Tata Sons board
-
మిస్త్రీకి చుక్కెదురు..!
ధిక్కరణ పిటిషన్లను కొట్టేసిన కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. తనను టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టర్‌గా తొలగించేందుకు చర్యలు చేపట్టడం ద్వారా టాటాసన్స్, ఆ సంస్థ డైరెక్టర్లు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఉల్లంఘించారంటూ... వారికి వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను ఎన్సీఎల్టీ బుధవారం రద్దు చేసింది. టాటా సన్స్ చర్య కోర్టు ధిక్కారం కిందకు రాదని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించేందుకు ఫిబ్రవరి 6న టాటా సన్స్ సమావేశం ఏర్పాటు చేయడంపై అఫిడవిట్‌ను మూడు రోజుల్లోగా దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వటం కొద్దిగా ఊరట. ఇదే అంశంపై 3 రోజుల్లోగా స్పందించాలని టాటా సన్స్‌ను కూడా బెంచ్ కోరింది. మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ కుటుంబ కంపెనీలు లోగడ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ ఈ నెల 31, ఫిబ్రవరి 1న విచారించనుంది. అవే రోజుల్లో ఈ అంశంపైనా విచారణ జరుపుతామని ట్రిబ్యునల్ తాజాగా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6న గానీ ఆ తర్వాతగానీ ఏ అంశంపైనా టాటా సన్స్ ఈజీఎం నిర్వహించకుండా ఇంజెక్షన్ ఆదేశాలు ఇవ్వాలని సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ తమ పిటిషన్లలో ఎన్సీఎల్టీని కోరాయి. -
టాటా-మిస్త్రీ వివాదంలో కొత్త ట్విస్ట్
ముంబై : సైరస్ మిస్త్రీ-రతన్ టాటా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మిస్త్రీ పనితీరు బాగాలేదంటూ.. కంపెనీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన్ను తొలగించామంటూ రతన్ టాటా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. నాలుగు నెలల ముందే ఆయన పనితీరును టాటా సన్స్ బోర్డు వేతనకమిటీ కీర్తించిన సంగతిని మాజీ చైర్మన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.. మిస్త్రీని తొలగించడానికి నాలుగు నెలల ముందు అంటే జూన్ 28న భేటీ అయిన వేతన కమిటీ , చైర్మన్‌గా మిస్త్రీ ఫర్ఫార్మెన్స్ భేష్‌గా ఉందని కొనియాడడమే కాక, వేతనాన్ని కూడా పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిపాయి. గ్రూప్ కంపెనీల్లో ఆయన అందిస్తున్న గణనీయమైన సహకారానికి గుర్తింపుగా ఏకగ్రీవంగా వేతనాన్ని పెంచాలని నిర్ణయించాయని పేర్కొన్నాయి., మిస్త్రీ బేసిక్ వేతనం, కమిషన్ పెంచాలని టాటా సన్స్ బోర్డుకు ప్రతిపాదించాలని ఈ కమిటీ అంగీకరించినట్టు స్పష్టంచేశాయి. బోర్డు సైతం పెద్ద మొత్తంలో ఇక్రిమెంట్కు సన్నద్ధమైందని, అయితే మిస్త్రీ దీనికి ఒప్పుకోలేదని తెలిసింది. తన టాప్ టీమ్‌కు ఇచ్చే మాదిరిగా తన వేతనాన్ని కూడా 6 శాతానికి కంటే మించి పెంచవద్దని మిస్త్రీ పట్టుబట్టారని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తెలిపింది. మిస్త్రీ సారథ్యంలో ఉన్న ఈ కౌన్సిల్‌ను ప్రస్తుతం టాటా సన్స్ బోర్డు రద్దు చేసింది. ఈ కౌన్సిల్లో ముగ్గురు సభ్యులు మధు కన్నన్, నిర్మల్య కుమార్, ఎన్ఎస్ రాజన్‌లు ఇప్పటికే గ్రూప్ నుంచి వైదొలుగుతూ రాజీనామాలు చేశారు. వీరి నియామకం మిస్త్రీ సారథ్యంలోనే జరిగింది. అర్థాంతరంగా సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవిని తొలగించడంతో టాటా గ్రూప్‌లో ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. టాటా గ్రూప్ ఉజ్వల భవిష్యత్తు కోసమే మిస్త్రీ తొలగించామంటూ రతన్ టాటా తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. మిస్త్రీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. అయితే తన పనితీరు బాగాలేదనడంలో ఎలాంటి వాస్తవం లేదని మిస్త్రీ సైతం విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం వేతన కమిటీ నాలుగు నెలల కింద మిస్త్రీ పనితీరును కీర్తించిన విషయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. -
డైరెక్టర్ల బోర్డులోకి ‘టీసీఎస్’ చంద్రశేఖరన్..
టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులోకి టీసీఎస్ సీఈఓ-ఎండీ ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) సీఈఓ రాల్ఫ్ స్పెత్‌లను అదనపు డెరైక్టర్లుగా తీసుకున్నారు. మిస్త్రీపై వేటువేసిన మర్నాడే టాటా సన్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ నియామకాలపై రతన్ టాటా మాట్లాడుతూ.. తమ నేతృత్వంలోని కంపెనీలను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు గుర్తింపుగానే వారికి ఈ పదవులు లభించాయని పేర్కొన్నారు. కాగా రాల్ఫ్, చంద్రశేఖరన్‌ల నియామకంతో టాటా సన్స్ బోర్డులో మొత్తం డెరైక్టర్ల సంఖ్య 12కు చేరింది. గ్రూప్ కంపెనీల సీఈఓలకు టాటా సన్స్ బోర్డులోకి తీసుకునే పాత సాంప్రదాయాన్ని తాజా చర్యలతో మళ్లీ పునరుద్ధరించినట్లు కనబడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇండియన్ హోటల్స్ చీఫ్ కృష్ణకుమార్, టాటా స్టీల్‌కు చెందిన జేజే ఇరానీలు బోర్డులో ఉన్నారు. కాగా, కొత్త చైర్మన్ రేసులో ఎన్. చంద్రశేఖరన్ కూడా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు బోర్డులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మిస్త్రీ ఇంటర్వ్యూ ఔట్.. టాటా గ్రూపునకు దాదాపు నాలుగేళ్లు సారథిగా పనిచేసిన సైరస్ మిస్త్రీని అవమానకరమైన రీతిలో చడీచప్పుడుకాకుండా తొలగించిన టాటాలు.. ఆయన గుర్తులేవీ గ్రూప్‌లో లేకుండా చేస్తున్నట్లు కనబడుతోంది. ప్రపంచంలో 25 అత్యుత్తమ కార్పొరేట్ కంపెనీలు, ఉద్యోగాల సృష్టికర్తల్లో ఒకటిగా నిలవాలంటూ విజన్-2025 పేరుతో ఆయన ఇచ్చిన ఏకైక ఇంటర్వ్యూను(అంతర్గత మేగజీన్‌కు) కూడా తక్షణం టాటా వెబ్సైట్ నుంచి తొలగించేయడం దీనికి నిదర్శనం. దీన్నిబట్టిచూస్తే.. టాటాలు మిస్త్రీ పనితీరుపై ఏరీతిలో అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘టాటా స్టీల్ యూకే’కు మంచిదే: బ్రిటిష్ మీడియా లండన్: మిస్త్రీ తొలగింపుపై బ్రిటన్ మీడియా కూడా ప్రత్యేకంగా దృష్టిసారించింది. మిస్త్రీ ఉద్వాసన ఒకరకంగా టాటా స్టీల్ యూకే(గతంలో కోరస్) కార్యకలాపాలకు మంచివార్తేనంటూ అక్కడి పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే స్టీల్ వ్యాపారంపై తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు అమితమైన మక్కువ(కోరస్‌ను కొనుగోలు చేసింది ఆయనే) ఉండటమే దీనికి కారణమని కూడా పేర్కొన్నాయి. తీవ్రమైన నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ యూకే యూనిట్లను వదిలించుకోనున్నట్లు ఈ ఏడాది మార్చిలో మిస్త్రీ సారథ్యంలోని టాటా గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ఉద్యోగులపై వేటు పడుతుందని అక్కడి కార్మిక సంఘాలు గగ్గోలు పెట్టాయి కూడా. టాటా స్టీల్ యూకే ప్లాంట్లు, అక్కడి ఉద్యోగుల భవిష్యత్తుపై గ్రూప్ అనుసరించబోయే ప్రణాళికలకు మిస్త్రీ తొలగింపు అద్దం పడుతోందని ఒక మీడియా కథనం పేర్కొంది. -
టాటా సన్స్ బోర్డులో కొత్త సభ్యులు
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయం ఆ గ్రూపు తీసుకుంది. చైర్మన్ పదవి రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. చంద్రశేఖరన్నూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో డాక్టర్. రాల్ఫ్ స్పెత్ను టాటా సన్స్ డైరెక్టర్ బోర్డులో అదనపు డైరెక్టర్లుగా నియమించింది. వీరి చేరికపై స్పందించిన టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా, వారి వారి కంపెనీల్లో శ్రేష్టమైన నాయకత్వపు గుర్తింపుగా వీరి నియామకం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరి ఎంపికతో, తొమ్మిది సభ్యులున్న టాటా సన్స్ బోర్డు సభ్యులు, పదకొండు మందికి పెరిగారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న వారినే చైర్మన్లుగా నియమించే అవకాశముంటుంది కనుక ముందస్తుగా రేసులో ఉన్న వారిని టాటా సన్స్ అదనపు బోర్డు డైరెక్టర్లుగా నియమించుకుంటోంది.