మాపై ట్రంప్ ప్రభావం లేదు
టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్
ముంబై: పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల వల్ల టీసీఎస్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. ట్రంప్ విధానాలు, వీసా నిబంధనల వల్ల తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని, వివిధ మార్కెట్లలో విజయవంతంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి దేశంలోనూ ఉద్యోగ నియామకాలు కొనసాగిస్తున్నామని టాటా సన్స్‌కు చైర్మన్ కూడా అయిన చంద్ర చెప్పారు.
టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలోనూ, ఆ దేశపు నియమనిబంధనలను తు.చ. తప్పక పాటిస్తున్నామని పేర్కొన్నారు. టీసీఎస్ తన ప్రయాణంలో ఇప్పటిదాకా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని విజయవంతంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన టీసీఎస్ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎమ్)లో ఆయన మాట్లాడారు. కాగా ఈ ఏజీఎమ్‌కు రతన్ టాటా ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని సంబంధిత వర్గాలంటున్నాయి.
డేటా కీలకం..
ప్రపంచ వ్యాపార సంస్థలు డిజిటల్ దిశగా మారుతున్నాయని, ఈ మార్పు చాలా వేగంగా జరుగుతోందని చంద్రశేఖరన్ వివరించారు. ఐటీతో పాటు అన్ని రంగాలకు భవిష్యత్తులో డేటా ఎక్స్‌లెన్స్ కీలకం కానున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీస్‌పై రెండు లక్షల మంది ఉద్యోగులకు టీసీఎస్ ఇప్పటికే తగిన శిక్షణనిచ్చిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ డిజిటల్ ఆదాయం 28 శాతం వృద్ధితో 300 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. టెక్నాలజీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని, మనకు అపారమైన అవకాశాలున్నాయని వివరించారు.
79 వేల ఉద్యోగాలిచ్చాం...
గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 79 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. వీరిలో విదేశాల్లో ఉద్యోగాలిచ్చిన వారి సంఖ్య 11,500గా ఉందని వివరించారు.