Rating agency Crisil
-
సిమెంట్ పరిశ్రమలో తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమలో వృద్ధి నిదానించొచ్చని, 7–8 శాతం మేర నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 475 మిలియన్ టన్నుల మేర డిమాండ్ ఉండొచ్చని పేర్కొంది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో సిమెంట్ రంగంలో డిమాండ్ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) సిమెంట్ డిమాండ్ కేవలం 3 శాతం వృద్ధినే నమోదు చేయడం గమనార్హం. వేసవిలో అధిక వేడి వాతావరణానికి తోడు, సాధారణ ఎన్నికల సమయంలో కార్మికుల కొరత డిమాండ్ మందగించడానికి కారణాలుగా క్రిసిల్ తెలిపింది. రెండో త్రైమాసికంలోనూ (జూలై–సెపె్టంబర్) సిమెంట్ డిమాండ్ మొదటి క్వార్టర్లో మాదిరే నమోదై ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ద్వితీయ ఆరు నెలల కాలం (2024–25)లో సిమెంట్ పరిశ్రమలో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని తెలిపింది. నిర్వహణ లాభం టన్నుకు రూ.975–1,000 మధ్య ఉండొచ్చని, ఇది దశాబ్ద సగటు రూ.963 కంటే ఎక్కువని పేర్కొంది. దేశ విక్రయాల్లో 85% వాటా కలిగిన 18 సిమెంట్ తయారీ సంస్థలను విశ్లేశించి క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. హౌసింగ్ నుంచి డిమాండ్.. ఇళ్ల నిర్మాణ రంగం నుంచి సిమెంట్ డిమాండ్ పుంజుకోవచ్చని, మెరుగైన వర్షాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. మొత్తం సిమెంట్ వినియోగంలో ఇళ్ల నిర్మాణ రంగం 55–60% వాటా ఆక్రమిస్తుండడం గమనార్హం. దీనికి తోడు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు సైతం సిమెంట్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని.. సిమెంట్ డిమాండ్‌లో మౌలిక రంగం వాటా 30 శాతంగా ఉంటుందని తెలిపింది. వాస్తవానికి మౌలిక రంగం నుంచి సిమెంట్‌కు డిమాండ్ జూలై వరకు స్తబ్దుగానే ఉన్నప్పటికీ.. అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సిమెంట్‌కు డిమాండ్‌ను పెంచుతుందని వివరించింది. 2024–25 బడ్జెట్లో మూలధన వ్యయాలకు కేటాయింపులను కేంద్రం 6% పెంచడంతో మౌలిక రంగ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని తెలిపింది. కంపెనీల వద్ద నగదు నిల్వలు మెరుగైన స్థితిలో ఉండడం వాటి రుణ పరపతిని స్థిరంగా ఉంచేలా చేస్తుందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగ కార్యకలాపాలు మందగించడం లేదా మౌలిక ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాలు బలహీనంగా ఉంటే కనుక అది సిమెంట్ డిమాండ్‌ను దెబ్బతీయవచ్చని రిస్‌్కలను ప్రస్తావించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు లేదా కంపెనీలు సిమెంట్ విక్రయ ధరలను పెంచలేకపోవడం కంపెనీల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని హెచ్చరించింది. -
ఎన్పీఏలు తగ్గుతున్నాయ్ కానీ..
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 2.5 శాతానికి మెరుగుపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. అయితే, వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్ఐ) రుణాల వంటి ఎటువంటి హామీ లేని (అన్సెక్యూర్డ్) రుణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ రుణాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. » 2023–24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. 2024–25లో ఈ రేటును 6.8 శాతంగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రుణ వృద్ధి రేటు కూడా ఇదే సంవత్సరాల్లో 16 శాతం నుంచి 14 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అయితే గడచిన దశాబ్ద కాలంలో 14 శాతం రుణ వృద్ధి రేటు అతిపెద్ద మూడవ వేగవంతమైన పురోగతి రేటు. » వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్ఐ) రుణాల వంటి అన్సెక్యూర్డ్ రుణాలకు అధిక రిస్క్ వెయిటేజ్ ఇవ్వాలన్న రెగ్యులేటరీ నిబంధనలతో ఇప్పటికే బ్యాంకింగ్ వీటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. » స్థూల ఎన్పీఏలు గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఎదురుదెబ్బలకు కారణమయ్యాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతి కనబడింది. 2023–24లో ఈ రేటు 2.8 శాతం ఉంటే, 2024–25లో 2.5 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం. » అన్సెక్యూర్డ్ రుణాలను తీసుకుంటే స్థూల ఎన్పీఏలు 2023–24లో 1.5 శాతం ఉంటే, 2024–25లో ఈ రేటు 2 శాతానికి చేరే అవకాశం ఉంది. » 30 రోజుల పాటు చెల్లించని రుణాలను ఇంకా స్థూల ఎన్పీఏలుగా గుర్తించబడనప్పటికీ, ఇవి కూడా కలుపుకుంటే వీటి తీవ్రత 2.1 శాతం నుంచి 2.5 శాతానికి పెరుగుతుంది. » 2023–24లో సూక్ష్మ రుణ సంస్థల రుణ వ్యయాలు 2 శాతం ఉంటే, 2024–25లో ఇవి 3.5 శాతానికి పెరగనున్నాయి. కార్పొరేట్ ‘క్రెడిట్ ఫ్రొఫైల్’కు ఎకానమీ వృద్ధి బాసట ఇదిలాఉండగా, అధిక ఆర్థిక వృద్ధి రేటు... 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత్ కార్పొరేట్ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మున్ముందు మరింత మెరుగుపడుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. దాదాపు 7,000 కంపెనీలను రేటింగ్ ఇచ్చే క్రిసిల్ రేటింగ్స్... ఈ విషయంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, క్రెడిట్ ప్రొఫైల్ పెరుగుదల నిష్పత్తి 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్య 1.79 రెట్లు ఉండగా, ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఇది 2.75 రెట్లు మెరుగుపడినట్లు తెలిపింది. గత ఆరు నెలల్లో 506 కంపెనీల రేటింగ్లను అప్‌గ్రేడ్ చేయగా, 184 డౌన్గ్రేడ్లు ఉన్నాయని వివరించింది. సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి దీనిపై మాట్లాడుతూ, భారత్ కార్పొరేట్ రంగంపై క్రిసిల్కు సానుకూల క్రెడిట్ అవుట్‌లుక్ ఉందని తెలిపింది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం ఎకానమీ పురోగతికి దారితీసే అంశాలని పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వ్యవధిలో (ప్రథమార్థంలో) 38 శాతానికి పైగా రేటింగ్ అప్గ్రేడ్లు మౌలిక సదుపాయాలు లేదా సంబంధిత రంగాలకు చెందినవేనని తెలిపింది. -
వచ్చే ఏడాదీ ట్రావెల్ కంపెనీలకు అనుకూలమే
ముంబై: పర్యాటక రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 30 శాతం వృద్ధిని చూడనుండగా, వచ్చే ఏడాది దీనితో పోలిస్తే 12–14 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా 30 శాతం వృద్ధి అన్నది కరోనా ముందు నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 18 శాతం అధికమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ కంపెనీలు ప్రచారంపై ఎక్కువగా ఖర్చు చేసినప్పటికీ, వాటి నిర్వహణ మార్జిన్ ఆరోగ్యంగా 6.5 శాతానికి పైనే ఉంటుందని తెలిపింది. వ్యయాల నియంత్రణ, ఆటోమేషన్ చర్యలు ఇందుకు సహకరిస్తాయని పేర్కొంది. థామస్ కుక్, మేక్ మై ట్రిప్, యాత్రా, ఈజ్ మైట్రిప్ కంపెనీల గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. ట్రావెల్ రంగంలో 60 శాతం ఆదాయం ఈ నాలుగు కంపెనీలకే చెందుతుండడం గమనార్హం. విదేశీ ప్రయాణాలు పెరుగుతుండడం, చిన్న ప్రాంతాలకూ డిమాండ్‌లో వృద్ధి టూర్, ట్రావెల్ ఆపరేటర్ల వృద్ధికి సాయపడుతున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ప్రభుత్వం టీసీఎస్ రేటు పెంచడం వల్ల పడే ప్రభావం స్వల్పమేనని, 80 శాతం ప్రయాణాల బిల్లు వ్యక్తిగతంగా రూ.7 లక్షల్లోపే ఉంటుందని ఆమె వెల్లడించారు. ఒక వ్యక్తి విదేశీ ప్రయాణాల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు మించి వ్యయం చేస్తే వసూలు చేసే టీసీఎస్ రేటును 5 శాతం నుంచి కేంద్రం 20 శాతానికి పెంచడం గమనార్హం. -
పేపర్ పరిశ్రమ ఆదాయంలో క్షీణత
న్యూఢిల్లీ: అమ్మకాలు పెరిగినప్పటికీ పేపర్ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 8–10 శాతం మేర క్షీణించొచ్చని ప్రమఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. తీవ్ర పోటీ కారణంగా నికర ప్రయోజనం తగ్గొచ్చని పేర్కొంది. క్రితం ఏడాది మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద అమ్మకాల పరిమాణం 5–7 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. నిర్వహణ మార్జిన్ ఆరోగ్యకరంగా 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే అయినా, కరోనా ముందున్న నాటి 17 శాతం కంటే ఎక్కువేనని వివరించింది. దీంతో స్థిరమైన నగదు ప్రవాహాలు ఉంటాయని తెలిపింది. 2022–23లో పేపర్ పరిశ్రమ రికార్డు స్థాయిలో 30 శాతం ఆదాయ వృద్ధిని చూడడం గమనార్హం. 87 పేపర్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ నివేదికను విడుదల చేసింది. పేపర్ పరిశ్రమలో సగం ఆదాయం ఈ కంపెనీల చేతుల్లోనే ఉంది. ప్యాకేజింగ్ పేపర్ వాటా మొత్తం మార్కెట్లో 55 శాతంగా ఉంది. ఆ తర్వాత రైటింగ్, ప్రింటింగ్ (డబ్ల్యూపీ) పేపర్ వాటా 30 శాతంగా ఉంది. మిగిలినది న్యూస్ ప్రింట్, స్పెషాలిటీ పేపర్. ప్యాకేజింగ్ పేపర్‌ను ఫార్మాస్యూటికల్స్, ఈ కామర్స్ గూడ్స్, కన్జన్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, రెడీమేడ్ విభాగాలు ఉపయోగిస్తుంటాయి. విద్యా రంగం, కార్పొరేట్ రంగం డబ్ల్యూపీ పేపర్‌ను ఉపయోగిస్తుంటుంది. డిమాండ్ ఇలా.. ప్యాకేజింగ్ పేపర్ అమ్మకాల పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. డబ్ల్యూపీ పేపర్ అమ్మకాల పరిమాణం 3–5 శాతమేర పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వం వ్యయాలకు తోడు, నూతన వి ద్యా విధానం ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. అలాగే, 2024 సాధారణ ఎన్నికల ముందు డబ్ల్యూపీ పేపర్‌కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. -
వృద్ధి బాటలో వాణిజ్య వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహన విక్రయాలు 2023–24లో 9–11 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. 6 శాతం ఆర్థిక వృద్ధి అంచనాలు, అలాగే మధ్య, భారీ వాణిజ్య వాహన విభాగంలో పెద్ద ఎత్తున విక్రయాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ‘మౌలిక రంగానికి బడ్జెట్లో పెరిగిన కేటాయింపులు డిమాండ్‌కు మద్ధతు ఇస్తాయి. దేశీయ వాణిజ్య వాహన విపణిలో వృద్ధి నమోదు కానుండడం వరుసగా ఇది మూడవ ఆర్థిక సంవత్సరంగా నిలుస్తుంది. తేలికపాటి వాణిజ్య వాహన విభాగం 8–10 శాతం వృద్ధి ఆస్కారం ఉంది. ఇదే జరిగితే కోవిడ్ ముందస్తు 2019ని మించి అమ్మకాలు నమోదు కానున్నాయి. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు 13–15 శాతం అధికం అయ్యే చాన్స్ ఉంది. ఈ విభాగం విక్రయాలు 2024–25లో కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకోనున్నాయి. 2021–22లో పరిశ్రమ 31 శాతం దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వాణిజ్య వాహన రంగం 27 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. కంపెనీల నిర్వహణ లాభాలు 2023–24లో నాలుగేళ్ల గరిష్టం 7–7.5 శాతానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం పెరగవచ్చు’ అని క్రిసిల్ వివరించింది. -
పెరుగుతున్న ఆర్థిక పొదుపులు
ముంబై: దేశంలో పొదుపు ఆర్థిక సాధనాల వైపు ప్రయాణిస్తోంది. ఈ ఆర్థిక పొదుపు 2026–27 నాటికి జీడీపీలో 74 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. దీనిపై బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2021–22 నాటికి రూ.135 లక్షల కోట్లుగా ఉంటే, 2026–27 నాటికి రూ.315 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేసింది. విధాన నిర్ణేతలు దీర్ఘకాలంగా పొదుపు నిధులు ఆర్థిక సాధనాల్లోకి మళ్లాలని కోరుకుంటున్నట్టు గుర్తు చేసింది. అంటే నగదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలకు బదులు ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈక్విటీ, ఇతర పెట్టుబడి సాదనాల్లో తమ పొదుపు నిధులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా డెట్, ఈక్విటీ మార్కెట్లలో అధిక లిక్విడిటీ మొత్తం ఆర్థికీకరణ అజెండాకు సాయపడుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు అస్థిరతలు లేదా లిక్విడిటీ పరిస్థితులు ఇన్వెస్టర్ల అనుభవంపై ప్రభావం చూపించొచ్చని క్రిసిల్ హెచ్చరించింది. మద్దతు చర్యలు.. అందరికీ ఆర్థిక సేవలు చేరువ కావడం, డిజిటలైజేషన్, దీర్ఘకాలంగా మధ్య తరగతి ప్రజల ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ఈ తరహా సాధనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నీ కలసి.. పొదుపు నిధులు ఆర్థిక సాధనాల వైపు మళ్లేందుకు దోహదపడినట్టు క్రిసిల్ వివరించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు పంపిణీపై దృష్టి సారించాలని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ జిజు విద్యాధరన్ సూచించారు. ఆయా ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు ప్రోత్సాహకాల అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి సాధనాలను మరింత సరళంగా అర్థం చేసుకునేందుకు అన్నింటిపైనా ఒకే మాదిరి పన్ను విధానం ఉండాలన్నారు. -
డయాగ్నస్టిక్ కంపెనీలకు ఇబ్బందే
ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. వైరస్ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ తెలిపింది. ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్మెంట్ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్ షీట్లను క్రిసిల్ విశ్లేషించింది. పెరిగిన పోటీ.. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు ల్యాబ్ టెస్ట్‌లను కూడా ఆఫర్ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్లైన్ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్లైన్ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్ సంస్థలు డిజిటల్ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్లైన్ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ప్రింట్ మీడియా ఆదాయంలో 35% వృద్ధి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయం 35 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమ ఆదాయం 75 శాతమే ఉంటుందని వెల్లడించింది. ‘2019–20లో ప్రింట్ మీడియా ఆదాయం రూ.31,000 కోట్లు. ఇందులో ప్రకటనల ద్వారా 70%, మిగిలినది చందాల (సబ్స్క్రిప్షన్స్) ద్వారా సమకూరింది. మహమ్మారి కారణంగా పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 40% పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.24,000–25,000 కోట్లకు చేరవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలు, కంటెంట్ డిజిటలైజేషన్‌తో లాభదాయకత 9–10 శాతానికి పునరుద్ధరించడానికి దారితీస్తుంది. ఆరు నెలలుగా న్యూస్‌ప్రింట్ ధరలు 20–30% అధికమైనప్పటికీ లాభం పెరుగుతుంది’ అని క్రిసిల్ తన నివేదిక ద్వారా తెలిపింది. ఆదాయాలు మెరుగుపడతాయి.. ఏప్రిల్–జూన్ కాలంలో ప్రకటన ఆదాయాలపై సెకండ్ వేవ్ ప్రభావం చూపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నందున ప్రస్తుత త్రైమాసికం నుండి ప్రకటన ఆదాయాలు మెరుగవుతాయి. ఆంగ్లేతర వార్తా పత్రికలు సెకండ్ వేవ్‌లో కూడా చందా ఆదాయాన్ని నిలబెట్టుకోగలిగాయి. బలమైన మూలాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం. కోవిడ్–19 ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో సబ్స్క్రిప్షన్స్ ఆదాయ నష్టం 12–15 శాతానికి పరిమితం అవుతుంది. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా తక్కువ ధర, నమ్మదగిన కంటెంట్‌ను అందించగల సామర్థ్యం, వార్తా పత్రికలను చదివే ప్రజల అలవాటు వంటి అంశాల కారణంగా భారత్‌లో ప్రింట్ మీడియా ప్రాచుర్యం పొందిందని క్రిసిల్ వెల్లడించింది. -
2050 నాటికి ‘వృద్ధ భారతం’!
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువభారత్‌గా ఉన్న దేశం.. 2050 నాటికల్లా వృద్ధ భారత్‌గా క్రమంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి పన్నెండు మందిలో ఒకరు అరవైలలో ఉండగా.. అప్పటికల్లా ప్రతి అయిదు మందిలో ఒకరు అరవై ఏళ్ల పైబడిన వారు ఉండనున్నారు. వయస్సుపరంగా జనాభా సంఖ్యలో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ పీఎఫ్ఆర్డీఏ, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 8.9 శాతంగా ఉండగా.. 2050 నాటికి ఇది 19.4 శాతానికి పెరగనుందని దేశ వయోజనుల ఆర్థిక భద్రత అంశంపై నివేదికను విడుదల చేసిన సందర్భంగా పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ తెలిపారు. నివేదిక ప్రకారం ప్రస్తుతం జనాభాలో 0.9 శాతంగా ఉన్న 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి 2.8 శాతానికి పెరగనుంది. ఈ నేపథ్యంలో పింఛను వ్యవస్థను అభివృద్ధి చేయడం దేశ శ్రేయస్సుకు కీలకమని హేమంత్ చెప్పారు. ఇది ఇటు వృద్ధులకు ఆర్థిక భద్రతనివ్వడంతో పాటు దీర్ఘకాలంలో ఎకానమీ వృద్ధికి తోడ్పడే కీలక రంగాలకు నిధులను సమకూర్చేందుకు కూడా దోహదపడగలదని ఆయన వివరించారు. -
మోదీ సర్కారుపై తగ్గిన అంచనాలు
నరేంద్ర మోదీ ఏడాది పాలనపై రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఒక మోస్తరు స్థాయికి తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన సమస్యల వల్ల డిమాండ్‌ను మెరుగుపర్చలేకపోవడమే కేంద్రంపై అసంతృప్తికి కారణమని పేర్కొంది. మోదీ ప్రభుత్వం రాగానే ఎకానమీ అత్యంత వేగంగా కోలుకుంటుందని, భారీ సంస్కరణలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం కొంత నిరాశపర్చినట్లు క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా క్రిసిల్ మోడిఫైడ్ ఎక్స్పెక్టేషన్స్ పేరిట నివేదికను విడుదల చేసింది. ఎన్ఎస్ఈలోని సీఎన్ఎక్స్ 500 సూచీలో 411 కంపెనీల ఫలితాలను ఈ నివేదికలో విశ్లేషించారు. రాబోయే రోజుల్లో స్థూలదేశీయోత్పత్తి 7.9 శాతం వృద్ధి సాధించగలదని, ద్రవ్యోల్బణం 5.8 శాతానికి దిగిరాగలదని క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ప్రభుత్వానికి అధిక ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం మొదలైనవి వారసత్వంగా వచ్చాయని, దీని వల్ల పరిమితస్థాయి పనితీరు మాత్రమే కనపర్చగలుగుతోందని జోషి వివరించారు. మరోవైపు, ఏడాది పాలనలో స్థూల ఆర్థిక పరిస్థితులు, వృద్ధి- ద్రవ్యోల్బణ అంచనాలు మెరుగుపడ్డాయని, కరెంటు ఖాతా లోటు అదుపులోకి వచ్చిందని జోషి చెప్పారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని, వ్యాపారాల నిర్వహణకు అనుకూలంగా నిబంధనలు సడలించడం తదితర చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. తక్షణ రికవరీ కష్టసాధ్యమే.. సానుకూల పరిస్థితులు కొంత మేర ఉన్నా.. ఎకానమీ వేగంగా టర్న్‌ఎరౌండ్ కావడం కష్టసాధ్యమేనని జోషి చెప్పారు. ద్రవ్య, ఆర్థికపరమైన పరిమితులు కారణంగా ప్రభుత్వం స్వల్పకాలికంగా డిమాండ్‌కు ఊతమివ్వలేకపోవచ్చన్నారు. డిమాండ్ లేకపోవడం వల్లే ప్రైవేట్ పెట్టుబడులు అంతగా రావడం లేదని జోషి వివరించారు. ఫలితంగా రికవరీ మందకొడిగా ఉంటోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విని యోగం క్రమంగా పెరుగుతున్న కొద్దీ డిమాండ్ కూడా మెరుగుపడగలదని పేర్కొన్నారు. అయితే, పెట్టుబడులు పెట్టేలా ప్రైవేట్ కంపెనీలను పురిగొల్పేంతగా ఇది ఉండకపోవచ్చని జోషి తెలిపారు.