రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 2.5 శాతానికి మెరుగుపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. అయితే, వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్‌ఐ) రుణాల వంటి ఎటువంటి హామీ లేని (అన్‌సెక్యూర్డ్) రుణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ రుణాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
» 2023–24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. 2024–25లో ఈ రేటును 6.8 శాతంగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రుణ వృద్ధి రేటు కూడా ఇదే సంవత్సరాల్లో 16 శాతం నుంచి 14 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అయితే గడచిన దశాబ్ద కాలంలో 14 శాతం రుణ వృద్ధి రేటు అతిపెద్ద మూడవ వేగవంతమైన పురోగతి రేటు.
» వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్‌ఐ) రుణాల వంటి అన్‌సెక్యూర్డ్ రుణాలకు అధిక రిస్క్ వెయిటేజ్ ఇవ్వాలన్న రెగ్యులేటరీ నిబంధనలతో ఇప్పటికే బ్యాంకింగ్ వీటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
» స్థూల ఎన్‌పీఏలు గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఎదురుదెబ్బలకు కారణమయ్యాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతి కనబడింది. 2023–24లో ఈ రేటు 2.8 శాతం ఉంటే, 2024–25లో 2.5 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.
» అన్‌సెక్యూర్డ్ రుణాలను తీసుకుంటే స్థూల ఎన్‌పీఏలు 2023–24లో 1.5 శాతం ఉంటే, 2024–25లో ఈ రేటు 2 శాతానికి చేరే అవకాశం ఉంది.
» 30 రోజుల పాటు చెల్లించని రుణాలను ఇంకా స్థూల ఎన్‌పీఏలుగా గుర్తించబడనప్పటికీ, ఇవి కూడా కలుపుకుంటే వీటి తీవ్రత 2.1 శాతం నుంచి 2.5 శాతానికి పెరుగుతుంది.
» 2023–24లో సూక్ష్మ రుణ సంస్థల రుణ వ్యయాలు 2 శాతం ఉంటే, 2024–25లో ఇవి 3.5 శాతానికి పెరగనున్నాయి.
కార్పొరేట్ ‘క్రెడిట్ ఫ్రొఫైల్’కు ఎకానమీ వృద్ధి బాసట
ఇదిలాఉండగా, అధిక ఆర్థిక వృద్ధి రేటు... 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత్ కార్పొరేట్ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మున్ముందు మరింత మెరుగుపడుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. దాదాపు 7,000 కంపెనీలను రేటింగ్ ఇచ్చే క్రిసిల్ రేటింగ్స్... ఈ విషయంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, క్రెడిట్ ప్రొఫైల్ పెరుగుదల నిష్పత్తి 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్య 1.79 రెట్లు ఉండగా, ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఇది 2.75 రెట్లు మెరుగుపడినట్లు తెలిపింది.
గత ఆరు నెలల్లో 506 కంపెనీల రేటింగ్‌లను అప్‌గ్రేడ్ చేయగా, 184 డౌన్‌గ్రేడ్‌లు ఉన్నాయని వివరించింది. సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి దీనిపై మాట్లాడుతూ, భారత్ కార్పొరేట్ రంగంపై క్రిసిల్‌కు సానుకూల క్రెడిట్ అవుట్‌లుక్ ఉందని తెలిపింది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం ఎకానమీ పురోగతికి దారితీసే అంశాలని పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వ్యవధిలో (ప్రథమార్థంలో) 38 శాతానికి పైగా రేటింగ్ అప్‌గ్రేడ్‌లు మౌలిక సదుపాయాలు లేదా సంబంధిత రంగాలకు చెందినవేనని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment