మిస్త్రీకి చుక్కెదురు..!
ధిక్కరణ పిటిషన్లను కొట్టేసిన కంపెనీ లా ట్రిబ్యునల్
ముంబై: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. తనను టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టర్‌గా తొలగించేందుకు చర్యలు చేపట్టడం ద్వారా టాటాసన్స్, ఆ సంస్థ డైరెక్టర్లు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ఉల్లంఘించారంటూ... వారికి వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను ఎన్‌సీఎల్‌టీ బుధవారం రద్దు చేసింది. టాటా సన్స్ చర్య కోర్టు ధిక్కారం కిందకు రాదని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించేందుకు ఫిబ్రవరి 6న టాటా సన్స్ సమావేశం ఏర్పాటు చేయడంపై అఫిడవిట్‌ను మూడు రోజుల్లోగా దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వటం కొద్దిగా ఊరట.
ఇదే అంశంపై 3 రోజుల్లోగా స్పందించాలని టాటా సన్స్‌ను కూడా బెంచ్ కోరింది. మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ కుటుంబ కంపెనీలు లోగడ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ ఈ నెల 31, ఫిబ్రవరి 1న విచారించనుంది. అవే రోజుల్లో ఈ అంశంపైనా విచారణ జరుపుతామని ట్రిబ్యునల్ తాజాగా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6న గానీ ఆ తర్వాతగానీ ఏ అంశంపైనా టాటా సన్స్ ఈజీఎం నిర్వహించకుండా ఇంజెక్షన్ ఆదేశాలు ఇవ్వాలని సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ తమ పిటిషన్లలో ఎన్‌సీఎల్‌టీని కోరాయి.