ఇక టాటా సన్స్ సారథి ‘చంద్ర’
నేడు చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతా ’చంద్ర’గా పిల్చుకునే చంద్రశేఖరన్ (54).. టాటా గ్రూప్ 150 ఏళ్ల చరిత్రలో తొలి పార్సీయేతర చైర్మన్ కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఆయన టాటా గ్రూప్‌లో భాగమైన ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు సారథ్యం వహించారు. ట్రస్టీలతో విభేదాల నేపథ్యంలో సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన టాటా గ్రూప్.. జనవరి 12న చంద్రశేఖరన్‌ను ఆయన స్థానంలో నియమించిన సంగతి తెలిసిందే. ఫొటోగ్రఫీపై మక్కువ కలిగిన చంద్ర .. ప్రపంచవ్యాప్తంగా పలు మారథాన్స్‌లో కూడా పాల్గొన్నారు. కొత్త హోదా తనపై మరింత భారీ బాధ్యత మోపిందని, ఇందులో ఇటు సవాళ్లతో పాటు అటు అవకాశాలు కూడా ఉన్నాయని చంద్రశేఖరన్ గత వారం వ్యాఖ్యానించారు.
సవాళ్లతో స్వాగతం..: కొత్త హోదాలో చంద్రశేఖరన్‌కి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ముందుగా టాటా స్టీల్ యూరప్ కార్యకలాపాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. టాటా స్టీల్ ఇప్పటికే బ్రిటన్‌లోని కొన్ని అసెట్స్‌ను విక్రయించడం మొదలుపెట్టింది. అయితే, ఎంత మేర అసెట్స్‌ను విక్రయించాలి, కార్యకలాపాలను మళ్లీ గాడిలో పెట్టడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై చంద్రశేఖరన్ కసరత్తు చేయాల్సి రానుంది. ఇక రతన్ టాటా కలల ప్రాజెక్టు నానో కార్ల విషయంలోనూ ఆయన తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా నష్టాలతో టాటా మోటార్స్‌కి నానో ప్రాజెక్టు గుదిబండగా మారింది. ఇవి కాకుండా మిస్త్రీకి ఉద్వాసన వ్యవహారంలో కేంద్ర బిందువులైన టాటా ట్రస్ట్స్, ట్రస్టీలతో చంద్రశేఖరన్ ఏవిధంగా నడుచుకోబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
టీసీఎస్ చైర్మన్‌గా చంద్రశేఖరన్; సీఈఓగా గోపీనాథన్
టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్ నేటి నుంచి టీసీఎస్ చెర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా కంపెనీ ఎండీ, సీఈఓగా ఆయన వ్యవహరించారు. ఇక ప్రస్తుత టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేష్ గోపీనా«థన్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు తీసుకుంటారు. కొత్త సీఎఫ్‌ఓగా వి. రామకృష్ణన్‌ను నియమించారు. మరోపక్క, సీఓఓ ఎన్.గణపతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.