గుడ్‌బై మై లైట్‌హౌస్
రతన్ టాటా యువ సహచరుడు శంతను నాయుడు
ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్‌టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు.
వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్‌టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్‌బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్‌లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్‌టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి.
వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్‌ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్‌టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది.
రతన్‌టాటా సహకారంతో మోటోపాస్ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్ ‘గుడ్ ఫెలోస్’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్‌టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్‌టాటా అసిస్టెంట్‌గా, టాటా ట్రస్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్‌టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment