టీసీఎస్ లాభం 5,684 కోట్లు | TCS profit 5.684 million | Sakshi
Sakshi News home page

టీసీఎస్ లాభం 5,684 కోట్లు

Published Fri, Jul 10 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

టీసీఎస్ లాభం 5,684 కోట్లు

టీసీఎస్ లాభం 5,684 కోట్లు

క్యూ1లో వృద్ధి 2.1 శాతమే...
♦ ఆదాయం రూ. 25,668 కోట్లు; 16 శాతం అప్
♦ షేరుకి రూ.5.5 చొప్పున మధ్యంతర డివిడెండ్
 
 ముంబై : దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,568 కోట్లతో పోలిస్తే లాభం 2.1 శాతమే వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో 16.1 శాతం ఎగబాకి రూ.25,668 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ.22,111 కోట్లుగా ఉంది. జపాన్, లాటిన్ అమెరికా మార్కెట్ల నుంచి ఎదురైన కొన్ని ప్రతికూలతలు ఫలితాలపై ప్రభావం చూపాయి. జూన్ క్వార్టర్‌లో నికర లాభం రూ.5,460 కోట్లు, ఆదాయం రూ. 25,760 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. లాభాల విషయంలో అంచనాలను మించగా, ఆదాయాలు మాత్రం తగ్గడం గమనార్హం. మరోపక్క, ఫలితాల సీజన్‌ను బోణీ చేసే ఇన్ఫోసిస్ స్థానంలో రెండు త్రైమాసికాల నుంచి టీసీఎస్ వచ్చి చేరడం విశేషం.

 సీక్వెన్షియల్‌గా చూస్తే...
 గతేడాది ఆఖరి త్రైమాసికం(2014-15, క్యూ4)లో లాభం(రూ.3,712 కోట్లు)తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో లాభం 53 శాతం ఎగబాకింది. అయితే, మార్చి క్వార్టర్‌లో ఉద్యోగులకు వన్‌టైమ్ బోనస్(రూ.2,628 కోట్లు) ప్రకటించిన నేపథ్యంలో దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే లాభం 1.5 శాతం మేర తగ్గినట్లు లెక్క. ఇక ఆదాయం విషయానికొస్తే పెరుగుదల 6 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో కంపెనీ ఆదాయం రూ. 24,220 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో క్యూ1 ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.5 శాతం వృద్ధితో 4.03 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్కెట్ వర్గాలు 4 శాతం వృద్ధిని అంచనా వేశాయి. కాగా, బ్రిటిష్ కంపెనీ డిలిజెంటా టేకోవర్ వల్ల కూడా 25 మిలియన్ డాలర్ల మేర ఆదాయంలో తగ్గుదలకు దారితీసిందని.. లేదంటే 4 శాతం వృద్ధి సాధించేవాళ్లమని టీసీఎస్ ఎండీ, సీఈఓ ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
♦ రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై టీసీఎస్ రూ.5.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
♦ 20 మిలియన్ డాలర్లకు పైబడిన 10 కాంట్రాక్టులను క్యూ1లో చేజిక్కించుకుంది. ఇక 50, 100 మిలియన్ డాలర్లను మించిన కాంట్రాక్టులు చెరొకటి కంపెనీకి లభించాయి.
♦ క్యూ1లో స్థూలంగా కంపెనీ 20,302 మంది ఉద్యోగులకు జతచేసుకుంది. అయితే, 15,023 మంది ఉద్యోగులు వలసపోవడంతో నికరంగా 5,279 మంది మాత్రమే జతయ్యారు. దీంతో జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,24,935కు చేరింది.
♦ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు జూన్ క్వార్టర్‌లో 15.9 శాతంగా నమోదైంది. మార్చి క్వార్టర్‌లో ఇది 14.9 శాతం. గడిచిన ఆరు త్రైమాసికాలుగా టీసీఎస్‌లో అట్రిషన్ రేటు పెరుగుతూనే ఉండటం గమనార్హం.
♦ టీసీఎస్ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 2.8 శాతం క్షీణించి రూ.2,521 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.14,229 కోట్లు దిగజారి రూ.4,93,874 కోట్లకు తగ్గింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.
 
 వృద్ధికి ‘డిజిటల్’ తోడ్పాటు...
 కీలక మార్కెట్లయిన ఉత్తర అమెరికాలో ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకోవడంతోపాటు ఫైనాన్షియల్ సర్వీసులు, రిటైల్, లైఫ్‌సెన్సైస్ రంగాల్లో డిజిటల్ సొల్యూషన్లకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో క్యూ1లో మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. కాంట్రాక్టుల అమలులో మాకున్న అపారమైన నైపుణ్యం, ట్రాక్‌రికార్డులు.. ఐపీ, డిజిటల్ సామర్థ్యాల్లో భారీస్థాయి పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ వ్యాపారాభివృద్ధికి మరింత చేయూతనందించనున్నాయి. పటిష్టమైన ఆర్డర్లు, వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు డిజిటల్ సేవలను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో సంబంధిత టెక్నాలజీలన్నింటిలోనూ ఈ ఏడాది లక్ష మందికిపైగా నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నాం.
 - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement