commercial vehicle sector
-
రెండు కంపెనీలుగా టాటా మోటార్స్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్రోవర్సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్సీఎల్టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. టర్న్ అరౌండ్ గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్‌అరౌండ్‌ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్ 12–15 నెలలు కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు. విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది. -
ఈ ఏడాదీ వాణిజ్య వాహనాల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా వాణిజ్య వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–10 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోళ్లు, గనులు, మౌలిక రంగంలో నిర్మాణ కార్యకలాపాలు, ఆరోగ్యకర స్థాయిలో వినియోగం ఈ వృద్ధికి దోహదం చేస్తుంది. వాస్తవానికి గత నెలలో విక్రయాలు 2022 ఏప్రిల్‌తో పోలిస్తే 5 శాతం, ఈ ఏడాది మార్చితో పోలిస్తే 41 శాతం క్షీణించాయి. 2022–23లో పరిశ్రమ పరిమాణం 33 శాతంపైగా దూసుకెళ్లింది. అనుకూల విక్రయాల స్థాయితో పాటు స్థూల ఆర్థిక కార్యకలాపాలలో బలమైన వృద్ధి ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఆరోగ్యకర డిమాండ్‌ను 2023–24 అనుసరిస్తుంది. మార్చి 2021లో ప్రకటించిన స్క్రాపేజ్ విధానం 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. కొత్త వాణిజ్య వాహనాల అమ్మకాల పెరుగుదలకు ఈ పాలసీ దోహదపడే అవకాశం ఉంది’ అని ఇక్రా వివరించింది. -
వృద్ధి బాటలో వాణిజ్య వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహన విక్రయాలు 2023–24లో 9–11 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. 6 శాతం ఆర్థిక వృద్ధి అంచనాలు, అలాగే మధ్య, భారీ వాణిజ్య వాహన విభాగంలో పెద్ద ఎత్తున విక్రయాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ‘మౌలిక రంగానికి బడ్జెట్లో పెరిగిన కేటాయింపులు డిమాండ్‌కు మద్ధతు ఇస్తాయి. దేశీయ వాణిజ్య వాహన విపణిలో వృద్ధి నమోదు కానుండడం వరుసగా ఇది మూడవ ఆర్థిక సంవత్సరంగా నిలుస్తుంది. తేలికపాటి వాణిజ్య వాహన విభాగం 8–10 శాతం వృద్ధి ఆస్కారం ఉంది. ఇదే జరిగితే కోవిడ్ ముందస్తు 2019ని మించి అమ్మకాలు నమోదు కానున్నాయి. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు 13–15 శాతం అధికం అయ్యే చాన్స్ ఉంది. ఈ విభాగం విక్రయాలు 2024–25లో కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకోనున్నాయి. 2021–22లో పరిశ్రమ 31 శాతం దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వాణిజ్య వాహన రంగం 27 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. కంపెనీల నిర్వహణ లాభాలు 2023–24లో నాలుగేళ్ల గరిష్టం 7–7.5 శాతానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం పెరగవచ్చు’ అని క్రిసిల్ వివరించింది. -
కమర్షియల్ వాహనాలు జోరుగా.. హుషారుగా! తగ్గేదెలే!!
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం ప్రతికూలమే అయినప్పటికీ ఈ ఏడాది వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల వంటి ప్రతికూలతలను అధిగమించేలా మౌలికసదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుండటం, దేశీయంగా వినియోగం క్రమంగా పెరుగుతుండటం తదితర సానుకూలాంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రవాణా రేట్లు, వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండటమనేది రవాణాదారుల విశ్వాస సూచీ మెరుగుదలకు తోడ్పడుతున్నాయని వాఘ్ వివరించారు. తమ కంపెనీ విషయానికొస్తే లాభదాయకత వృద్ధిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, ఎప్పట్లాగే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం పండుగ సీజన్ నుండి డిమాండ్ పుంజుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) గణాంకాల ప్రకారం 2022-23 తొలి త్రైమాసికంలో దేశీయంగా సీవీల విక్రయాలు 112 శాతం పెరిగి 1,05,800 యూనిట్ల నుంచి 2,24,512 యూనిట్లకు పెరిగాయి. 2021-22లో అమ్మకాలు 26 శాతం వృద్ధి చెంది 5,68,559 యూనిట్ల నుంచి 7,16,566 యూనిట్లకు పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపుతో ఈఎంఐల భారం పెరుగుతుందని, అయితే ఇది మరీ ఎక్కువగా ఉండకుండా చూసేలా తగు ఫైనాన్సింగ్ స్కీమ్‌లు లభించే విధంగా ఆర్థిక సంస్థలతో కలిసి పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోందని వాఘ్ చెప్పారు. -
వాణిజ్య వాహన విక్రయాలు : 4.35 లక్షలు
ముంబై: దేశీయంగా వాణిజ్య వాహనాల (సీవీ) పరిశ్రమ రికవరీ బాట పట్టిందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్ (వీఈసీవీ) ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. బస్సుల సెగ్మెంట్ కోలుకోవడం, రిప్లేస్మెంట్కు డిమాండ్ పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 4.35 లక్షల స్థాయి దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2018–19లో రికార్డు స్థాయిలో 5.77 లక్షల పైచిలుకు అమ్ముడైన సీవీలు వివిధ కారణల రీత్యా 2020–21లో 2.34 లక్షలకు పడిపోయాయి. 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 3.34 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య వాహనాల అమ్మకాలు 47 శాతం పెరిగి 3.43 లక్షలకు చేరాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, గత నాలుగు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణమాలను బట్టి చూస్తే సీవీల అమ్మకాలు తిరిగి 2019–20 నాటి స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అగర్వాల్ వివరించారు. వచ్చే మూడేళ్లు పరిశ్రమకు మెరుగ్గా ఉండనున్నట్లు పేర్కొన్నారు. స్వీడన్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. చదవండి👉 ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారులకు శుభవార్త! -
ఇక్కడి వాహన యజమానులు చాలా స్మార్ట్
కొత్త టెక్నాలజీకి సై అంటారు 2016-17లో 20 శాతంపైగా వృద్ధి మహీంద్రా ట్రక్, బస్ విభాగం సీఈవో నళిన్ మెహతా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో తెలుగు రాష్ట్రాలది ఎప్పుడూ ప్రత్యేకమే. మార్కెట్లోకి నూతన టెక్నాలజీతో కొత్త మోడల్ వస్తే చాలు. వాహనాన్ని కొంటారని మహీంద్రా అండ్ మహీంద్రా చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,78,000ల భారీ వాణిజ్య వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 10 శాతం ఉండనుంది. ముంబై తర్వాత దేశంలో అతి పెద్ద మార్కెట్ ఈ రెండు రాష్ట్రాలేనని మహీంద్రా ట్రక్, బస్ విభాగం సీఈవో నళిన్ మెహతా వెల్లడించారు. భారత్‌లో వాణిజ్య వాహన రంగం తీరుతెన్నులు, మహీంద్రా భవిష్యత్ కార్యాచరణను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. యజమానుల చురుకైన పాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో యజమానులకు వాహనం ఎలా ఉండాలో తెలుసు. డ్రైవర్లకున్న పరిజ్ఞానం వారికీ వుంది. సాంకేతికపరమైన అవగాహనా ఉంది. ప్రతీ వాహనం పనితీరును ప్రత్యక్షంగా గమనిస్తారు. నూతన టెక్నాలజీతో కొత్త మోడళ్లు రాగానే ఆసక్తిగా కొంటారు. కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక ఒక్కో వాహనం కోసం ఖాతా పుస్తకాన్ని నిర్వహించే వారూ ఉన్నారు. 100కుపైగా వాణిజ్య వాహనాలున్న ఆపరేటర్లు దేశవ్యాప్తంగా 5,000లకుపైగా ఉంటారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 50 శాతముంటుంది. తెలుగు రాష్ట్రాల వాహన యజమానులతో తమిళనాడు ఆపరేటర్లు పోటీపడతారు. వృద్ధి ఇక్కడే ఎక్కువ.. దేశవ్యాప్తంగా వాణిజ్య వాహన రంగానికి 2012-2015 అత్యంత క్లిష్టమైన కాలం. మందగమనం కారణంగా కొత్త వాహనాల కొనుగోళ్లకు యజమానులు దూరంగా ఉన్నారు. వాస్తవానికి పెద్ద ఆపరేటర్లు నాలుగేళ్లకోసారి పాత వాహనాన్ని విక్రయించి కొత్తవి సమకూర్చుకుంటారు. అలాంటిది 2012-15 కాలంలో కొనుగోళ్లను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో పరిశ్రమ 50 శాతం తిరోగమనం చెందింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 100 శాతం తిరోగమనం నమోదైంది. అయితే రికవరీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణ రంగంతోపాటు ఇతర విభాగాల కారణంగా వాహన అమ్మకాలు అధికంగా ఉండనున్నాయి. కొత్త వాహనాల కొనుగోళ్లు మొద లయ్యాయి. 2016-17లో పరిశ్రమ 20% వృద్ధి ఆశిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మరింత మెరుగైన పనితీరు కనబరుస్తాయి. కొత్త మోడళ్లతో రంగంలోకి.. ఇటీవల మహీంద్రా ప్రవేశపెట్టిన బ్లేజో స్మార్ట్ ట్రక్కులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. విభిన్న అవసరాలకు 25-49 టన్నుల శ్రేణిలో 55 వేరియంట్లను తీసుకొచ్చాం. కంపెనీకి 2016-17లో 40% అమ్మకాలు బ్లేజో నుంచి సమకూరతాయని ఆశిస్తున్నాం. ఇక 8-16 టన్నుల వాణిజ్య వాహన విభాగంలోకి రెండున్నరేళ్లలో మహీంద్రా ప్రవేశిస్తోంది. కంపెనీ నుంచి 20 మోడళ్లు రావచ్చు. ఈ సెగ్మెంట్లో 15% వృద్ధితో ఏటా లక్ష యూనిట్లు వివిధ కంపెనీలవి అమ్ముడవుతున్నాయి. ట్రక్, బస్ విభాగంలో మహీంద్రా 2015లో 10 కొత్త మోడళ్లు తీసుకొచ్చింది. 2016లో 15 మోడళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది.