నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్
ప్రతీ భారతీయుడికి చిహ్నం
రతన్‌టాటా మరణంతో భారత పరిశ్రమ తన కిరీటంలో ఆభరణాన్ని మాత్రమే కోల్పోలేదు, ఆయన దార్శనికత మరియు అత్యుత్తమ వ్యక్తిగత లక్షణాలు ప్రతి భారతీయుడికి చిహ్నంగా మారాయి. విలువను సృష్టించడం ఒకరి కోసం కాదు, దేశ పురోగతికి, గొప్ప ప్రయోజనం కోసం అన్న ఆయన ఆచరణ నాకు స్ఫూర్తినిచ్చింది. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్
సమాజానికి తిరిగిచ్చారు..
గౌరవనీయ వ్యాపారవేత్త. సమాజానికి తిరిగిస్తానన్న హామీకి అనుణంగా జీవించారు. యువతరానికి ఆయన స్ఫూర్తి. – ప్రియా అగర్వాల్ హెబ్బర్, హిందుస్థాన్ జింక్ చైర్‌పర్సన్
చిరకాల ముద్ర..
మిస్టర్ టాటా మరణం ఒక శకానికి ముగింపు. టాటా గ్రూప్ ప్రస్థానంపై చిరకాల ముద్ర వేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. టాటా గ్రూప్, రతన్‌టాటాతో మిస్త్రీ కుటుంబానికి దీర్ఘకాల అనుబంధం ఉంది. – షాపూర్జీ మిస్త్రీ, ఎస్‌పీ గ్రూప్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment