‘టాటా’ మనిషికే పగ్గాలు
టాటా సన్స్ చైర్మన్‌గా టీసీఎస్ చంద్రశేఖరన్
• గురువారం సాయంత్రం బోర్డు భేటీలో నిర్ణయం
• అనిశ్చితికి తెర; ఫిబ్రవరి 21న బాధ్యతలు
ముంబై: టాటా సన్స్‌కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. సైరస్ మిస్త్రీ వ్యవహారంతో ఇబ్బందులెదుర్కొన్న రతన్ టాటా... ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా తనకు నమ్మకంగా ఉండే చంద్రశేఖరన్‌వైపు మొగ్గు చూపించారని తెలుస్తోంది. దీనికితోడు గ్రూపులో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్‌ను విజయవంతంగా నడిపిస్తున్న చరిత్ర కూడా చంద్రశేఖరన్‌కు ఉంది.
గురువారం సాయంత్రం ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్‌గా ఆయన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. ఇక కొత్త బాధ్యతలను చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న స్వీకరిస్తారు. ‘‘టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్S.చంద్రశేఖరన్ టాటాసన్స్ డైరెక్టర్ల బోర్డు గురువారం నాటి సమావేశంలో నియమించింది. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది’’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాకపోతే చంద్రశేఖరన్ పదవీ కాలం ఎన్నాళ్లుంటుంది? రతన్‌టాటాకు గ్రూపులో కొత్తగా ఏవైనా బాధ్యతలు అప్పగిస్తున్నారా? వంటి వివరాలను మాత్రం టాటా సన్స్ వెల్లడించలేదు.
ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫారసు
గతేడాది అక్టోబర్ 24న టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ పీ మిస్త్రీని తప్పించడంతో తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా పగ్గాలు చేపట్టారు. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న 103 బిలియన్ డాలర్ల విలువగల టాటా గ్రూపు చైర్మన్‌గా అర్హత కలిగిన వ్యక్తి ఎంపిక కోసం... అదే రోజున రతన్‌టాటా, టీవీఎస్ గ్రూపు హెడ్ వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్యతో ఓ కమిటీ ఏర్పడింది. కమిటీకి కొత్త చైర్మన్ ఎంపిక కోసం 4 నెలల సమయం ఇచ్చారు. కానీ కమిటీ దీన్ని 2 నెలల్లోనే ముగించింది. తాజా నిర్ణయంతో టాటా గ్రూపు నాయకత్వంపై రెండు నెలలుగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడినట్లే. మిస్త్రీ కుటుంబం టాటా సన్స్‌పై న్యాయపోరాటం చేస్తున్న కీలక సమయంలో ‘చంద్ర’ టాటా చైర్మన్ బాధ్యతల్లోకి వస్తుండడం గమనార్హం.
చంద్రశేఖరుడిపై ఆశలు...
‘‘చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో, ఎండీగా ఉత్తమనాయకత్వాన్ని అందించారు. టాటా గ్రూపు మొత్తం తన సామర్ధ్యాన్ని గుర్తించడంతోపాటు ఆయా వ్యాపారాల్లో నాయకులుగా రాణించేందుకు ఆయన స్ఫూర్తినిస్తారని నమ్ముతున్నాం. అలాగే, మా విలువలతో కూడిన వ్యవస్థను, నైతికతను కొనసాగిస్తారని, టాటా గ్రూపు విధానాలను అనుసరిస్తారని భావిస్తున్నాం’’ అని టాటా సన్స్ ప్రకటనలో పేర్కొంది.
నియమకాన్ని ఆహ్వానిస్తున్నాం..
టాటాసన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ నిర్ణయంతో టాటా గ్రూపు దేశ వ్యాపార రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది. – అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్
సారథ్యానికి తగిన వ్యక్తి...
టీసీఎస్‌ను ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి స్థాయికి తీసుకె ళ్లారు. అంతర్జాతీయంగా చంద్రశేఖరన్‌కున్న అనుభవం, వ్యాపార చతురత, టాటాలతో సుదీర్ఘ అనుబంధం నూతన బాధ్యతలకు ఆయన తగిన వారని నిరూపిస్తుంది.
– చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో
సవాళ్లను ఎదుర్కోనే సత్తా చంద్రకు ఉంది..
టాటా గ్రూపు చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ సామర్థ్యం తనకు ఉందని ఆయన ఇప్పటికే టీసీఎస్‌లో నిరూపించుకున్నారు. – ఎన్.నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు
ఇండియన్ ఐకాన్ రక్షకుడు..
కొత్త బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్‌ను అభినందనలు. మీరిప్పుడు ఇండియన్ ఐకాన్ సంరక్షకులు. ఆ బాధ్యతను చేపట్టగల విశాలమైన భుజస్కంధాలు మీకున్నాయి. – ఆనంద్ మహింద్రా, మహింద్రా గ్రూపు చైర్మన్