డైరెక్టర్ల బోర్డులోకి ‘టీసీఎస్’ చంద్రశేఖరన్..
టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులోకి టీసీఎస్ సీఈఓ-ఎండీ ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) సీఈఓ రాల్ఫ్ స్పెత్‌లను అదనపు డెరైక్టర్లుగా తీసుకున్నారు. మిస్త్రీపై వేటువేసిన మర్నాడే టాటా సన్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ నియామకాలపై రతన్ టాటా మాట్లాడుతూ.. తమ నేతృత్వంలోని కంపెనీలను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు గుర్తింపుగానే వారికి ఈ పదవులు లభించాయని పేర్కొన్నారు.
కాగా రాల్ఫ్, చంద్రశేఖరన్‌ల నియామకంతో టాటా సన్స్ బోర్డులో మొత్తం డెరైక్టర్ల సంఖ్య 12కు చేరింది. గ్రూప్ కంపెనీల సీఈఓలకు టాటా సన్స్ బోర్డులోకి తీసుకునే పాత సాంప్రదాయాన్ని తాజా చర్యలతో మళ్లీ పునరుద్ధరించినట్లు కనబడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇండియన్ హోటల్స్ చీఫ్ కృష్ణకుమార్, టాటా స్టీల్‌కు చెందిన జేజే ఇరానీలు బోర్డులో ఉన్నారు. కాగా, కొత్త చైర్మన్ రేసులో ఎన్. చంద్రశేఖరన్ కూడా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు బోర్డులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మిస్త్రీ ఇంటర్వ్యూ ఔట్..
టాటా గ్రూపునకు దాదాపు నాలుగేళ్లు సారథిగా పనిచేసిన సైరస్ మిస్త్రీని అవమానకరమైన రీతిలో చడీచప్పుడుకాకుండా తొలగించిన టాటాలు.. ఆయన గుర్తులేవీ గ్రూప్‌లో లేకుండా చేస్తున్నట్లు కనబడుతోంది. ప్రపంచంలో 25 అత్యుత్తమ కార్పొరేట్ కంపెనీలు, ఉద్యోగాల సృష్టికర్తల్లో ఒకటిగా నిలవాలంటూ విజన్-2025 పేరుతో ఆయన ఇచ్చిన ఏకైక ఇంటర్వ్యూను(అంతర్గత మేగజీన్‌కు) కూడా తక్షణం టాటా వెబ్‌సైట్ నుంచి తొలగించేయడం దీనికి నిదర్శనం. దీన్నిబట్టిచూస్తే.. టాటాలు మిస్త్రీ పనితీరుపై ఏరీతిలో అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
‘టాటా స్టీల్ యూకే’కు మంచిదే: బ్రిటిష్ మీడియా
లండన్: మిస్త్రీ తొలగింపుపై బ్రిటన్ మీడియా కూడా ప్రత్యేకంగా దృష్టిసారించింది. మిస్త్రీ ఉద్వాసన ఒకరకంగా టాటా స్టీల్ యూకే(గతంలో కోరస్) కార్యకలాపాలకు మంచివార్తేనంటూ అక్కడి పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే స్టీల్ వ్యాపారంపై తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు అమితమైన మక్కువ(కోరస్‌ను కొనుగోలు చేసింది ఆయనే) ఉండటమే దీనికి కారణమని కూడా పేర్కొన్నాయి. తీవ్రమైన నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ యూకే యూనిట్లను వదిలించుకోనున్నట్లు ఈ ఏడాది మార్చిలో మిస్త్రీ సారథ్యంలోని టాటా గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ఉద్యోగులపై వేటు పడుతుందని అక్కడి కార్మిక సంఘాలు గగ్గోలు పెట్టాయి కూడా. టాటా స్టీల్ యూకే ప్లాంట్లు, అక్కడి ఉద్యోగుల భవిష్యత్తుపై గ్రూప్ అనుసరించబోయే ప్రణాళికలకు మిస్త్రీ తొలగింపు అద్దం పడుతోందని ఒక మీడియా కథనం పేర్కొంది.