హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహన విక్రయాలు 2023–24లో 9–11 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. 6 శాతం ఆర్థిక వృద్ధి అంచనాలు, అలాగే మధ్య, భారీ వాణిజ్య వాహన విభాగంలో పెద్ద ఎత్తున విక్రయాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ‘మౌలిక రంగానికి బడ్జెట్‌లో పెరిగిన కేటాయింపులు డిమాండ్‌కు మద్ధతు ఇస్తాయి.
దేశీయ వాణిజ్య వాహన విపణిలో వృద్ధి నమోదు కానుండడం వరుసగా ఇది మూడవ ఆర్థిక సంవత్సరంగా నిలుస్తుంది. తేలికపాటి వాణిజ్య వాహన విభాగం 8–10 శాతం వృద్ధి ఆస్కారం ఉంది. ఇదే జరిగితే కోవిడ్ ముందస్తు 2019ని మించి అమ్మకాలు నమోదు కానున్నాయి. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు 13–15 శాతం అధికం అయ్యే చాన్స్ ఉంది.
ఈ విభాగం విక్రయాలు 2024–25లో కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకోనున్నాయి. 2021–22లో పరిశ్రమ 31 శాతం దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వాణిజ్య వాహన రంగం 27 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. కంపెనీల నిర్వహణ లాభాలు 2023–24లో నాలుగేళ్ల గరిష్టం 7–7.5 శాతానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం పెరగవచ్చు’ అని క్రిసిల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment