ఇక్కడి వాహన యజమానులు చాలా స్మార్ట్
కొత్త టెక్నాలజీకి సై అంటారు
2016-17లో 20 శాతంపైగా వృద్ధి
మహీంద్రా ట్రక్, బస్ విభాగం సీఈవో నళిన్ మెహతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో తెలుగు రాష్ట్రాలది ఎప్పుడూ ప్రత్యేకమే. మార్కెట్లోకి నూతన టెక్నాలజీతో కొత్త మోడల్ వస్తే చాలు. వాహనాన్ని కొంటారని మహీంద్రా అండ్ మహీంద్రా చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,78,000ల భారీ వాణిజ్య వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 10 శాతం ఉండనుంది. ముంబై తర్వాత దేశంలో అతి పెద్ద మార్కెట్ ఈ రెండు రాష్ట్రాలేనని మహీంద్రా ట్రక్, బస్ విభాగం సీఈవో నళిన్ మెహతా వెల్లడించారు. భారత్‌లో వాణిజ్య వాహన రంగం తీరుతెన్నులు, మహీంద్రా భవిష్యత్ కార్యాచరణను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
యజమానుల చురుకైన పాత్ర..
తెలుగు రాష్ట్రాల్లో యజమానులకు వాహనం ఎలా ఉండాలో తెలుసు. డ్రైవర్లకున్న పరిజ్ఞానం వారికీ వుంది. సాంకేతికపరమైన అవగాహనా ఉంది. ప్రతీ వాహనం పనితీరును ప్రత్యక్షంగా గమనిస్తారు. నూతన టెక్నాలజీతో కొత్త మోడళ్లు రాగానే ఆసక్తిగా కొంటారు. కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక ఒక్కో వాహనం కోసం ఖాతా పుస్తకాన్ని నిర్వహించే వారూ ఉన్నారు. 100కుపైగా వాణిజ్య వాహనాలున్న ఆపరేటర్లు దేశవ్యాప్తంగా 5,000లకుపైగా ఉంటారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 50 శాతముంటుంది. తెలుగు రాష్ట్రాల వాహన యజమానులతో తమిళనాడు ఆపరేటర్లు పోటీపడతారు.
వృద్ధి ఇక్కడే ఎక్కువ..
దేశవ్యాప్తంగా వాణిజ్య వాహన రంగానికి 2012-2015 అత్యంత క్లిష్టమైన కాలం. మందగమనం కారణంగా కొత్త వాహనాల కొనుగోళ్లకు యజమానులు దూరంగా ఉన్నారు. వాస్తవానికి పెద్ద ఆపరేటర్లు నాలుగేళ్లకోసారి పాత వాహనాన్ని విక్రయించి కొత్తవి సమకూర్చుకుంటారు. అలాంటిది 2012-15 కాలంలో కొనుగోళ్లను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో పరిశ్రమ 50 శాతం తిరోగమనం చెందింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 100 శాతం తిరోగమనం నమోదైంది. అయితే రికవరీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణ రంగంతోపాటు ఇతర విభాగాల కారణంగా వాహన అమ్మకాలు అధికంగా ఉండనున్నాయి. కొత్త వాహనాల కొనుగోళ్లు మొద లయ్యాయి. 2016-17లో పరిశ్రమ 20% వృద్ధి ఆశిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మరింత మెరుగైన పనితీరు కనబరుస్తాయి.
కొత్త మోడళ్లతో రంగంలోకి..
ఇటీవల మహీంద్రా ప్రవేశపెట్టిన బ్లేజో స్మార్ట్ ట్రక్కులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. విభిన్న అవసరాలకు 25-49 టన్నుల శ్రేణిలో 55 వేరియంట్లను తీసుకొచ్చాం. కంపెనీకి 2016-17లో 40% అమ్మకాలు బ్లేజో నుంచి సమకూరతాయని ఆశిస్తున్నాం. ఇక 8-16 టన్నుల వాణిజ్య వాహన విభాగంలోకి రెండున్నరేళ్లలో మహీంద్రా ప్రవేశిస్తోంది. కంపెనీ నుంచి 20 మోడళ్లు రావచ్చు. ఈ సెగ్మెంట్‌లో 15% వృద్ధితో ఏటా లక్ష యూనిట్లు వివిధ కంపెనీలవి అమ్ముడవుతున్నాయి. ట్రక్, బస్ విభాగంలో మహీంద్రా 2015లో 10 కొత్త మోడళ్లు తీసుకొచ్చింది. 2016లో 15 మోడళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది.