టీసీఎస్ లో బాహుబలి టైటిల్ ఎవరికి?
టీసీఎస్ లో బాహుబలి టైటిల్ ఎవరికి?
Published Sat, Jun 17 2017 3:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
ముంబై : బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా బాహుబలి సినిమా ప్రస్తావనే. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో కూడా బాహుబలి, కట్టప్పలకు తగ్గ పాత్రలు ఉన్నాయట. టాటా గ్రూప్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ పదవిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్రాతలు ప్రస్తావనకు వచ్చాయి. టీసీఎస్ బోర్డు సభ్యులైన రతన్ టాటా కంపెనీకి బాహుబలి కాగ, ఆయన సన్నిహితుడు ఇషాత్ హుస్సేస్ కట్టప్పగా ఇన్వెస్టర్లు అభివర్ణించారు.
సినిమాలో చూపించిన మాదిరిగా రాజుకు, సేవకుడుకు మధ్యనున్న నమ్మకమైన సంబంధం, రతన్ టాటాకు, హుస్సేన్ కు ఉంటుందని కొనియాడారు. భారత కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి టాటా గ్రూప్ లో హఠాత్తు పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా బోర్డు సభ్యులు బయటికి పంపేయడం, ఆ తర్వాత కొత్త చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ ను బోర్డు సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. కొన్ని నెలల పాటు జరిగిన ఈ వివాదంతో టాటా గ్రూప్ పరువు వీధిన పడింది. అయితే తర్వాత తర్వాత పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.
దీర్ఘకాలిక ఇన్నింగ్ కు తాము చంద్రను ఆహ్వానిస్తున్నామని, బొంబై హౌజ్ చెన్నై హౌజ్ గా మారిందంటూ షేర్ హోల్డర్ అరుణ్ కుమార్ చెప్పారు. ఇషాత్ హుస్సేన్ మీరు కట్టప్ప, రతన్ టాటా బాహుబలి, 2016లో టాటా సన్స్ అధికార ప్రతినిధిగా మీ పాత్రను మీరు ఎంతో బాధ్యతాయుతంగా చేపట్టారని పేర్కొన్నారు. చంద్రశేఖరన్ కు ఎక్కువగా చంద్ర అని గుర్తింపు ఉంది. చంద్రను నియమించి, రతన్ టాటా తన మిషన్ విజయవంతంగా పూర్తిచేసినట్టు మరో ప్రముఖ ఇన్వెస్టర్ ఆశాలత మహేశ్వరి చెప్పారు. కాగ, నిన్న జరిగిన ఈ వార్షిక సాధారణ సమావేశంలో పలు విషయాలపై చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లతో మాట్లాడారు. ఈ సమావేశంలోనే ట్రంప్ విధానాలు ప్రభావం తమపై ఉండదని ఇన్వెస్టర్లకు ధైర్యం చెప్పారు. ట్రంప్ తో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు.
Advertisement
Advertisement