రతన్ టాటా సమాజానికి చేసిన సేవ ఎనలేనిది. టాటా గ్రూప్ సంపదలో సగానికిపైగా టాటా ట్రస్ట్‌కు విరాళంగా అందజేస్తున్నారు. దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజకీయాలు, అవినీతికి దూరంగా ఉండే రతన్ టాటా జీవితం ఎంతో మందికి అనుసరణీయం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెద్ద వయసులో తాను ఎలా సమయం గడిపారో తెలిపారు. ఎవరైనా తనను మంచి సలహా ఇవ్వమని అడిగితే ఏం చెబుతారో వివరించారు.
ఇంటర్వ్యూలో టాటా మాట్లాడుతూ..‘చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నా. వారి నుంచి నిత్యం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఎనిమిది పదుల వయసు దాటాక కూడా విద్యార్థిగానే ఉన్నాను. ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎవరూ సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండరు. ఎవరైనా మంచి సలహా ఇవ్వాలని అడిగితే..మంచిసలహా అనేది సమయాన్ని బట్టి మారుతుంటుంది. కానీ మంచి పని చేయాలన్న తపన మాత్రం ఎప్పటికీ మారకుండా ఉంటుంది. అందుకే..సలహాల సంగతి ఆపేసి కష్టమైనా సరే సరైన పని చేయడంపై దృష్టి సారించాలని చెబుతుంటా! ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే..సరైన పని చేయడమే కీలకమైందని అర్థమవుతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
వివిధ సందర్భాల్లో రతన్ టాటా చెప్పిన మాటలు కొన్ని..
జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం.
కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.
తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు.
వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.
ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్‌నూ స్వీకరించలేకపోతే అపజయం తప్పదు.
ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు.
ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి.
మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.
అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.
నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం.
సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.
విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment