NPA
-
రుణం.. కాదిక సులభం!
డబ్బు అవసరం ఉంది.. సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చనుకుంటే కుదరదిక. రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాపారాన్ని, వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడానికి గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చిన సంస్థలు రూట్ మార్చాయి. మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో తాము ఇచి్చన రుణాలు నిరర్ధక ఆస్తులుగా (ఎన్పీఏ) మారకూడదని జాగ్రత్త పడుతున్నాయి. ఎన్పీఏల రిస్క్ నుంచి బయటపడేందుకు క్రెడిట్ స్కోర్‌ను నిక్కచ్చిగా పాటిస్తున్నాయి. ముప్పు తక్కువగా ఉన్న కస్టమర్లకే లోన్స్ మంజూరు చేస్తున్నాయి. మరికొన్ని రుణ సంస్థలు ఒక మెట్టు దిగినప్పటికీ వాహనాలు, కన్యూమర్ డ్యూరబుల్స్ విషయంలో తక్కువ మొత్తం మంజూరు చేయడం లేదా డౌన్‌పేమెంట్ అధికంగా వసూలు చేయడం లాంటివి చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్కంపెనీల సేఫ్ గేమ్క్రెడిట్ హిస్టరీ లేనివారు.. అంటే తొలిసారిగా రుణం తీసుకోవాలనుకునే వారిని కంపెనీలు అంత సులభంగా కనికరించడం లేదు. న్యూ టు క్రెడిట్ (ఎన్టీసీ) విభాగంలో రెండేళ్లలో లోన్ పొందిన కస్టమర్ల సంఖ్య 54.5% తగ్గిందంటే కంపెనీల సేఫ్ గేమ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 730లోపు ఉన్న వినియోగదార్లకు జారీ చేస్తున్న రుణాల సంఖ్య సైతం క్షీణించింది. రెండేళ్లలో వీరి వాటా 42 నుంచి 36 శాతానికి వచి్చంది. అదే సమయంలో 731 మించి క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లు 58 నుంచి 64 శాతానికి చేరారు. అంతేకాదు ఏడాదిలో సగటు వ్యక్తిగత రుణ మొత్తాన్ని 2024 డిసెంబర్ నాటికి 20% తగ్గించి రూ.44,000కు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. 2023 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.55,000 ఉండేది. చిన్న రుణాల్లో ఫిన్‌టెక్ హవా భారత్‌లో 2024 డిసెంబర్ నాటికి ఫిన్‌టెక్ కంపెనీలు మంజూరు చేసిన రుణాల మొత్తం రూ.1,30,000 కోట్లు. దేశంలోని మొత్తం రుణ పరిశ్రమలో ఫిన్‌టెక్ సంస్థల వాటా కేవలం 1.03 శాతమే. అయినా ఈ కంపెనీలు జారీ చేసిన రుణాలు ఏడాదిలో 32% వృద్ధిని నమోదు చేశాయి. రూ.50,000లోపు విలువ చేసే వ్యక్తిగత రుణాల్లో ఖాతాల సంఖ్య పరంగా ఫిన్‌టెక్ కంపెనీల వాటా ఏకంగా 89 శాతం ఉంది. ఇక ఫిన్‌టెక్‌లు ఇస్తున్న పర్సనల్ లోన్స్‌లో తక్కువ విలువ చేసే (రూ.50 వేల లోపు) ఖాతాలు 92 శాతం నమోదు చేశాయి. ఈ కంపెనీలు యువత లక్ష్యంగా మారుమూల పల్లెలకూ విస్తరించాయనడానికి ఈ అంకెలే నిదర్శనం. ఫిన్‌టెక్ సంస్థలు వినూత్న సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ చెల్లింపులు, వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్–టు–పీర్ లెండింగ్) రుణాల వంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి. 2024 డిసెంబర్ నాటికి భారత్‌లో రిటైల్ రుణాలు ఇలా..పరిశ్రమమొత్తం రుణాలు రూ.1,26,48,000 కోట్లురెండేళ్లలో వృద్ధి: 52%కస్టమర్లు: 27.8 కోట్లుఫిన్టెక్మొత్తం రుణాలు రూ.1,30,000 కోట్లు రెండేళ్లలో వృద్ధి: 145%కస్టమర్లు: 2.33 కోట్లు -
‘బ్యాడ్ బ్యాంక్’ గుడ్..!?
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై సమకూరే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. వసూలుకాని మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు.ఆర్బీఐ ఇటీవల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. దాంతో చాలామంది అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత ఉంటేనే అప్పు తీసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే అప్పులు ఎన్పీఏలు మారితే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బ్యాడ్ బ్యాంకుల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది.ఏమిటి లాభం..బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఎన్పీఏ ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి.ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు?బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)’లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి రికవరీ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి.ఇదీ చదవండి: ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..దీని ఏర్పాటుపై ప్రతిపాదనలుఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామం
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రోల్టా ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.616.30 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని ప్రకటించింది. ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన రోల్టా 2023 జనవరిలో దివాలా ప్రకటించి వివిధ రుణదాతలకు సుమారు రూ.14,000 కోట్లు బకాయి పడింది. ఈ కేసును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించారు.రోల్టా ఇండియా లిమిటెడ్ చేసిన రూ.616.30 కోట్ల రుణాల మోసం వివరాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సెబీ (ఎల్ఓడీఆర్) రెగ్యులేషన్స్, 2015 కింద బ్యాంక్ రెగ్యులేటరీ కాంప్లయన్స్, అంతర్గత వివరాల వెల్లడి విధానాల్లో భాగంగా బీఓఐ ఈ విషయాన్ని పేర్కొంది. మే 2024 కొన్ని సంస్థల నివేదిక ప్రకారం రోల్టా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నేతృత్వంలోని సంస్థలకు రూ.7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని అన్ సెక్యూర్డ్ విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ.6,699 కోట్లు బకాయి పడింది.ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!కార్యకలాపాలు ప్రభావితం కాకుండా చర్యలుబ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.616.30 కోట్ల మొత్తాన్ని పూర్తిగా సమకూర్చినట్లు ఆర్బీఐకి తెలిపిన వివరాల్లో పేర్కొంది. ఈ వర్గీకరణ వల్ల దాని ఆర్థిక పరిస్థితి ప్రభావితం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. పారదర్శకతను కొనసాగించడానికి, నియంత్రణ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి బ్యాంక్ నిబద్ధతతో ఉందని పేర్కొంది. ఏదేమైనా, భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) సమస్యను ఈ పరిణామాలు హైలైట్ చేస్తున్నాయి. ఇది ఆర్థిక సంస్థలకు సవాలుగా మారుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు తమ రుణ విధానాల్లో తగిన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. -
ఎన్పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) మొండిబాకీలను (ఎన్పీఏ) వేలం వేసే ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించేందుకు ‘బ్యాంక్‌నెట్’ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. సరికొత్తగా తీర్చిదిద్దిన ఈ–ఆక్షన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఎన్పీఏ కేసుల పరిష్కార ప్రక్రియను పారదర్శకమైన విధంగా, వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని మంత్రి వివరించారు.ఆటోమేటెడ్ కేవైసీ సాధనాలు, సురక్షితమైన పేమెంట్ గేట్వేలు, బ్యాంకు ధ్రువీకరించిన ప్రాపర్టీ టైటిల్స్ మొదలైన వాటిని అనుసంధానించడంతో పాటు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రాపర్టీ వేలం ప్రక్రియ ఆసాంతం అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు, 15 ప్రభుత్వ ప్రాయోజిత రుణాలు, సబ్సిడీ పథకాలను ఒకే చోట అనుసంధానించేందుకు ‘జన సమర్థ్ పోర్టల్’ ఉపయోగపడుతోందని మంత్రి తెలిపారు. దరఖాస్తుదారు డేటాను డిజిటల్‌గా మదింపు చేసే ఈ ప్రక్రియతో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, అనుమతులను పొందడం మరింత సులభతరం అయ్యిందని వివరించారు. ఇదీ చదవండి: టెస్లాను వెనక్కి నెట్టిన బీవైడీ28న ఇండస్‌ఇండ్‌పై నివేదికఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాలను పరిశీలిస్తున్న ఎక్స్టర్నల్ ఆడిటింగ్ సంస్థ పీడబ్ల్యూసీ మార్చి 28న బ్యాంకు బోర్డుకు తమ నివేదికను సమరి్పంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అకౌంటింగ్ సమస్యలు, వివిధ స్థాయుల్లో లోపాలు, తీసుకోతగిన దిద్దుబాటు చర్యలతో పాటు బ్యాంకునకు వాస్తవంగా ఎత మేర నష్టం వాటిల్లినది కూడా పీడబ్ల్యూసీ తన నివేదికలో పొందుపర్చే అవకాశం ఉన్నట్లు వివరించాయి. దాదాపు రూ. 2,100 కోట్ల అకౌంటింగ్ లోపాల వల్ల సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ అంచనా వేసింది. అవసరమైన వివరాలన్నీ వెల్లడించి, ప్రస్తుత త్రైమాసికంలోనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. -
రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్‌కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్అంబాసిడర్గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్ మాగ్నెట్’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్ సోదరుడే ఈ ప్రమోద్ మిట్టల్. మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్‌గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్ మిట్టల్ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.రిస్క్ మేనేజ్మెంట్: జీఐకేఐఎల్ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం. -
ఎన్పీఏ కేసులు.. ఆర్థిక శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), జాతీయ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) వద్ద ఎన్పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్సీఎల్టీ ముందుకు బ్యాంక్‌లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్సీఎల్టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్ఏఆర్సీఎల్, ఎన్సీఎల్టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్ఏఆర్సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్పీఏ ఖాతాలను బ్యాంక్‌లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. -
ఎన్పీఏలు తగ్గుతున్నాయ్ కానీ..
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 2.5 శాతానికి మెరుగుపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. అయితే, వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్ఐ) రుణాల వంటి ఎటువంటి హామీ లేని (అన్సెక్యూర్డ్) రుణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ రుణాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. » 2023–24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. 2024–25లో ఈ రేటును 6.8 శాతంగా అంచనా వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రుణ వృద్ధి రేటు కూడా ఇదే సంవత్సరాల్లో 16 శాతం నుంచి 14 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అయితే గడచిన దశాబ్ద కాలంలో 14 శాతం రుణ వృద్ధి రేటు అతిపెద్ద మూడవ వేగవంతమైన పురోగతి రేటు. » వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ (ఎంఎఫ్ఐ) రుణాల వంటి అన్సెక్యూర్డ్ రుణాలకు అధిక రిస్క్ వెయిటేజ్ ఇవ్వాలన్న రెగ్యులేటరీ నిబంధనలతో ఇప్పటికే బ్యాంకింగ్ వీటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. » స్థూల ఎన్పీఏలు గతంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఎదురుదెబ్బలకు కారణమయ్యాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతి కనబడింది. 2023–24లో ఈ రేటు 2.8 శాతం ఉంటే, 2024–25లో 2.5 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం. » అన్సెక్యూర్డ్ రుణాలను తీసుకుంటే స్థూల ఎన్పీఏలు 2023–24లో 1.5 శాతం ఉంటే, 2024–25లో ఈ రేటు 2 శాతానికి చేరే అవకాశం ఉంది. » 30 రోజుల పాటు చెల్లించని రుణాలను ఇంకా స్థూల ఎన్పీఏలుగా గుర్తించబడనప్పటికీ, ఇవి కూడా కలుపుకుంటే వీటి తీవ్రత 2.1 శాతం నుంచి 2.5 శాతానికి పెరుగుతుంది. » 2023–24లో సూక్ష్మ రుణ సంస్థల రుణ వ్యయాలు 2 శాతం ఉంటే, 2024–25లో ఇవి 3.5 శాతానికి పెరగనున్నాయి. కార్పొరేట్ ‘క్రెడిట్ ఫ్రొఫైల్’కు ఎకానమీ వృద్ధి బాసట ఇదిలాఉండగా, అధిక ఆర్థిక వృద్ధి రేటు... 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత్ కార్పొరేట్ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మున్ముందు మరింత మెరుగుపడుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. దాదాపు 7,000 కంపెనీలను రేటింగ్ ఇచ్చే క్రిసిల్ రేటింగ్స్... ఈ విషయంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, క్రెడిట్ ప్రొఫైల్ పెరుగుదల నిష్పత్తి 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్య 1.79 రెట్లు ఉండగా, ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఇది 2.75 రెట్లు మెరుగుపడినట్లు తెలిపింది. గత ఆరు నెలల్లో 506 కంపెనీల రేటింగ్లను అప్‌గ్రేడ్ చేయగా, 184 డౌన్గ్రేడ్లు ఉన్నాయని వివరించింది. సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి దీనిపై మాట్లాడుతూ, భారత్ కార్పొరేట్ రంగంపై క్రిసిల్కు సానుకూల క్రెడిట్ అవుట్‌లుక్ ఉందని తెలిపింది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం ఎకానమీ పురోగతికి దారితీసే అంశాలని పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వ్యవధిలో (ప్రథమార్థంలో) 38 శాతానికి పైగా రేటింగ్ అప్గ్రేడ్లు మౌలిక సదుపాయాలు లేదా సంబంధిత రంగాలకు చెందినవేనని తెలిపింది. -
రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్ చేసింది.బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్‌లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌తోపాటు బిడ్డింగ్‌లో పాల్గొన్న ఓంకార ఏఆర్సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది. -
అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. జూన్ 30న బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.410 కోట్లను డిఫాల్ట్ చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకునేలా అప్పు ఇచ్చిన బ్యాంకులు ఇంటర్క్రెడిటర్ అగ్రిమెంట్(రుణ గ్రహీతలు డిఫాల్ట్ అయితే రిస్క్ తగ్గించే ఒప్పందం)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు రూ.14,000 కోట్లు టర్మ్ లోన్లు ఉన్నాయి. రూ.15,000 కోట్లు షార్ట్ టర్మ్ లోన్లు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ లోన్, రూ.4,000 కోట్ల షార్ట్ టర్మ్ లోన్, రూ.1,400 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించింది. కెనరా బ్యాంక్ రూ.3,800 కోట్ల రుణాలు, ఇండియన్ బ్యాంక్ రూ.1,400 కోట్ల టర్మ్ లోన్ ఇచ్చింది. అయితే ఇటీవల రుణదాతలకు చెల్లించాల్సిన రూ.410 కోట్లు డిఫాల్ట్ చేయడంతో బ్యాంకులు ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్(ఐసీఏ)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ డిఫాల్ట్ అయిన నెలలోపు ఐసీఏపై సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. తద్వారా నష్టాల్లో ఉన్న కంపెనీని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకోవచ్చు. అయితే 75% మంది రుణదాతలు నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ చర్య అమలు అవుతుంది.సంస్థ ఇటీవల చేసిన డిఫాల్ట్ నగదు ఇంకా సాంకేతికంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) అవ్వలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది రుణదాతలు తాము ఇచ్చిన అప్పులకుగాను సంస్థలో 15 శాతం కేటాయింపులు పూర్తి చేశారు. డిఫాల్ట్ నిర్ణయం ప్రకటించిన 90 రోజుల తర్వాత లోన్ ఖాతా ఎన్పీఏగా మారుతుంది. ఆ సమయంలో బ్యాంకులు కనీసం 15 శాతం కేటాయింపులు కలిగి ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణఈ వ్యవహారంపై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ..‘వైజాగ్‌స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ సంస్థ రుణాలకు ప్రభుత్వ హామీ ఉండదు. సంస్థ ప్రస్తుతం కేవలం 30 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీ కస్టమర్లు తమ చెల్లింపులు సరిగా చేయడంలేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల ప్రారంభంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. సొంతంగా ఉక్కు గనులు కేటాయిస్తే కంపెనీ లాభాల్లోకి వెళ్తుందని అధికారులు, కార్మికులు చెబుతున్నారు. -
తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే..
దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో తగ్గునున్నాయని కేర్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. జీఎన్‌పీఏలు 2.1-2.4 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌పీఏలు 2.5-2.7 శాతంగా ఉన్నాయని సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో చెప్పింది. పారుబాకీలను ఎన్పీఏలుగా పేర్కొనడంతో పాటు, వాటికి తగిన కేటాయింపులు చేసి, వాస్తవ విలువలను చూపించాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేర్ రేటింగ్స్ తెలిపింది. అధిక వడ్డీ రేట్లు, నియంత్రణల ప్రభావం, ద్రవ్య లభ్యత, వాతావరణం, అంతర్జాతీయ సమస్యలు బ్యాంకుల జీఎన్పీఏలపై ప్రభావం చూపొచ్చనీ విశ్లేషించింది. 2013-14లో బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.8% కాగా, 2015-16లో ఏక్యూఆర్ (ఆర్బీఐ ఆస్తుల నాణ్యతా పరిశీలన) కారణంగా 2017-18 నాటికి 11.2 శాతానికి చేరాయి. ఎన్పీఏలను గుర్తించడం, వాటిని పునర్వ్యవస్థీకరణ చేయడం లాంటివి చేపట్టడంతో చాలా బ్యాంకులు ఒత్తిడికి గురయ్యాయని పేర్కొంది. తదుపరి తీసుకున్న కఠిన చర్యల కారణంగా 2018-19 నుంచి జీఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టాయి. 2022-23 నాటికి దశాబ్ద కనిష్ఠ స్థాయి 3.9 శాతానికి దిగి వచ్చాయి. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం చివరికి ఇవి 3 శాతం వద్ద ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రంగాల వారీగా చూస్తే.. 2023 సెప్టెంబరు చివరకు వ్యవసాయ రంగంలో 7% జీఎన్‌పీఏలు ఉన్నాయి. పారిశ్రామిక రుణాల్లో 4.2%, రిటైల్ రుణాల్లో 1.3% జీఎన్‌పీఏలు ఉన్నాయని తెలిపింది. -
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్‌దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
నిరర్థక ఆస్తులు తగ్గితేనే డివిడెండ్..! ఆర్బీఐ కొత్త నిబంధన
ముంబై: వాటాదారులకు డివిడెండ్ పంపిణీ విషయంలో బ్యాంక్‌లకు ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. నికర నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) 6 శాతం కంటే తక్కువగా ఉంటే, అవి డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొంది. చివరిగా 2005లో సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు బ్యాంక్‌లు వాటి నికర ఎన్పీఏలు 7 శాతంలోపుంటే డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ పంపిణీ చేసుకోవాలంటే నికర ఎన్పీఏలు 6 శాతంలోపు ఉండాలని ముసాయిదా ప్రతిపాదనల్లో ఆర్బీఐ పేర్కొంది. అలాగే, డివిడెండ్ పంపిణీలో గరిష్ట పరిమితిని లాభాల్లో 40 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. కాకపోతే ఈ గరిష్ట పరిమితి మేరకు డివిడెండ్ పంచాలంటే నికర ఎన్పీఏలు సున్నాగా ఉండాలి. డివిడెండ్ పంపిణీకి సంబంధించి తాత్కాలిక ఉపశమనం అభ్యర్థనలను అమోదించేది లేదని పేర్కొంది. ఇదీ చదవండి: అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే.. డివిడెండ్ పంపిణీకి అర్హత పొందాలంటే వాణిజ్య బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 11.5 శాతంగా ఉండాలి. అదే ఫైనాన్స్ బ్యాంక్‌లు, పేమెంట్ బ్యాంక్‌లకు 15 శాతంగా, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లకు 9 శాతంగా ఉండాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. విదేశీ బ్యాంక్‌లు ఆర్బీఐ అనుమతి లేకుండానే తమ లాభాలను మాతృ సంస్థకు పంపుకునేందుకు కూడా అనుమతించనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిని బ్యాంక్‌ల బోర్డులు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. బాసెల్ 3 ప్రమాణాలు, కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) అమలు నేపథ్యంలో మార్గదర్శకాలను ఆర్బీఐ సమీక్షించింది. -
‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..?
రూ.లక్ష లేదా రెండు లక్షల రూపాయలు బ్యాంకులు అప్పుగా ఇవ్వాలంటే సవాలక్ష పత్రాలు అడిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ కార్పొరేట్లు అప్పుకోసం బ్యాంకులకు వెళితే మర్యాదలు చేసిమరీ కోరి అప్పిస్తాయి. కానీ లక్షల్లో అప్పుతీసుకునే సామాన్యులే నెల కిస్తీలు సవ్యంగా చెల్లిస్తారు. కోట్లల్లో అప్పులు తీసుకునే కొందరు కార్పొరేట్లు, ఇతరులు పూర్తిగా చెల్లించేవరకు అనుమానమే. అలా తీసుకున్న అప్పు చెల్లించకుండా బ్యాంకుల వద్ద పోగవుతున్న నిరర్ధక ఆస్తుల(తిరిగి చెల్లించని అప్పులు) చిట్టా 2019 వరకు ఏకంగా రూ.9,33,779 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి కరాద్ తెలిపారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద ఇచ్చిన లోన్లను కలుపుకొని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2019 మార్చి 31 నాటికి రూ.9,33,779 కోట్లుగా రికార్డయ్యాయని కేంద్ర మంత్రి కరాద్ ఇటీవల పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది బ్యాంకుల అడ్వాన్స్‌ల్లో 9.07 శాతానికి సమానం. ద్రవ్యోల్బణం కారణంగా పరిస్థితులు దిగజారితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మరింత పెరగొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగ సంక్షోభం పెను సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే.. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు. ఏమిటి లాభం.. బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి. ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు? బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ’(ఏఆర్సీ)లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి. దీని ఏర్పాటు ఇలా.. ఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ప్రముఖులు ఏమంటున్నారంటే.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకంలో వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాను మార్చడం తప్ప పెద్దగా మార్పేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసే అసమర్థత మాత్రమే బ్యాడ్ బ్యాంకులకు బదిలీ అవుతుందని విమర్శించారు. అయితే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ‘ఇండియన్ బ్యాంక్స్: ఏ టైం టు రిఫార్మ్’ పుస్తకంలో రాజన్ సూచించారు. అప్పుడు ఎన్పీఏలను బ్యాడ్ బ్యాంకులకు తరలించాలన్నారు. మరోవైపు, ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై ఓ సందర్భంలో అఇష్టతను చూపించారు. రికవరీలు భారీగా చేయగలిగితే తప్ప వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను బలంగా సమర్థించారు. ఇదీ చదవండి: కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్ బ్యాంక్ కీలుబొమ్మగా మారితే ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
ఐదేళ్లలో రూ.10.57 లక్షల కోట్ల రుణ మాఫీ.. ఎన్పీఏల రికవరీ ఎంతంటే?
దేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2018–19 నుంచి 2022–23) రూ.10.57 లక్షల కోట్లను మాఫీ (రైటాఫ్.. పద్దుల్లోంచి తొలగింపు) చేశాయని, అందులో రూ.5.52 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు సంబంధించిన రుణాలని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు గత ఐదేళ్ల కాలంలో రూ.7,15,507 కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) కూడా రికవరీ చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల కాలంలో మోసాలకు సంబంధించి జరిగిన రైటాఫ్‌ల విలువ రూ.93,874 కోట్లని ఈ సందర్భంగా వెల్లడించారు. మాఫీతో రుణ గ్రహీతకు ప్రయోజనం ఉండదు... సంబంధిత బ్యాంక్ బోర్డుల మార్గదర్శకాలు– విధానాలకు అనుగుణంగా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను క్లీన్ చేస్తాయని కరాద్ పేర్కొన్నారు. పన్ను ప్రయోజనాలను పొందేందడం, మూలధనాన్ని తగిన విధంగా వినియోగించుకోవడం వంటి అంశాలకు సంబంధించి బ్యాంకులు రైట్–ఆఫ్‌ల ప్రభావాన్ని క్రమం తప్పకుండా అంచనా వేస్తాయని కరాద్ చెప్పారు. ‘‘ఇటువంటి రైట్–ఆఫ్‌లు రుణగ్రహీతల తిరిగి చెల్లించాల్సిన బాధ్యతల మాఫీకి దారితీయదు. రైట్–ఆఫ్ రుణగ్రహీతలకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు. రుణగ్రహీతలు బ్యాంకులకు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిందే. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న యంత్రాంగాల ద్వారా రికవరీ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి’’ అని కరాద్ స్పష్టం చేశారు. 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు: నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు 21,791 నకిలీ జీఎస్టీ రిజి్రస్టేషన్లను ఇందుకు సంబంధించి రూ.24,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతలను గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రెండు నెలలపాటు సాగిన స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు ఈ విషయాలను గుర్తించినట్లు వెల్లడించారు. గుర్తించిన నకిలీ రిజి్రస్టేషన్లలో స్టేట్ ట్యాక్స్ న్యాయపరిధిలోని రిజి్రస్టేషన్లు 11,392 కాగా (రూ.8,805 కోట్లు), సీబీఐసీ న్యాయపరిధిలోనివి 10,399 (రూ.15,205 కోట్లు) అని ఆమె వివరించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడటానికి, పన్ను చెల్లింపుదారులు ఎటువంటి తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ అవుతుంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారాల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు. -
రూ. 3,000 కోట్ల మొండి పద్దుల విక్రయానికి యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంక్ ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించేందుకు రూ. 3,000 కోట్ల విలువ చేసే 8 మొండి పద్దులను (ఎన్పీఏ) గుర్తించినట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్ల విలువ చేసే మూడు ఖాతాలను విక్రయించినట్లు తెలిపింది. తాజాగా దాదాపు రూ. 10,000 కోట్ల బాకీలు ఉన్న మొత్తం 42 సమస్యాత్మక ఖాతాలను గుర్తించినట్లు బ్యాంకు సీఈవో ఎ మణిమేఖలై తెలిపారు. వీటిలో కనీసం ఎనిమిది ఖాతాలను ఈ ఆర్థిక సంవత్సరం విక్రయించగలమని ఆశిస్తున్నట్లు వివరించారు. -
రూ.154 కోట్లకు తగ్గిన ఎన్పీఏ
సుభాష్‌నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నిరర్థక ఆస్తుల విలువ (ఎన్పీఏ) రూ.220 కోట్ల నుంచి రూ.154 కోట్లకు తగ్గించడం అభినందనీయమని, ఎన్పీఏ మరింత తగ్గేలా చైర్మన్లు, బ్యాంకు సిబ్బంది కృషి చేయాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి సూచించారు. మంగళవారం వైఎస్ఆర్ సహకార భవనంలో జరిగిన డీసీసీబీ 101వ మహాజన సభకు ఆయన అధ్యక్షత వహించారు. బ్యాంకు సీఈవో గజానంద్ నివేదికను చదివారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్పీఏ రికవరీ సిబ్బందికి చైర్మన్లు సహకరించాలని, తద్వారా మరింత మంది రైతులకు నూతనంగా రుణాలు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) గడువు జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడగించామని తెలిపారు. బ్యాంకు ద్వారా గ్రామీణ, పట్ట ణ ప్రాంతాల్లో హౌజింగ్ రుణాలు, విద్య, కార్లు, తదితర వాటికి రుణాలు అందించనున్నామన్నారు. బంగారు ఆభరణాలపై రూ.200 కోట్ల వరకు రు ణాలు ఇచ్చామని, ఈయేడాది రూ.50 కోట్ల వరకు రుణాలు పెంచామన్నారు. రైతులకు వానాకాలం పంటరుణాలు ఇస్తున్నారని తెలిపారు. జీవోనెంబర్ 44 ప్రకారం మార్జిన్ అకౌంట్లో నగదు జమ చేసు కున్న తర్వాతే రుణాలకు సంబంధించి మిగతా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించారు. బ్యాంకు రూ.2.58 కోట్ల వార్షిక లాభంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 144 సొసైటీ కేంద్రా ల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు డిపాజిట్లు రూ.614 కోట్ల నుంచి రూ.641.64 కోట్లకు పెరిగాయన్నారు. మనందరం రైతులకు అండగా ఉంటూ వారికి సేవ చేయడంలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్, గోనె సంచులు, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, గోదాములకు రుణాలు, తదితర అంశాలను సొసైటీ చైర్మన్లు ప్రస్తావించారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై వైస్ చైర్మన్ రమేష్‌రెడ్డి, సీఈవో గజానంద్, డీసీఓ సింహాచలం సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. సభలో డీసీసీబీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, గోర్కంటి లింగన్న, శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
ఎస్బీఐ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మార్చి త్రైమాసికానికి మెరుగైన పనితీరు చూపించింది. ఎన్పీఏలకు కేటాయింపులు తగ్గడంతో విశ్లేషకుల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 83 శాతం వృద్ధితో రూ.16,695 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.9,113 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 29 శాతం పెరిగి రూ.40,393 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం రూ.31,198 కోట్లుగా ఉండడం గమనార్హం. ఒక్కో షేరుకు రూ.11.30 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని ఎస్బీఐ నిర్ణయించింది. మొండి రుణాలకు (ఎన్పీఏలు) కేటాయింపులు, కంటింజెన్సీలు 54 శాతం తగ్గి రూ.3,316 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.7,237 కోట్లుగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.78 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 3.97 శాతంగా ఉంటే, 2022 డిసెంబర్ చివరికి 3.14 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది మార్చి చివరికి ఇవి 1.08 శాతం, 2022 డిసెంబర్ చివరికి 0.77 శాతంగా ఉండడం గమనార్హం. దేశీయ వ్యాపారంపై నికర వడ్డీ మార్జిన్ 3.84 శాతానికి పుంజుకుంది. ♦ మార్చి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ నికర లాభం (అనుబంధ సంస్థలతో కలిపి) క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9,994 కోట్ల నుంచి రూ.18,343 కోట్లకు వృద్ధి చెందింది. 90 శాతానికి పైగా పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,08,034 కోట్ల నుంచి, రూ.1,36,852 కోట్లకు పెరిగింది. ♦ మార్చి త్రైమాసికానికి నిర్వహణ లాభం 25 శాతం వృద్ధితో రూ.24,621 కోట్లకు చేరుకుంది. ♦ ప్రొవిజన్ కవరేజ్ రేషియో 1.35 శాతం మెరుగుపడి 76.39 శాతంగా ఉంది. ♦ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. మార్చి చివరికి రూ.32.69 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్ రుణాలు వార్షికంగా 12 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలు 18 శాతం పెరిగాయి. ♦ డిపాజిట్లు 9 శాతం వృద్ధితో రూ.44.23 లక్షల కోట్లకు చేరాయి. ♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ స్టాండలోన్ నికర లాభం రూ.50,232 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021–22)తో పోలిస్తే 58 శాతం పెరిగింది. స్టాండలోన్ ఆదాయం రూ.1,06,912 కోట్లుగా నమోదైంది. ♦ 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ లాభం రూ.35,374 కోట్ల నుంచి రూ.56,558 కోట్లకు చేరింది. ఆదాయం రూ.4,06,973 కోట్ల నుంచి రూ.4,73,378 కోట్లకు చేరింది. ♦ బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 2 శాతానికి పైగా నష్టపోయి రూ.574 వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో రూ.571.40 కనిష్ట స్థాయిని చూసింది. -
లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు.. కారణం ఇదే!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలను తగ్గించుకుని, రికార్డు లాభాలు నమోదు చేశాయి. రుణాలకు భారీగా డిమాండ్ నెలకొనడం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరును కొనసాగించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేట్ రంగంలో స్థిరీకరణ కనిపిస్తుందని వారు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం, సిటీబ్యాంక్ రిటైల్ పోర్ట్‌ఫోలియోను యాక్సిస్ బ్యాంక్ టేకోవర్ చేయడం 2023లో పూర్తి కానుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేటును మరో పావు శాతం పెంచి 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ తెలిపారు. ఇదే జరిగితే, బ్యాంకులు రుణాలపై పెంచినంతగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచటం లేదు కాబట్టి వాటి లాభదాయకతకు మరింతగా తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బ్యాంకింగ్ రంగంలో కొన్ని పరిణామాలు చూస్తే.. ► మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా ఉన్న 12 పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 32 శాతం అధికంగా నికర లాభాలు నమోదు చేశాయి. రూ. 40,991 కోట్లు ఆర్జించాయి. సెప్టెంబర్ క్వార్టర్లో పీఎస్బీలన్నింటి నికర లాభం 50 శాతం పెరిగి రూ. 25,685 కోట్లకు ఎగిసింది. ► ఇదే తీరు కొనసాగితే పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22కు మించి లాభాలు సాధించవచ్చని అంచనా. 2021–22లో 12 పీఎస్‌బీల లాభాలు 110 శాతం పెరిగి రూ. 31,816 కోట్ల నుంచి రూ. 66,539 కోట్లకు చేరాయి. ► మొండి బాకీలను తగ్గించేందుకు, అదనపు మూలధనం ఇచ్చి బ్యాంకులను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. 2022 మార్చి ఆఖరు నాటికి మొండి బాకీలు 9.11 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చాయని ఇటీవల తెలిపారు. కార్పొరేట్లు కూడా రుణాలు తీసుకోవడం పెరుగుతుండటంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ► ప్రైవేట్ రంగం విషయానికొస్తే యస్ బ్యాంకులోకి రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు (కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్) రూ. 8,896 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. చెరో 9.99 శాతం వాటా తీసుకున్నాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీ ఆర్థిక సేవల దిగ్గజంగా ఆవిర్భవించనుంది. 2023–24 రెండో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ► వ్యాపార వృద్ధి ప్రణాళికల్లో భాగంగా సిటీబ్యాంక్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 12,325 కోట్లకు కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, వినియోగదారు రుణాలు తదితర వ్యాపార విభాగాలు ఉన్నాయి. విలీనం పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ వద్ద 2.85 కోట్ల పొదుపు ఖాతాలు, 1.06 కోట్ల క్రియాశీలక క్రెడిట్ కార్డులు ఉంటాయి. చదవండి: జొమాటో షాకింగ్ రిపోర్ట్: పూణె వాసి యాప్ ద్వారా రూ.28 లక్షల పుడ్ ఆర్డర్! -
భారత భవిష్యత్తు మీ భుజాలపైనే..!
సాక్షి, హైదరాబాద్: భారత భవిష్యత్తు భారం యువ ఐపీఎస్ అధికారుల భుజస్కంధాలపైనే ఉందని, వారంతా భారత ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి మంగళవారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)ని సందర్శించారు. ఎన్పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ అకాడమీ తరఫున రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ ఆవరణలోని ఐపీఎస్ అధికారుల స్మారక స్థూపం వద్ద రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత అకాడమీలో శిక్షణ పొందుతున్న 195 మంది 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన సేవలోకి అడుగు పెడుతున్న యువ ఐపీ ఎస్‌లకు అభినందనలు తెలిపారు. ప్రభు త్వాల పనితీరును, ప్రతిష్టను పెంచే కీలక బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు చేరువ చేయ డంలో పోలీస్ అధికారుల వ్యక్తిత్వం, ప్రవర్తన కీలకమని సూచించారు. నేరాల కట్టడి, నేరాల దర్యాప్తు, ఉగ్రవాదం, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాల అదుపు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. పోలీసింగ్‌లో నాయకులుగా నిలవాలి సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషి స్తున్నారని, గత మూడేళ్లుగా ఎన్పీఏ శిక్షణ లోనూ మహిళా అధికారులు సత్తా చాటు తూ టాపర్లుగా నిలిచారని రాష్ట్రపతి చెప్పారు. మరో 25 ఏళ్లలో భారతదేశం వందో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందని, భవిçÙ్యత్ భారత నిర్మాణంలో ఈ యువ అధికారులది కీలక పాత్ర అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ(రైటాఫ్) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైటాఫ్ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్ లోన్లు ఉన్నాయని తెలియజేశారు. ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు -
ఎస్బీఐ రూ.746 కోట్ల ఎన్పీఏల వేలం
న్యూఢిల్లీ: ఎంతకీ వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఎస్బీఐ వరుసగా ఈ నెల, వచ్చే నెలలో వేలం వేయనుంది. సింటెక్స్ బీఏపీఎల్ మోసపూరిత రుణ ఖాతాను కూడా విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ.746 కోట్లను వసూలు చేసుకోనుంది. ముందుగా నవంబర్ 4న ఎస్బీఐ పలు ఎన్పీఏ ఖాతాలను వేలం వేయనుంది. సింటెక్స్ బీఏపీఎల్ రూ.198 కోట్లు, సూరత్ హజీరా ఎన్‌హెచ్6 టోల్‌వే ప్రైవేటు లిమిటెడ్ రూ.335 కోట్లు, శ్రీభావ్ పాలీవేవ్స్ రూ.20 కోట్ల ఎన్పీఏలు వేలం జాబితాలో ఉన్నాయి. సింటెక్స్ బీఏపీఎల్ ఖాతాకు కేవలం అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలే (ఏఆర్‌సీలు) అర్హులని ఎస్బీఐ పేర్కొంది. -
యూనియన్ బ్యాంక్ ఆశలు.. రూ.15,000 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిల (ఎన్పీఏలు) వసూలుపై బలమైన అంచనాలతో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.15,000 కోట్లు వసూలు అవుతాయని భావిస్తోంది. ఇందులో రూ.10,000 కోట్ల వరకు ఎన్సీఎల్టీ పరిధిలో దివాలా పరిష్కారం కోసం చూస్తున్న రుణ ఖాతాల నుంచి వస్తాయని అంచనా వేస్తున్నట్టు విశ్లేషకులతో నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై స్పష్టత ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)కి కొన్ని రుణ ఖాతాలను బదిలీ చేయనున్నట్టు చెప్పారు. రూ.4,842 కోట్ల విలువ చేసే రుణ పరిష్కార దరఖాస్తులను ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదించినట్టు.. మరో 55 ఖాతాలకు సంబంధించి రూ.5,168 కోట్ల ఎక్స్పోజర్కు ఆమోదం లభించాల్సి ఉన్నట్టు తెలిపారు. జూన్ త్రైమాసికంలో ఎన్సీఎల్టీ పరిష్కారాల రూపంలో యూనియన్ బ్యాంకుకు రూ.122 కోట్ల మొండి రుణాలు వసూలయ్యాయి. చదవండి: Sahara Group: సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే! -
మీది ఎన్డీఏనా.. ఎన్పీఏనా?.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి దేశంలో నిరుద్యోగం పెరిగింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అతిఎక్కువ ధరకు చేరుకుంది. వినియోగదారుల నమ్మకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు చెప్తోంది. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అనాలా లేక ఎన్పీఏ ప్రభుత్వం అనాలా? భక్తులారా.. ఎన్పీఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) అని అర్థం’అంటూ ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటే యుద్ధం చేస్తామంటూ వీహెచ్‌పీ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపైనా కేటీఆర్ స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారూ.. వీళ్లందరూ ఈ దేశ రాజ్యాంగం, పీనల్ కోడ్ నిబంధనలకు అతీతులా? మీ అధికార పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీసులకు ఇలాంటి దారుణ పరిస్థితులను మీరు సహిస్తారా?’అని ప్రశ్నించారు. (చదవండి: కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేయాలి) బెంగళూరులో పెట్టుబడులివిగో! కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు రావాలంటూ మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్‌పై కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్ గ్రూప్ స్పందించింది. ‘కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పరిసరాల్లో సుమారు రూ. 11,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 46,984 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన పరిశ్రమల జాబితాలో రెండు లిథియం అయాన్ సెల్ యూనిట్లు, ఎక్సైడ్ ప్లాంటు ఉన్నాయి’ అని పరిశ్రమల జాబితాను కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసింది. (చదవండి: రాహుల్ రాకతో ’సీన్’ మారాల్సిందే) -
రుణ రికవరీలకు యూపీఏ ప్రభుత్వ చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై ఇలా... ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిపాజిటర్లకు రక్షణ.. డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దివాలా చర్యల పటిష్టత దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్‌లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
వాహనాల ఫైనాన్స్ విభాగంపై దెబ్బే, క్యూ3పై క్రిసిల్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు!
మొండిపద్దుల వర్గీకరణ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించడం వల్ల మూడో త్రైమాసికంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 1.50 శాతం ఎగిసి 6.80 శాతానికి చేరిందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఒకవేళ నిబంధనలను సవరించకపోయి ఉంటే స్థూల ఎన్పీఏలు (జీఎన్‌పీఏ) 0.30 శాతం మేర తగ్గి 5.3 శాతానికి దిగి వచ్చేవని పేర్కొంది. అయితే, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతుండటం, చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు .. తమ వసూళ్ల ప్రక్రియను పటిష్టం చేసుకోవడం తదితర పరిణామాల కారణంగా రాబోయే రోజుల్లో ఎన్‌బీఎఫ్‌సీల జీఎన్‌పీఏలు క్రమంగా తగ్గగలవని క్రిసిల్ ఒక నివేదికలో వివరించింది. డిసెంబర్ క్వార్టర్‌కి ఎన్పీఏల వర్గీకరణ విధానాన్ని సవరిస్తూ ఆర్బీఐ గతంలో ఒక సర్క్యులర్ జారీ చేసింది. పలు విభాగాలపై దీని ప్రభావం వివిధ రకాలుగా ఉందని క్రిసిల్ తెలిపింది. బంగారం రుణాల విభాగం మెరుగ్గానే ఉండగా.. వాహనాల ఫైనాన్స్ విభాగంపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. అయితే, సర్క్యులర్‌లో నిబంధనల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఆర్బీఐ వాయిదా వేయడంతో ఎన్‌బీఎఫ్‌సీలకు కాస్త వెసులుబాటు లభించవచ్చని క్రిసిల్ తెలిపింది. -
ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్ట్
జైసల్మేర్ (రాజస్తాన్): బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సోమవారం అరెస్టయ్యారు. ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వైఫల్యం వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)కి విక్రయించడం తత్సంబంధ లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణ. ఢిల్లీలో ఆయనను అరెస్ట్ చేసి, జైసల్మేర్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. పోలీసు అధికారుల కథనం ప్రకారం 2007లో జైసల్మేర్‌లో ‘గర్ రాజ్వాడ’ హోటల్ ప్రాజెక్టుకుగాను గోడవన్ గ్రూప్‌నకు ఎస్బీఐ దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడేళ్లపాటు ఆ ప్రాజెక్టు ఎటువంటి పురోగతి లేదు. 2010లో ఈ అకౌంట్ మొండిబకాయిగా (ఎన్పీఏ) మారింది. రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన హోటల్ ప్రాపర్టీని సీజ్ చేసి, మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)కి విక్రయించినట్లు చౌదరిపై 2015లో కేసు నమోదైంది. హోటల్‌ను కొనుగోలు చేసిన కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా చౌదరి చేరడం వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా కనబడుతోంది. విధివిధానాల ప్రకారమే విక్రయం: ఎస్బీఐ విక్రయించేటప్పుడు అన్ని విధి విధానాలను అనుసరించినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సంఘటనల క్రమం గురించి కోర్టుకు సరిగ్గా వివరించినట్లు కనిపించడం లేదని బ్యాంక్ పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో ఎస్బీఐ పార్టీ కాదని, కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు అభిప్రాయాలను వినిపించే సందర్భం ఏదీ రాలేదని వివరించింది. 2014లో తమ బోర్డులో చేరిన చౌదరి తో సహా ఏఆర్సీ డైరెక్టర్లందరి పేర్లను ఈ కేసులో చేర్చినట్లు ఎస్బీఐ తెలిపింది. చౌదరి సెప్టెంబర్ 2013లో పదవీ విరమణ చేసినట్లు పేర్కొంది. ప్రేరేపిత చర్య: రజనీష్ కుమార్ ప్రతీప్ చౌదరి అరెస్టు ప్రేరేపితమైన, తీవ్రమైన చర్యని ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ‘ఏఆర్సీలకు ఆస్తులను విక్రయించడానికి ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే జరిగినట్లు సుస్పష్టం. ఇక్కడ అవినీతి ఎక్కడుంది?’ అని కుమార్ ప్రశ్నించారు. -
ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?
ప్రజలు సాధారణంగా తమ కలల గృహాన్ని కొనుగోలు చేయడం కోసం గృహ రుణం(Home Loan) తీసుకుంటారు. గృహ రుణాలు ఎక్కువగా దీర్ఘకాలం వరకు ఉంటాయి. అయితే గృహరుణం తీసుకున్న తర్వాత కొందరు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం గృహ రుణాల ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం మీరు గనుక హోమ్ లోన్ ఈఎమ్ఐ కట్టకపోతే ఆలస్య ఫీజులు కింద జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీ ఛార్జ్ సాధారణంగా ఈఎమ్ఐలో 1-2% వరకు ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కాలానికి మొత్తం బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత వసూలు చేసే ఆలస్య ఫీజులకు ఇది అదనంగా ఉంటుంది. ఒక్క ఈఎమ్ఐ పేమెంట్ కట్టకపోయిన అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇంటి రుణంపై సింగిల్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్ల వరకు తగ్గవచ్చు. అటువంటి పరిస్థితి వల్ల తర్వాత ఏదైనా లోన్ పొందే అవకాశం కోల్పోతారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు) నిరర్ధక ఆస్తిగా లోన్ అయితే, ఒకవేళ మీరు ఈఎమ్ఐని మిస్ అయినట్లయితే చివరి పేమెంట్ చేసిన 90 రోజుల్లోగా కట్టాల్సి ఉంటుంది. ఇది చిన్న డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. మీరు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే దాని ప్రభావం నుంచి మీరు కోలుకోవచ్చు. మిస్ అయిన ఈఎమ్ఐని తర్వాత గడువు తేదీనాటి నుంచి చెల్లించండి. అలాగే, మిగతా ఈఎమ్ఐలను మిస్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ నష్టం/ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణదాతను సంప్రదించండి. వారిని ఏదైనా పరిష్కారం చెప్పమనండి. మీ రుణం నిరర్ధక ఆస్తి(ఎన్‌పిఎ)గా మారడానికి ముందు మీ బకాయిలను చెల్లించడానికి మీకు 90 రోజుల గడువు ఉంది. ఒకవేళ మీరు 90 రోజుల తర్వాత కూడా మీ ఈఎమ్ఐ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే SARFAESI 2002 చట్టం ప్రకారం.. మీ ఆస్తిని వేలం వేసే హక్కు రుణదాతకు లభిస్తుంది. కాబట్టి, అలా౦టి పరిస్థితుల నుంచి తప్పి౦చుకోవడానికి ము౦దుగానే చర్యలు తీసుకో౦డి. గృహ రుణ ఎగవేత నుంచి తప్పించుకోవడం కోసం మీరు మీ రుణదాతను తక్కువ ఈఎమ్ఐ కోసం అభ్యర్థించవచ్చు.ఒకవేళ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయిన/మీ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే ఈఎమ్ఐ చెల్లింపులపై బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మాఫీని ఇవ్వవచ్చు. అయితే, రుణదాత తర్వాత ఈ కాలానికి బకాయి రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. (చదవండి: రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!) ఆస్తిపై హక్కులు చేజారిపోతాయి మీరు ఇక రుణం చెల్లించని పక్షంలో మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థలు గానీ ఇంటి వాస్తవ విలువను అంచనా వేసి తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. ఒకవేళ వేలంలో పేర్కొన్న విలువ వాస్తవ విలువ కంటే తక్కువ అని యజమాని భావిస్తే ఆ సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకున్న తర్వాత అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని మీకు పంపిస్తుంది. మరో మార్గం ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు మరో మార్గం ఉంటుంది. బ్యాంక్/రుణం తీసుకున్న సంస్థ వేలం వేయడానికి ముందే మీరు ఆ ఇంటిని విక్రయించండి. ఎందుకంటే, రుణదాతలు ఎక్కువ సార్లు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ ఇంటిని విక్రయిస్తాయి. దీని వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఆ ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఈఎమ్ఐని ఒకేసారి క్లియర్ చేయండి. దీని వల్ల మీరు కొంత లాభపడే అవకాశం ఉంది. మీకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయంలో 40% ఈఎమ్ఐ చెల్లింపులు ఉండే విధంగా చూసుకోండి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది) -
రుణాలు రూ.2వేలకోట్లు పైనే, వసూళ్లు సైతం అదే స్థాయిలో
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో రూ.2,150 కోట్ల రుణాలను జారీ చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జారీ చేసిన రుణాలు రూ.2,000 కోట్లు దాటడం వరుసగా ఇది రెండవ నెల అని కంపెనీ తెలిపింది. వసూళ్లు ఏప్రిల్‌లో 72 శాతం, మే 67, జూన్ 90, జూలైలో 95 శాతం నమోదైతే.. ఆగస్ట్‌లో ఇది 97 శాతానికి చేరిందని వివరించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభం, పరిస్థితులు మెరుగవడంతో నగదు రాక పెరిగి నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గాయని వివరించింది. ‘ఇది చాలా ప్రోత్సాహకరమైన సంకేతం అని మేము నమ్ముతున్నాం. సెప్టెంబర్, రాబోయే నెలల్లో ఎన్పీఏలు మరింత తగ్గుతాయని భావిస్తున్నాం. కంపెనీ వద్ద సరిపడ నగదు నిల్వలు ఉన్నాయి’ అని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది. చదవండి : పాత కార్ల అమ్మకాల్లో మహీంద్రా జోరు -
ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్ఫేసీ చట్టం 2002 (ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ– సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్) కింద రుణ ఖాతాలను మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించడం తగదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్, ఇతర సీనియర్ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న వాదనలను సైతం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందన్న వార్తలను మేము చదివాం’’ అని కూడా ధిక్కరణ పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, విక్రమ్ నాథ్, హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళితే... ఈ కేసులో కోర్టు ధిక్కరణ పిటీషనర్ల తరఫున అడ్వకేట్ విశాల్ తివారీ చేసిన వాదనల ప్రకారం 2020 ఆగస్టు 31వ తేదీ వరకూ మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించని అకౌట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు 2020 సెప్టెంబర్ 3న ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ బ్యాంకులు ఉద్దేశ్యపూర్వగా సర్ఫేసీ యాక్ట్ కింద అకౌంట్లు కొన్నింటిని ఏకపక్షంగా ఎన్పీఏలుగా మార్చాయి. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పలు ట్రేడర్లతో పాటు అజయ్ హోటెల్ అండ్ రెస్టారెంట్స్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020 నవంబర్ 30న తమ అకౌంట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా ఎన్పీఏగా మార్చిందని అజయ్ హోటెల్ అండ్ రెస్టారెంట్ పేర్కొంది. బకాయిలను వడ్డీసహా చెల్లించాలని తనకు 2021 మేలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మూడవ ప్రతివాది) నోటీసులు పంపిందని పేర్కొంది. తద్వారా 2020 సెప్టెంబర్ 3న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘించిందని వివరించింది. ఈ పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ, ‘‘కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎకానమీ పురోగమిస్తోందని వార్తలు చదివాం. 2020 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలోకి ఇప్పుడు ఆర్బీఐని లాగాలని మేము అనుకోవడం లేదు. ధిక్కరణ అనేది నేరుగా న్యాయస్థానం– ధిక్కరణదారు మధ్య వ్యవహారం. ఈ సందర్భంలో ఆర్బీఐ గవర్నర్‌ను అధికారులను ధిక్కరణకు పాల్పడ్డారని భావించలేం. అవసరమైతే మీరు సర్ఫేసీ చట్టం కిందే తగిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది చదవండి: తినుబండరాలు,సబ్బుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం -
కొంపముంచే రుణాలు, తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలు
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలకు నిరర్థక రుణాలు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) గండికొట్టాయి. జూన్‌తో అంతమైన మొదటి త్రైమాసికంలో లాభం గణనీయంగా తగ్గిపోయి రూ.153 కోట్లకు పరిమితమైంది. ఎన్పీఏలకు రూ.830 కోట్లను పక్కన పెట్టడం ఇందుకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.817 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 4.5 శాతం పెరిగి రూ.1,275 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.32 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ.8,652 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో రూ.7,650 కోట్లు గృహ రుణాలే ఉన్నాయి. రుణాల మంజూరులో 152 శాతం పురోగతి చూపించింది. ‘‘ఎన్పీఏలకు చేసిన కేటాయింపుల వల్లే మా నికర లాభం తగ్గిపోయింది. దీనికితోడు వేతన వ్యయాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని దాటి వచ్చామన్న బలమైన నమ్మకంతో ఉన్నాం. రానున్న కాలంలో మంచి వృద్ధి పథంలో కొనసాగుతాం’’ అని సంస్థ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. మూడోదశలోని వసూలు కాని రుణాలు మొత్తం రుణాలో 5.93 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.83 శాతంగానే ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడడం వల్ల వసూళ్లు మందగించాయని.. వసూళ్లపై మరింత దృష్టి సారిస్తామని విశ్వనాథగౌడ్ చెప్పారు. -
బ్యాంకింగ్ మొండి బకాయిలు : ఇక్రా నివేదిక
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) తీవ్రత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తగ్గుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ)లు మొత్తం రుణాల్లో 7.6 శాతం ఉంటే, ఈ రేటు 2021–22 మార్చి ముగిసే నాటికి 7.1 శాతానికి దిగివస్తాయని అంచనావేసింది. అధిక రికవరీలు, రుణ పునర్వ్యవస్థీకరణలు, వేగవంతమైన రుణ వృద్ధి ఇందుకు దోహదపడే ప్రధాన అంశాలని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► స్థూల మొండిబకాయిలు 6.9 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటాయని భావిస్తున్నాం. నికరంగా ఈ శ్రేణి 1.9 శాతం 2 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జీఎన్‌పీఏల అంచనాలతో పోల్చితే (9.8 శాతం) తాజా ఇక్రా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ► కేవలం కొత్త పద్దులకు సంబంధించి ఎన్పీఏలు 2019–20లో రూ.3.7 లక్షల కోట్లు. రుణాల్లో ఇది 4.2 శాతం. 2020–21లో ఈ పరిమాణం రూ.2.6 లక్షల కోట్లు. రుణాల్లో 2.7 శాతం. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉంది. మారటోరియం వంటి రెగ్యులేటరీ వెసులుబాట్లు ఏమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేకపోవడం దీనికి కారణం. ► కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటున్న రుణగ్రహీతల ఆదాయం, ద్రవ్యలభ్యత సంబంధిత ఒత్తిడులు 2021–22 ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లలో ప్రతిబింబించవు. లిక్విడిటీ, నియంత్రణ, సరళీకరణ విధానాలు, అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వంటి కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. ► రుణాలకు సంబంధించి కేటాయింపులు (క్రెడిట్ ప్రొవిజన్స్) 2019–20లో 3.7 శాతం. 2020–21లో ఈ రేటు 2.5 శాతానికి తగ్గింది. ► బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగానికి సంబంధించి పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఐదు సంవత్సరాల తర్వాత 2020–21లో బ్యాంకులు లాభాలను చూశాయి. అలాగే నికర ఎన్పీఏలు గడచిన ఆరేళ్లలో అతి తక్కువ స్థాయిలో 3.1 శాతంగా నమోదయ్యాయి. మున్ముందు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాలతో కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ► ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడ్డంతోపాటు మూలధనం పెంపు చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తుండడం హర్షణీయం. బ్యాంకింగ్ రంగం వృద్ధి, పురోగతి, లాభదాయకతకు ఆయా అంశాలు మద్దతును ఇస్తున్నాయి. ► ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ సవాళ్లను బ్యాంకింగ్ పటిష్టంగా ఎదుర్కొన్నట్లు ఇక్రా విశ్వసిస్తోంది. దీనితో బ్యాంకింగ్ రంగానికి ఇక్రా ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను -
బ్యాంకుల్లో మొండి బకాయిలు, తగ్గుతున్నాయట
ముంబై: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) తీవ్రత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తగ్గుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం పేర్కొంది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ)లు మొత్తం రుణాల్లో 7.6 శాతం ఉంటే, ఈ రేటు 2021–22 మార్చి ముగిసే నాటికి 7.1 శాతానికి దిగివస్తాయని అంచనావేసింది. అధిక రికవరీలు, రుణ పునర్వ్యవస్థీకరణలు, వేగవంతమైన రుణ వృద్ధి ఇందుకు దోహదపడే ప్రధాన అంశాలని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ♦ స్థూల మొండిబకాయిలు 6.9 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటాయని భావిస్తున్నాం. నికరంగా ఈ శ్రేణి 1.9 శాతం 2 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జీఎన్‌పీఏల అంచనాలతో పోల్చితే (9.8 శాతం) తాజా ఇక్రా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ♦కేవలం కొత్త పద్దులకు సంబంధించి ఎన్పీఏలు 2019–20లో రూ.3.7 లక్షల కోట్లు. రుణాల్లో ఇది 4.2 శాతం. 2020–21లో ఈ పరిమాణం రూ.2.6 లక్షల కోట్లు. రుణాల్లో 2.7 శాతం. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఎన్పీఏలు పెరిగే అవకాశం ఉంది. మారటోరియం వంటి రెగ్యులేటరీ వెసులుబాట్లు ఏమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేకపోవడం దీనికి కారణం. ♦కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటున్న రుణగ్రహీతల ఆదాయం, ద్రవ్యలభ్యత సంబంధిత ఒత్తిడులు 2021–22 ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లలో ప్రతిబింబించవు. లిక్విడిటీ, నియంత్రణ, సరళీకరణ విధానాలు, అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వంటి కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. రుణాలకు సంబంధించి కేటాయింపులు (క్రెడిట్ ప్రొవిజన్స్) 2019–20లో 3.7 శాతం. 2020–21లో ఈ రేటు 2.5 శాతానికి తగ్గింది. ♦ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగానికి సంబంధించి పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఐదు సంవత్సరాల తర్వాత 2020–21లో బ్యాంకులు లాభాలను చూశాయి. అలాగే నికర ఎన్పీఏలు గడచిన ఆరేళ్లలో అతి తక్కువ స్థాయిలో 3.1 శాతంగా నమోదయ్యాయి. మున్ముందు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాలతో కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ♦ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడ్డంతోపాటు మూలధనం పెంపు చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తుండడం హర్షణీయం. బ్యాంకింగ్ రంగం వృద్ధి, పురోగతి, లాభదాయకతకు ఆయా అంశాలు మద్దతును ఇస్తున్నాయి. ♦ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ సవాళ్లను బ్యాంకింగ్ పటిష్టంగా ఎదుర్కొన్నట్లు ఇక్రా విశ్వసిస్తోంది. దీనితో బ్యాంకింగ్ రంగానికి ఇక్రా ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తోంది. -
వచ్చే నెల్లో ఎస్బీఐ ఎన్పీఏ అకౌంట్ల వేలం
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే నెల్లో రెండు మొండి బకాయి (ఎన్పీఏ) పద్దులను వేలం వేయనుంది. రూ.313 కోట్లకుపైగా వసూళ్లు ఈ వేలం లక్ష్యమని బ్యాంక్ విడుదల చేసిన ఒక నోటీస్ వివరించింది. రెండు ఖాతాలనూ ఆగస్టు 6న ఈ–ఆక్షన్ వేయనున్నట్లు నోటీస్ పేర్కొంది. భద్రేశ్వర్ విద్యుత్ ప్రైవేట్ లిమిటెడ్ (బీవీపీఎల్) ఎన్పీఏ వేలం ద్వారా రూ .262.73 కోట్లు, జీఓఎల్ ఆఫ్‌షోర్ లిమిటెడ్ ఖాతా వేలంతో రూ.50.75 కోట్ల బకాయిలను రాబట్టుకోవడం బ్యాంక్ లక్ష్యం. రెండు సంస్థలకు సంబంధించి వేలం రిజర్వ్ ధరలు వరుసగా రూ.100.12 కోట్లు. రూ.50 కోట్లుగా ఉన్నాయి. -
వెయ్యి కోట్ల రుణం చేజారింది!
సాక్షి, హైదరాబాద్: చేతికి అందివచ్చిన సాయం రూ.1,000 కోట్లు చివరి నిమిషంలో అడుగు దూరంలో ఆగిపోయింది. దీంతో ఆర్టీసీ దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఇప్పుడా సాయం అందితేనే సిబ్బంది జీతాలు, తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన అద్దె బస్సు నిర్వాహకుల బకాయిలు చెల్లించేందుకు వీలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో అందివచ్చిన సాయం పొందాలంటే, ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి రూ.190 కోట్లు కావాలి. అవి చెల్లిస్తేనే సాయం అందుతుంది. వాస్తవానికి రూ.1,000 కోట్లు్ల బ్యాంకు నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. ఇప్పుడు ఆ రుణానికి అవసరమైన రూ.190 కోట్లు కూడా ప్రభుత్వం ఇస్తే తప్ప ఆర్టీసీ గట్టెక్కలేని పరిస్థితి నెలకొంది. అది ఎన్పీఏ మహిమ.. ఆర్టీసీ చాలాకాలంగా అప్పులపై నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం, సిబ్బంది జీతాల ఖర్చు బాగా పెరిగిపోవటంతో బ్యాంకు రుణాల ద్వారా సర్దుబాటు చేస్తోంది. అయితే అలా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవటం తరచూ జరుగుతుండటంతో ఆర్టీసీని బ్యాంకులు మొండి బకాయిల జాబితాలోకి చేర్చాయి. తద్వారా సంస్థ నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో చేరిపోయింది. ఒకసారి బ్యాంకులు మొండి బకాయిదారుగా నిర్ధారిస్తే కొత్తగా రుణం పుట్టదు. ఇప్పుడు ఆర్టీసీకి అదే పరిస్థితి ఎదురైంది. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్లో ఇంకా రూ.190 కోట్ల మేర బకాయి ఉంది. చాలాకాలంగా ఈ మొత్తాన్ని తీర్చకపోవటంతో మొండిబకాయిగా ముద్రపడింది. సెకండ్ వేవ్‌తో పెరిగిన నష్టాలు అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థపై కోవిడ్ రెండో దశ మరింత నష్టాలకు గురిచేసింది. ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు అద్దె బస్సు నిర్వాహకులకు ఐదు నెలలుగా రూ.100 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడంతో బడ్జెట్లో కేటాయించిన మొత్తంలోంచి రూ.1,000 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు పూచీకత్తు జారీ చేసింది. దానికి స్పందించిన ఓ బ్యాంకు రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ రూ.190 కోట్ల అప్పు మరో బ్యాంకుకు బకాయిపడి చాలాకాలం కావ టంతో, అది చెల్లిస్తేగానీ రూ.1,000 కోట్ల కొత్త అప్పు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ రూ.190 కోట్లు చెల్లించే మార్గం లేక ఆర్టీసీ మళ్లీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మాకు చెల్లించకపోతే ఆత్మహత్యలే గతి గతంలో మా బకాయిలు తీర్చేందుకు తెచ్చిన నిధులను డీజిల్, ఇతర ఖర్చులకు వాడేసి మాకు పైసా ఇవ్వలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పుడు మాలో చాలామందికి తిండికి కూడా కష్టంగా ఉంది. బ్యాంకులు మా బస్సుల్ని జప్తు చేస్తున్నాయి. డ్రైవర్లు జీతాల కోసం డిమాండ్ చేస్తున్నారు. మాకే తిండికి కష్టంగా మారిన పరిస్థితిలో డ్రైవర్లకు జీతాలు ఎలా ఇవ్వగలం. ఇప్పటికే 12 మంది మా ప్రతినిధులు కోవిడ్‌తో చనిపోయారు. మరో 200 మంది పోరాడుతున్నారు. ఇప్పటికైనా వచ్చే రూ.1,000 కోట్ల నుంచి మా బకాయిలు చెల్లించి ఆదుకోవాలి. – జగదీశ్వర్‌రెడ్డి, అద్దె బస్సు యజమానుల సంఘం -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య 2020 రెండవ అర్థ భాగంలో కొంత మెరుగుపడినప్పటికీ, 2021 మొదటి ఆరు నెలల కాలంలో సమస్య మళ్లీ కొంత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఫిక్కీ-ఐబీఏ సర్వే ఒకటి పేర్కొంది. జూలై-డిసెంబర్ 2020 మధ్య ఫిక్కీ-ఐబీఏ నిర్వహించిన 12వ దఫా బ్యాంకర్ల సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... మొత్తం 20 బ్యాంకులను సర్వేకు ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు విదేశీ బ్యాంకులు వీటిలో ఉన్నాయి. మొత్తం బ్యాంకింగ్ రంగంలో దాదాపు 59 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 2020 చివరి ఆరు నెలల్లో మొండిబకాయిలు తగ్గాయని సగం మంది ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఎన్పీఏలు తగ్గాయని చెప్పిన వారి శాతం 78గా ఉంది. 2021 మొదటి ఆరు నెలల్లో ఎన్పీఏలు 10 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని దాదాపు 68 శాతం మంది తెలిపారు. ఇది ఏకంగా 12 శాతందాటిపోతుందని అంచనావేస్తున్న వారి శాతం 37గా ఉంది. పర్యాటక, ఆతిథ్యం, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), పౌర విమానయానం, రెస్టారెంట్ల విభాగాల్లో అధిక ఎన్పీఏల ప్రభావం ఉంటుందని మెజారిటీ ప్రతినిధులు తెలిపారు. రవాణా, ఆతిథ్య రంగాల్లో ఎన్పీఏలు భారీగా పెరిగిపోతుందని అంచనావేస్తున్నవారు 55 శాతంగా ఉన్నారు. 45 శాతం మంది ఈ రంగంలో ఎన్పీఏల భారం కొద్దిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి భారీ ఎన్పీఏల భారం ఉంటుందని దాదాపు 84 శాతం అంచనావేయడం గమనార్హం. రెస్టారెంట్ల విషయంలో ఈ శాతం 89గా ఉంది. ఈ విభాగంలో ఎన్పీఏల భారం అంతంతే అన్న అంచనావేసినవారు 26 శాతంమందే. ఎంఎస్ఎంఈలో ఒన్‌టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు (గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన) విజ్ఞప్తులు గణనీయంగా పెరుగుతాయి. మౌలిక, ఔషధ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో దీర్ఘకాలిక రుణ డిమాండ్ పెరుగుతుంది. ఫార్మా రంగానికి రుణ డిమాండ్ పెరుగుతుందన్న అంచనాల విషయంలో 11వ దఫా సర్వేలో 29 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే, 12వ దఫా సర్వేలో ఇది 45 శాతానికి పెరిగింది. ఒన్-టాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కింద తాము నిధులు పొందలేదని మెజారిటీ ప్రతినిధులు సర్వేలో తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీల్లోకి దాదాపు టీఎల్టీఆర్ఓ నిధులు వెళ్లాయని 33 శాతం మంది పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతం! కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంటోంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. చదవండి: ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్ -
బ్యాడ్ బ్యాంక్‌లు ఎక్కువే కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండి బకాయిల సమస్య పరి ష్కారానికి పలు బ్యాడ్ బ్యాంకుల అవసరం ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలంటూ పరిశ్రమల మండలి సీఐఐ కోరింది. బడ్జెట్ ముందు ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో పలు సూచనలు చేసింది. బ్యాంకుల బ్యాలన్స్షీట్లలోని నిరర్థక ఆస్తుల కొనుగోలుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)ను అనుమతించాలని కోరింది. ‘‘కరోనా పరిణామం తర్వాత మార్కెట్ ఆధారితంగా సరైన ధర నిర్ణయించే యాంత్రాంగం అవసరం. అంతర్జాతీయంగా, దేశీయంగా నిధుల లభ్యత భారీగా ఉన్నందున ఒకటికి మించిన బ్యాడ్ బ్యాంకులు ఈ సమస్యను పారదర్శకంగా పరిష్కరించగలవు. రుణ క్రమాన్ని తిరిగి గాడిన పెట్టగలవు’’ అంటూ సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్‌కోటక్ చెప్పారు. మార్కెట్ ఆధారిత బలమైన యంత్రాంగం ఉంటే.. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను ఎటువంటి భయాలు లేకుండా విక్రయించుకోగలవన్నారు. స్వచ్ఛమైన బ్యాలన్స్ షీట్లతో అప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలవని.. దాంతో ప్రభుత్వం మూలధన నిధుల సాయం చేయాల్సిన అవసరం తప్పుతుందని సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుండడంతో పరిశ్రమ నుంచి రుణాల కోసం వచ్చే డిమాండ్లను బ్యాంకులు తీర్చాల్సి ఉంటుందన్నారు. -
రుణాలపై చక్రవడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది. రూ.2 కోట్ల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలనీ, ‘సామాన్యుడి దీపావళి’ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు రూ.2 కోట్లలోపు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా ప్రకటించి ఉండకూడదు. ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది. మారటోరియం అవకాశాన్ని వినియోగిం చుకోని, ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ పొందవచ్చు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన 6 నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీన జరగనుంది. -
రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!
న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు మొండిపద్దుల కిందకు రాని అకౌంట్లు వేటినీ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. రెండు వారాల్లో ఈ విషయమై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయానికి ఇదే ఆఖరు అవకాశమని, ఆపై ఈ అంశాన్ని వాయిదా వేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం వేళ ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ గతంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ వేయడాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తుది ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు ఎన్పీఏలు కాని ఏ అకౌంట్లనూ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఆదేశించింది. వడ్డీపై వడ్డీతో ఇబ్బంది..: ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్‌గ్రేడింగ్ చేస్తూనే ఉన్నాయని, దీన్ని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు లెక్కకడుతున్నాయని మరో న్యాయవాది రాజీవ్ దత్తా చెప్పారు. లక్షలాది మంది కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారని, అనేకమంది ఉపాధి కోల్పోయారని, ఈ సమయంలో వడ్డీ మీద వడ్డీ అడగడం సబబు కాదని వాదించారు. అయితే ఉన్న నియమాల ప్రకారమే డౌన్‌గ్రేడింగ్ జరుగుతోందని ఆర్బీఐ న్యాయవాది వీ గిరి చెప్పారు. అన్ని అంశాలను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నందున రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. తాజా విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వం అన్ని అంశాలనూ అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తోందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకొనేందుకు రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. వాదనలన్నీ విన్న కోర్టు 2 వారాల్లో సరైన పరిష్కారంతో రావాలని, ఆపై తాము తుది నిర్ణయం తీసుకుంటామంది. రాజీవ్ మహర్షి నేతృత్వం మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి, సిఫారసులు చేయడానికి రాజీవ్ మహర్షి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. -
ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలి
మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్ రంగం రానున్న బడ్జెట్లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్పీఏ భయాలతో కార్పొరేట్ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం... హౌసింగ్‌కు ప్రోత్సాహకాలివ్వాలి... ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు జీవనరేఖ లాంటివి. ఎకానమీ పుంజుకుంటే ముం దుగా లాభపడేవి బ్యాంకులే. అందుకే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలను బడ్జెట్లో చేపడతారని భావిస్తున్నాం. అయితే, నేరుగా బ్యాంకులకు సంబంధించి భారీ ప్రకటనలేవీ ఉండకపోవచ్చు’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. కీలకమైన రంగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో విఫలమైతే మున్ముందు నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది. నాన్‌బ్యాంకింగ్ సంస్థల ద్వారా నేరుగా రుణాలిచ్చిన తనఖాల్లేని రుణాలు(అన్సెక్యూర్డ్)తో బ్యాంకుల రిస్కులు మరింత తీవ్రం అవుతాయి’ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటికే మంచి కార్పొరేట్ కంపెనీల నుంచి రుణాలకు సంబంధించి డిమాండ్ ఘోరంగా పడిపోవడంతో దీన్ని భర్తీ చేసుకోవాడానికి రిటైల్ రుణాలపై బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారిస్తున్నాయి. ‘వాహన, గృహ రుణాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనా లేదు. అయితే, వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో మొండి బాకీలు గనుక పెరిగాయంటే బ్యాంకింగ్‌కు కొత్త సమస్యలు తప్పవు’ అని మరో బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇంకా ఏం ఆశిస్తున్నారంటే... ► హౌసింగ్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల బ్యాంకింగ్‌కు పరోక్షంగా ప్రయోజం ఉంటుంది. ► నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.25,000 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి(ఏఐఎఫ్)ను మరింతగా పెంచాలి. దీనివల్ల రియల్టీ రంగం పునరుత్తేజంతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సమస్యలకు కూడా అడ్డుకట్టపడుతుంది. ► ద్రవ్యలోటు కట్టడితో పాటు బడ్జెట్లో ప్రకటించబోయే ఇతరత్రా విధానపరమైన చర్యల ఆధారంగానే... ఆర్బీఐ తదుపరి పాలసీ చర్యలు(వడ్డీరేట్ల విషయంలో) ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్ల తగ్గింపునకు గత పాలసీ సమీక్షలో ఆర్బీఐ విరామం ప్రకటించింది. తదుపరి సమీక్ష ఫిబ్రవరి 6న జరగనుంది. ► ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లకు సంబంధించి పాక్షిక హామీ పథకం(పీసీజీ)ని ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. సంక్షోభంతో నిధుల సమస్యలను ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య సరఫరా పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. -
పంట రుణాల మాఫీ రూ. 4.7 లక్షల కోట్లకు
ముంబై: గడిచిన పదేళ్లలో వివిధ రాష్ట్రాలు మాఫీ చేసిన వ్యవసాయ రుణాల పరిమాణం ఏకంగా రూ. 4.7 లక్షల కోట్లకు చేరింది. ఇది మొత్తం పరిశ్రమల మొండిబాకీల్లో (ఎన్పీఏ) దాదాపు 82 శాతం. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.79 లక్షల కోట్లుగా ఉండగా, వీటిలో వ్యవసాయ రంగ ఎన్పీఏలు రూ. 1.1 లక్షల కోట్లకు చేరాయి. ‘మొత్తం ఎన్‌పీఏల్లో వ్యవసాయ రంగ బాకీలు రూ.1.1 లక్షల కోట్లుగానే ఉన్నా.. గడిచిన దశాబ్ద కాలంగా మాఫీ చేసిన సుమారు రూ. 3.14 లక్షల కోట్ల రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులు, ప్రభుత్వాల మీద ఏకంగా రూ. 4.2 లక్షల కోట్ల పైగా భారం పడినట్లే. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరో రూ. 45,000–51,000 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 4.7 లక్షల కోట్లకు చేరుతుంది. మొత్తం పరిశ్రమ స్థాయిలో పేరుకుపోయిన మొండిబాకీల్లో ఇది 82 శాతం అవుతుంది’ అని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. రుణభారాలతో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల సమస్య తీవ్రతను తగ్గించేందుకు పది పెద్ద రాష్ట్రాలు 2015 ఆరి్థక సంవత్సరం నుంచి రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రూ. 24,000 కోట్లు, తెలంగాణ రూ. 17,000 కోట్లు, తమిళనాడు రూ. 5,280 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశాయి. నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మాఫీల్లో అత్యధిక భాగం తూతూమంత్రంగానే జరిగిందని .. వాస్తవ రైటాఫ్‌లు 60 శాతం మించబోవని నివేదిక పేర్కొంది. -
వేలానికి ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ఎన్పీఏలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎస్బీఐ, యూనియన్‌బ్యాంకులు రూ.2,836 కోట్ల వసూలు కాని మొండి రుణాలను (ఎన్పీఏ) వేలం వేయనున్నాయి. రూ.1,555 కోట్ల విలువైన ఎన్పీఏలను ఎస్బీఐ వేలానికి ఉంచింది. అలాగే, 11 ఎన్పీఏల ఖాతాలకు సంబంధించి రూ.1,281 కోట్ల రుణ ఆస్తుల వేలానికి బిడ్లను యూనియన్ బ్యాంకు ఆహ్వానించింది. ఈ నెల్లోనే ఈవేలం ద్వారా వీటిని అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించనున్నాయి. ఎస్బీఐ వేలానికి ఉంచిన వాటిల్లో రోహిత్ ఫెర్రోటెక్ రూ.1,313.67 కోట్లు, ఇంపెక్స్ ఫెర్రోటెక్ రూ.200.67 కోట్లు, అవని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రా రూ.40.53 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. యూనియన్ బ్యాంకు వేలానికి ఉంచిన వాటిల్లో జీవీకే పవర్ గోయిండ్వాల్‌సాహెబ్ (రూ.444 కోట్లు), రాజమండ్రి గోదావరి బ్రిడ్జి (రూ.153 కోట్లు) తదితర ఖాతాలు ఉండడం గమనార్హం. -
మున్ముందు ఎన్పీఏలు మిలీనియల్స్‌వేనా?
ముంబై: మిలీనియల్స్ (1980– 2000 మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్పీఏలు) మారనున్నాయా..? గత రెండేళ్లుగా బ్యాంకులకు మిలీనియల్స్ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్సెక్యూర్డ్ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్ యూనియన్ సిబిల్ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్ సంఖ్య 58% పెరగ్గా, ఇతర విభాగంలో ఈ వృద్ధి 14%గానే ఉందని సిబిల్ నివేదిక తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో భారీ ఎన్పీఏల నేపథ్యంలో బ్యాంకులు రిటైల్ రుణాలపై ఎక్కువ గా ఆధారపడడం తెలిసిందే. అన్ సెక్యూర్డ్ రుణాల కింద క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కన్జ్యూమర్ రుణాలు ఇస్తున్నారు. మిలీనియల్స్ రుణాల్లో 72% ఇవే ఉంటున్నాయని సిబిల్ నివేదించింది. ఇక మిలీనియల్స్ తీసుకుంటున్న రుణాల్లో సురక్షిత (సెక్యూర్డ్) రుణాల కిందకు వచ్చే వాహన రుణాలు 9% ఉన్నట్లు సిబిల్ వెల్లడించింది. తమ క్రెడిట్ స్కోరుపై మిలీనియల్స్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, స్కోరును పర్యవేక్షించుకుంటున్నారని పేర్కొంది. 700 కంటే తక్కువ స్కోరు కలిగిన వారిలో 51% మంది 6 నెలల్లోనే క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకున్నారని వివరించింది. -
పైపైన ఆడిటింగ్.. సంక్షోభానికి కారణం
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్‌కు గురైన జాయ్‌థామస్ ఆరోపించారు. సమయాభావంతో బ్యాంకు పుస్తకాలను పైపై ఆడిటింగ్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్బీఐకి ఆయన ఐదు పేజీల లేఖను రాశారు. వసూలు కాని బకాయిలను (ఎన్పీఏలు) వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపించడం వెనుక బ్యాంకు యాజమాన్యం, డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు థామస్ అంగీకరించారు. అలాగే, పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ పుస్తకం రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్ల మేర ఒక్క హెచ్‌డీఐఎల్ ఖాతాకు (73 శాతం) నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన విషయాన్ని దాచడంలోనూ యాజమాన్యం పాత్ర ఉన్నట్టు థామస్ పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంకుకు ముగ్గురు ఆడిటర్లు ఉండగా, వీరిలో ఎవరి పేరునూ థామస్ తన లేఖలో పేర్కొనలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదిక ప్రకారం.. లక్డావాల్ అండ్ కో, అశోక్ జయేష్ అండ్ అసోసియేట్స్, డీబీ కేట్కార్ అండ్ కో సంస్థలు స్టాట్యుటరీ ఆడిటర్లుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో థామస్ లేఖ కూడా భాగంగా ఉంది. థామస్‌తోపాటు, బ్యాంకు చైర్మన్ వర్యమ్‌సింగ్, హెచ్‌డీఐఎల్ ప్రమోటర్ వాద్వాన్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 2008 నుంచి గోప్యంగానే.. బ్యాంకు వృద్ధి క్రమంలో ఉండడంతో ఆడిటర్లు సమయాభావం వల్ల కేవలం పెరిగిన అడ్వాన్స్‌లను (రుణాలు) చూశారే కానీ, మొత్తం బ్యాం కు ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాలను పరిశీలించలేదని థామస్ తన లేఖలో వివరించా రు. బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం తోనే భారీ రుణ ఖాతాల సమాచారాన్ని 2008 నుంచి ఆర్బీఐకి తెలియజేయకుండా గుట్టుగా ఉంచినట్టు థామస్ తెలిపారు. చెల్లింపుల్లో జా ప్యం ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా హెచ్‌డీఐఎల్ ఖాతాను స్టాండర్డ్‌గానే చూపించామన్నారు. రంగంలోకి ఐసీఏఐ చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి (ఐసీఏఐ) పీఎంసీ బ్యాంకు వ్యవహారంలో రంగంలోకి దిగింది. పీఎంసీ బ్యాంకులో చోటుచేసుకున్న అవకతవకల్లో ఆడిటర్ల పాత్రను తేల్చేందుకు గాను ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి సమాచారం కో రింది. ఆర్బీఐ విజిలెన్స్ విభాగం, మహా రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కమిషనర్‌కు లేఖ రాసింది. తాము గుర్తించిన వివరాలు, ఆడిటర్ల పాత్ర అందులో ఏమైనా ఉందా అన్న వివరాలను తెలియజేయాలని కోరినట్టు ఏఐసీఏఐ తెలిపింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా బ్యాంకు స్టాట్యుటరీ ఆడిటర్ల నుంచి కోరినట్టు వెల్లడించింది. ఆడిటర్ల పాత్ర ఉన్నట్టు తేలితే ఐసీఏఐ తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
చిన్న సంస్థలకు వరం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని మొండి బాకీగా(ఎన్పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్రం బ్యాంకులను కోరింది. వాటి రుణాలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్యాంకుల పనితీరు, రుణ వృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏగా ప్రకటించొద్దంటూ ఆర్బీఐ జూన్ 7న ఉత్తర్వులు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ ఆదేశాలను అనుసరించాలని, 2020 మార్చి వరకు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించొద్దని కోరినట్టు చెప్పారు. రుణాల పునరుద్ధరణకు పనిచేయాలని సూచించామన్నారు. ఇది ఎంఎస్ఎంఈ రంగానికి మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో వసూలు కాని నిరర్ధక ఆస్తులుగా మారే అవకాశం ఉన్న వాటిని ఒత్తిడిలోని రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని ఎన్బీఎఫ్సీలను గుర్తించాయని.. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. దాంతో లిక్విడిటీ మెరుగవుతుందని, అవసరమైన వర్గాలకు రుణాలు అందుతాయన్నారు. రుణ మేళాలు...: దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అక్టోబర్ 3 నుంచి రుణమేళాలు నిర్వహిస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. తాము టై అప్ అయిన ఎన్బీఎఫ్సీలతో కలసి గృహ కొనుగోలుదారులకు, రైతులకు, ఇతరులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా అక్టోబర్ 3–7వ తేదీల మధ్య 200 జిల్లాల్లో, మిగిలిన 200 జిల్లాల్లో అక్టోబర్ 11 తర్వాత నుంచి ఈ సమావేశాల ఏర్పాటు ఉంటుందన్నారు. పండుగల సమయంలో సాధ్యమైనన్ని రుణాలను అందించడమే వీటి ఉద్దేశంగా చెప్పారు. -
అంతా ఆ బ్యాంకే చేసింది..!
లేహ్: ఆల్టికో క్యాపిటల్‌లో సంక్షోభానికి ఓ ప్రైవేటు బ్యాంకు స్వార్ధపూరిత వైఖరే కారణమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు సమకూర్చే బ్యాంకింగేతర ఆరి్థక సంస్థ ఆల్టికో క్యాపిటల్ దేశీయ బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు తాజా ఎన్పీఏగా మారే ప్రమాదం వచ్చి పడింది. దీనికి కారణం సదరు సంస్థ గత వారం ఈసీబీ రుణంపై రూ.20 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఓ ప్రైవేటు బ్యాంకు తన రుణాలను కాపాడుకునేందుకు ఆల్టికో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ (ఫిక్స్డ్ డిపాజిట్)ని సర్దుబాటు చేసుకుంది. దీన్ని ఏక్షపక్ష నిర్ణయంగా రజనీష్ కుమార్ పేర్కొన్నారు. తన సొంత డబ్బులను కాపాడుకునేందుకు అనుసరించిన ఈ చర్య విస్తృతమైన ఆరి్థక వ్యవస్థకు సమస్యలు తెచి్చపెడుతుందన్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మొత్తంగా రూ.4,500 కోట్ల మేర ఆల్టికో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడం గత వారమే మొదటి సారి చోటు చేసుకుంది. లేహ్ వచి్చన సందర్భంగా దీనిపై రజనీష్ కుమార్ మీడియా సమక్షంలో స్పందించారు. ‘‘ఏదైనా బ్యాంకు స్వార్ధపూరిత వైఖరి తీసుకుంటే మిగిలిన వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రూ.50–100 కోట్ల ఎక్స్పోజర్ను మీరు తీసేసుకుని మీ డబ్బులను కాపాడుకున్నామని సంతోషపడొచ్చు. కానీ, మీరు వ్యవస్థను పాడు చేస్తే అది సరైన విధానం కాదు. పెద్ద కంపెనీల విషయంలోనూ ఓ బ్యాంకు ట్రిగ్గర్ నొక్కితే లేదా రుణాల సరఫరాను నిలిపివేస్తే ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. సమష్టిగా వ్యవహరించాలి... బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మొత్తం ఆరి్థక వ్యవస్థను కాపాడవచ్చన్నారు రజనీష్ కుమార్. అతిపెద్ద ఎన్పీఏ కేసుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆల్టికో క్యాపిటల్ యూఏఈకి చెందిన మాష్‌రెక్ బ్యాంకుకు రూ.660 కోట్లు, ఎస్బీఐకి రూ.400 కోట్లు, యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు రూ.200 కోట్లు, రిలయన్స్ నిప్పన్ ఏఎంసీకి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. గత వారం మాష్‌రెక్ బ్యాంకుకు రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవడమే సంక్షోభానికి కారణం. ఈ నెల 3న ఆల్టికో రేటింగ్‌ను ఇండియా రేటింగ్స్, కేర్ రేటింగ్స్ జంక్ కేటగిరీకి డౌన్‌గ్రేడ్ చేశాయి. క్లియర్‌వాటర్ క్యాపిటల్ పార్ట్నర్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, వర్దే పార్ట్నర్స్ ఈ సంస్థకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
రియల్టీకి ఊతం!
న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్పీఏలుగా ప్రకటించనివి, ఎన్సీఎల్టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్ మార్కెట్, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు. మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు.. ► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ► ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు. ► నెలాఖరుకల్లా జీఎస్టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు. ► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు. ► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు. -
వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్ కంపెనీలను(యునైటెడ్ బ్రాండింగ్ వరల్డ్‌వైడ్ ఇతరత్రా) గుర్తించింది. దీని ఆధారంగా బెంగళూరుకు చెందిన వి.శశికాంత్, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ గతవారం సోదాలు నిర్వహించింది. శశికాంత్ అనే వ్యక్తి మాల్యాకు అత్యంత ఆప్తుడని ఈడీ వర్గాలు తెలిపాయి. తాజాగా అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్(ఎఫ్ఈఓ) చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో దాదాపు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన మల్యాపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటన్ పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
ఉగ్రవాదంపై ‘వర్చువల్’ పోరు!
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారులకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానని నేషనల్ పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ అభయ్ అన్నారు. బుధవారం ఉదయం అకాడమీ అధికారుల ఘనస్వాగతం అనంతరం నూతన డైరెక్టర్‌గా అభయ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1986 ఐపీఎస్ బ్యాచ్ ఒడిశా కేడర్‌కి చెందినవారు. అనంతరం అభయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భావి ఐపీఎస్ ఆఫీసర్లను తీర్చిదిద్దే అకాడమీ బాధ్యతలను స్వీకరించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాను గతంలో సీబీఐ (బ్యాండ్ఫ్రాడ్), సీఆర్పీఎఫ్, నార్కోటిక్స్ బ్యూరోలో విధులు నిర్వహించానన్నారు. దేశంలో అధిక సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక అకాడమీలో ప్రస్తుతం 350 మంది ఆఫీసర్లు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. వీరిలో 147 మంది ఆఫీసర్లు ఫేజ్–1, మరో 121 మంది ఫేజ్–2 ట్రైనింగ్‌లో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిలో ఫారిన్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వివరించారు. గడిచిన పదేళ్లలో అకాడమీలో కాలానుగుణంగా శిక్షణ విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. సీబీఐ, ఎన్ఐఏలో కేసు దర్యాప్తు తర్వాత న్యాయ విచారణను పర్యవేక్షించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా ఆధునిక పద్ధతిలో వర్చువల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దర్యాప్తు విధానంలో (ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు) అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వర్చువల్ తరగతులు అంటే..? వర్చువల్ తరగతులు అనగా కంప్యూటర్ సాయంతో భారీ తెరలను ఏర్పాటు చేసి టార్గెట్‌ను ఛేదించే ఒక ఆధునిక విధానం. చాలామంది పిల్లలు ప్లే స్టేషన్ పేరిట వివిధ గేమ్స్‌ని నిజంగా ఆడిన అనుభూతిని పొందినట్లే.. ఉగ్రవాద దాడి జరిగినపుడు శత్రువుపై ఎలా దాడి చేయాలి? ఎటునుంచి ముప్పు పొంచి ఉంది? క్షణాల్లో ఎలా దాడి చేయాలి? సురక్షితంగా ఎలా రావాలి? అన్న విషయాలపై శిక్షణ ఇస్తారు. -
ఎయిరిండియాను అమ్మేసినా దేశీ సంస్థల చేతుల్లోనే
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే, వాటాలు విక్రయించినప్పటికీ ఎయిరిండియా భారతీయుల చేతుల్లోనే ఉండాలని కేంద్రం భావిస్తోందని ఆయన చెప్పారు. గతంలో ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎయిరిండియా పనితీరు చాలా బాగా ఉందని, కాకపోతే అధిక రుణభారం, వడ్డీలే పెద్ద సమస్యగా మారాయని గురువారం లోక్‌సభలో ఆయన చెప్పారు. ‘ఎయిరిండియా ఒక అత్యుత్తమ అసెట్‌లాంటిది. దానికి 125 విమానాలు ఉన్నాయి. దాదాపు సగం విమానాలు 40 అంతర్జాతీయ రూట్లలో, 80 విమానాలు దేశీయంగా వివిధ రూట్లలో నడుస్తున్నాయి. కంపెనీ పనితీరు చాలా బాగుంది. కానీ మోయలేనంత రుణభారమే పెద్ద సమస్య. ఆ రుణాలపై భారీగా వడ్డీలు కట్టాల్సి వస్తుండటం మరో సమస్య‘ అని పురి వివరించారు. దేశీ విమానయాన మార్కెట్ క్షీణిస్తోందన్న వార్తలన్నీ అపోహలేనని ఆయన కొట్టి పారేశారు. వాస్తవానికి ఇది 17 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు. -
ఆర్బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది
ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్బీఐ అయినా ముందుగా స్పందించి ఉండాల్సింది’’ అన్నారాయన. ప్రభుత్వంతో విభేదాల కారణంగా గతేడాది డిసెంబర్ 10న ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత తొలిసారిగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ఆందోళనకరమైన అంశాలపై ఉర్జిత్ పటేల్ మాట్లాడారు. ‘‘ప్రస్తుత మూలధన నిధులు కూడా ఎక్కువ చేసి చూపించినవే. భారీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఇవి సరిపోవు. అసలు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చామో తెలుసా? 2014కు ముందు అన్ని పక్షాలూ తమ పాత్రలను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యాయి. బ్యాంకులు, నియంత్రణ సంస్థ (ఆర్బీఐ), ప్రభుత్వం కూడా’’ అని ఉర్జిత్ పటేల్ స్పష్టంచేశారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారడం, ఆర్బీఐ గవర్నరు హోదాలో రఘురామ్ రాజన్ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను మదింపు చేయడంతో భారీ స్థాయిలో ఎన్పీఏల పుట్ట బయటపడిన విషయం తెలిసిందే. రఘురామ్ రాజన్ హయాం నుంచి పటేల్ ఆర్బీఐలో వివిధ హోదాల్లో మొత్తం ఐదేళ్లకు పైగా పనిచేశారు. సమస్యను కార్పెట్ కింద చుట్టేయడం ఫలితాన్నివ్వదని, భవిష్యత్తులో రుణ వితరణ సమర్థవంతంగా ఉండాలని పటేల్ అభిప్రాయపడ్డారు. ఎన్బీఎఫ్సీ ఆస్తులను సైతం సమీక్షించాలి ఆర్థిక వ్యవస్థతో అంతర్గతంగా అనుసంధానమై ఉన్న దృష్ట్యా ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను సమీక్షించడం తప్పనిసరి అని ఉర్జిత్ పటేల్ ఉద్ఘాటించారు. సామాజిక రంగ అవసరాలు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకోలేకపోవడం వంటి అంశాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరిగిందని చెప్పారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధుల సాయం పెరిగినట్టు తెలిపారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు బలవంతం చేయడంపైనా పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బలహీన బ్యాంకులను విలీనం చేసుకునే బ్యాంకుల విలువ హరించుకుపోతుందన్నారు. ఎల్ఐసీతో కొనుగోలు చేయించిన ఐడీబీఐ బ్యాంకును చాలా సమస్యాత్మక బ్యాంకుగా అభివర్ణించారు. బ్యాంకులకు అడ్డంకులు తొలగాలి: రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కొన్ని అడ్డంకులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ అడ్డంకులు తొలగితే, ఆయా బ్యాంకులు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వపరమైన నియంత్రణలు కొంత తగ్గాల్సి ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ వాటాలు ప్రభుత్వానికి ఉన్నంతవరకూ ఇది సాధ్యం కాదనీ అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణే అన్నింటికీ మందన్న అభిప్రాయం కొన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ, కేవలం ఇదే సరైనదని భావించకూడదన్నారు. తనకు తెలిసి కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల నిర్వహణ కూడా పేలవంగానే ఉందని అన్నారు. తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు ప్రైవేటు రంగంకన్నా ఎక్కువగాను .. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు తక్కువగాను వేతనాలు చెల్లిస్తుండటం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుమతించాల్సిన పరిస్థితులు ఉండటం వంటివి పీఎస్‌బీల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కావాల్సింది ఏమిటి?‘ అన్న ఒక పుస్తకంలో ఈ మేరకు రాజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తలు అభిజిత్ బెనర్జీ, గీతా గోపీనాథ్, మిహిర్ ఎస్ శర్మ కూడా ఈ పుస్తకంలో తమ విశ్లేషణలు చేశారు. -
ఎన్పీఏల గుర్తింపునకు ఇకపై నెల గడువు
ముంబై: మొండి బకాయిల్ని (ఎన్పీఏ) గుర్తించే విషయంలో ఆర్బీఐ శుక్రవారం నూతన నిబంధనలను విడుదల చేసింది. ఒక్కరోజు చెల్లింపుల్లో విఫలమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న ఆర్బీఐ పూర్వపు ఆదేశాలను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాత నిబంధనల స్థానంలో ఆర్బీఐ కొత్తవాటిని తీసుకొచ్చింది. రుణ ఖాతాల పరిష్కారానికి సంబంధించి ఇంతకుముందు వరకు అమల్లో ఉన్న అన్ని పరిష్కార విధానాల స్థానంలో నూతన నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆర్బీఐ తెలిపింది. వీటి కింద ఇకపై ఎన్పీఏల ఖాతాల గుర్తింపునకు గాను 30 రోజుల గడువిచ్చారు. నూతన ఆదేశాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులను ముందే గుర్తించి, సకాలంలో వాటిని ఆర్బీఐకి తెలియజేసి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఒత్తిడిలో (వసూళ్ల పరంగా) ఉన్న రుణ ఖాతాలను బ్యాంకులు ముందుగానే గుర్తించడంతోపాటు, చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన వెంటనే వాటిని ప్రత్యేకంగా పేర్కొన్న ఖాతాలుగా (ఎస్ఎంఏ) వర్గీకరించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. డిఫాల్ట్ అవడానికి ముందే పరిష్కార ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచించింది. ‘‘బ్యాంకు, ఆర్థిక సంస్థ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ వీటిల్లో ఏదైనా ఓ రుణగ్రహీత డిఫాల్ట్ అయినట్టు ప్రకటించిన అనంతరం 30 రోజుల్లోపు ఆయా రుణగ్రహీత ఖాతాకు సంబంధించి పరిష్కార విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. పరిష్కార ప్రణాళిక అమలు చేసేట్టయితే, రుణమిచ్చిన అన్ని సంస్థలూ అంతర్గత ఒప్పందంలోకి (ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్) వస్తాయి’’ అని ఆర్బీఐ పేర్కొంది. దివాలా లేదా వసూళ్లకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపట్టే స్వేచ్ఛ రుణదాతలకు ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు. ‘‘నూతన కార్యాచరణను 2018 ఫిబ్రవరి 12 నాటి ఆదేశాల ఆధారంగా రూపొందించారు. తగినంత మెజారిటీతో పరిష్కారాలను అన్వేషించే యంత్రాంగం ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అన్నది నిబంధనల మేరకు బ్యాంకులు ఉమ్మడిగా పరిష్కా రాన్ని ఐబీసీకి వెలుపల గుర్తించేందుకు తోడ్పడుతుంది’’ అని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ ఎల్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ‘‘నూతన నిబంధనలు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఎన్పీఏల గుర్తింపు ఇప్పుడిక వేగాన్ని సంతరించుకుంటుంది’’ అని ఎకనమిక్ లా ప్రాక్టీస్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ సుహైల్ నథాని పేర్కొన్నారు. -
బ్యాంకుల అంతర్గత ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు ఎన్పీఏల భారాన్ని తగ్గించుకునే కసరత్తులో భాగంగా తమ మధ్య కుదిరిన ఒప్పందాల (ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్/ఐసీఏ)ను అమల్లోకి తీసుకురానున్నాయి. తద్వారా మధ్య స్థాయి ఎన్పీఏ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయనున్నాయి. ఏడు నెలల క్రితం బ్యాంకులు అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ప్రకారం మైనారిటీ రుణదాతలు మెజారిటీ రుణదాతల నిర్ణయాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్ కేసుల విషయంలో ఈ అంతర్గత ఒప్పందాలను అమలు చేయనున్నట్టు సీనియర్ బ్యాంకర్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లోనూ పరిష్కార ప్రణాళికలను ఒప్పందాలకు ముందే రుణదాతలు ఖరారు చేయడం గమనార్హం. అయితే, కొన్ని బ్యాంకులు ఇంకా తమ ఆమోదం తెలియజేయాల్సి ఉంది. జీఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ కేసు విషయంలో ఈ కంపెనీని అదానీ పవర్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు రుణదాతలు అంగీకరించారు. మొత్తం రూ.8,000 కోట్ల రుణంలో 53 శాతాన్ని బ్యాంకులు ‘హేర్‌కట్’ రూపంలో నష్టపోనున్నాయి. అయితే, జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీకి తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు ఈ పరిష్కార ప్రణాళికను ఇంకా ఆమోదించాల్సి ఉంది. హెచ్‌సీసీకి సంబంధించిన రుణ పరిష్కార ప్రణాళికకు మాత్రం చాలా వరకు రుణదాతలు అంగీకారం తెలిపారు. అయితే, రుణమిచ్చిన ఒక సంస్థ మాత్రం తొలుత అంగీకారం తెలిపి ఆ తర్వాత పరిష్కార ప్రణాళికకు ఆమోదం విషయంలో వెనక్కి తగ్గింది. ఈ ప్రణాళిక కింద రూ.4,900 కోట్ల రుణంలో సగాన్ని దీర్ఘకాలిక క్యుములేటివ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లుగా మార్చడంతోపాటు, మిగిలిన రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించేలా పరిష్కారం ఉంది. ఈ రెండు పరిష్కార ప్రణాళికలు ఇప్పుడు తుది ఆమోదం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ పరిశీలన కమిటీ ముందున్నాయి. కాగా ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కమిటీ జెట్ ఎయిర్వేస్ కేసులో సంయుక్త ప్రణాళికను అమల్లో పెడుతోంది. ఇదీ అంతర్గత ఒప్పందమే. ఐసీఏ కీలకం.. ఎన్పీఏల పరిష్కారానికి గతేడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల మధ్య అంతర్గత ఒప్పందాలు అనేవి ఎంతో కీలకం కానున్నాయి. రుణాల చెల్లింపుల్లో విఫలమైన సంస్థకు సంబంధించిన ఎన్పీఏల పరిష్కార ప్రణాళికకు, రుణాలిచ్చిన అన్ని సంస్థలు తప్పనిసరిగా ఆమోదం తెలియజేడం ద్వారానే అవి విజయవంతం అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదన్నది బ్యాంకర్ల అభిప్రాయం. అయితే, బ్యాంకుల మధ్య ఒప్పందం ప్రకారం 66 శాతం రుణదాతలు ఆమోదం తెలిపినా అమలు చేయడం సాధ్యపడుతుంది. పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలియజేయడం ఇష్టం లేని సంస్థలు తమ ఎక్స్పోజర్ను విక్రయించి తప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటు రంగంలోని పెద్ద బ్యాంకులు ఐసీఏపై ఇప్పటికే సంతకాలు చేశాయి. రుణాల్లో తక్కువ వాటాలు ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంకు ఈ ప్రక్రియకు దూరంగా ఉంది. అలాగే, విదేశీ బ్యాంకులు కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2018 జూలైలో ఐసీఏపై 34 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సంతకాలు చేయగా, ఇటీవలే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కూడా ఇందులో చేరింది. దీంతో సంఖ్య 35కు చేరింది. -
ఎన్పీఏ రికవరీ రూ.1.80 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్పీఏ) రికవరీ విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1.80 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఆర్థికశాఖ అంచనావేస్తోంది. రెండు బడా ఎన్పీఏ కేసుల పరిష్కారం తుది దశలో ఉండటం దీనికి కారణమని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద ఇప్పటికే బ్యాంకులు లక్ష కోట్ల రూపాయలు రికవరీ చేశాయి. మరికొన్ని కేసుల పరిష్కారం తుదిదశలో ఉన్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఎస్సార్ స్టీల్ కేసులో రూ.52,000 కోట్లు, భూషణ్ పవర్ అండ్ స్టీల్ నుంచి మరో రూ.18,000 కోట్లు రికవరీ అవుతాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు వీడియోకాన్ గ్రూప్, మానెట్ ఇస్పాత్, ఆమ్టెక్ ఆటో, రుచీ సుయాలకు సంబంధించి కూడా దివాలా వివాదాలు కూడా త్వరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2016లో దివాలా కోడ్ అమల్లోకి వచ్చాక దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువైన ఇబ్బందికర బకాయిలు పరిష్కారం అయినట్లు అంచనా. ఆయా అంశాలన్నీ బ్యాంకులకు సానుకూలమని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.9.62 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అటు తర్వాత రూ.23,000 కోట్లకు తగ్గాయి. -
ఇండియన్ బ్యాంక్‌కు ప్రొవిజనింగ్ దెబ్బ..
న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో.. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సగానికి తగ్గి రూ. 152 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ లాభం రూ. 303 కోట్లు. ఇక క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,903 కోట్ల నుంచి రూ. 5,269 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 6.27 శాతం నుంచి 7.46 శాతానికి ఎగిశాయి. నికర ఎన్పీఏలు కూడా 3.3 శాతం నుంచి 4.42 శాతానికి పెరిగాయి. పరిమాణంపరంగా స్థూల ఎన్పీఏలు రూ. 9,595 కోట్ల నుంచి రూ. 13,198 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ. 4,899 కోట్ల నుంచి రూ. 7,571 కోట్లకు ఎగిశాయి. ఫలితంగా మొండిబాకీలకు కేటాయింపులు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ. 385 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. -
ద్రవ్య లభ్యత సమస్యల్లేవు!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ ఉద్ఘాటించారు. అవసరమైతే తగిన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టంచేశారు. గవర్నర్ సోమవారం లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... మంగళవారం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) ప్రతినిధులతో కూడా సమావేశమవుతానని, ఈ రంగంలో నగదు లభ్యత సమస్యల్ని తెలుసుకుంటామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్ష... లిక్విడిటీ అంశంపై ఆర్బీఐ క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తుందని దాస్ చెప్పారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థలో నగదు కొరత రానివ్వం. అదే సమయంలో అవసరానికి మించి ద్రవ్యం వ్యవస్థలో ఉండడాన్ని కూడా ఆర్బీఐ అనుమతించదు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను జాగ్రత్తగా పరిశీలిస్తూ, అవసరం మేరకు ఉండేలా ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది’’ అని దాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతనెల్లో దాస్ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. వ్యవస్థలో నగదు లభ్యత, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రుణ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. తర్వాత ఈ నెల మొదట్లో రూ. 25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి ఆర్బీఐ అనుమతించింది. అయితే సంస్థ రుణం పునర్వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్టీలో నమోదై ఉండాలి. జీఎస్టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్ఎంఈలకు ఇది వర్తించదు. మధ్యంతర డివిడెండ్‌పై ఆర్బీఐ నిర్ణయం కేంద్రానికి తాను మధ్యంతర డివిడెండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంతివ్వాలన్న అంశాన్ని ఆర్బీఐ నిర్ణయిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఆర్బీఐ ఇచ్చిన మధ్యంతర డివిడెండ్ రూ.10,000 కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ. 50,000 కోట్లు డివిడెండ్‌గా బదలాయించింది. ‘‘2018–19లో ఎంత మధ్యంతర డివిడెండ్ ఇస్తుందన్న విషయం ఆర్బీఐ ప్రకటించినప్పుడు మీకు తెలుస్తుంది’’ అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 2018–19లో రూ.54,817.25 కోట్ల డివిడెండ్ వస్తుందని బడ్జెట్ అంచనావేసింది. 2,000 నోట్లపై ఇక చెప్పేదేమీలేదు.. వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను దశలవారీగా తొలగిస్తారన్న వార్తలపై గవర్నర్ సమాధానం ఇస్తూ, ‘‘ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ విషయంపై ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దీనిపై ఇంకా చెప్పాల్సింది ఏదీ లేదు’’ అన్నారు. డీమోనిటైజేషన్ తర్వాత ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్ల ముద్రణను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తగినంత స్థాయిలో రూ.2,000 నోట్లు ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు. ఎన్పీఏలపై బ్యాంకులకు ‘టార్గెట్’ లేదు మొండిబకాయిల (ఎన్పీఏ)ల సవాలు పరిష్కారంలో బ్యాంకులకు ఏదైనా లక్ష్యాలు నిర్దేశిస్తున్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని గవర్నర్ స్పష్టం చేశారు. బ్యాంకుల మొండిబకాయిల స్థాయి తగ్గుతోందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు బాగుందన్నారు. 2018 మార్చిలో రూ.9.62 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అటు తర్వాత రూ.23,000 కోట్లకు తగ్గాయి. ఇష్టానుసారం రైతు రుణ మాఫీ సరికాదు! ఇష్టానుసారంగా రైతు రుణ మాఫీ మంచి విధానం కాదని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఇది దేశ బ్యాంకింగ్ రుణ వ్యవస్థపై అలాగే పునఃచెల్లింపులకు సంబంధించి రుణ గ్రహీత ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో శక్తికాంతదాస్ తాజా ప్రకటన చేశారు. రాష్ట్రాల ద్రవ్యలోటు అంశంపై ప్రతికూల ప్రభావం చూపే అంశమిదని ఆయన అన్నారు. ‘‘ఎన్నికైన ప్రతి ప్రభుత్వానికీ తమ ఆర్థిక అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే రైతు రుణ మాఫీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ ద్రవ్య పరిస్థితులపై చాలా జాగరూకతతో కూడిన నిర్ణయం తీసుకోవడం అవసరం. ప్రతి ప్రభుత్వమూ తమ ఆర్థిక పరిస్థితులను గమనించుకోవాలి. రుణ మాఫీకి సంబంధించి బ్యాంకులకు తక్షణం డబ్బు బదలాయించగలమా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.1.47 లక్షల కోట్ల వ్యవసాయ రుణ మాఫీ ప్రకటనలు జరిగాయి. ప్రభుత్వానికి డివిడెండ్ రూ.40,000 కోట్లు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే మార్చిలోపు కేంద్రానికి రూ.30,000 కోట్ల నుంచి రూ. 40,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉందని ఈ అంశంతో సంబంధమున్న అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోదీ పాలనా యంత్రాంగం ద్రవ్యలోటు (ఒక నిర్దిష్ట కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం–చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) పూడ్చుకోడానికి ఈ మొత్తం దోహదపడే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఆర్బీఐ రూ.10,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. జూలై–జూన్ మధ్య పన్నెండు నెలల కాలాన్ని ఆర్బీఐ తన ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది. నేపథ్యం ఇదీ..: కేంద్ర ప్రభుత్వానికి పన్ను వసూళ్లు తగ్గిన నేపథ్యంలో– భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్ నిర్దేశాలను దాటిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. -
‘బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కోత ఉండదు’
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్‌లను.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని.. ఫలితంగా రుణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని ప్రకటించారు. కానీ బ్యాంకుల వద్ద ఉన్న ఎన్పీఏలు ఫలితంగా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దివాల చట్టం సాయంతో రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెవడమే కాక ఎన్పీఏలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. దీని గురించి జైట్లీ ‘2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ. 65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్ కోసం కేటాయించాం. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చాం. ఎన్పీఏలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తున్నాయి’ అని జైట్లీ తెలిపారు. -
మొండి బకాయిలు వసూలు కావు... జాగ్రత్త
న్యూఢిల్లీ: ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామా... ఆర్బీఐ విధానాల ప్రాధాన్యతల విషయంలో ఉన్న రిస్క్‌ను తెలియజేస్తోందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరగడాన్ని ఇది తెలియజేస్తోందని, మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలకు దీనివల్ల విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పటేల్ రాజీనామా కారణంగా ఏర్పడే సమస్యలన్నవి కొత్తగా వచ్చిన శక్తికాంత దాస్ సారథ్యంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తేటతెల్లం అవుతాయని పేర్కొంది. ‘‘వృద్ధిని వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎంతో కాలంగా వచ్చిన ఒత్తిళ్ల తర్వాతే ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఆర్బీఐ విధాన ప్రాధాన్యతల రిస్క్‌ను తెలియజేస్తోంది. మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంలో బ్యాంకింగ్ రంగ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు కట్టుబడి ఉండటం అన్నది మరింత స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణానికి కారణం అవుతుంది. ఆర్బీఐలో ప్రభుత్వ జోక్యం పెరిగితే అది ప్రగతికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలంగా ఉన్న ఎన్పీఏల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల విషయంలో వెనక్కి తగ్గితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆర్బీఐ విధానాలను మరింత ప్రోత్సహించడం ప్రభుత్వానికి రాజకీయ ప్రోత్సాహకం అవుతుందని అభిప్రాయపడింది. -
మొండిబాకీల విక్రయంలో ఆంధ్రాబ్యాంక్
న్యూఢిల్లీ: సుమారు 50 ఖాతాల నుంచి రావాల్సిన మొండిబాకీలను రికవర్ చేసుకోవడంపై ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ దృష్టి సారించింది. దాదాపు రూ. 1,553 కోట్ల మేర మొండిబాకీలను (ఎన్పీఏ) వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) నుంచి బిడ్లను ఆహ్వానించింది. నవంబర్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు(ఈవోఐ) సమర్పించాల్సిందని టెండర్ డాక్యుమెంట్లో పేర్కొంది. డిసెంబర్ 3న ఈ–బిడ్డింగ్ జరుగుతుందని, డిసెంబర్ 10లోగా ఒప్పందాలను కుదుర్చుకోవడం, నగదు బదిలీ తదితర లావాదేవీలు పూర్తవుతాయని బ్యాంక్ పేర్కొంది. 53 ఖాతాల్లో రూ. 1,552.96 కోట్ల మొత్తానికి సంబంధించిన ఎన్పీఏల ప్రతిపాదిత వేలంలో పాల్గొనేందుకు ఏఆర్‌సీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. పూర్తిగా నగదు ప్రాతిపదికన ఈ ఎన్పీఏల వేలం ఉంటుందని తెలిపింది. వేలానికి వస్తున్న పెద్ద మొండిపద్దుల్లో ట్రాన్స్ట్రాయ్ దిండిగల్–తెని–కుమ్లి టోల్వేస్ (మొత్తం బాకీ రూ. 147 కోట్లు), ట్రాన్స్ట్రాయ్ కృష్ణగిరి దిండివనం హైవేస్ (రూ. 103 కోట్లు), కార్పొరేట్ పవర్ (రూ. 306.65 కోట్లు), వీసా స్టీల్ (రూ. 211.76 కోట్లు), తుల్సియాన్ ఎన్ఈసీ (మొత్తం బాకీ రూ. 154 కోట్లు), కార్పొరేట్ ఇస్పాత్ అలాయ్స్ (రూ. 148 కోట్లు) ఉన్నాయి. -
రూ. 1.8 లక్షల కోట్లు దాటనున్న మొండిబాకీల రికవరీ
న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం (ఐబీసీ) ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల పైగా మొండిబాకీల (ఎన్పీఏ) రికవరీ కాగలదని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద ఖాతాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుండగా, మరికొన్ని ఖాతాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ వంటి కేసులను ఉటంకిస్తూ ఇదే తీరు కొనసాగితే తాము నిర్దేశించుకున్న రూ. 1.80 లక్షల కోట్ల మొండిబాకీల రికవరీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017–18లో బ్యాంకులు రూ. 74,562 కోట్లు రాబట్టుకోగలిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,551 కోట్లు రికవర్ చేసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన 12 భారీ మొండిబాకీ కేసుల పరిష్కారం ద్వారా కనీసం రూ. లక్ష కోట్ల పైగా రాగలవని బ్యాంకులు ఆశిస్తున్నాయి. ఆర్బీఐ రూపొందించిన భారీ ఎన్‌పీఏల్లోని ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్ పరిష్కార ప్రక్రియ ప్రస్తుతం తుది దశల్లో ఉంది. బినానీ సిమెంట్, జేపీ ఇన్ఫ్రాటెక్ పరిష్కార ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎస్సార్ స్టీల్‌కి ఇచ్చిన సుమారు రూ. 49,000 కోట్ల రుణాల్లో దాదాపు 86 శాతం మొత్తాన్ని రాబట్టుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. -
నిరాశపరిచిన యస్ బ్యాంకు
ముంబై: ఇంతకాలం పనితీరు పరంగా చక్కని ఫలితాలతో ముందుండే యస్ బ్యాంకు... ఒక్కసారిగా సెప్టెంబర్ త్రైమాసికంలో నిరాశ పరిచింది. బ్యాంకు నికర లాభం 3.8 శాతం తగ్గి రూ.964.7 కోట్లుగా నమోదైంది. ఆర్బీఐ ఎన్పీఏల గుర్తింపు కార్యక్రమం తర్వాత బ్యాంకు నికర లాభం తగ్గడం ఇదే ప్రథమం. కిందటేడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.1,003 కోట్లుగా ఉంది. ఎన్పీఏలను యస్ బ్యాంకు రూ.10,000 కోట్ల మేర తక్కువ చేసి చూపించిందని ఆర్బీఐ ఆడిట్లో గుర్తించడం... తర్వాత పరిణామాల్లో యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా రాణా కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించడానికి అనుమతివ్వకుండా, వచ్చే జనవరి 31 తర్వాత దిగిపోవాలని ఆదేశించడం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,048 కోట్ల నుంచి రూ.8,704 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ.2,417 కోట్లకు చేరుకుంది. మార్జిన్లు స్థిరంగా 3.3%గా ఉన్నాయి. వడ్డీయేతర ఆదాయం 18% పెరిగి రూ.1,473 కోట్లుగా నమోదైంది. కాసా డిపాజిట్ల వాటా 33.8%కి తగ్గింది. ఆస్తుల నాణ్యత క్షీణత కార్పొరేట్ బాండ్లపై పెట్టుబడులకు సంబంధించి నష్టాలకు చేసిన కేటాయింపులే నికర లాభం తగ్గేలా చేశాయి. స్థూల ఎన్పీఏల రేషియో 1.6 శాతానికి పెరిగింది. జూన్ క్వార్టర్లో ఇది 1.31 శాతం కావడం గమనార్హం. నికర ఎన్పీఏలు సైతం జూన్ క్వార్టర్లో ఉన్న 0.59 శాతం నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.84 శాతానికి చేరాయి. బ్యాంకు రుణాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1.48 లక్షల కోట్ల నుంచి రూ.2.39 లక్షల కోట్లకు పెరిగాయి. రిటైల్ రుణాలు సైతం వార్షికంగా చూస్తే 103 శాతం పెరిగాయి. డిపాజిట్లలో వృద్ధి 41 శాతంగా ఉంది. తాజాగా రూ.1,631 కోట్ల ఎన్పీఏలు ఓ డైవర్సిఫైడ్ ఖాతాకు సంబంధించి జతయ్యాయి. ఓ సిమెంట్ కంపెనీ ఖాతా కూడా ఎన్పీఏగా మారింది. బ్యాంకు ప్రొవిజన్లు రూ.940 కోట్లకు పెరిగాయి. రూ. 631 కోట్లు రికవరీకి అవకాశం అయితే, ఒక ఖాతాకు సంబంధించి రూ.631 కోట్ల ఎన్పీఏ తదుపరి త్రైమాసికంలో రికవరీ అవుతుందని యస్‌బ్యాంకు సీనియర్ గ్రూపు ప్రెసిడెంట్ రజత్ మోంగా తెలిపారు. డైవర్సిఫైడ్ ఖాతాకు సంబంధించి ఆస్తుల విక్రయం మొదలైందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో వసూలు అవుతాయని చెప్పారు. కొంత చెల్లింపులు ఇప్పటికే సెప్టెంబర్ 30 తర్వాత వచ్చినట్టు తెలిపారు. రాణాకపూర్ తర్వాత బ్యాంకుకు సారథ్యం వహించనున్నట్టు వినిపిస్తున్న పేర్లలో రజత్ మోంగా కూడా ఉండటం గమనార్హం. కార్పొరేట్ బాండ్ల పోర్ట్‌ఫోలియోకు సంబంధించి రూ.252 కోట్లను ఎంటీఎం రూపంలో పక్కన పెట్టినట్టు మోంగా తెలిపారు. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ తరఫున రిస్క్ ఆధారిత పర్యవేక్షణ జరగాల్సి ఉంది. ఇందులో ఏవైనా అంతరాలు పేర్కొంటే, నిర్ణీత పరిమితిని మించితే వాటిని వెల్లడించాల్సి ఉంది’’ అని మోంగా తెలిపారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు సంస్థలకు సంబంధించి బ్యాంకుకు రూ.2,600 కోట్ల ఎక్స్పోజర్ ఉందని, వీటికి ఎటువంటి కేటాయింపులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. -
ఎన్సీఎల్టీకి జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ ఎన్పీఏ కేసు!
ముంబై: జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ సహా 11 విద్యుత్ ప్రాజెక్టుల ఎన్పీఏ ఖాతాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రయాగ్‌రాజ్ పవర్ జనరేషన్, జై ప్రకాష్ పవర్ వెంచర్, ఎస్కేఎస్ ఇస్పాత్ పవర్, మీనాక్షి ఎనర్జీ, అథెనా ఛత్తీస్‌గఢ్ వపర్ జబువా, కేఎస్కే మహానంది, కోస్టల్ ఎనర్జెన్, జిందాల్ ఇండియా థర్మల్ పవర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా సరే వాటిని ఎన్పీఏలుగా గుర్తించాలన్నది ఆర్బీఐ ఆదేశాల సారం. ఇలా ఎన్పీఏలుగా గుర్తించిన కేసుల్లో 180 రోజుల్లోపు బ్యాంకులు పరిష్కారం కనుగొనాలి. లేదా పరిష్కారం కోసం ఎన్సీఎల్టీకి నివేదించాల్సి ఉంటుంది. దీంతో 11 ఎన్పీఏ ఖాతాలను ఎన్సీఎల్టీకి -
మోదీజీ మీ హయాంలో రుణాల సంగతేంటి..?
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో ఇచ్చిన రుణాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం తోసిపుచ్చారు. తామిచ్చిన రుణాల్లో ఎంతమేర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారాయో వెల్లడించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు రీకాల్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 2014 మే తర్వాత జారీ చేసిన రుణాల్లో ఎంత మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారాయో చెప్పాలని ఎన్డీఏ సర్కార్‌ను నిలదీశారు.పార్లమెంట్లో ఎన్నిసార్లు ఈ ప్రశ్నను లేవనెత్తినా సమాధానం లేదని చిదంబరం వరుస ట్వీట్లలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఇచ్చిన రుణాలు ఎన్పీఏలుగా మారాయని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014కు ముందు 12 మంది బడా ఎగవేతదారులకు ఇచ్చిన రూ 1.75 లక్షల కోట్ల బకాయిదారులపై తీవ్ర చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మరో 27 భారీ రుణ ఖాతాల నుంచి రూ లక్ష కోట్లు రికవరీ చేసే చర్యలు చేపట్టామని చెప్పారు. -
ఎన్పీఏలు ఇంకా పెరుగుతాయి
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు ఇప్పటికే భారీ స్థాయిలో మొండి బకాయిల (ఎన్పీఏలు) భారాన్ని మోస్తుండగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవింకా పెరుగుతాయని ఆర్బీఐ స్వయంగా పేర్కొంది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని అంచనా చేసింది. ఎఫ్‌డీఐలకు భారత్ ఇక ముందూ స్వర్గధామంగా ఉంటుందని, రద్దయిన పెద్ద నోట్లలో 99.3 శాతం మేర తిరిగి వ్యవస్థలోకి ప్రవేశపెట్టామని వివరించింది. ఈ మేరకు 2017–18 వార్షిక నివేదికను ఆర్బీఐ బుధవారం విడుదల చేసింది. ఆర్బీఐ అకౌంటింగ్ సంవత్సరం జూలైతో ప్రారంభమై జూన్‌తో అంతమవుతుంది. ఎన్పీఏలు పెరుగుతాయి... 2018 మార్చి నాటికి బ్యాంకింగ్ రంగంలోని మొత్తం రుణాల్లో... స్థూల ఎన్పీఏలు, పునరుద్ధరించిన ఒత్తిడిలోని రుణాలు కలిపి 12.1 శాతానికి చేరాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్పీఏలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు పెరగడం, మార్క్ టు మార్కెట్ (ఎంటీఎం) ట్రెజరీ నష్టాలు పెరగడం వల్లే బ్యాంకులు గడిచిన ఆర్థిక సంవత్సరానికి నికరంగా నష్టాలు ప్రకటించాల్సి వచ్చిందని వివరించింది. నివారణ చర్యగా మూడో త్రైమాసికం నుంచి ఎంటీఎం నష్టాలను నాలుగు త్రైమాసికాల పరిధిలో చూపించుకునేందుకు బ్యాంకులను అనుమతించినట్టు తెలిపింది. ఆర్బీఐ నిర్వహించే పరిశీలనలతో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్పీఏల రేషియో 2018–19 ఆర్థిక సంవత్సరానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. వసూలు కాని ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్పీఏలుగా గుర్తించే పారదర్శకత విధానం కారణంగా... 2015 మార్చి నాటికి రూ.2,23,464 కోట్లుగా ఉన్న ఎన్పీఏలు... 2018 మార్చి నాటికి రూ.10,35,528 కోట్లకు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. ఆస్తుల నాణ్యత (రుణాలు) క్షీణించడం, బాసెల్–3 అమలు బ్యాంకుల మూలధన నిధులకు ఇబ్బంది కలుగుతుందని, అయితే, రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా సమస్యలు ఎదుర్కొనే ప్రభుత్వరంగ బ్యాంకులకు బడ్జెట్ మద్దతు లభించనుందని తెలిపింది. ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) 2017 ఏప్రిల్ నుంచి అమల్లోకి రాగా, ఇందులో 11 ప్రభుత్వరంగ బ్యాంకులను చేర్చడం జరిగిందని, వాటి క్యాపిటల్ మరింత తుడిచిపెట్టుకుపోకుండా ఈ చర్య తీసుకున్నట్టు వివరించింది. వృద్ధి 7.4 శాతం... గత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ మరోసారి పేర్కొంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వర్షాలు బాగుండడం ఇందుకు తోడ్పడతాయని పేర్కొంది. సాధారణ వర్షాలతో వరుసగా మూడో ఏడాది వ్యవసాయ ఉత్పత్తి పెరగనుందని అంచనా వ్యక్తం చేసింది. మధ్య కాలానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యంతో (రెండు పాయింట్లు అటూ, ఇటుగా) మానిటరీ పాలసీ కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎఫ్‌డీఐలపై ఆశాభావం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలు) ఇకపైనా భారత్ చిరునామాగా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ‘‘తయారీ రంగం ఊపులో ఉండటం, సేవల రంగం, వ్యవసాయ రంగాల తోడ్పాటుతో వినియోగ డిమాండ్ బలంగా ఉంటుంది. ఇదే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుంది. 2017–18లో 37.3 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మన దేశంలోకి వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐలు 36.3 బిలియన్ డాలర్లు, 36.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి’’ అని ఆర్బీఐ తెలిపింది. విదేశీ పెట్టుబడుల రాక మారిషస్, సింగపూర్ నుంచే 61% ఉన్నట్టు పేర్కొంది. కేంద్రానికి రూ.50,000 కోట్లు 2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన మిగులు నిల్వలు రూ.50,000 కోట్లను డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 63.08 శాతం ఎక్కువ. 2016–17లో రూ.30,659 కోట్లనే కేంద్రానికి జమ చేసింది. నోట్ల రద్దు లక్ష్యాలు చాలా నెరవేరాయి: కేంద్రం పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా వరకు లక్ష్యాలు నెరవేరాయని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. నల్లధన ప్రవాహానికి కళ్లెం వేసేందుకు ఇది సాయపడిందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ పేర్కొన్నారు. రద్దయిన పెద్ద నోట్లలో 99.3% వెనక్కి వచ్చేసినట్టు ఆర్బీఐ ప్రకటనతో, కేవలం రూ.13,000 కోట్ల కోసం దేశం ఎంతో మూల్య ం చెల్లించాల్సి వచ్చిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రశ్నలకు గార్గ్ స్పందిస్తూ... ‘‘ఉగ్రవాదులకు నిధుల సాయానికి డీమోనిటైజేషన్ చెక్ పెట్టింది. డిజిటల్ చెల్లింపులను పెంచింది. గతంతో పోలిస్తే వ్యవస్థలో ఇప్పుడు రూ.3–4 లక్షల కోట్ల మేర నగదు తక్కువగా ఉంది’’ అని పేర్కొన్నారు. నల్లధనం అంతా నగదు రూపంలోనే లేదని, రియల్టీ, బంగారం, ఇతర మార్గాల్లోనూ ఉందని పేర్కొన్నారు. పెద్ద నోట్లన్నీ తిరిగొచ్చేశాయి... 2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్ కారణంగా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లలో 99.3 శాతం మేర బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ తెలిపింది. ‘‘2016 నవంబర్ 8 నోట్ల రద్దు నాటికి రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉండగా, బ్యాంకులు రూ.15.31 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను స్వీకరించాయి. అంటే కేవలం రూ.10,720 కోట్ల మేర రద్దయిన నోట్లే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదు’’ అని ఆర్బీఐ తన నివేదికలో వివరించింది. రద్దయిన నోట్ల స్థానంలో తిరిగి రూ.500, రూ.2,000 నోట్లతోపాటు ఇతర నోట్ల ముద్రణకు గాను 2016–17లో రూ.7,965 కోట్లు, 2017–18లో మరో రూ.4,912 కోట్ల మేర ఖర్చు చేసినట్టు తెలిపింది. 2015–16లో నోట్ల ముద్రణకు గాను రూ.3,421 కోట్లు ఖర్చు పెట్టినట్టు నివేదిక తెలియజేస్తోంది. ఈ నోట్ల ముద్రణ ఖర్చు పెరగడం వల్ల ఆర్బీఐ లాభాలు కూడా తగ్గాయి. బ్యాంకుల ద్వారా తనకు చేరిన రద్దయిన నోట్ల లెక్కింపునకు రెండేళ్లకు పైగా సమయం పట్టిందని, ఎట్టకేలకు ఈ కార్యక్రమం ముగిసిందని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. తగ్గిన నకిలీ నోట్లు: నల్లధనం, అవినీతి నియంత్రణ, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టాలన్నది డీమోనిటైజేషన్ లక్ష్యమన్న ఆర్బీఐ.. రూ.500, రూ.1,000 నోట్లకు సంబంధించి గుర్తించిన నకిలీ నోట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 59.7 శాతం మేర తగ్గినట్టు తెలిపింది. కానీ, రూ.100 నోట్ల విషయంలో మాత్రం నకిలీ నోట్ల గుర్తింపు 35 శాతం, రూ.50 నోట్ల విషయంలో నకిలీ నోట్లు 154 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది. -
తగ్గనున్న మొండి బకాయిల భారం
ముంబై: భారత్ బ్యాంకుల స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తగ్గనుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ– ఇక్రా విశ్లేషించింది. 2019 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 10 శాతంగా ఉంటుందని అంచనావేస్తోంది. 2018 జూన్ 30 నాటికి భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిల భారం 11.52 శాతం. ఇక నికర ఎన్పీఏల భారం ఈ ఏడాది జూన్ ముగింపు నాటికి 5.92 శాతం ఉంటే 2019 మార్చి నాటికి ఈ రేటు 4.3 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. బ్యాంకింగ్ మొండిబకాయిల్లో దాదాపు 60 శాతం పరిష్కార క్రమంలో ఉన్నాయని, తన సానుకూల అంచనాలకు ఇదే కారణమని తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఒకవేళ మొండిబకాయిల పరిష్కార క్రమం విఫలమయితే మాత్రం 2019 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 12.2 శాతంగా, నికర మొండిబకాయిలు 5.6 శాతంగా ఉంటాయన్నది తమ అంచనా అని ఇక్రా పేర్కొంది. -
ఎన్పీఏల పాపం యూపీఏదే..
ముంబై: మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా పేరుకుపోవడానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో విచక్షణారహితంగా రుణాలివ్వడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభానికి ముందు, ఆ తర్వాత అడ్డగోలుగా రుణాలివ్వడం జరిగిందని, వాటి ఆధారంగా యూపీఏ ప్రభుత్వం అధిక స్థాయిలో జీడీపీ వృద్ధిని చూపించుకుందని ఆయన విమర్శించారు. ‘ప్రతీ సంవత్సరం 28 లేదా 31 శాతం మేర రుణ వృద్ధిని ఆధారంగా చూపించి అధిక జీడీపీ రేటు సాధించామని చెప్పుకున్నారంటే... రాబోయే రోజుల్లో చరిత్ర దాన్ని కచ్చితంగా విచక్షణారహిత రుణాల వృద్ధిగానే పరిగణిస్తుంది. ఇది భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్డీయే హయాంలో అధిక వృద్ధి గణాంకాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మొండిబాకీలకు బ్యాంకర్లు కూడా కారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. లాభసాటి కాని ప్రాజెక్టులకు కూడా యూపీఏ హయాంలో బ్యాంకర్లు రుణాలిచ్చారని, అవి సమస్యాత్మకంగా మారినా కూడా పట్టించుకోకుండా తోడ్పాటు అందించడం కొనసాగించారని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొండిబాకీల రికవరీల కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోందన్నారు. -
మొండి బాకీలను ముందే ఎందుకు గుర్తించలేదు?
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏల నిరోధానికి ముందుగానే చర్యలు తీసుకోవడంలో ఆర్బీఐ వైఫల్యాన్ని పార్లమెంటరీ ప్యానల్ ప్రశ్నించింది. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ హయాంలో 2015 డిసెంబర్లో చేపట్టిన బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్షతో (ఆక్యూఆర్) మొండి బకాయిల (ఎన్పీఏలు) పుట్ట కదిలిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఆస్తుల నాణ్యత సమీక్షకు పూర్వమే ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి ముందస్తు సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోయిందో ఆర్బీఐ వెల్లడించాల్సి ఉందని ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ అధ్యక్షతన గల స్టాండింగ్ కమిటీ సోమవారమే ఆమోదంలోకి తీసుకుందని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం సభ్యుడిగా ఉన్నారు. పునరుద్ధరణ పథకాల ద్వారా ఒత్తిడిలోని రుణాలను ఎప్పటికప్పుడు కొనసాగించడం వెనుక కారణాలను ఈ కమిటీ ప్రశ్నించింది. ఎన్పీఏ విషయంలో ఆర్బీఐ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని కమిటీ అభిప్రాయపడింది. 2015 మార్చి, 2018 మార్చి మధ్య ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.6.2 లక్షల కోట్ల మేర పెరిగిపోయిన నేపథ్యంలో కమిటీ ఆర్బీఐ పాత్రపై సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. జీడీపీ రేషియోలో రుణాల జారీ 2017 డిసెంబర్ నాటికి చైనాలో 208 శాతం, బ్రిటన్‌లో 170 శాతం, అమెరికాలో 152 శాతంగా ఉంటే, మన దేశంలో తక్కువగా 54.5 శాతమే ఉండడాన్ని కమిటీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న అస్సెట్, క్యాపిటల్ లెవరేజ్ నిష్పత్తిని (ఆస్తులు, నిధుల మధ్య అంతరం) ఆర్బీఐ పరిశీలించడం ద్వారా, బ్యాంకుల నిధుల పరిమాణాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించింది. బ్యాంకుల్లో రూ.250 కోట్లకు మించిన ఎన్పీఏ ఖాతాలను ప్రత్యేకమైన ఏజెన్సీల ద్వారా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఇందుకోసం నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. -
రుణాలు ఎగ్గొట్టిన విద్యుత్ కంపెనీలకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన విద్యుత్ కంపెనీలపై దివాలా చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మార్గం సుగమం అయింది. మొండి బకాయిలుగా (ఎన్పీఏ) మారి 180 రోజుల్లోపు పరిష్కారం లభించని ఖాతాలను బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా, దీనికి వ్యతిరేకంగా విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ దశలో మధ్యంతర ఆదేశాల జారీ కుదరదని కోర్టు సోమవారం స్పష్టం చేసింది. వాస్తవాలను నమోదు చేసిన తర్వాత ఈ అంశంలో ప్రత్యేకంగా కోర్టును ఆశ్రయించొచ్చని పిటిషన్లకు అవకాశం ఇచ్చింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 7 కింద రుణదాతలు చర్యలు చేపట్టకుండా ఈ ఆదేశాలు నిరోధించవని కూడా కోర్టు స్పష్టం చేసింది. మార్చి 1 నాటికి మొండి బకాయిలుగా మారి పరిష్కారం లభించని ఖాతాలను ఎన్సీఎల్టీకి నివేదించాల్సిన గడువు ఆగస్ట్ 27తో ముగిసింది. అయితే, చట్టంలోని సెక్షన్ 7 కింద ఆర్బీఐతో సంప్రదింపులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు కోరింది. ఈ సెక్షన్ కింద ప్రజాప్రయోజనాల కోణంలో ఆర్బీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేయగలదు. విద్యుత్ రంగానికి సంబంధించి ఎన్పీఏలు, రుణ ఎగవేతలు మార్చి నాటికి రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్నాయని విద్యుత్ రంగానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక తెలియజేస్తోంది. అయితే, విద్యుత్ కంపెనీల రుణ భారం వెనుక డిస్కమ్‌ల చెల్లింపులు ఆలస్యం కావడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల లేమి, బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలుగా కంపెనీలు, విద్యుత్ శాఖ పేర్కొంటుండడం గమనార్హం. ఈ కారణాల నేపథ్యంలో 180 రోజుల గడువును పొడిగించాలన్నది విద్యుత్ కంపెనీల డిమాండ్. కాగా, కోర్టు ఆదేశాల పట్ల నిరాశ చెందామని ప్రభుత్వరంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పీవీ రమేష్ పేర్కొన్నారు. త్వరలో ఆర్బీఐతో కేంద్రం సంప్రదింపులు అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు కేంద్ర విద్యుత్ శాఖ త్వరలోనే విద్యుత్ కంపెనీల ఎన్పీఏల విషయమై ఆర్బీఐతో సంప్రదింపులు జరపనుంది. ఎన్పీఏ ఖాతాలకు 180రోజుల్లోగా పరిష్కారం కొనుగొనాలని లేని పక్షంలో ఎన్సీఎల్టీకి నివేదించాలన్న ఆర్బీఐ ఆదేశాలను సవరించాలని కోరే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొవిజనింగ్‌పై ప్రభావమేమీ ఉండదు: ఎస్బీఐ దాదాపు 70 భారీ మొండిపద్దుల పరిష్కారంపై ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ.. బ్యాంకుల ప్రొవిజనింగ్‌పై పెద్ద ప్రభావమేమీ ఉండదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే ఆయా ఖాతాలకు సంబంధించి తగినంత కేటాయిం పులు చేశాయని, పరిష్కార ప్రక్రియ కొనసాగిస్తున్నాయని ఐబీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. దాదాపు రూ.1.74 లక్షల కోట్లు బాకీ పడిన 34 మొండిపద్దుల్లో .. 16 ఖాతాలను ఇప్పటికే ఎన్సీఎల్టీకి నివేదించినట్లు, మరో ఏడు పద్దుల పరిష్కార ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు రజనీష్ చెప్పారు. -
బాకీల వసూలుకు... బ్యాంకుల జట్టు!
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల (ఎన్పీఏ) సమస్యను సత్వరం పరిష్కరించుకోవడంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా సునీల్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు సుమారు 24 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సోమవారం అంతర్–రుణదాతల ఒప్పందాన్ని (ఐసీఏ) కుదుర్చుకున్నాయి. కన్సార్షియం కింద ఇచ్చిన రూ. 500 కోట్ల లోపు రుణబాకీల రికవరీకి ఇది తోడ్పడనుంది. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు, మూడు ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఎగ్జిమ్ బ్యాంక్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. తమ తమ బోర్డుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మిగతా బ్యాంకులూ దీన్లో భాగం అవుతాయని ఆశిస్తున్నాం. జూలై ఆఖరు నాటికి ఇది అమల్లోకి రావొచ్చు‘ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా విలేకరులకు తెలిపారు. తమ ప్రధాన కార్యాలయాల నుంచి అనుమతులు పొందిన తర్వాత విదేశీ బ్యాంకులు కూడా ఐసీఏలో భాగమయ్యే అవకాశం ఉందని.. అయితే ఇందుకు కొంత సమయం పట్టొచ్చని ఆయన చెప్పారు. ప్రధానంగా రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా విలువుండే ఎన్పీఏలను పరిష్కరించటం లక్ష్యమని.. రూ. 500–రూ. 2,000 కోట్ల ఖాతాలను వేరేరకంగా డీల్ చేయడం జరుగుతుందని మెహతా వివరించారు. 2018 మార్చి ఆఖరు నాటికి రూ. 50– 500 కోట్ల కేటగిరీలో సుమారు రూ.3.10 లక్షల కోట్ల మేర, రూ.50 కోట్ల లోపు కేటగిరీలో రూ.2.10 లక్షల కోట్ల మేర ఎన్పీఏలున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు 12 శాతం మేర మొండిబాకీలు పేరుకుపోయాయి. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఇవి రూ.9 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఎన్పీఏల పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ సైతం ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకుల తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. మొండిబాకీల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనపై అధ్యయనం చేసిన సునీల్ మెహతా కమిటీ ఇచ్చిన ప్రాజెక్ట్ సశక్త్‌లో ఈ ఐసీఏ ప్రతిపాదన కూడా ఉంది. చరిత్రాత్మక సందర్భం.. మొండిబాకీల రికవరీ దిశగా ఐసీఏ కీలకమైన ముందడుగుగా కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. భారీ మొత్తంలో రుణాలను రాబట్టడంతో పాటు అనేక ఉద్యోగాలను, జాతి సంపదను కాపాడగలిగే చక్కని ప్రణాళికలు రూపొందినా.. ఒకరిద్దరు బ్యాంకర్ల కారణంగా నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా బ్యాంకర్లంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయమని చెప్పారు. ‘ఇది చరిత్రాత్మక సందర్భం. దేశ విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం చూపిన ఎన్పీఏల సమస్య భవిష్యత్‌లో మళ్లీ తలెత్తకుండా.. సమష్టిగా వ్యవహరించాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయి. తమంతట తామే సమస్య పరిష్కారానికి ఈ ఒప్పందాన్ని రూపొందించుకున్నాయి. ఇది సమాంతర వ్యవస్థగా కాకుండా.. దివాలా చట్టానికి లోబడే పనిచేస్తుంది. ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి భారీ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఐసీఏలో చేరుతున్నాయి. ఐసీఐసీఐ వంటి ఇతర బ్యాంకులు కూడా ఇందులో భాగం కానున్నాయి‘ అని ఆయన చెప్పారు. ఒప్పందం పనిచేసేదిలా... నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన పంచముఖ వ్యూహం ప్రాజెక్ట్ సశక్త్‌లో... ఈ ఒప్పందం భాగంగా ఉండనుంది. దీని ప్రకారం సదరు ఎన్‌పీఏకి సంబంధించి అత్యధిక మొత్తాన్ని రుణంగా మంజూరు చేసిన బ్యాంకు లీడ్ లెండర్‌గా ఉంటుంది. ఈ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలతో పాటు ఇతరత్రా చట్టాలకు అనుగుణంగా తగు పరిష్కార ప్రణాళికను రూపొం దించి, పర్యవేక్షణ కమిటీకి సమర్పిస్తుంది. దాని సిఫార్సులను కూడా కలిపి.. మొత్తం ప్రణాళికను మిగతా రుణదాతల ముందు ఉంచుతుంది. మొత్తం రుణంలో దాదాపు 66% వాటా ఉన్న రుణదాతలు(మెజారిటీ) దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఐసీఏలోని మిగతా సంస్థలన్నీ కూడా ఇందులో ప్రతిపాదనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఏ రుణదాత అయినా దీన్ని వ్యతిరేకించిన పక్షంలో నిర్దిష్ట శాతం మేర వారి ఎన్‌పీఏని కొనుగోలు చేసేందుకు లీడ్ లెండరుకు హక్కు ఉంటుంది. అయితే, ఇదేమీ తప్పనిసరి కాదు. అలాగే ప్రతిపాదనను వ్యతిరేకించిన రుణదాత.. మిగతా సంస్థల రుణ వాటాలను కొనుగోలు చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది. కన్సార్షియంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి రుణ పరిష్కార ప్రణాళిక అమలుకు లీడ్ లెండరును తమ ఏజెంటుగా వ్యవహరించేందుకు నియమించుకుంటాయి. ప్రణాళిక అమలుకు లీడ్ లెండరే అవసరమైన నిపుణులను ఎంపిక చేసి, 180 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. -
బ్యాంకులకు బెయిలవుట్ జోష్
న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), అలహాబాద్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు.. అదనపు టయర్ 1 (ఏటీ–1) బాండ్‌హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్బీ టయర్ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో పీఎస్బీలకు లభించనున్నాయి. మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్‌బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్‌హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి. పీఎస్‌బీల షేర్లు రయ్.. కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ షేరు సుమారు 10.88%, అలహాబాద్ బ్యాంక్ 7.23%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.57%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.38%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్ 5.71%, ఇండియన్ బ్యాంక్ 5.04% పెరిగాయి. అటు ఆంధ్రా బ్యాంక్ 4.91%, దేనా బ్యాంక్ 3.58%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.27%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘కనీస బ్యాలెన్స్’ పెనాల్టీలతో పీఎన్బీకి రూ.152 కోట్లు న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్ ఖాతాలపై పీఎన్బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్‌కు పీఎన్బీ ఈ విషయాలు తెలియజేసింది. ‘2017–18లో మినిమం బ్యాలెన్స్ పాటించని 1,22,98,748 సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ వ్యాఖ్యానించారు. -
బకాయిలే బీఎస్ఎన్ఎల్ నష్టాలకు కారణం
ఏలూరు(టూటౌన్): బకాయిలు పేరుకుపోవడమే బీఎస్ఎన్ఎల్ నష్టాలకు కారణమని ఆ సంస్థ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలో నేషనల్ యూనియన్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ వర్కర్స్, పశ్చిమగోదావరి జిల్లా శాఖ 7వ జిల్లా మహాసభ ఉపాధ్యక్షుడు వి.రామయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. నష్టాలతో కూడిన రూరల్ ఏరియా సర్వీసులు బీఎస్ఎన్ఎల్ ఇస్తున్నప్పటికీ ఆనష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయకపోవటం వల్ల ఈ నష్టాలు మరింత పెరిగిపోతున్నాయని అసోసియేషన్ కార్యదర్శి కేఎస్ఆర్ మూర్తి అన్నారు. నెలకు రూ.60 వేలు జీతం పొందుతున్న ఉద్యోగులు యూనియన్ పదవి అడ్డుపెట్టుకుని డ్యూటీలు ఎగ్గొడుతున్నారని, సంస్థ నష్టాలకు ఇదికూడా ఒక కారణమన్నారు. కేవీ రత్నాజీ తాడువాయి ఎక్చేంజీలో పనిచేస్తూ గతేడాది సెప్టెంబర్ 19న మరణిస్తే నేటి వరకూ అతని కుటుంబానికి పెన్షన్, గ్రాట్యూటీ, ఇన్సూరెన్స్ చెల్లించలేదని పేర్కొన్నారు. గతంలో ముగ్గురు లైన్స్టాఫ్ పనిచేసిన చోట ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారన్నారు. అయినా వారితోనే ఫోను సమస్యలతో పాటు, సిమ్ కార్డులు అమ్మడం, కస్టమర్స్ ఇంటికి వెళ్లి టెలిఫోను బిల్లులు ఇచ్చుట వంటి డ్యూటీలు కూడా చేయిస్తున్నారని తెలిపారు. 01.01.2017 నుంచి వేతన సవరణ చేయాలని ఈ సమావేశం కోరింది. సంస్థ నష్టాల్లో ఉన్నందున వేతన సవరణ చేయలేమని చెప్పడం సరికాదని సమావేశం అభిప్రాయపడింది. గత నెల 30న ఉద్యోగ విరమణ చేసిన వి.రామయ్య దంపతులను, జీఎం కేఎస్వీ ప్రసాద్‌లను సన్మానించారు. అనంతరం జిల్లా ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్షుడు– కె.సాంబశివరావు, ఉపాధ్యక్షులు– వి.రామయ్య, కె.మాణిక్యాలరావు, కార్యదర్శి– కేఎస్ఆర్ మూర్తి, సహాయ కార్యదర్శులు– బీవీవీఎంఎస్వీ ప్రసాద్, పి.సాంబశివ రావు, డి.కోటేశ్వరరావు, ఎస్.అమీర్ సుల్తాన్, కోశాధికారి– సీహెచ్ రాంబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు– పీవీవీ సత్యనారాయణ, సీహెచ్ జగదీశ్వరి, ఏవీ సత్యనారాయణ, ఎంవీ సత్యనారాయణ, వై.ప్రశాంత్ బాబులతో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. -
మొండిబకాయిల భారం మరింత!
ముంబై: దేశంలో బ్యాంకింగ్ మొండిబకాయిలు (ఎన్పీఏ) మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనావేస్తోంది. 2018 మార్చిలో మొత్తం రుణాల్లో 11.6 శాతంగా ఉన్న వాణిజ్య బ్యాంకుల స్థూల మొండిబకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి 12.2 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. వాణిజ్య బ్యాంకుల లాభదాయకత పడిపోతోందని, ఎన్పీఏలకు ప్రొవిజినింగ్ దీనికి ప్రధాన కారణమని వివరించింది. ఆర్బీఐ దిద్దుబాటు చర్యల పరిధిలో ఉన్న 11 బ్యాంకులను ఉటంకిస్తూ, 2018 మార్చి నాటికి 21%గా ఉన్న స్థూల మొండిబకాయిల భారం ఆర్థిక సంవత్సరం చివరకు 22.3 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. ఆరు బ్యాంకులకు రిస్క్–వెయిటెడ్ అసెట్స్ రేషియోకు సంబంధించి అవసరమైన (9%) మూలధన సైతం తగ్గే అవకాశం ఉందని నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి కొరవడినప్పటికీ, 2017–18లో రుణ వృద్ధి పుంజుకుందని పేర్కొంది. 11 బ్యాంకులు బయటపడేది రెండేళ్ల తర్వాతే! ఆర్బీఐ వాచ్‌లిస్ట్ నుంచి 2020 నాటికి బయటపడే అవకాశం ఉందని మొండిబకాయిల (ఎన్పీఏ) భారాన్ని ఎదుర్కొంటున్న 11 ప్రభుత్వ బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ ముందు ఆ బ్యాంకుల ఉన్నతాధికారులు తమ అభిప్రాయాన్ని వివరిస్తూ, 2020 నాటికిగానీ దిద్దుబాటు చర్యల (పీసీఏ) చట్టం నుంచి బయటపడే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ♦ ఇటీవల జరిగిన సమావేశంలో ఆర్బీఐ వాచ్‌లిస్ట్‌లో ఉన్న 11 బ్యాంకులు– ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఉన్నత స్థాయి అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల ‘‘రుణ కార్యకలాపాలు స్తంభించిపోవడం గురించి సమావేశంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.ఎన్పీఏలను పరిష్కార ప్రణాళికను బ్యాంకింగ్ అధికారులు సమావేశం ముందు ఉంచారు. ♦ 2017 డిసెంబర్ ముగింపునకు మొత్తం బ్యాంకింగ్ రంగ మొండిబకాయిలు రూ.8.99 లక్షల కోట్లు. మొత్తం రుణాల్లో ఇది 10.11 శాతం. స్థూల ఎన్‌పీఏల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.7.77 లక్షల కోట్లు. ♦ దీనికితోడు బ్యాంకింగ్‌లో పెరుగుతున్న తీవ్ర మోసాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2015–16లో మోసాల సంఖ్య 4,693 అయితే, 2017–18 నాటికి 5,904కు చేరింది. ఇదే కాలంలో మోసాల విలువ రూ.18,699 కోట్ల నుంచి రూ.32,361 కోట్లకు పెరిగింది. -
ఒక ఏడాది.. 1.2 లక్షల కోట్ల రైటాఫ్!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 1.20 లక్షల కోట్ల మేర మొండిబాకీలను రైటాఫ్ చేశాయి. ఆయా బ్యాంకులన్నీ కలిపి ప్రకటించిన నష్టాలతో పోలిస్తే రద్దు చేసిన బాకీల విలువ ఏకంగా ఒకటిన్నర రెట్లు అధికం కావడం గమనార్హం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013–14లో రూ. 34,409 కోట్లుగా ఉన్న రైటాఫ్‌లు.. అయిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. 2017–18 నాటికి రూ. 1.20 లక్షల కోట్లకు (ప్రొవిజనల్) చేరాయి. బ్యాంకింగ్ పరిభాషలో రైటాఫ్ చేయడమంటే.. మొండిపద్దుకు సంబంధించి బ్యాంకు తనకొచ్చిన ఆదాయం నుంచి 100 శాతం ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, దీనివల్ల మొండిబాకీలను ఖాతాల నుంచి తొలగించినట్లయినప్పటికీ.. బ్యాంకు నిర్వహణ లాభాలు దెబ్బతింటాయి. ఈ పరిణామాల కారణంగానే పీఎస్‌బీలు గత ఆర్థిక సంవత్సరంలో ఇటు భారీగా రైటాఫ్‌లతో పాటు అటు రికార్డు స్థాయిలో నష్టాలు కూడా ప్రకటించాయి. 2016–17 దాకా ఎంతో కొంత లాభాలు ప్రకటిస్తూ వచ్చిన పీఎస్‌బీలు 2017–18లో ఏకంగా రూ. 85,370 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2017–18లో ఎస్బీఐ రైటాఫ్ చేసిన మొండిబాకీలు రూ. 40,196 కోట్లు. -
బ్యాంకులకు.. డబ్బులు కావాలి!!
ముంబై: వసూలుకాని మొండి బకాయిలకు (ఎన్పీఏ) భారీగా నిధులు కేటాయిస్తూ నిధుల కటకటను ఎదుర్కొంటున్న బ్యాంకులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాయి. వ్యాపార కార్యకలాపాలకు నిధులు కరువవటంతో గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీల్లో వాటాలను విక్రయించటం మొదలు పెట్టాయి. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే ఆ దిశగా అడుగులేశాయి. స్టాక్ మార్కెట్లో 34 లిస్టెడ్ బ్యాంకుల ఉమ్మడి ఎన్పీఏలు రూ.9 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటికి చేస్తున్న కేటాయింపులతో నిధులు అడుగంటిపోయిన పరిస్థితుల్లో సబ్సిడరీల్లో తమకున్న వాటాలను అమ్మి సొమ్ము చేసుకోవడం మినహా వాటికి వేరే మార్గం కనిపించడం లేదు. దీంతో సబ్సిడరీల్లో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో లేదా ఏక మొత్తంలో వాటాను ఒకేసారి విక్రయించడమో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వాటాలను విక్రయిస్తే వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల తమ స్టేట్మెంట్లలో ఇతర ఆదాయం లేదా ట్రెజరీ ఆదాయంగా పేర్కొంటాయి. అయితే, సబ్సిడరీల్లో నికర పెట్టుబడి వివరాలు తెలియనందున వాటాల విక్రయం వల్ల ఒనగూరే అసలు ప్రయోజనం ఎంతన్నది వాటాదారులకు తెలియడం కష్టమే. వాటాలను విక్రయించిన బ్యాంకులు గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ తన అనుబంధ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కొంత వాటాలను ఐపీవో ద్వారా విక్రయించింది. దీని ద్వారా రూ.5436 కోట్లను సమీకరించింది. దీంతో ఎస్బీఐ లైఫ్ కూడా లిస్టెడ్ సంస్థగా మారి... ఎస్బీఐ వాటాలకు మరింత విలువ సమకూరేలా మార్గం సుగమం అయింది. ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు సైతం ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఏడు శాతం వాటాలను ఐపీవో ద్వారా విక్రయించి సుమారు రూ.2,100 కోట్ల నిధుల్ని పొందింది. 2017–18లో ఈ వాటాల విక్రయం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు కన్సాలిడేటెడ్ ఖాతాల్లో నికరంగా పొందిన ప్రయోజనం రూ.1,711 కోట్లు. అలాగే, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో 20.78 శాతం వాటాను ఐపీవో ద్వారా విక్రయించి రూ.3,480 కోట్లను సమీకరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2016–17లోనే ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో కొంత వాటాను విక్రయించి రూ.6,000 కోట్ల వరకూ సమకూర్చుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఐడీబీఐ బ్యాంకు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. స్థూల ఎన్పీఏలు 28 శాతానికి చేరాయి. ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే ఎన్ఎస్ఈ, ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాటాల విక్రయం ద్వారా రూ.200 కోట్లు, రూ.112 కోట్ల చొప్పున నిధుల్ని పొందింది. నీరవ్ మోదీ దెబ్బకు చతికిల పడిన పంజాబ్ నేషనల్ బ్యాంకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.3,250 కోట్ల వరకు పొం దింది. యూనియన్ బ్యాంకు సైతం యూనియన్ అసెట్ మేనేజ్మెంట్లో తనకున్న 39.62% వాటాను సహ భాగస్వామి దైచీ లైఫ్ హోల్డింగ్స్ కొనుగోలు చేసినట్టు ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాదిలో మరిన్ని... ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వాటాల విక్రయాన్ని కొనసాగించనుంది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో 3–5% వాటాలు, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌లో 24–49 శాతం వరకు వాటాను అమ్మే ప్రణాళికలతో ఉంది. తమ సబ్సిడరీలన్నీ చక్కటి పనితీరును ప్రదర్శిస్తున్నాయని, ప్రస్తుత ఏడాది, వచ్చే ఏడాది కూడా వాటిలోని వాటాల నుంచి సొమ్ము చేసుకోవడం జరుగుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని 2019– 20లో లిస్ట్ చేయాలనుకుంటున్నట్టు ఎస్బీఐ ఎండీ దినేష్ ఖరా చెప్పారు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు తన సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లిస్ట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక బ్యాంకు: యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌లో 8.26 శాతం వాటా విక్రయించే ప్రతిపాదనతో ఉంది. ఐడీబీఐ బ్యాంకు: ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్‌లో వాటాలను విక్రయించనుంది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో తనుకున్న 30 శాతం వాటా విక్రయించే యత్నాల్లో ఉంది. ఫెడరల్ బ్యాంకు: నాన్ బ్యాంకింగ్ సంస్థ ఫెడ్ఫినాలో 26 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. పీఎన్బీ: పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలనే ప్రతిపాదనతో ఉంది. పెట్టుబడుల్లేని బ్యాంకుల పరిస్థితి? అనుబంధ సంస్థలు, ఇతర సంస్థల్లో పెట్టుబడులు లేని బ్యాంకులు కార్యకలాపాలను కుదించుకునే చర్యల్ని చేపట్టడం గడ్డు పరిస్థితికి నిదర్శనం. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులు విదేశీ కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నాయి. ఉదాహరణకు బ్యాంకు ఆఫ్ బరోడా 2017–18లో బహ్రెయిన్, బహమాస్, దక్షిణాఫ్రికా కార్యకలాపాలను మూసివేసినట్టు ఇటీవలే ప్రకటించింది. -
మొండిబాకీల్లో.. పోటాపోటీ!
ఐడీబీఐ బ్యాంకు ఇస్తున్న రుణాల్లో ప్రతి వంద రూపాయలకూ రూ.28 వరకూ నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏ) మారిపోతోంది. అంటే తిరిగి చేతికొస్తున్నది 72 రూపాయలే. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇస్తున్న 100 రూపాయల అప్పులో దాదాపు రూ.12.26 వరకూ ఎన్పీఏగా మారి... రూ.77.74 మాత్రమే చేతికొస్తోంది. ఈ రెండు బ్యాంకుల మొత్తం ఎన్పీఏలెంతో తెలుసా..? అక్షరాలా లక్షా పన్నెండువేల కోట్లపైనే!!. ఐడీబీఐ నష్టాలు రూ.5,663 కోట్లు మొండిబాకీలకు భారీ కేటాయింపుల వల్ల ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు మరింతగా పెరిగాయి. క్యూ4లో నికర నష్టాలు రూ.5,663 కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 జనవరి–మార్చి మధ్య నష్టాలు రూ.3,120 కోట్లు. తాజా క్యూ4లో బ్యాంకు ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.7,703 కోట్ల నుంచి రూ. 7,914 కోట్లకు చేరింది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) వాటా 21.25 శాతం నుంచి ఏకంగా 27.95 శాతానికి ఎగిసింది. నికర ఎన్పీఏలు కూడా 13.21 శాతం నుంచి 16.69 శాతానికి పెరిగాయి. విలువ పరంగా ఎన్పీఏలు రూ.55,588 కోట్లు. నాలుగో త్రైమాసికంలో ఎన్పీఏల కోసం కేటాయింపులు రూ. 6,054 కోట్ల నుంచి రూ. 10,773 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు షేరు 3 శాతం క్షీణించి రూ. 65.10 వద్ద ముగిసింది. బీఓబీ నష్టం రూ.3,102 కోట్లు మొండి బాకీలకు కేటాయింపులు పెరగటంతో నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.3,102 కోట్ల నష్టం ప్రకటించింది. 2016–17 క్యూ4లో రూ.155 కోట్ల లాభం నమోదు చేయటం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండిబాకీల కేటాయింపు ఏకంగా రూ.2,425 కోట్ల నుంచి రూ.7,052 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 12,852 కోట్ల నుంచి రూ. 12,735 కోట్లకు తగ్గింది. రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 10.46% నుంచి 12.26 శాతానికి పెరిగింది. విలువపరంగా చూస్తే.. రూ. 42,719 కోట్ల నుంచి రూ. 56,480 కోట్లకు చేరింది. నికర ఎన్పీఏలు 4.72% నుంచి 5.49 శాతానికి పెరిగాయి. శుక్రవారం బీఎస్ఈలో బీవోబీ షేరు 1.80 శాతం పెరిగి రూ. 141.20 వద్ద క్లోజయ్యింది. -
ఎన్పీఏల భారం తగ్గింపుపై ఆర్థిక శాఖ దృష్టి
న్యూఢిల్లీ: ఎన్పీఏలకు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో నిధుల కటకట బారిన పడకుండా బ్యాంకులకు వెసులుబాటు కల్పించే మార్గంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రొవిజన్ షోర్అప్ సర్టిఫికెట్స్(పీఎస్సీ)ను బ్యాంకులకు జారీ చేయడమే ఈ ప్రతిపాదన. దీని కింద బ్యాంకులు ఎన్పీఏలకు చేసిన కేటాయింపులకు సరిపడా పీఎస్సీలను పొందుతాయి. దీంతో వాటికి నిధుల సమస్య తొలగిపోతుందని, ఆయా నిధుల్ని రుణాల జారీకి వినియోగించుకోవడం ద్వారా బ్యాంకులు మెరుగైన స్థితిలో కొనసాగేందుకు అవకాశం లభిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది కూడా నిధుల సాయం వంటిదేనని, ఒకేసారి కాకుండా పలు త్రైమాసికాల పాటు కొనసాగుతుందని వివరించాయి. పీఎస్సీలు అన్నవి కేవలం ఎన్పీఏకే పరిమితమని, బ్యాంకులు చేసే మొత్తం ప్రొవిజన్లకు కాదని స్పష్టం చేశాయి. ‘‘బ్యాడ్ బ్యాంకు, పీఎస్సీ యంత్రాంగానికి మధ్య పూర్తి తేడా ఉంది. బ్యాడ్ బ్యాంకు అన్నది బ్యాంకింగ్ రంగంలోని మొత్తం ఎన్పీఏలను స్వాధీనం చేసుకోవడం కోసం. పీఎస్సీ విధానంలో బ్యాంకులు ఎన్పీఏలను స్వా«ధీ నం చేసి తాము కేటాయింపులు చేసిన మేరకు పీఎస్సీలను తీసుకుంటాయి’’ అని ఆ వర్గాలు తెలిపాయి. -
ప్రైవేటు బ్యాంకుల మొండి బాకీలు రూ.లక్ష కోట్ల పైనే
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగంలో అడ్డగోలుగా మంజూరై, వసూలు కాని మొండి రుణాల (ఎన్పీఏల) వ్యవహారం.. బ్యాంకు ఖాతాల ప్రక్షాళన కార్యక్రమం ఫలితంగా వెలుగు చూసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో ఎన్పీఏలు బయటకు వచ్చాయి. వీటితో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు ఎన్పీఏల విషయంలో కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ, అలా అని దూరంగాను లేవు. ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఎన్పీఏలు పెరిగిపోతున్నాయి మరి. ఆరు ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2018 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటాయి. 2015 సెప్టెంబర్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టే నాటికి ఆరు ప్రధాన ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు రూ.28,033 కోట్లుగా ఉంటే, అవి ఈ ఏడాది మార్చి ఆఖరుకి రూ.లక్ష కోట్లకు పెరిగిపోయాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి. మొండి బకాయిలకు సంబంధించి ఆర్బీఐ నూతన కార్యాచరణను అమల్లో పెట్టడం వల్ల మార్చి క్వార్టర్లో ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు మరోసారి గణనీయంగా పెరిగిపోయాయి. మార్చి క్వార్టర్లో భారీగా పెరుగుదల గతేడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటి స్థూల ఎన్పీఏలు రూ.8.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, మార్చి ముగింపు నాటికి ఇవి మరింత పెరిగిపోయాయి. కార్పొరేట్ రంగానికి అధికంగా రుణాలు ఇచ్చిన ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు ఎన్పీఏలను ఎక్కువగా చూపించాయి. మార్చి చివరికి ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్పీఏలు 238 శాతం ఎగిసి రూ.54,063 కోట్లకు చేరాయి. అదే యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే స్థూల ఎన్పీఏలు 670 శాతం పెరిగి రూ.34,249 కోట్లకు చేరాయి. ఈ రెండు బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి భారీగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్పీఏ రేషియో 2015 సెప్టెంబర్ నాటికి మొత్తం రుణాల్లో 3.26 శాతంగా ఉండగా, 2018 మార్చి నాటికి అది 10 శాతానికి పెరిగిపోయింది. అటు యాక్సిస్ బ్యాంకు స్థూల ఎన్పీఏ రేషియో ఇదే కాలంలో 1.38 శాతం నుంచి 6.7%కి ఎగిసింది. 2015 సెప్టెంబర్ నాటి నుంచి చూస్తే యస్ బ్యాంకు ఎన్పీఏల రేషియా ఈ ఏడాది మార్చి చివరికి 434 శాతం పెరిగిపోయింది. ఆర్బీఐ నిబంధనల వల్లే... బ్యాంకుల ఎన్పీఏలు జనవరి–మార్చి త్రైమాసికంలోనూ పెరగడం ఆర్బీఐ నూతన కార్యాచరణ పర్యవసానమేనని ఏంజెల్ బ్రోకింగ్ అనలిస్ట్ సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. ‘‘ఆర్బీఐ... రుణాలను తగిన విధంగా వర్గీకరించాలని, చెల్లింపులు ఆగిపోయిన రోజు నుంచి 180 రోజుల్లోపు వాటిని పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ సాధ్యం కాకపోతే వాటిని దివాలా చర్యల కింద సిఫారసు చేయాలని ఆదేశాలే జారీచేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు కొన్ని ఖాతాలను ఎన్పీఏలుగా తిరిగి వర్గీకరించాయి. ఈ ఖాతాలకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బ్యాంకులు పరిష్కార ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ రెండు నెలలు కీలకం’’ అని సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. మారిన ప్రాధాన్యం ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుదెబ్బల ఫలితంగా రిస్క్‌తో కూడిన కార్పొరేట్ రుణాలకు దూరం జరిగింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు కార్పొరేట్ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.7,008 కోట్లు మాత్రమే. గత మూడు సంవత్సరాలుగా ఐసీఐసీఐ బ్యాంకు లోన్‌బుక్ వార్షికంగా 3.3 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, ఇతర బ్యాంకుల కంటే ఐసీఐసీఐ బ్యాంకు ఎన్పీఏలు ఎక్కువగా పెరగడానికి కారణం ఇదేనంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా కార్పొరేట్ రంగాన్నే నమ్ముకున్న బ్యాంకులు ఎన్పీఏల షాక్‌తో రిటైల్ రుణాలపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో బ్యాంకుల రుణాల వృద్ధిలో ఎక్కువ భాగం రిటైల్ విభాగం నుంచే ఉంటోంది. యాక్సిస్ బ్యాంకు రిటైల్ లోన్‌బుక్ 2015 మార్చి నాటికి రూ1.1 లక్ష కోట్లుగా ఉండగా, 2018 మార్చి నాటికి రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం రుణాల్లో 47 శాతానికి చేరాయి. అటు ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 42.4 శాతం నుంచి 56.6 శాతానికి పెరిగింది. 2020 నాటికి 60 శాతం వాటా రిటైల్ రుణాలే ఆక్రమిస్తాయని బ్యాంకు అంచనా వేస్తోంది. బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోను మార్చుకుంటున్నాయని, కార్పొరేట్ రుణాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితమైనా, 20 శాతం వృద్ధి ఉన్న రిటైల్ రుణాల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాస్ అన్నారు. -
ఇన్ఫ్రాకు రుణాలిక కష్టమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసిన నిబంధనావళి వల్ల దేశంలో మౌలిక రంగానికి బ్యాంకింగ్ రుణాలు... ప్రత్యేకించి దీర్ఘకాలిక ఫండింగ్ నెమ్మదిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొండిబకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి కొత్త నిబంధనావళిని సడలించే సమస్యే లేదని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం, పరిశ్రమలు, బ్యాంకింగ్ నుంచి నిబంధనల సడలింపునకు సంబంధించి వస్తున్న విజ్ఞప్తులను మన్నించలేమని కూడా ఆర్బీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఎగవేతదారుల సత్వర గుర్తింపు, రుణ పునఃచెల్లింపుల్లో విఫలమైన కంపెనీలను (ఒక రోజు ఆలస్యం అయినా) దారిలో పెట్టడానికి అనుసరించాల్సిన సత్వర ప్రణాళిక రూపకల్పన విధివిధానాలు, ఆయా కంపెనీలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు రిఫర్ చేయడానికి 180 రోజుల కాలపరిమితుల విధింపు వంటి అంశాలు ఆర్బీఐ తాజా నిబంధనావళిలో ఉన్నాయి. ఈ కఠిన నిర్ణయాల నేపథ్యంలో విద్యుత్, రోడ్లు, నౌకాశ్రయాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో దీర్ఘకాలిక ఫండింగ్ తగ్గే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు ఒక బ్యాంకర్ తెలిపారు. నిజానికి దేశాభివృద్ధికి ఈ రంగాలకు రుణ లభ్యత అవసరమైనా, ఇలాంటి రుణాలను రాబట్టుకునే విషయంలో ఇబ్బంది సైతం తీవ్రంగా ఉందని పేర్కొన్న మరో బ్యాంకర్ అందువల్ల ఆయా రంగాలకు రుణ మంజూరులో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
పీఎన్బీ ‘గాంధీగిరి’, ఇక వారికి చుక్కలే..!
న్యూఢిల్లీ : ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చూసిన వారికి ‘గాంధీగిరి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్యాయం చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పడానికి హింసామార్గంలో కాదు...గాంధీమార్గంలో కూడా బుద్ధి చెప్పవచ్చని చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే మొండి బకాయిలను వసూలు చేయాడానికి ప్రస్తుతం పీఎన్బీ ఇదే మార్గాన్ని ఎంచుకుంది. పీఎన్బీ ప్రస్తుత పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ ఇద్దరు కలిసి పంజాబ్ బ్యాంక్‌లో 13 వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. పేరుకుపోయిన ఎన్పీఏల వసూళ్ల గురించి రోజురోజుకు ఆందోళనలు పెరగడంతో వాటి వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో పీఎన్బీ ఈ ‘గాంధీగిరి’కి శ్రీకారం చుట్టింది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ ‘గాంధీగిరి’ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి నెలకు రూ.100-150 కోట్ల రూపాయల వరకు రుణాలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ‘గాంధీగిరి’ విధానంలో ఉద్యోగులు రుణం తీసుకుని చెల్లించని వారి నివాసాలు, కార్యలయాల ముందు మౌనంగా కూర్చుంటారు. ఉద్యోగులు ఇలా చేయడాన్ని అవమానంగా భావించి అయిన అప్పు తీసుకున్నవాళ్లు రుణం చెల్లిస్తారనే ఉద్దేశ్యంతో బ్యాంకు ‘గాంధీగిరి’ని ప్రారంభించింది. దీన్ని అమలు చేయడానికి 1,144 మంది ఉద్యోగులను కూడా నియమించింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల విషయంలో జారీ చేసిన ఆదేశాల మేరకు పీఎన్బీ గత కొన్ని వారాల నుంచి దీన్ని చాలా కఠినంగా అమలుచేస్తోంది. తాము ఇప్పటికే 1,084 వేల మందిని ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులుగా గుర్తించామని, వారిలో 260 ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎగవేతదారుల విషయంలో తాము కఠిన చర్యలు తీసుకున్నామని, 150 మంది పాస్‌పోర్టులను సైతం స్వాధీనం చేసుకున్నామని, 37మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశామని చెప్పారు. ఇకనుంచి రుణాల మంజూరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని అందుకు గాను ఒక ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఈ భాగస్వామ్యం వల్ల రుణాల వసూలు సులభతరం అవ్వడమే కాక క్రెడిట్, ఫ్రాడ్ రిస్క్‌ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందిని బ్యాంకు అధికారులు చెప్పారు. ఎన్పీఏల వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ విధానాలను తీసుకువచ్చామని, ఫలితంగా ఒక సంవత్సర కాలంలో 70-80 వేల ఎన్పీఏల దగ్గర రుణాలు వసూలు చేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. 2017, డిసెంబర్ నాటికి పీఎన్బీలో 57,519కోట్ల రూపాయల ఎన్పీఏలు ఉన్నాయని సమాచారం. -
‘మొండి’ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా
న్యూఢిల్లీ: మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా పేరుకుపోయిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్ మరింతగా దృష్టి సారించింది. ఎన్పీఏలను కట్టడి చేసే దిశగా వీటిపై ఆంక్షలు విధించింది. సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నిబంధనల పరిధిలోకి చేర్చింది. అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ జాబితాలో ఉన్నట్లు తెలియవచ్చింది. తాజాగా మరో అయిదు బ్యాంకులు కూడా పీసీఏ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రా బ్యాంక్‌తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈ లిస్టులో ఉండొచ్చని అంచనా. పీసీఏ నిబంధనలు వర్తిస్తే...? బ్యాంకులపై ఆర్బీఐ గనక పీసీఏ (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) ప్రయోగిస్తే... బ్యాంకులు కొత్త శాఖలు తెరవడంపైన, సిబ్బందిని నియమించుకోవటంపైన ఆంక్షలు అమల్లోకి వస్తాయి. అలాగే రుణ లావాదేవీలపైనా పరిమితులు అమలవుతాయి. భారీ రుణాలివ్వాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అవుతుంది. మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకులు అంతర్గతంగా పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ఆర్బీఐ ఈ నిబంధనలు ప్రయోగిస్తుంది. -
త్వరలో గరిష్ట స్థాయికి ఎన్పీఏలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యనాటికల్లా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు (ఎన్పీఏ) గరిష్ట స్థాయికి ఎగియనున్నాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే, బ్యాంకర్లపై మోసాలు, కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో రుణాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మొండిబాకీల సమస్య పరిష్కారానికి సంబంధించి ఫిబ్రవరి 12న ప్రకటించిన నిబంధనలతో మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు భారీగా పెరుగుతాయని, 2018–19 మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని క్రిసిల్ పేర్కొంది. గతేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 9.4 శాతం నుంచి 11 శాతానికి పెరగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతానికి ఎగిసి, క్రమంగా 2019 మార్చి నాటికి 10.3 శాతానికి తగ్గొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి వివరించారు. ఎన్పీఏ సమస్యలు తగ్గిన తర్వాత నుంచి మళ్లీ రుణాల వృద్ధి, నిర్వహణ లాభాలు మొదలైన అంశాలపైకి దృష్టి మళ్లగలదని ఆయన చెప్పారు. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 12,900 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం, ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్విడ్ ప్రో కో ఆరోపణలు మొదలైనవి రుణ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. -
ఎన్పీఏలుగా స్టెర్లింగ్ గ్రూప్ కంపెనీలు: ఆంధ్రాబ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెర్లింగ్ గ్రూప్ కంపెనీలపై ఆర్బీఐతోపాటు సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు ఆంధ్రాబ్యాంకు తెలిపింది. మోసపూరిత ఖాతాలుగా తెలుపుతూ, రూ.519.19 కోట్ల నిధులు దారి మళ్లించారని 2017 డిసెంబరులో ఇచ్చిన ఫిర్యాదులో తాము పేర్కొన్నట్టు వెల్లడించింది. ఈ గ్రూప్ కంపెనీలు 2015 మార్చి నుంచే ఎన్పీఏల ఖాతాలో చేరాయని బ్యాంకు తెలిపింది. డిసెంబరు 31 నాటికి రూ.515.19 కోట్ల ఫండ్ ఆధారిత రుణం ఎన్పీఏగా ఉందని వివరించింది. రూ.5,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్ అనుప్ ప్రకాశ్ గర్గ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే అనుప్ ప్రకాశ్ 2006–09 మధ్య చార్టర్డ్ అకౌంటెంట్ డైరెక్టర్‌గా ఉన్నారని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం అతను తమ ఉద్యోగి లేదా డైరెక్టర్ ఎంత మాత్రమూ కాదని ఆంధ్రాబ్యాంకు స్పష్టం చేసింది. స్టెర్లింగ్ గ్రూప్ కంపెనీలకు రుణం ఇచ్చిన కన్సార్షియంలో ఆంధ్రాబ్యాంకు లీడ్ బ్యాంకర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలకు ఆంధ్రాబ్యాంకు ఇచ్చిన రుణంలో ఫండ్ ఆధారిత రుణం రూ.578.57 కోట్లు, నాన్ ఫండ్ ఆధారిత రుణం రూ.568.35 కోట్లు ఉందని, మీడియాలో వచ్చినట్టు రూ.5,000 కోట్లు కాదని వెల్లడించింది. తాజా వార్తల నేపథ్యంలో సోమవారం ఆంధ్రాబ్యాంకు షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 6.88 శాతం పడిపోయి రూ.35.85 వద్ద స్థిరపడింది. -
మొండి బకాయిల్లో మనది ఐదోస్థానం!
ముంబై: అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో మనదే మొదటి స్థానంలో నిలుస్తుండటం మరో ముఖ్యాంశం. భారత బ్యాంకుల మొండి బకాయిల భారం మొత్తంగా రూ.9.5 లక్షల కోట్లు. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలుస్తున్నట్లు ‘కేర్’ రేటింగ్స్ విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. నివేదికలోని మరిన్ని అంశాలు చూస్తే... ►యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు–గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి. ►ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా భారత ఆర్థిక వ్యవస్థ మొండిబకాయిల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ►కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ విశ్లేషణ ప్రకారం– ఎన్పీఏల సమస్య భారత్‌లో తీవ్రంగా ఉంది. రుణ నాణ్యత (ఏఆర్క్యూ) విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2015లో దృష్టి సారించిన తరువాత కూడా ఈ సమస్య పెరుగుతూనే వచ్చింది. అయితే యూరోపియన్ దేశాల్లో ఈ సమస్య చాలా కాలం నుంచీ నలుగుతున్నదే. భారత్‌లో మాత్రం కేవలం రెండేళ్లలో ఈ సమస్య ఆందోళనకర స్థితికి చేరింది. ► 2015 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏల విలువ రూ.2.78 లక్షల కోట్లు. ఈ విలువ 2017 జూన్ నాటికి ఏకంగా రూ.9.5 లక్షల కోట్లకు ఎగసింది. ►ఆదాయాల వృద్ధి మందగమనం, అధిక వడ్డీరేట్లు మొండిబకాయిలు పెరగడానికి కారణాల్లో ప్రధానమైనవి. ► కేంద్రం, ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకులు సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల భారత్ ప్రవేశపెట్టిన దివాలా (ఐబీసీ) చట్టం ఇందులో ఒకటి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ చట్టం సెగను ఎదుర్కొంటున్నాయి. అలాగే బ్యాంకింగ్‌కు ప్రభుత్వం నుంచి తగిన మూలధన మద్దతూ అందుతోంది. ► ఎన్పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు– బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి. -
యూపీఏ వల్లే బ్యాంకింగ్ సంక్షోభం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సంక్షోభానికి యూపీఏనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. నచ్చిన వారికి రుణాలిప్పించేందుకు బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. 2జీ, బొగ్గు, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణాల కన్నా ఇది చాలా పెద్దదని మోదీ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ), మొండి బకాయిల సమస్యలను గత ప్రభుత్వంలోని ఆర్థికవేత్తలు మాకు అందించారు’ అని అన్నారు. ‘పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు భారీగా రుణాలిప్పించారు. యూపీఏ హయాంలోని అతిపెద్ద కుంభకోణం ఇది’ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తప్పు చేస్తున్నారని అందరికీ తెలుసు ‘బ్యాంకుల ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలు ఎలా కారణమయ్యాయనే దానిపై ఫిక్కీ వంటి సంస్థలు అధ్యయనం చేయలేదు. ప్రభుత్వం, బ్యాంకులు, మార్కెట్లు, పరిశ్రమల్లో ఉన్న వారందరికీ యూపీఏ చేస్తున్న తప్పులు తెలుసు. పారిశ్రామికవేత్తలను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు లూటీ చేశారు’ అని విమర్శించారు. పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తీసుకొచ్చామన్నారు. యాంటీ –ప్రాఫిటీరింగ్ (జీఎస్టీ తగ్గడంతో వచ్చే లాభాలను పంచటం) ప్రయోజనాలను ప్రజలకు చేరేలా పరిశ్రమలు చొరవ తీసుకోవాలన్నారు. ‘ఎఫ్ఆర్డీఐ’పై పుకార్లు అబద్ధం బ్యాంకు వినియోగదారులు, వారి డిపాజిట్లను కాపాడే విధంగానే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు – 2017పై వస్తున్న పుకార్లను కొట్టిపడేశారు. ఇలాంటి పుకార్లను ఖండించటంలో ఫిక్కీ కీలకంగా వ్యవహరించాలని కోరారు. ఎఫ్ఆర్డీఐ బిల్లు ముసాయిదాలోని ‘బెయిల్–ఇన్’ నిబంధనపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లకు ప్రమాదకరమని పేర్కొనటంపై మోదీ పైవిధంగా స్పందించారు. బ్రహ్మపుత్ర ‘నలుపు’ కారణమేంటి? కొంతకాలంగా బ్రహ్మపుత్ర నదీ జలాలు నలుపురంగులోకి మారటానికి కారణాలేంటో తెలుసుకోవాలని విదేశాంగ శాఖ, జలవనరుల శాఖలకు మోదీ ఆదేశించారు. దీనికి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని సూచించారు. నీటి రంగు మార్పునకు సంబంధించి చైనాతో చర్చించాలని సుష్మా స్వరాజ్‌ను ఆదేశించారు. -
ఆస్తుల కొనుగోలుకు వారికి అర్హత లేదు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారు, బ్యాంకులకు బకాయి పడిన ఖాతాదారులు (ఎన్పీఏ) దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా... వేలానికి వచ్చే ఆస్తులకు బిడ్డింగ్ వేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణల ఆర్డినెన్స్‌కు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ ముద్రపడింది. ఈ ఆర్డినెన్స్‌ను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిం దే. ఐబీసీ చట్టంలో నిబంధనలను దుర్వినియోగం చేయకుండా మోసపూరిత వ్యక్తులను అడ్డుకోవడమే ఆర్డినెన్స్ ఉద్దేశమని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఐబీసీలో చేసిన మార్పులకు వచ్చే నెల 15 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది. తొలి దశలో బ్యాంకులకు రూ.5,000 కోట్లకుపైగా బకాయిలు పడిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో దివాలా పరిష్కార చర్యలు ఇప్పటికే ఐబీసీ కింద మొదలయ్యాయి. వీటిలో పలు ఖాతాల కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీల ప్రమోటర్లు బిడ్డర్లుగా ఉండడం గమనార్హం. ఈ విధమైన అనైతిక చర్యలను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఆరు సెక్షన్లలో మార్పులు ఎన్పీఏ ఖాతాలుగా వర్గీకరించి ఏడాది, అంతకుమించినా, లేదా దివాలా పరిష్కారం కింద నమోదు చేసేలోపు వడ్డీ సహా బకాయిలను చెల్లించ లేకపోయిన వారిపై అనర్హత అమలవుతుంది. వీరు ఆస్తుల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉండదని ఆర్డినెన్స్ స్పష్టం చేస్తోంది. దీంతో ఐబీసీ కింద దివాలా పరిష్కారానికి నివేదించిన ఖాతాల తాలూకూ కార్పొరేట్లు, ప్రమోటర్లు హోల్డింగ్ కంపెనీలు లేదా సంబంధిత పార్టీలు మొండి బకాయిల ఆస్తుల బిడ్డింగ్‌లో పాల్గొనలేరు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డు (ఐబీబీఐ)కు అదనపు అధికారాలు కల్పించారు. ఐబీసీ నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై రూ.2 కోట్ల వరకు జరిమానా విధించొచ్చు. మొత్తం మీద ఐబీసీ కోడ్‌లో ఆరు సెక్షన్లలో సవరణలు చేయగా, కొత్తగా రెండు సెక్షన్లు జోడించారు. ఆస్తుల విలువపై ప్రభావం ఉండదు: ఎస్బీఐ దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటున్న ఎన్పీఏ ఆస్తుల విలువపై తాజా ఆర్డినెన్స్ ప్రభావం చూపించకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘చట్టంలో మార్పులతో ఆ ఆస్తుల విలువ పడిపోదు. ఎందుకంటే వీటి కొనుగోలుకు ఎంతో ఆసక్తి ఉంది. ప్రస్తుత ప్రమోటర్లను బిడ్డింగ్‌కు అనుమతించకపోయినా, అనుమతించినా విలువలో మార్పుండదు. సరసమైన ధర ప్రకారమే వేలం ఉంటుంది’’ అని రజనీష్‌కుమార్ చెప్పారు. -
బ్యాంకులకు ‘బ్యాడ్ టైమ్’ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య ముగిసినట్టేనా...? బ్యాంకుల బాధలు తీరినట్టేనా...? అవుననే అంటోంది ప్రముఖ రేటింగ్స్ సంస్థ కేర్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌కు (జూలై–సెప్టెంబర్) సంబంధించి బ్యాంకులు ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాలను గమనిస్తే ఎన్పీఏల పరంగా దారుణ శకం ముగిసి ఉండొచ్చంటోంది. మొండి బకాయిల పెరుగుదల గణనీయంగా తగ్గినట్టు గణాంకాలను చూస్తే తెలుస్తోందని కేర్ రేటింగ్స్ వ్యాఖ్యానించింది. 2016–17 సెప్టెంబర్ త్రైమాసికంలో ఎన్పీఏల పెరుగుదల 105 శాతంగా నమోదైతే... ప్రస్తుత ఆర్థిక సంవవ్సరం (2017–18) సెప్టెంబర్ క్వార్టర్లో ఎన్పీఏలు కేవలం 26.3 శాతంగానే పెరగడాన్ని నిదర్శనంగా కేర్ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. ప్రైవేటులో పెరిగాయి...! ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మాత్రం ఎన్పీఏలు పెరిగాయి. ఆర్బీఐ వార్షిక ఆడిట్ల వల్ల ఖాతాల్లో వ్యత్యాసాలను అవి తప్పనిసరిగా చూపించాల్సి రావడం దీనికి కారణమని కేర్ తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిశీలిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎన్పీఏలు రూ.6,649 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు తగ్గిపోయాయి. కెనరా బ్యాంకు ఎన్పీఏలు అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో రూ.5,511 కోట్ల నుంచి రూ.3,367 కోట్లకు దిగొచ్చాయి. యూనియన్ బ్యాంకు ఎన్పీఏలు అంతకుముందు ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే రూ.4,453 కోట్ల నుంచి రూ.2,686 కోట్లకు క్షీణించాయి. మొండి బకాయిలు పెరిగిపోతున్న దృష్ట్యా బ్యాంకులు అనుసరించిన అప్రమత్తత విధానమే దీనికి కారణమై ఉండొచ్చని కేర్ రేటింగ్స్‌కు చెందిన అనలిస్ట్ మదన్ సబ్నావిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేటాయింపులు మరోవైపు మొండి బాకీలకు నిధుల కేటాయింపులు (ప్రొవిజన్స్) పెరిగిన దృష్ట్యా ఎన్పీఏల గుర్తింపు కొనసాగుతున్నట్టు కేర్ రేటింగ్స్ పేర్కొంది. గణాంకాల ప్రకారం ఎన్పీఏలకు కేటాయింపులు పెరుగుతున్నప్పటికీ, అది సెప్టెంబర్ క్వార్టర్లో 13.6 శాతమేనని, గతేడాది ఇదే కాలంలో ఉన్న 13.8 శాతం కేటాయింపుల కంటే తక్కువేనని కేర్ వివరించింది. అయితే, ఇప్పటికీ గత కాలంలో పోలిస్తే ఎన్పీఏల శాతం ఎక్కువగానే ఉన్నట్టు తెలియజేసింది. 2015–16 రెండో క్వార్టర్లో 4.1 శాతం, 2016–17లో 7.6 శాతం కంటే 2017–18లో ఎన్పీఏల రేషియో 8.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. దేశీయ బ్యాంకింగ్ రంగం రూ.8 లక్షల కోట్ల ఎన్పీఏల భారాన్ని మోస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని కేసులు దివాళా పరిష్కార చట్టం పరిధిలోకి రానుండడంతో డిసెంబర్ క్వార్టర్లో ఎన్పీఏల పెరుగుదల, వాటికి అధిక కేటాయింపుల భారం ఉండొచ్చని కేర్ అంచనా వేసింది. ‘‘చాలా వరకు మధ్య స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకుల పరంగా చెడ్డ కాలం ముగిసినట్టేనని మా అంచనా. ఇది బ్యాం కింగ్ రంగానికి ఆశాజనకం. మొండి బకాయిలుగా మారే రుణా లు క్రమంగా తగ్గిపోవడాన్ని చూడొచ్చు’’ అని ఎస్ఎంసీ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అనలిస్ట్ సిద్ధార్థ్ పురోహిత్ చెప్పారు. -
ప్రభుత్వ బ్యాంకులకు 70,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎన్పీఏల భారాన్ని మోస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు రానున్న నాలుగు నెలల్లో రీక్యాప్ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అందించనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మూలధన సాయం చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసే ఉంటుంది. ఇందులో రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో సాయం చేయనున్నట్టు అప్పుడే తెలిపింది. ఈ నేపథ్యంలో బాండ్ల స్వరూపం విషయమై ఆర్థిక శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోందని, ఈ నెల చివర్లోగా నిర్ణయం వెలువడనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బాండ్ల విలువ రూ.70,000–80,000 కోట్ల మధ్య ఉండొచ్చని పేర్కొన్నాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల విషయంలో ప్రభుత్వం ముందు పలు అవకాశాలున్నాయని, ఏది మంచిదన్నది అధ్యయనం చేస్తామని జైట్లీ లోగడ స్పష్టం చేశారు. రీక్యాప్ కార్యక్రమంతోపాటు గతంలో తీసుకున్న ఇంద్రధనస్సు రోడ్ మ్యాప్ కింద వచ్చే రెండేళ్లలో బ్యాంకులకు మరో రూ.18,000 కోట్ల సాయాన్ని కూడా అందించనున్నట్టు జైట్లీ చెప్పారు. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు 2017 మార్చి నాటికి రూ.7.33 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. -
మేము సైతం..
-
ఈ బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంకులకు భారీ షాకిచ్చింది. మొండిబకాయిల(ఎన్పీఏ)లపై చర్యలను ఆర్బీఐ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీఐలపై తప్పుడు నివేదికలు, రెగ్యులేటర్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలతో ఈ రెండు బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. ఆదాయం గుర్తింపు ఆస్తి వర్గీకరణ (ఐఆర్ఏసీ) నిబంధనల ఆధారంగా జరిమానా విధించినట్టు ఆర్బీఐ చెప్పింది. యథాతథ ఆస్తులను వర్గీకరించడంలో ఎస్ బ్యాంక్ విఫలమైందని ఆరోపించిన ఆర్బీఐ ఎస్‌బ్యాంక్‌కు రూ. 6 కోట్ల జరిమానా విధించింది. అలాగే ఎటీఎం సైబర్ భద్రతా అంశంపై సకాలంలో నివేదించలేదని ఆగ్రహించింది. మరోవైపు రెగ్యులేటర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఐడీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ 2 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రుణాల మంజూరు, పునరుద్ధరించే విషయంలో నిబంధనలను అనుసరించలేదని ఐడీఎఫ్సీపై ఆర్బీఐ ఆరోపించింది. డిసెంబర్ 31, 2016 నాటి బ్యాంక్ రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2016 మార్చి లోపు ఎన్పీఏలను గుర్తించి, తమకు నివేదించాలని అక్టోబర్ 2015న దేశంలోని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం నాటి మార్కెట్లో ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ స్ఠాయిలో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు దూసుకుపోతున్నాయి. -
మొండి బాకీల ముప్పు.. మరో రూ.40 వేల కోట్లు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగానికి మొండిబకాయిల(ఎన్పీఏ) బెడద ఇప్పట్లో తీరేలా కనబడటంలేదు. ఇప్పటికే కొండలాపేరుకుపోయిన ఈ మొండిబాకీలకు మరో రూ.40 వేల కోట్ల మేర అదనంగా ఎన్పీఏలు జతయ్యే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ రంగం ఆందోళనచెందుతోంది. ఆర్బీఐ ఆదేశాలతో యాక్సిస్ బ్యాంక్ కన్సార్షియంకు చెందిన ఎనిమిది రుణ ఖాతాలను ఎన్పీఏలుగా పునర్‌వర్గీకరించడమే దీనికి ప్రధాన కారణం. 2016–17కు సంబంధించి వార్షిక రిస్క్ ఆధారిత పర్యవేక్షణ ప్రక్రియ(ఆర్బీఎస్)లో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికి యాక్సిస్ రుణాల వర్గీకరణ, కేటయింపులపై ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీచేసింది. దీని ఫలితంగా మొత్తం 9 స్టాండర్డ్ (క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవి)రుణ ఖాతాలను ఎన్పీఏలుగా చూపాల్సివచ్చిందని.. ఇందులో 8 ఖాతాలు కన్సార్షియం (ఇతర బ్యాంకులతో కలిపి ఇచ్చిన రుణాలు)కు చెందినవని ఇటీవలి క్యూ2(2017–18, సెప్టెంబర్ క్వార్టర్) ఫలితాల సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ వరకూ ఈ 9 ఖాతాలనూ యాక్సిస్ బ్యాంక్ స్టాండర్డ్ రుణాలుగానే ఖాతా పుస్తకాల్లో వర్గీకరించింది. జూన్ చివరినాటికి ఈ ఖాతాల రుణ బకాయిల విలువ దాదాపు రూ.42,000 కోట్లుగా అంచనా. వీటిలో కేవలం 6 శాతం రుణ బకాయిని మాత్రమే ఎన్పీఏలుగా యాక్సిస్ లెక్కగట్టడం గమనార్హం. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ ఖాతాలన్నింటినీ యాక్సిస్ బ్యాంక్ ఎన్పీఏలుగా ప్రకటించడంతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకుల్లో భయం మొదలైంది. తమ రుణ బకాయిల పరిస్థితి ఏంటన్నది ఆయా బ్యాంకుల ఆందోళన. అవి కూడా ఆ ఖాతాల్ని ఎన్పీఏలుగా చూపించాల్సివుంటుంది.ఇప్పటికే బ్యాంకింగ్ రంగం రూ.8 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వెలువడిన క్యూ2 ఫలితాలను చూస్తే.. పరిస్థితి కుదుటపడకపోగా, ఎన్పీఏలు అంతకంతకూ పెరుగుతున్న దాఖలాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. లాభాలకు చిల్లు.. ‘యాక్సిస్ చర్యలతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ ఖాతాలకు సంబంధించి తమ రుణాలను కూడా ఆయా బ్యాంకులు రేపోమాపో ఎన్పీఏలుగా చూపాల్సివస్తుంది. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఈ పునర్వర్గీకరణ ఉండొచ్చు. దీంతో మరిన్ని కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాల్సి వస్తుంది. మొత్తానికి వాటి లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని మెక్వారీ క్యాపిటల్ సెక్యూరిటీస్‌కు చెందిన సురేష్ గణపతి వ్యాఖ్యానించారు. మరోపక్క, ఇప్పటికే కన్సార్షియంలోని ఒక బ్యాంకు ఈ ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించిన నేపథ్యంలో.. మిగతా బ్యాంకులు ఈ ఖాతాలకు(రుణ గ్రహీతలు) కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని ఒక సీనియర్ బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ బ్యాంక్ ఈ ఏడాది మార్చి క్వార్టర్ స్థూల ఎన్‌పీఏల్లో రూ.5,637 కోట్లు తక్కువగా చూపినట్లు ఆర్బీఐ తనిఖీల్లో బయటపడింది. దీంతో మార్చి చివరినాటికి బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ.21,280 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు పెరిగినట్టు లెక్క. సెప్టెంబర్ క్వార్టర్లో స్థూల, నికర ఎన్పీఏలు భారీగా పెరగడం తెలిసిందే. -
భారత్ బ్యాంకింగ్ బాగోలేదు
రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, క్రిసిల్ విశ్లేషణ ► ప్రతికూల అవుట్‌లుక్ ఇచ్చిన ఫిచ్ ► మొండిబకాయిల సమస్య తీవ్రమన్న క్రిసిల్ న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్‌కు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు.. ఫిచ్, క్రిసిల్ షాకిచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ భారత్ బ్యాంకులకు ప్రతికూల ఔట్లుక్ ఇవ్వగా, మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రంగా ఉందని క్రిసిల్ పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్‌కు క్రిసిల్‌లో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. తగినంత తాజా మూలధన నిధుల కల్పన విషయంలో బలహీనతలనూ రెండు సంస్థలూ ప్రస్తావించాయి. ఫిచ్ నివేదికలో ముఖ్యాంశాలు... ► తాజా మూలధన పరిస్థితి కల్పన విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అధిక మొండిబకాయిలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం దీనికి కారణం. ఆయా అంశాలు బ్యాంకుల లాభదాయకతపై కూడా ప్రభావం చూపుతాయి. మా నెగిటివ్ అవుట్‌లుక్ ప్రధాన కారణాల్లో ఇదొకటి. ► వచ్చే 12 నెలల్లో రుణ నాణ్యత సవాలుగా కొనసాగవచ్చు. విద్యుత్‌రంగంలో ఇబ్బంది, వ్యవసాయ రుణ మాఫీలు, చిన్న తరహా పరిశ్రమల ప్రతికూల ధోరణి వంటి అంశాలు దీనికి కారణం. ► తాజా మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్ 3 ప్రమాణాలను చేరుకోడానికి 2019 మార్చి నాటికి భారత్ బ్యాంకింగ్‌కు 65 బిలియన్ అమెరికా డాలర్లు అవసరం. దీనిలో 90 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకే అవసరం అవుతుంది. ► ఎన్పీఏలు, బలహీన ప్రొవిజనింగ్ కవర్, పేలవ రుణ వృద్ధి వంటి అంశాల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి ప్రభుత్వం నుంచి మరింత మూలధన నిధుల సాయం అందాలి. ► రుణ నాణ్యత విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా, ప్రైవేటు రంగం పరిస్థితి బాగుంది. ► మొండిబకాయిల సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది. ► 2016–17 ఏడాదిలో రుణ వృద్ధి 4.4 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి సమీప భవిష్యత్తులోనూ కొనసాగే వీలుంది. క్రిసిల్ ఏమంటోందంటే.. ► వచ్చే ఏడాది మార్చి ముగిసే నాటికి వార్షికంగా మొండిబకాయిల భారం 1% పెరిగి (రుణాల్లో) 10.5 శాతానికి చేరే వీలుంది. ► ఒత్తిడిలోఉన్న కొన్ని రుణాలనూ పలు బ్యాంకులు మొండిబకాయిలుగా ప్రకటించే అవకాశం ఉండటం ఆందోళనకరం. ► ఒత్తిడిలో ఉన్న రుణాలు ప్రధానంగా మౌలికరంగం, విద్యుత్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలకు మంజూరు చేసినవే. ఈ రంగాల పునరుద్ధరణ తక్షణ అవసరం. ► దివాలా చట్టం అలాగే ఇతర పలు వ్యవస్థాగత పథకాల ద్వారా ఒత్తిడిలో ఉన్న రుణ సంబంధ అంశాల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ► నిజానికి గడచిన రెండేళ్లలో రికవరీలు చాలా తక్కువగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏల్లో తగ్గుదల అధిక రైటాఫ్స్ వల్లనే. మూడీస్ భిన్నం... కాగా ఫిచ్, క్రిసిల్ అభిప్రాయం మరో అంతర్జాతీయ దిగ్గజం– మూడీస్కన్నా కొంత భిన్నంగా ఉండటం గమనార్హం. దాదాపు పక్షం రోజుల క్రితం మూడీస్ – భారత్ బ్యాంకింగ్‌కు ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్లు పేర్కొంది. రుణ నాణ్యత పెంపునకు చర్యలు బాగున్నాయనీ, నిర్వహణ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, దీనితో దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు స్టేబుల్ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. తమ రేటింగ్‌లో ఉన్న 15 బ్యాంకుల్లో పదింటికి కూడా స్టేబుల్ అవుట్‌లుక్ ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం 15 బ్యాంకుల మొత్తం రుణ పరిమాణం వ్యవస్థలో 70 శాతం. అయితే వ్యవసాయం, చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణ నాణ్యత విషయంలో బ్యాంకింగ్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
బకాయిల భారం తగ్గిన తర్వాతే విలీనాల పర్వం!: రాజన్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో తొలుత మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తదుపరే విలీనాల ప్రక్రియ ప్రారంభం కావాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల మూలధన సమస్య పరిష్కారానికి కూడా ఇది కీలకమని ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. తాను ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన రుణ నాణ్యాతా సమీక్ష (ఏక్యూఆర్) మొండిబకాయిల పరిష్కారంలో కీలక అడుగని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
సరికొత్త గరిష్టాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు అంచనాలకు తగ్గ ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూలో అన్ని వైపుల నుంచి బ్యాంకు గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. దీంతో బ్యాంకు లాభాలు 2017-18 తొలి క్వార్టర్లో 20.2 శాతం పైకి ఎగిసి, రూ.3,893.84 కోట్లగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు పెరిగినప్పటికీ, బ్యాంకు ఈ మేర లాభాలు నమోదుచేయడం గమనార్హం. తొలుత స్టాక్ మార్కెట్లో బ్యాంకు అసెట్ క్వాలిటీపై ఆందోళనలు రేకెత్తడంతో షేర్లు పడిపోయాయి. కానీ తమ ఆస్తుల నాణ్యత పెరగడానికి ప్రధాన కారణం, జూన్‌లో రాష్ట్రాలు ప్రకటించిన వ్యవసాయ రుణ మాఫీనేనని చెప్పడంతో బ్యాంకు షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. ప్రస్తుతం 1.59 శాతం జంప్‌చేసి, రూ.1,733 వద్ద ట్రేడవుతోంది. కాగ, బ్యాంకు స్థూల ఎన్‌పీఏల్లో 60 శాతం వ్యవసాయ రంగానివేనని హెచ్డీఎఫ్సీ తెలిపింది. అన్ని దిగ్గజ బ్యాంకుల్లో కెల్లా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకే తక్కువ మొండిబకాయిలు ఉంటాయి. నికర వడ్డీ ఆదాయాలు, ఇతర ఆదాయాల నుంచి బ్యాంకుకు లాభాలు చేకూరాయని హెచ్డీఎఫ్సీ సోమవారం బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం(వడ్డీ ద్వారా పొందే ఆదాయాలు, వడ్డీల రూపంలో పెట్టే ఖర్చుల మధ్య ఉన్న తేడా) బ్యాంకుకు 20.4 శాతం పెరిగి, రూ.9,370.4 కోట్లగా నమోదైంది. బ్యాంకు సగటు రుణాల వృద్ధి కూడా 20.7 శాతం పెరిగింది. కోర్ నికర వడ్డీ మార్జిన్లు ఈ క్వార్టర్లో 4.4 శాతంగా ఉన్నాయి. ఈ క్వార్టర్లో అడ్వాన్సులు 23.4 శాతం పెరిగి రూ.5.8 లక్షల కోట్లగా ఉండగా.. రిటైల్ రుణాల వృద్ధి 21.9 శాతం, హోల్ సేల్ రుణాలు 25.5 శాతం ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు డిపాజిట్లు కూడా 17 శాతం పెరిగి ఏడాది ఏడాదికి రూ.6.71 లక్షల కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. డిపాజిట్లలో సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు 26.5 శాతం పెరుగగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 34.1 శాతం పెరిగాయి. -
బ్యాంకులపై రూ.18,000 కోట్ల భారం
♦ 12 భారీ ఎన్పీఏలకే పక్కన పెట్టాల్సిన అవసరం ♦ 25 శాతం లాభాలకు గండి: ఇండియా రేటింగ్స్ ముంబై: ఆర్బీఐ గుర్తించిన భారీ రుణ ఎగవేత కేసుల రూపంలో దేశీయ బ్యాంకుల లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం తగ్గిపోనుందని ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ పేర్కొంది. ఇటీవల ఆర్బీఐ 12 భారీ రుణ ఎగవేత కేసుల్లో ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. వీటి కోసం బ్యాంకులు అదనంగా రూ.18,000 కోట్ల నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఈ 12 కేసుల్లో ఒకటైన ఎస్సార్ స్టీల్ ఆర్బీఐ ఆదేశాలను గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయగా... కోర్టు బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఖాతాలకు సగటు కేటాయింపులు 42 శాతంగా ఉండగా, ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో 50 శాతం చేయాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. అది ఈ ఆర్థిక సంవత్సరంలోనే నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. ఈ అదనపు కేటాయింపుల వల్ల నేరుగా బ్యాంకుల లాభంపై 25 శాతం మేర ప్రభావం పడుతుందని వివరించింది. ఆస్తుల రాబడులపైనా 0.12 శాతం ప్రభావం చూపిస్తుందని తెలిపింది. కొన్ని మధ్య స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకుల లాభ, నష్టాల ఖాతాలపై ఈ ఒత్తిడి అసాధారణంగా ఉంటుందని అంచనా వేసింది. పెద్ద స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మెరుగైన మార్కెట్ విలువ, నిధులు పొందే సౌలభ్యం ఉందని, నాన్ కోర్ ఆస్తులను విక్రయించగలవని... చిన్న స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకులకు బెయిలవుట్ ప్యాకేజీ (ప్రభుత్వం నుంచి నిధుల సాయం) అవసరమవుతుందని నివేదికలో ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ప్రభుత్వరంగ ఎస్బీఐ ఎన్పీఏలకు అధిక కేటాయింపులు చేయాల్సి ఉంటుందని, అయినా లాభాలపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేయగా... ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంకు మాత్రం భారీ రుణ ఎగవేత కేసులకు సంబంధించి తగినంత నిధులు కేటాయింపులు చేయాల్సి ఉందని ప్రకటించింది. రుణాలపై అదనపు వివరాలు వెల్లడించాల్సిందే: సెబీ ఆస్తుల వర్గీకరణ మధ్య తేడా, నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్)కు సంబంధించి అదనపు వివరాలు వెల్ల డించాలని లిస్టెడ్ బ్యాంకులను సెబీ కోరింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా చేసే కేటాయింపులు లాభాల్లో 15 శాతం దాటితే బ్యాంకులు స్టాక్ ఎక్సేంజ్‌లకు ప్రత్యేకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెరిగిన స్థూల ఎన్‌పీఏల్లో ఆర్బీఐ గుర్తించిన స్థూల ఎన్పీఏలు 15 శాతం మించినాగానీ ఆ వివరాలను ఆర్థిక ఫలితాలతో పాటు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ఎన్పీఏలపై ఆర్బీఐకి వారం గడువు
నిపుణుల నివేదికపై స్పందన తెలియజేయాలన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి చర్యల్ని సూచిస్తూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఆర్బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరడంతో వీటి పరిష్కారంపై చర్యల్ని సూచించేందుకు గాను ఆర్బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 12 బడా రుణ ఎగవేత కేసుల్లో చర్యలు సూచిస్తూ ఇటీవల ఆర్బీఐకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సీపీఐఎల్ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. బ్యాంకులకు రూ.500 కోట్లకు పైబడి రుణ బకాయిలు పడిన అందరి పేర్లను బయటపెట్టాలంటూ ఆర్బీఐని ఆదేశించాలని కోరారు. దీన్ని ఆర్బీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. పేర్లను వెల్లడించాల్సిన బాధ్యత ఆర్బీఐపై లేదని స్పష్టం చేశారు. దీంతో నిపుణుల కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికపై స్పందన తెలియజేసేందుకు ఈ నెల 24 వరకు ఆర్బీఐకి గడువిస్తూ చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నిజానికి సీపీఐఎల్ ఈ విషయంలో 2003లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.500 కోట్ల పైబడి రుణ ఎగవేతదారుల జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు లోగడే ఆర్బీఐని కోరింది. ఆ తర్వాత పేర్లను వెల్లడించకపోయినా రుణ బకాయిలు ఎంతున్నాయన్నది బయటపెడితే చాలని వెసులుబాటు ఇచ్చింది. అయినప్పటికీ ఇది గోప్యత అధికారాల కిందకు వస్తుందంటూ ఆర్బీఐ దాన్ని వ్యతిరేకిస్తోంది. -
రూ.8 లక్షల కోట్ల ఎన్పీఏలపై ‘దివాలా’ చర్యలు!
♦ 2019 మార్చికల్లా దివాలా చట్టం ప్రకారం పరిష్కారానికి అవకాశం ♦ అసోచామ్ అధ్యయన నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దివాలా చట్టం ప్రకారం మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను పరిష్కరించేందుకు ఆర్బీఐ చర్యలను వేగవంతం చేస్తోందని అసోచామ్ పేర్కొంది. 2019 మార్చిలోపు దాదాపు రూ.8 లక్షల కోట్ల ఎన్పీఏలను ఈ దివాలా చట్టాన్ని ప్రయోగించి బ్యాంకులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. దీనివల్ల వ్యవస్థలో ఎన్పీఏల పరిమాణం తగ్గడంతోపాటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వం, ఆర్బీఐ చేపడుతున్న కొన్ని చర్యలతోపాటు ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడుతుండటం(టర్న్‌ఎరౌండ్) వంటి పలు అంశాలు కూడా ఈ ఎన్పీఏల సమస్యనుంచి గట్టెక్కేందుకు దోహదం చేస్తాయని అసోచామ్ పేర్కొంది. కాగా, దివాలా చట్టాన్ని ప్రయోగించినప్పటికీ.. ఈ ఎన్పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి ఎంత త్వరగా తొలగిపోతాయన్నది చూడాల్సి ఉందని.. ఎందుకంటే కొన్ని బ్యాంకులు ప్రస్తుతం మొండిబకాయిలను భరించలేని పరిస్థితుల్లో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించింది. కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి...: బ్యాంకుల ఆర్థిక పరిస్థితితో పాటు పనితీరుపైన కూడా ఎన్పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2016–17లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.5 లక్షల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించాయి. అయితే, ఎన్పీఏలకు భారీ ప్రొవిజనింగ్ కారణంగా వీటి నికర లాభం రూ.574 కోట్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి కొత్తగా రుణాలిచ్చేందుకు బ్యాంకులకు అవకాశం లేకుండా పోతోందని నివేదక తెలిపింది. దివాలా కోడ్(ఐబీసీ) ద్వారా ఆర్బీఐకి మరిన్ని అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, ఇప్పటికే 12 అతిపెద్ద రుణ ఎగవేత కంపెనీలపై దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు ఈ దిశగా చర్యలు ప్రారంభించాయి కూడా. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 12 కంపెనీలవే 25 శాతం(దాదాపు రూ.2లక్షల కోట్లు) కావడం గమనార్హం. -
ఎన్పీఏలను నేరంగా చూస్తున్నారు
♦ ఇవి పోగయ్యేది వైఫల్యాల వల్లే ♦ వైఫల్యాలు జరుగుతుంటాయి.. ♦ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య కోల్‌కతా: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు చేరిన తరుణంలో, ఎగవేతదారులపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన దేశంలో మొండి బకాయిలను (ఎన్పీఏ) నేరంగా పరిగణిస్తున్నారు. కానీ, వీటిని అలా చూడకూడదు. ఎన్పీఏలు తయారయ్యేది వైఫల్యాల వల్లే. వైఫల్యాలకు అనుమతి ఉండదు. ఇందుకు సమాజం కూడా అంగీకరించదు. అయినా సరే వైఫల్యాలు చోటు చేసుకుంటాయి’’ అని అరుంధతి మంగళవారం కోల్‌కతాలో చెప్పారు. ఇక్కడ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ... ‘‘జీడీపీ 8.5% వృద్ధి చెందుతున్న సమయంలో ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారతాయని ఊహించలేదు. కానీ, జీడీపీ వృద్ధి 4%కి పడిపోవడంతో బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు భారీగా పెరిగిపోయాయి. అయితే మొత్తం రుణాల్లో ఇవి 5 శాతమేనని గుర్తుంచుకోవాలి’’ అని ఆమె చెప్పారు. మరిన్ని రిటైల్ ఉత్పత్తులు... డిజిటల్ వేదికగా మరిన్ని రిటైల్ ఉత్పత్తులను తీసుకురానున్నట్టు అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ... వినియోగదారులు ఖర్చు చేసే తీరును డిజిటల్ సాయంతో విశ్లేషించనున్నట్టు చెప్పారు. రుణ వృద్ధి 9% ఉంటే సరైనదని, కానీ అది 7% కంటే తక్కువే ఉందని చెప్పారు. -
ఆ పాపం బడాబాబులదే: వెంకయ్య
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిల పెరిగిపోవడానికి కారణం సంపన్న కార్పొరేట్లే తప్ప పేదలు కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తీసుకున్న రుణాల చెల్లింపులో పేదల ట్రాక్ రికార్డు చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాల వారిపై బ్యాంకులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘బ్యాంకుల దృక్పథం మారుతోంది. ఇది మరింతగా మారాలి. అల్లయ్యలు.. మల్లయ్యలకే (మాల్యాలు) కాదు.. ఊళ్లల్లో .. చిన్న చిన్న పట్టణాల్లో ఉండే పుల్లయ్యలకు కూడా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పేదల వల్ల రాలేదు.. దీనికి కారణం చాలా చాలా పెద్దోళ్లే. స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు 98–99 శాతం దాకా కట్టేస్తూనే ఉన్నారు‘ అని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ చట్టం రెరా అమలుకు అవసరమయ్యే యంత్రాంగాన్ని జూలై 30 నాటికల్లా సిద్ధం చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్లు నేషననల్ హౌసింగ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. -
మొండిబకాయిలు పైపైకి!
♦ 2018 మార్చి నాటికి ♦ 10.2 శాతానికి చేరే అవకాశం ♦ 2017–18 జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతం ♦ ఆర్బీఐ ద్రవ్య స్థిరత్వ నివేదిక వెల్లడి ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రమాద ఘంటికలు మ్రోగించింది. 2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2016 సెప్టెంబర్‌లో ఎన్పీఏల రేటు 9.2 శాతం కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్బీఐ తన తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని కూడా ఈ నివేదిలో ఆర్బీఐ పేర్కొంది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ నికర మొండిబకాయిల (ఎన్ఎన్పీఏ) రేషియో 2016 సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉంటే, 2017 మార్చినాటికి ఈ రేటు 5.5 శాతానికి పెరిగింది. ♦ ఒత్తిడిలో ఉన్న రుణ నిష్పత్తి (స్ట్రెస్డ్ అడ్వాన్సెస్ రేషియో) మాత్రం 12 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసింది. వ్యవసాయం, సేవలు, రిటైల్ రంగాల్లో ఈ తరహా రుణ నిష్పత్తి తగ్గితే, పారిశ్రామిక రంగం విషయంలో మాత్రం 22.3 శాతం నుంచి 23 శాతానికి చేరింది. ♦ నికర మొండిబకాయిల విషయంలో మొదటి తొలి అకౌంట్ల వాటా 25.6 శాతంగా ఉంది. ♦ రుణాల జారీ విషయంలో బ్యాంకుల వాటా 2015–16లో 50 శాతంగా ఉంటే, 2016–17లో ఈ రేటు 38 శాతానికి చేరింది. అయితే ఇది వాణిజ్య రంగం రుణాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఫైనాన్షియల్ యేతర సంస్థలు, కమర్షియల్ పేపర్ల నికర జారీ వంటి అంశాలు దీనికి కారణం. ♦ ఇతర నిర్వహణ పరమైన ఆదాయాలు పెరగడం వల్ల బ్యాంకుల నికర ఆదాయం 2016–17లో 48 శాతం పెరిగింది. మొండిబకాయిలకు సంబంధించి కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) కూడా కొంతే పెరగడం ఇక్కడ బ్యాంకింగ్‌కు మొత్తంగా కలిసి వచ్చిన అంశం. కాగా, 2015–16లో బ్యాంకింగ్ నికర లాభం 61.6 శాతం మేర క్షీణించింది. ♦ సెప్టెంబర్ 2016 నుంచి 2017 మార్చి మధ్య రుణ వృద్ధి రేటు క్షీణిస్తే, డిపాజిట్ వృద్ధి మాత్రం పెరిగింది. కాగా ఇదే కాలంలో బ్యాంకుల క్యాపిటల్ టూ రిస్క్ వెయిటేజ్డ్ రుణ నిష్పత్తి 13.4 శాతం నుంచి 13.6 శాతానికి మెరుగుపడింది. వృద్ధికి సంస్కరణల బాట... మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా ఉంటుందని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి ఆర్థిక సంస్కరణలు, దేశంలో రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు ఈ స్థాయి వృద్ధికి దోహదపడతాయని వివరించింది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం–ద్రవ్యలోటు 2016–17లో 3.5 శాతంగా ఉంటే, ఇది 2017–18లో 3.2 శాతానికి తగ్గుతుందన్న అంచనాలనూ నివేదిక వెలిబుచ్చింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం, పేదల గృహ నిర్మాణాలకు చేయూత, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధిపై దృష్టి వంటి అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని నివేదిక వివరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రియల్టీలకి ప్రోత్సాహం, జీఎస్టీ అమలు, విదేశాలకు ఎగుమతులు తిరిగి మెరుగుపడుతున్న ధోరణి కూడా వృద్ధికి ఊతం ఇచ్చే అంశాలుగా వివరించింది. ఇక ద్రవ్యోల్బణం కూడా పూర్తి అదుపులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సగటున విని యోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 3.5 శాతం మధ్య ఉంటుందనీ, తరువాతి ఆరు నెలల్లో ఇది 3.5 నుంచి 4.5 శాతం ఉంటుందని ఆర్బీఐ నివేదిక విశ్లేషించింది. కేంద్రంలో ద్రవ్య పరిస్థితులు అదుపులోకి వస్తున్నప్పటికీ, రాష్ట్రాల విషయంలో కొంత ఆందోళన ఉందని నివేదిక పేర్కొంది. ప్రొవిజనింగ్స్ రెట్టింపు: మోర్గాన్ స్టాన్లీ ఇదిలాఉండగా, డర్టీ 12 సంస్థల మొండిబకాయిల వల్ల ఈ ఏడాది బ్యాంకింగ్ కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ–మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో వివరించింది. 12 సంస్థలపై దివాలా ప్రొసీడింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో భారీ ప్రొవిజనింగ్స్ అవసరం ఏదీ పడదని కొన్ని బ్యాంకులు పేర్కొంటున్నప్పటికీ, మొత్తంగా ప్రస్తుత స్థాయిల నుంచి ఇవి రెట్టింపయ్యే వీలుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. -
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
♦ 31,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్.. ♦ 180 పాయింట్లు డౌన్ ♦ ఇంట్రాడేలో 9,500 పాయింట్ల స్థాయిని ♦ కోల్పోయిన నిఫ్టీ... 64 పాయింట్ల క్షీణత ముంబై: దివాలా ప్రక్రియను ప్రారంభించిన కంపెనీలకు సంబంధించిన ఎన్పీఏలపై కేటాయింపుల్ని పెంచాలంటూ బ్యాంకుల్ని రిజర్వుబ్యాంక్ ఆదేశించిందన్న వార్తలతో మంగళవారం బ్యాంకింగ్ షేర్లు పతనంకావడంతో స్టాక్ సూచీలు పడిపోయాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా వుండటం, జీఎస్టీ అమలురోజు దగ్గరపడటంతో...అందుకు సంబంధించిన ఆందోళనలు కూడా మార్కెట్ క్షీణతకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 290 పాయింట్ల వరకూ తగ్గి 30,848 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. ముగింపులో షార్ట్ కవరింగ్ ఫలితంగా నష్టాల్లో కొంతభాగాన్ని పూడ్చుకుని, చివరకు 180 పాయింట్ల నష్టంతో 31,000 పాయింట్ల స్థాయికి దిగువన 30,958 పాయింట్ల వద్ద ముగిసింది. నెలరోజుల్లో సెన్సెక్స్ ఇంత అధికస్థాయిలో తగ్గడం ఇదే ప్రధమం. మే 23న ఈ సూచి 205 పాయింట్లు క్షీణించింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 9,500 పాయింట్లస్థాయి దిగువకు పడిపోయి...9,473 పాయింట్ల స్థాయిని తాకింది. చివరకు 64 పాయింట్ల నష్టంతో 9,511 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక కేటాయింపులపై ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు మార్కెట్ దిశను దెబ్బతీసాయని, ఆర్బీఐ చర్యతో బ్యాంకుల లాభాలకు గండిపడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎస్బీఐ 3.27 శాతం డౌన్... ఆర్బీఐ చర్య కారణంగా బీఎస్ఈ బ్యాంకెక్స్ సూచి 1.45 శాతం నష్టపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 3.27 శాతం క్షీణించి రూ. 279.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేరు ఇదే. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లు యాక్సిస్ బ్యాంక్ 2.34 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.20 శాతం, కొటక్ బ్యాంక్ 1.13 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.63 శాతం చొప్పున తగ్గాయి. మిడ్సైజ్డ్ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, విజయా బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు 4.97 శాతంవరకూ పతనమయ్యాయి. సిమెంటు షేర్లకు నష్టాలు... జీఎస్టీ మరో మూడురోజుల్లో అమలులోకి రానున్న నేపథ్యంలో ధర పెరుగుతుందన్న అంచనాలతో సిమెంటు షేర్లు ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంటు షేర్లు 3–4 శాతం మధ్య తగ్గాయి. తగ్గిన షేర్లలో ఆసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, సిప్లా, టీసీఎస్, మహింద్రా, మారుతి సుజుకి, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, విప్రోలు వున్నాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, లుపిన్, ఐటీసీలు పెరిగాయి. స్వల్పలాభంతో లిస్టయిన తేజాస్ టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమయ్యే ఉత్పత్తుల్ని అభివృద్ధిపర్చే తేజాస్ నెట్వర్క్స్ షేరు మంగళవారం స్వల్పలాభంతో లిస్టయ్యింది. రూ. 257 ఇష్యూధరతో పోలిస్తే 2.5 శాతం పెరుగుదలతో రూ. 263.5 వద్ద లిస్టయిన తేజాస్ ఇంట్రాడేలో రూ. 271 గరిష్టస్థాయికి పెరిగినప్పటికీ, చివరకు లిస్టింగ్ ధరవద్దే ముగిసింది. బీఎస్ఈలో 24 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో కోటి షేర్ల చొప్పున చేతులు మారాయి. ఈ ఐపీఓ 1.88 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. -
బ్యాంకుల నెత్తిన మరో పిడుగు
♦ భారీ ఎన్పీఏలకు 50 శాతం కేటాయింపులు ♦ నష్టాలుగా భావించి పక్కన పెట్టాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ♦ పరిష్కారం రాకపోతే 100% కేటాయించాల్సిందే ♦ దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల భారం ముంబై: ఆర్బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు(ఎన్పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను శుక్రవారం రాత్రి ఆదేశించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్బీఐ గోప్యంగా జారీ చేసిన ఈ ఆదేశాల గురించి బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇన్సాల్వెన్సీ చర్యలు చేపట్టబోయే కేసులకు సంబంధించిన రుణాల్లో 50 శాతాన్ని నష్టాలుగా ప్రకటించి నిధులు కేటాయింపులు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ తాజాగా కోరడం గమనార్హం. అంతేకాదు, అంతిమంగా రుణదాతలు, రుణగ్రహీతలు ఓ పరిష్కారానికి రాలేకపోతే... ఆస్తుల లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ ఆదేశిస్తే బ్యాంకులు ఆయా కేసుల్లో 100 శాతం కేటాయింపులు చేయాల్సిందేనని వాణిజ్య బ్యాంకుల సీఈవోలకు పంపిన లేఖలో ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, ఈ కేటాయింపులకు మూడు త్రైమాసికాలు సమయం (2018 మార్చి వరకు) ఇవ్వడం కొంచెం ఊరటగా ఓ బ్యాంకర్ పేర్కొన్నారు. నిజానికి ఈ ఆదేశాలు బ్యాంకులు ఊహించనివే. ఐబీసీ కింద చర్యలు చేపట్టే చాలా కేసుల్లో నిర్ణీత సమయంలోగా పరిష్కారం లభించకపోవచ్చని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే నూరు శాతం కేటాయింపులు చేయాలని ఆర్బీఐ ఆదేశించడంతో... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రెట్టింపు స్థాయిలో నిధుల కేటాయింపులు చేయాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కేటాయింపులు ఏ మేరకు...? ఆర్బీఐ ఇన్సాల్వెన్సీ చర్యలకు ఆదేశించిన కేసుల్లో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంకుల మొత్తం మొండి బాకాయిల్లో ఇవి 25 శాతం. ప్రస్తుతం ఈ ఎన్పీఏ ఖాతాలకు కేటాయింపులు 30–40 శాతం స్థాయిలో ఉన్నట్టు బ్యాంకర్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం(2017–18) చివరికి మరో రూ.30,000–50,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందుకు వెళ్లే ఇతర కేసులకూ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ఓ బ్యాంకర్ తెలిపారు. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు మొండి బకాయిల కేసులను ఎస్సీఎల్టీకి నివేదించే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇందుకు అధిక కేటాయింపులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2017 మార్చి నాటికి లిస్టెడ్ వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏల కోసం చేసిన కేటాయింపులు రూ.1.95 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు తమకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్ టీఎం భాసిన్ మీడియాకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం – 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అధికారులు సైతం ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేటు బ్యాంకైనా ప్రజలకు సంబంధించిన విధుల్లోనే ఉన్నారని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల (ప్రభుత్వ రంగ బ్యాంకులు) ఉద్యోగుల అవినీతి కేసులను విచారించే అధికారం సీవీసీకి ఉంది. ఇకపై ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి యాజమాన్యాలపై వచ్చే అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేయనున్నట్టు భాసిన్ తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగాలు నిబంధనల్లో మార్పులు చేసినట్టు చెప్పారు. ఎన్పీఏల కోసం 25శాతం అదనపు కేటాయింపులు: క్రిసిల్ ముంబై: ఎన్పీఏల పరిష్కారానికి ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఎన్పీఏ కేసుల్లో బ్యాంకులు 60 శాతం వరకు హేర్‌కట్ (రుణంలో నిర్ణీత మేర నష్టం)ను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. టాప్ 50 ఎన్పీఏ కేసుల్లో 60 శాతం హేర్‌కట్ అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు అదనంగా 25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. భారీ హేర్‌కట్ నేపథ్యంలో ఎన్పీఏలకు కేటా యింపులకు గాను బ్యాంకులకు ఆరు నుంచి ఎనిమిది క్వార్టర్ల సమయం ఇస్తే వాటికి ఉపశమనంగా ఉంటుందని సీతారామన్ అన్నారు. -
ఎన్పీఏలుగా ప్రకటనకు గడువు పెంపు!
న్యూఢిల్లీ: ఎన్పీఏలుగా ప్రకటించేందుకు ప్రస్తుతమున్న 90 రోజుల కాల వ్యవధిని మరింత పెంచాలన్న అభ్యర్థనను ఆర్బీఐ పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ ప్రతిపాదన తమకు అందిందని, అది ప్రస్తుతం ఆర్బీఐ పరిశీలనలో ఉన్నట్టు ఓ వార్తా సంస్థకు చెప్పారు. ప్రతిపాదన ఎవరినుంచి వచ్చిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఓ రుణానికి సంబంధించి వరుసగా మూడు నెలల పాటు (90 రోజులు) వాయిదాలు చెల్లించకపోతే దాన్ని మొండి బాకీ (ఎన్పీఏ)గా వర్గీకరించాల్సి ఉంటుంది. సాధారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థల నుంచి చెల్లింపులు ఆలస్యంగానే వస్తుంటాయి. ఒక్కసారి చెల్లింపుల్లో ఈ గడువు దాటితే వీటికిచ్చిన రుణాలు ఎన్పీఏలుగా మారడం, ఆ తర్వాత వాటికి రుణాలు రావడం కష్టంగా మారుతుంది. ఒకవేళ ఆర్బీఐ గడువు పెంచితే చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపశమనం లభించనుంది. కాగా, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసే చర్యల్లో భాగంగా రుణాల పునరుద్ధరణకు ప్రస్తుతమున్న యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు. -
మొండి బాకీల రద్దును తోసిపుచ్చలేం
విలీన బ్యాంకుల విషయంలో ఎస్బీఐ స్పందన న్యూఢిల్లీ: విలీనం చేసుకున్న అనుబంధ బ్యాంకులకు సంబంధించి మొండి బకాయిల (ఎన్పీఏ) రద్దును తోసిపుచ్చలేమని ఎస్బీఐ పేర్కొంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలాతోపాటు భారతీయ మహిళా బ్యాంకులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో కలిసిపోయిన విషయం తెలిసిందే. వ్యయాలు తగ్గించుకునేందుకు, నిర్వహణపరమైన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతం ఈ బ్యాంకులను తన సొంత నెట్‌వర్క్‌తో అనుసంధానించే పనిలో ఎస్బీఐ ఉంది. విలీనానికి సంబంధించి ఎటువంటి మొండి బకాయిలను రద్దు చేయబోమని హామీ ఇవ్వలేమంటూ ఇటీవలే పూర్తి చేసిన క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) పత్రాల్లో పేర్కొంది. అలాగే, విలీనం చేసుకున్న బ్యాంకులను సొంత నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు అదనపు ఖర్చు కూడా అవుతుందని తెలిపింది. అయితే, విలీనం వల్ల దీర్ఘకాలంలో లాభమే కలుగుతుందని ఎస్బీఐ భావిస్తోంది. -
‘డర్టీ డజన్’పై దివాలా అస్త్రం!
♦ ఆ 12 ఖాతాల సంగతి ముందు చూడండి ♦ వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోండి ♦ ఎన్పీఏలపై బ్యాంకుల్ని ఆదేశించిన రిజర్వు బ్యాంకు ♦ మిగిలిన ఎన్పీఏలకు సంబంధించి ఆరునెలల్లో ప్రణాళిక ♦ అప్పటికీ పరిష్కారం కాకుంటే వారిపైనా దివాలా కోడ్ ♦ కంపెనీ లా ట్రిబ్యునల్‌లోనూ ఈ కేసులకు ప్రాధాన్యం ♦ ఎట్టకేలకు మొండి బకాయిలపై కార్యాచరణ షురూ! న్యూఢిల్లీ, మొండి బకాయిల పని పట్టడంలో భాగంగా కింగ్‌ఫిషర్ గ్రూపు అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... అతనికంటె ఘనులు మరో 12 మందిని రిజర్వు బ్యాంకు గుర్తించింది. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. చిత్రమేంటంటే దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ 8 లక్షల కోట్లలో 25 శాతం... అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం 12 మంది!!. ‘‘ఈ 12 ఖాతాలపైనా తక్షణం దివాలా చట్టం కింద (ఐబీసీ) చర్యలు ఆరంభించవచ్చునని గుర్తించాం’’ అని ఆర్బీఐ స్పష్టంచేసింది. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం... అంటే రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే. దివాలా చట్టం కింద ఎవరెవరిపై చర్యలు చేపట్టవచ్చో సూచించేందుకు రిజర్వు బ్యాంకు ఇటీవలే అంతర్గతంగా ఓ అడ్వైజరీ కమిటీని నియమించింది. దీన్లో అత్యధికులు ఆర్బీఐలోని స్వతంత్ర సభ్యులే. ఈ కమిటీ అన్నిటినీ పరిశీలించిందని, ఎలాంటి వివక్షకూ తావివ్వకుండా, అధ్యయనానంతరం ఈ నిర్ణయానికి వచ్చిందని బ్యాంకు తెలియజేసింది. ‘‘ఈ కమిటీ అన్ని ఖాతాలనూ పరిశీలించింది. 2016 మార్చి 31 నాటికి రూ.5వేల కోట్లు అంతకన్నా ఎక్కువ అప్పులుండి, వాటిలో 60 శాతానికి పైగా అప్పులు ఎన్పీఏలుగా మారిన పక్షంలో... అలాంటి ఖాతాల్ని ఈ దివాలా చట్టం కింద విచారించవచ్చని సూచించింది. కమిటీ సూచన మేరకు... ఆయా ఖాతాలపై దివాలా చట్టం కింద కేసులు పెట్టాల్సిందిగా మేం బ్యాంకులను కోరుతున్నాం’’ అని ఆర్బీఐ వివరించింది. లా ట్రిబ్యునల్‌లో ప్రాధాన్యం ఇలా బ్యాంకులు దివాలా కేసు పెట్టిన ఖాతాలపై విచారణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అధిక ప్రాధాన్యమిస్తుందని కూడా ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ 12 ఖాతాలూ కాకుండా మిగిలిన ఎన్పీఏలకు సంబంధించి ఆరు నెలల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళికను తయారు చేయాల్సిందిగా కూడా రిజర్వు బ్యాంకు అడ్వైజరీ కమిటీ సిఫారసు చేసింది. ‘‘ఒకవేళ ఆయా ఖాతాలకు సంబంధించి ఆరు నెలల్లోగా ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకకపోతే... ఆయా ఖాతాలపై కూడా దివాలా చట్టం కింద చర్యలు చేపడతాం’’ అని ఆర్బీఐ తెలియజేసింది. టాప్–500 ఖాతాల్ని పరిశీలించాకే... భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి, స్ట్రెస్డ్ అసెట్స్ ఖాతాలుగా బ్యాంకులు గుర్తించిన 500 ఖాతాలను అడ్వైజరీ కమిటీకి ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆర్బీఐ తెలిపింది. ‘‘ఆ స్ట్రెస్డ్ రుణాల్లో చాలావాటిని బ్యాంకులు ఇప్పటికే ఎన్పీఏలుగా కూడా ప్రకటించేశాయి. వాటన్నిటినీ చూశాకే అడ్వైజరీ కమిటీ తాజా సిఫారసు చేసింది’’ అని ఆర్బీఐ వివరించింది. నిజానికి ఈ 12 ఖాతాల పేర్లను ఆర్బీఐ గానీ, బ్యాంకులుగానీ వెల్లడించలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా భారీగా రుణాల్లో కూరుకుపోయి, చాలావరకూ రుణాలను ఇప్పటికే ఎగ్గొట్టి స్ట్రెస్డ్ ఖాతాలుగా మారిన టాప్–14 సంస్థల వివరాలు పై బాక్స్‌లో చూడవచ్చు. (విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ గ్రూప్‌పై ఇప్పటికే చర్యలు ఆరంభించిన నేపథ్యంలో దాన్ని ఈ జాబితాలో చేర్చలేదు) -
5,000 కోట్ల ఎన్పీఏల విక్రయం
2017–18 ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్ లక్ష్యమిది ♦ 150 మందితో నిరర్ధక ఆస్తుల నిర్వహణ బృందం ♦ ఎన్‌పీఏల్లో తెలుగు రాష్ట్రాలే టాప్; వ్యవసాయ, కార్పొరేట్ రుణాలే అధికం ♦ ఏపీ, తెలంగాణల్లో ఎన్పీఏల రికవరీ కోసం 20 మంది నియామకం ♦ కొన్నాళ్లు కార్పొరేట్ రుణాలకు బ్రేక్; రిటైల్, ఎస్ఎంఈలపై ఫోకస్ ♦ వచ్చే త్రైమాసికంలో ఈక్విటీ, బాండ్ల అమ్మకంతో రూ.8–9 వేల కోట్ల సమీకరణ ♦ ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోతుకూచి సీతారాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీగా ఎన్‌పీఏల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్... నికర నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ)S రికవరీపై దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ఎన్పీఏలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 150 మంది ఉద్యోగులతో కలిసి నిరర్ధక ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్ విభాగాల్లో ప్రతి ఎన్‌పీఏను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి బాధ్యత అని ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోతుకూచి సీతారాం చెప్పారు. 2017 మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ.44 వేల కోట్లు కాగా.. ఇందులో నికర ఎన్పీఏల విలువ రూ.28 వేల కోట్లు. ఐడీబీఐ బ్యాంక్ తెలంగాణ, ఏపీ సీజీఎం దాస్‌గుప్తాతో కలిసి గురువారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘78% ఎన్పీఏలు పెద్ద కార్పొరేట్ సంస్థలవే. ఈ రుణాల్లో అధికం ఇతర బ్యాంకుల కన్సార్షియం ద్వారా అందించాం. వాటి రికవరీ అంత సులభం కాదు. సాధారణ రికవరీ ప్రక్రియ ద్వారా దీన్ని పరిష్కరించలేం. ఈ వర్గం ఎన్పీఏ తగ్గింపు ప్రాథమికంగా ఖాతాల అప్‌గ్రేడ్ ద్వారానే అవుతుంది. ఇందుకు మరో ఏడాది సమయం పడుతుంది’’ అని ఆయన వివరించారు. త్వరలోనే ఫిన్‌టెక్ స్టార్టప్స్‌తో ఒప్పందం.. ‘‘ఇతర రంగాల మల్లే బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఉద్యోగుల ఎంపిక విధానం మారింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో 16 వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో అధికులు 33–35 మధ్య వయస్సు వాళ్లే. ఈ మధ్య కాలంలో పదవీ విరమణలుండవు కాబట్టి కొత్త ఉద్యోగుల ఎంపిక కూడా లేనట్టే. కానీ, డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ అనలిటిక్ట్స్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో నిపుణులైన ఉద్యోగుల అవసరముంది’’ అని సీతారాం తెలిపారు. డిజిటల్లో భాగంగా ఆర్థికS సేవల స్టార్టప్స్, ఎస్ఎంఈలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని, ఒకటిరెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకునే దిశగా చర్చలూ జరుగుతున్నాయని చెప్పారాయన. కార్పొరేట్ రుణాలకు బ్రేక్.. అధిక కార్పొరేట్ రుణాల్లో రిస్క్, ఒత్తిడి ఎక్కువగా ఉందని, అందుకే కొద్దికాలం ఈ విభాగంలో రుణాల మంజూరులో లిమిట్ పెట్టి, రిటైల్, ఎస్ఎంఈ విభాగాలపై దృష్టిపెట్టామని సీతారామ్ వివరించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం (2017–18)లో రూ.13,500 కోట్ల రిటైల్, రూ.6,500 కార్పొరేట్ రుణాలందించాం. మొత్తం రుణాల్లో రిటైల్ వాటా 43 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 3–4 శాతం మేర పెంచాలనేది లక్ష్యం. ఏప్రిల్‌లో కేంద్రం నుంచి రూ.1,900 కోట్ల నిధులను సమీకరించాం. మరో 3 నెలల్లో ఈక్విటీ, బాండ్ల విక్రయం ద్వారా సుమారు రూ.8–9 వేల కోట్లు సమీకరిస్తాం. త్వరలో అమల్లోకిరానున్న జీఎస్టీలో ఉత్తరాదికి చెందిన కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మినహా మిగిలినవన్నీ నమోదు చేశాం. సాఫ్ట్వేర్ పునరుద్ధరణ కోసం పలువురు వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. జూలై 1 నాటికి జీఎస్టీకి సిద్ధంగా ఉంటాం. అయితే పన్ను విధానం, చెల్లింపుల్లో కాసింత గందరగోళంగా ఉంది’’ అని చెప్పారు. ఏపీ, తెలంగాణల్లోనే ఎన్పీఏలెక్కువ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎన్పీఏల వాటా కాసింత ఎక్కువవని ఇందులోనూ వ్యవసాయ, కార్పొరేట్ విభాగంలోనే ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నాయని ఐడీబీఐ బ్యాంక్ తెలంగాణ, ఏపీ సీజీఎం బీ దాస్‌గుప్తా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్పీఏల రికవరీ కోసం ప్రత్యేకంగా 20 మందిని నియమించుకున్నామని.. రోజూ కరెంట్, సేవింగ్ అకౌంట్స్ (సీఏఎస్ఏ) నివేదికలను సమర్పించడం వీరి బాధ్యతని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కాసింత ఎక్కువగా కనిపించిందని చెప్పారు. ‘‘ఆ సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి నగదును తెప్పించి పరిస్థితిని సర్దుమణిపించాం. వచ్చే 2 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఐడీబీఐ ఏటీఎంలను తిరిగి ప్రారంభిస్తాం’’ అన్నారు. -
ఎస్4ఏ స్కీము నిబంధనలు సడలించండి
మొండిబాకీలపై ఆర్బీఐని కోరిన బ్యాంకులు ముంబై: మొండి బాకీల సత్వర పరిష్కారానికి ఉద్దేశించిన ఎస్4ఏ స్కీములో కొన్ని నిబంధనలు సడలించాలని రిజర్వు బ్యాంకును పలు బ్యాంకులు కోరాయి. ప్రమోటర్ల వ్యక్తిగత పూచీకత్తు వంటి నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలని అభ్యర్థించాయి. అలాగే రీపేమెంట్ షెడ్యూల్‌ను పొడిగించేందుకు, స్కీము కింద వడ్డీ రేటును తగ్గించేందుకు అనుమతించాలని కోరాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఆచరణీయ పథకం (ఎస్4ఏ) మార్గదర్శకాల్లో ఇలాంటి వెసులుబాటు లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ స్కీమును అమలు చేయదల్చుకున్న పక్షంలో బ్యాంకర్ల ఫోరం ప్రమోటర్ల నుంచి వ్యక్తిగత పూచీ తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్‌తో జరిగిన సమావేశంలో బ్యాంకర్లు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం జరిగిన సమావేశంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యాంకుల అధిపతులు పాల్గొన్నారు. ‘‘ఆయా సంస్థలపై ఒత్తిడి పెరగడానికి గల కారణాలు ప్రమోటర్ల పరిధిలో లేనివి, అలాంటప్పుడు వారి వ్యక్తిగత పూచీకత్తు డిమాండ్ చేయడం సాధ్యపడదు. ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీల విషయంలో అస్సలు కుదరదు. కాబట్టి ఈ నిబంధనను తొలగించాలి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మొండిబకాయిలు.. బాబోయ్!
⇔ మొత్తం రుణాల్లో 15 శాతానికి చేరే అవకాశం ⇔ అత్యధికంగా ఎన్పీఏలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ⇔ పెరగనున్న పీఎస్‌బీల మూలధన అవసరాలు ⇔ బ్యాంకింగ్ రంగంపై 2018 నాటికి ఎస్అండ్పీ అంచనా న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం మొత్తం రుణాల్లో 15 శాతా నికి చేరనున్నాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణమైన మూలధన అవసరాలు మాత్రం 2019 దాకా పెరుగుతూనే ఉంటాయి. భారతీయ బ్యాంకుల కష్టాలు, చికిత్స మీద ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 మార్చి ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొత్తం నిరర్ధక ఆస్తుల పరిమాణం 13–15 శాతం దాకా పెరగొచ్చని, ఈ రుణాల్లో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే ఉండనుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ చాబ్రియా తెలిపారు. తాము రేటింగ్ ఇస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ఏటా నిరర్ధక రుణాల పరిమాణం పెరుగుతుండటం.. అధిక ప్రొవిజనింగ్‌కు, లాభాలు తగ్గడానికి కారణమవుతోందని వివరించారు. దీంతో అనూహ్య నష్టాలను భరించేం దుకు అందుబాటులో ఉన్న మూలధనం చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. రాబోయే 12 నెలల్లో బ్యాంకుల రుణ పరపతి మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని నివేదికలో ఎస్అండ్పీ తెలిపింది. దశాబ్ద కనిష్టానికి రుణాల వృద్ధి.. రుణాల మంజూరులో వృద్ధి ప్రస్తుతం దశాబ్ద కనిష్ట స్థాయిలో ఉన్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. బాసెల్ త్రీ నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకోవాలంటే బ్యాంకులు ఇతరత్రా వనరులపై ఆధారపడాల్సి రావొచ్చని లేదా ప్రాధాన్యేతర ఆస్తులను విక్రయించుకోవాల్సి ఉంటుందని దీపాలీ చెప్పారు. ఏదైనా సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికి ఆస్కారం లేకుండా బ్యాంకుల వద్ద మూలధనం తక్కువ స్థాయిలో ఉందని, లాభసాటిగా లేని ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాల్లో కోత విధించుకోవాల్సి కూడా రావొచ్చని దీపాలీ చెప్పారు. నిబంధనల ప్రకారం మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం 2019 దాకా పెరుగుతూనే ఉండొచ్చని, లాభదాయకత మాత్రం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు. 2016–19 మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రూ. 70,000 కోట్లు కేంద్రం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. అయితే, పీఎస్‌బీల అవసరాలు పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు సరిపోవని ఎస్అండ్పీ తెలిపింది. మూలధనం కొరత, అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కన్సాలిడేషన్‌కు తెరతీయొచ్చని పేర్కొంది. ప్రభుత్వం మూలధనం సమకూర్చడం, అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడం భారతీయ పీఎస్‌బీల రేటింగ్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషించగలవని ఎస్అండ్పీ తెలిపింది. -
ఎన్పీఏలపై జూన్ 12న జైట్లీ సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే నెల 12వ తేదీన బ్యాంకింగ్‌పై ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొంటారు. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య, సవాళ్ల పరిష్కారంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. ఎన్పీఏ అంశంమీదే కాకుండా ఒత్తిడిలో ఉన్న నిరర్థక ఆస్తుల విషయంపైనా సమావేశం సమీక్ష జరుపుతుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. విద్యుత్, స్టీల్, రోడ్ ఇన్ప్రా, జౌళి వంటి రంగాల బలహీనతల నేపథ్యంలో ఎన్పీఏల విలువ రూ. 6 లక్షల కోట్లను దాటిన సంగతి తెలిసిందే. ఇంద్రధనుష్ ప్రణాళికసహా మార్కెట్ నుంచి బ్యాంకింగ్ నిధులు సమీకరించుకునే అంశంపైనా సమావేశం దృష్టి పెడుతుంది. విద్య, గృహ రంగాల్లో రుణ వృద్ధి, ప్రధాన్‌మంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి వివిధ పథకాల పనితీరు కూడా చర్చల్లో చోటుచేసుకోనుంది. -
మళ్లీ నష్టాల్లోకి బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: వరుసగా రెండు క్వార్టర్లలో లాభాల్ని కనపర్చి, టర్న్ ఎరౌండ్ అయిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,045 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో కనపర్చిన రూ. 3,587 కోట్ల నికరనష్టంతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గినప్పటికీ, అంతక్రితం వరుసగా రెండు త్రైమాసికాల్లో (2016 సెప్టెంబర్, డిసెంబర్ క్వార్టర్లు) ఈ బ్యాంకు లాభాల్ని ఆర్జించగలిగింది. కానీ 2017 మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు రూ. 7,000 కోట్ల మేర పెరగ్గా, రూ. 3,983 కోట్ల బకాయిల్ని బ్యాంకు రైటాఫ్చేసింది. 2016 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మొండి బకాయిలు మూడు రెట్లు పెరిగాయి. దాంతో మార్చి క్వార్టర్లో నష్టాలు తప్పలేదు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి లాభాలేవీ లేనందున, సోమవారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఎటువంటి డివిడెండునూ సిఫార్సుచేయలేదు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ. 1,558 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఈ నష్టం రూ. 6,089 కోట్లు. స్థూల ఎన్పీఏలు 13.22 శాతం... మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఏల శాతం 13.07 నుంచి 13.22కు పెరిగింది. నికర ఎన్పీఏలు మాత్రం 2016 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 7.79 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 8.8 శాతం పెరిగి రూ. 3,187 కోట్ల నుంచి రూ. 3,469 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఇతర ఆదాయం రూ. 884 కోట్ల నుంచి భారీగా రూ. 1,754 కోట్లకు పెరిగింది. ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు జాయింట్ వెంచర్ అయిన స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 18 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 495 కోట్ల లాభం సంపాదించడం, సిబిల్లో వాటాను రూ. 188 కోట్లకు విక్రయించడం వంటి అంశాల కారణంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు నష్టాల్ని పరిమితం చేసుకోగలిగింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు 10 శాతంపైగా పతనమై రూ. 158 వద్ద ముగిసింది. 2015 ఆగస్టు తర్వాత ఈ షేరు ఒకే రోజులో ఇంతగా క్షీణించడం ఇదే ప్రధమం. -
ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ నష్టం
రెట్టింపైన మొండిబకాయిలు... ముంబై: మొండి బకాయిలకు భారీ కేటాయింపులు చేయాల్సిరావడంతో ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో భారీనష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,735 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించగా, తాజా త్రైమాసికంలో ఈ నష్టం రూ. 3,199 కోట్లకు పెరిగిపోయింది.బ్యాంకు మొత్తం ఆదాయం 2.74 శాతం క్షీణతతో రూ. 8,274 కోట్ల నుంచి రూ. 8,048 కోట్లకు తగ్గింది. స్థూల, నికర మొండిబకాయిలు రెట్టింపయ్యాయి. స్థూల ఎన్పీఏలు 10.98 శాతం నుంచి 21.25 శాతానికి పెరగ్గా, నికర ఎన్పీఏలు 6.78 శాతం నుంచి 13.21 శాతానికి చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపుల్ని బ్యాంకు రూ. 3,331 కోట్ల నుంచి రూ. 4,590 కోట్లకు పెంచింది. పూర్తి సంవత్సరంలో బ్యాంకు నికరనష్టం రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,158 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 31,453 కోట్ల నుంచి రూ. 31,758 కోట్లకు చేరింది. ఫలితాల కారణంగా ఈ షేరు గురువారం 8 శాతం పతనమై రూ. 69 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా టర్న్ ఎరౌండ్
ఎన్పీఏలకు కేటాయింపుల తగ్గుదల ప్రభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో టర్న్ ఎరౌండ్ అయ్యింది. గతేడాది ఇదేకాలంలో నికరనష్టాన్ని ప్రకటించిన బ్యాంకు తాజా త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరలాభాన్ని వెల్లడించింది. మొండి బాకాయిలకు కేటాయింపులు భారీగా తగ్గడంతో బ్యాంకు నికరలాభాన్ని సాధించగలిగింది. 2016 మార్చి క్వార్టర్లో బ్యాంకు రూ. 3,230 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 12,789 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలకు కేటాయింపులు రూ. 6,867 కోట్ల నుంచి రూ. 2,623 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. స్థూల ఎన్పీఏలు మాత్రం 9.99 శాతం నుంచి 10.46 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 5.06 శాతం నుంచి 4,72 శాతానికి తగ్గాయి. బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 1.20 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 2 శాతం క్షీణతతో రూ. 187 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి. -
ప్రైవేట్ బ్యాంకులూ.. ‘మొండి’కొండలే!
లెక్కల్లో చూపని ఎన్పీఏలు ఎక్కువే ► ఆర్బీఐ మదింపు నిబంధనలతో బయటపడుతున్న నిజాలు ► యస్ బ్యాంక్‌లో రూ. 4,930 కోట్లు, ఐసీఐసీఐలో 7 శాతం, యాక్సిస్‌లో 4.5 శాతం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓవైపు మొండి బాకీల నష్టాలతో కుదేలవుతుంటే .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇప్పటిదాకా ప్రకటిస్తూ వచ్చిన ఆకర్షణీయ ఫలితాల్లో వాస్తవమెంత? వాటిల్లో మొండిబకాయిలు నిజంగానే తక్కువగానే ఉన్నాయా? ఈ ప్రశ్నలకు కాదు అనే సమాధానం వస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఎన్పీఏలు భారీగానే ఉన్నాయని.. కాకపోతే అవి వాటిని సగం పైగా తక్కువ చేసి చూపిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. 2015–16లో యస్ బ్యాంక్ సొంత లెక్కల ప్రకారం స్థూల ఎన్పీఏల శాతం 0.76 శాతంగానే ఉండగా.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇవి 5 శాతం మేర ఉన్నాయి. యస్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల ఎన్పీఏలు చూపించగా .. ఆర్బీఐ ప్రకారం ఇవి రూ. 4,930 కోట్లుగా ఉన్నాయి. ఇక మరో కన్సల్టెన్సీ గణాంకాల ప్రకారం యాక్సిస్ బ్యాంకు ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 4.5 శాతం పైగా ఉన్నాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ ఇవి 1.78 శాతం మాత్రమే ఉంటాయని చూపించింది. అటు ఐసీఐసీఐ కూడా మొండి బకాయిలు 5.85 శాతంగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ.. వాస్తవానికి ఇవి 7 శాతం మేర ఉంటాయి. ఈ రెండు బ్యాంకులు ఇంకా తమ వార్షిక నివేదికలు ప్రచురించాల్సి ఉంది. లెక్కలు చెప్పక తప్పదు.. ఆర్బీఐ గతేడాది అసెట్ క్వాలిటీ సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ మొండి బకాయిల్లో చాలా భాగాన్ని దాచి ఉంచుతున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిబంధనల ప్రకారం ఆర్బీఐ మదించిన గణాంకాలు, తమ సొంత లెక్కల మధ్య వ్యత్యాసం 15 శాతం పైగా ఉన్న పక్షంలో రిజర్వ్ బ్యాంక్ గణాంకాలను బ్యాంకులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని ప్రైవేట్ బ్యాంకుల్లోని ఎన్పీఏల వాస్తవ లెక్కలు ప్రజల ముందుకు రావొచ్చని భావిస్తున్నారు. బ్యాంకుల సొంత లెక్కలకు, ఆర్బీఐ గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్న నేపథ్యంలో 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆడిట్ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా తగ్గాయి: యస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న దిద్దుబాటు చర్యలతో మొండిబకాయీల్లో చాలా భాగం తగ్గాయని యస్ బ్యాంక్ పేర్కొంది. కొన్ని ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించామని, కొన్ని ఖాతాలు మెరుగుపడ్డాయని.. ఫలితంగా మొత్తం రావాల్సిన స్థూల ఎన్పీఏలు 2017 మార్చి 31నాటికి రూ. 1,039.9 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. ఇందులో ఒకే ఖాతాదారు నుంచి రూ. 911.5 కోట్లు రావాల్సి ఉండగా.. సమీప భవిష్యత్‌లో రాబట్టుకోగలమని తెలిపింది. ఈ ఖాతా కోసం ప్రత్యేకంగా రూ. 227.9 కోట్ల ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ మొండి బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించాల్సిన పరిస్థితి ఉండదని తెలిపింది. ఎన్పీఏలపై ఆర్బీఐ, ఆర్థిక శాఖ సమావేశం.. మొండిబకాయిల సమస్యల పరిష్కారం అంశంపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖలో సీనియర్ అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్పీఏల విషయంలో కఠినంగా వ్యవహరించేలా రిజర్వ్ బ్యాంక్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిలకడగానే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు: ఆర్బీఐ నివేదిక 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్య లోటు 3.4 శాతానికి పెరిగినప్పటికీ.. మొత్తం మీద చూస్తే మాత్రం ఆర్థిక స్థితిగతులు దీర్ఘకాలంలో నిలదొక్కుకునేలాగే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ)విధానం వాటికి సానుకూలంగా ఉండగలదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై వార్షిక నివేదికలో ఆర్బీఐ ఈ అంశాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల ప్రకారం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రాష్ట్రాల స్థూల ద్రవ్య లోటు (జీఎస్ఎఫ్డీ) .. బడ్జెట్లో ప్రతిపాదించిన 3 శాతాన్ని దాటేసి 3.4 శాతానికి పెరిగింది. విద్యుత్ డిస్కమ్‌లకు తోడ్పాటునిచ్చేందుకు ఉద్దేశించిన ఉదయ్ బాండ్ల జారీనే దీనికి ప్రధాన కారణమని.. దాన్ని మినహాయిస్తే.. జీఎస్ఎఫ్డీ 2.7 శాతంగానే ఉండొచ్చని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. పాతిక పెద్ద రాష్ట్రాల గణాంకాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నివేదికను రూపొందించింది. 12 బ్యాంకులపై ఆర్బీఐ చర్యలకు రంగం సిద్ధం? మొండి బకాయిల పరిష్కారం దిశగా సవరించిన నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) అస్త్రాన్ని ప్రయోగించనున్న బ్యాంకులు సుమారు డజను దాకా బ్యాంకులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులే కాగా.. పాత తరం ప్రైవేట్ బ్యాంక్ ధన్‌లక్ష్మీ బ్యాంక్ కూడా ఉండనుంది. అసెట్ క్వాలిటీ నిబంధనల ప్రకారం స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) నికర రుణాల్లో 6 శాతాన్ని మించితే చర్యలు తప్పవు. దీన్ని బట్టి చూస్తే 11 బ్యాంకులు ఇప్పటికే ఈ పరిమితిని దాటేశాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అత్యధికంగా 14.32 శాతం మేర నికర ఎన్పీఏలు ప్రకటించింది. 10.66 శాతంతో దేనా బ్యాంక్, 10.62 శాతంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సుమారు 9.61 శాతం నికర ఎన్పీఏలు ఉన్న ఐడీబీఐ బ్యాంకుపై ఆర్బీఐ ఇప్పటికే పీసీఏ చర్యలు ప్రారంభించింది. పీసీఏతో ఆంక్షలు.. పీసీఏ చర్యలు గానీ అమల్లోకి వస్తే సదరు బ్యాంకులు చెల్లించే డివిడెండ్లు, లాభాల పంపిణీ మొదలైన వాటిపై ఆంక్షలు విధిస్తారు. బ్యాంకులు తమ శాఖల నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఉండదు. అధిక స్థాయిలో ప్రొవిజనింగ్ జరపాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ వేతనాలు, డైరెక్టర్ల ఫీజులపై పరిమితులు అమల్లోకి వస్తాయి. -
ఇలాంటివి చాలా చూశాం!
‘ఎన్పీఏ’ తాజా నిబంధనలపై మూడీస్ వ్యాఖ్య వసూళ్లకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని వెల్లడి ముంబై: మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఉద్దేశించి తాజాగా ప్రతిపాదించిన చర్యల్లో కొత్తదనమేమీ లేదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వ్యాఖ్యానించింది. ఇవన్నీ కూడా గతంలో చూసినవేనని పేర్కొంది. మూలధనాన్ని సమీకరించుకోవడంలో బ్యాంకులకు ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదని... ఫలితంగా మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తుందని మూడీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన మూలధనం లేక వాస్తవ స్థాయిలో నికర నిరర్ధక ఆస్తులను (ఎన్పీఏ) రైటాఫ్ చేయలేక సతమతమవుతున్నాయి. కొత్త నిబంధనలు ఈ అంశంపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్పీఏల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుంది‘ అని వివరించింది. అయితే, నిరర్ధక ఆస్తుల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ చర్యలు దోహదపడగలవని, రుణపరపతి పరంగా సానుకూలమైనవని పేర్కొంది. మొండి బాకీలను బ్యాంకులు తమంతట తాము రాబట్టుకోలేని పక్షంలో తగు చర్యల గురించి ఆదేశించేలా రిజర్వ్ బ్యాంక్‌కు అధికారాలు లభించేలా బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టాలను సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడీస్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు రూ. 6 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 70 శాతం పైగా... అంటే రూ.4.2 లక్షల కోట్లవరకూ 40–50 పెద్ద ఖాతాల వద్దే ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన చర్యల ప్రకారం.. బ్యాంకులు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిల్ లించ్ పేర్కొంది. -
మొండిబాకీలపై ఆర్బీఐ వాచ్‌లిస్ట్‌లో ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు మొదలుపెట్టింది. ఎన్పీఏలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించింది. దీంతో కొత్త రుణాలు మంజూరు చేయడం, డివిడెండ్ పంపిణీ తదితర కార్యకలాపాలపై పరిమితులు అమల్లోకి రానున్నాయి. తమ సంస్థలో అధిక ఎన్పీఏలు, ఆస్తులపై రాబడులు ప్రతికూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్బీఐ మే 5న సత్వర దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది. అయితే, వీటివల్ల బ్యాంకు పనితీరుపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని, సంస్థ కార్యకలాపాలను మెరుగుపర్చుకునేందుకు ఇవి దోహదపడగలవని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 80 శాతం ఎగసి రూ. 35,245 కోట్లకు ఎగియగా, నష్టాలు రూ. 2,255 కోట్ల మేర నమోదయ్యాయి. రుణ రేట్లు పావుశాతం కోత ఐడీబీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను మంగళవారం పావుశాతం వరకూ తగ్గించింది. 2016 ఏప్రిల్ నుంచీ తమ తాజా డిపాజిట్లు– రుణాలు– మార్జిన్లు ఆధారంగా దాదాపు నెలకోసారి బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను సవరిస్తున్నాయి. -
ఇక ప్రభుత్వ బ్యాంకుల ఎఫ్పీఓల జోరు!
► మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వ చర్యల ఆసరా... ► మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వేగవంతం... ► ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడీస్తున్న మొండి బకాయిల ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలను ప్రకటించడంతో... ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నిధుల సమీకరణ ప్రయత్నాలు ఇక జోరందుకోనున్నాయి. ఎన్పీఏలకు అడ్డుకట్టకోసం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి మరిన్ని అధికారాలు కల్పించేలా బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘కేంద్రం ఎన్పీఏలపై తీసుకుంటున్న చర్యలు.. పీఎస్‌బీల బ్యాలెన్స్షీట్లు మెరుగుపడేందుకు దోహదం చేయనున్నాయి. దీనివల్ల షేరు విలువలు కూడా పుంజుకోవడానికి వీలవుతుంది. దీంతో మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వేగవంతం కానుంది’ అని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ‘బాసెల్’ గడువు... బాసెల్–3 అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మన బ్యాంకులు తగినంత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాణాలు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ లోగా భారతీయ బ్యాంకుల క్యాపిటల్అడిక్వషీ రేషియో(సీఏఆర్) బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణంగా పెంచుకోవాలి. దీనికోసం పీఎస్బీలకు కేంద్రం ఇప్పటికే ఇంద్రధనుష్ పేరుతో ఒక ప్రణాళికను ప్రకటించింది. దీనిప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎస్బీలకు రూ.70 వేల కోట్ల మూలధనం అందుతుంది. ఇప్పటికే ఇందులో రూ.50 వేల కోట్లను పీఎస్బీలకు సమకూర్చింది. మిగతా మొత్తాన్ని కూడా 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇవ్వనుంది. కాగా, బాసెల్–3 అవసరాల నిమిత్తం మరో రూ.1.1 లక్షల కోట్లను ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) సహా ఇతరత్రా మార్గాల్లో మార్కెట్ నుంచి పీఎస్‌బీలు సమీకరించాల్సి ఉంటుందని ‘ఇంద్రధనుష్’లో నిర్ధేశించారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం... ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సుమారు అరడజను బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వంటివి ఈ ఏడాది ఎఫ్‌పీఓలను జారీచేయొచ్చని ఆర్థిక శాఖ అధికారి చెప్పారు. కాగా, ఈ ఏడాది ఎఫ్‌పీఓ సహా ఇతరత్రా మార్గాల్లో రూ.15,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఎస్బీఐ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర కూడా వేసింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం ► ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు నియంత్రణ ► ఎన్పీఏల పరిష్కారంలో కీలక అడుగు ► ఎగవేతదారులపై విస్తృత చర్యలు చేపట్టే అధికారం న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్య పరిష్కారం దిశగా ఆర్బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఎన్పీఏల వసూలుకు సంబంధించి బ్యాంకులను ఆర్బీఐ ఇక నేరుగా ఆదేశించగలదు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగాన్ని భారీగా ప్రక్షాళన చేసేందుకు తాజా ఆదేశాలు దోహదపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఆర్డినెన్స్‌తో ‘‘రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్బీఐ ఆదేశించగలదు’’ అని శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు అసాధారణంగా రూ.6 లక్షల కోట్లకుపైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను చేపట్టడం గమనార్హం. మొత్తం దేశీయ బ్యాంకింగ్ రంగంలో 2016 డిసెంబర్ నాటికి ఎన్పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్పీఏలుగా మారాయి. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్పీఏలు అసాధారణ స్థాయికి చేరాయని, సమస్య పరిష్కరానికి సత్వర చర్యలు అవసరమని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లో కొత్తగా సెక్షన్ 35ఏఏ, 35ఏబీలను చోటు కల్పించనుంది. చట్ట సవరణ ఉద్దేశాలు ♦ భారీ రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు తాజా రుణాలు ఇక లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు. ♦ రంగాల వారీగా పర్యవేక్షణ కమిటీలను నియమించే అధికారం ఆర్బీఐకి ఇచ్చారు. ఒత్తిడిలో ఉన్న రుణాల వసూలుకు పరిష్కారాలు సూచించేందుకు కమిటీలు లేదా అధికారులను కూడా నియమించగలదు. ♦ మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాం కర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి. ♦ ఒత్తిడిలో ఉన్న రుణాల విషయమై పరిష్కారానికి గాను ఆర్బీఐ సమయానుకూలంగా మార్గదర్శకాలు జారీ చేయగలదు. దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించగలదు. ♦ మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది. ♦ హెయిర్ కట్ (ఇచ్చిన రుణంలో బ్యాంకు నష్టపోయేందుకు అంగీకరించే మొత్తం) విషయంలో కేసును బట్టి పరిష్కారం సూచించే అధికారం ఆర్బీఐకి లభించింది. అవసరమైతే మార్గదర్శకాల్లోనూ వెసులుబాటు ఇవ్వగలదు. ♦ కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు. ♦ తాజా చట్టానికి అనుగుణంగా రెండు వారాల్లో ఆర్బీఐ ఎన్పీఏలకు సంబంధించి తగిన చర్యల్ని నోటిఫై చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ తొలుత 50 భారీ రుణ ఎగవేత కేసులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పరిష్కరించడంపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ప్రస్తుత స్థితి ఇక ఎంత మాత్రం కొనసాగరాదు: జైట్లీ బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి చేసిన సవరణలతో బ్యాంకులు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని, దాంతో ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో త్వరగా పరిష్కారాలు లభించగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ‘‘ఈ చట్టం యొక్క లక్ష్యం ప్రస్తుతమున్న యాథాతథ స్థితి (ఎన్పీఏలకు సంబంధించి) కొనసాగకూడదన్నదే. స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అచేతనం చేయడమన్నది ఆర్థిక రంగానికి హానికరం. కనుక దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎన్పీఏలుగా మారిన రుణాలను గుర్తించి సత్వర పరిష్కారాలను కనుగొనేందుకు ఆర్బీఐకి అధికారాలు కల్పించినట్టు జైట్లీ చెప్పారు. ఒత్తిడిలో ఉన్న రుణాల జాబితా ఇప్పటికే ఆర్బీఐ ముందుకు చేరింద ని, దాన్ని పరిశీలించి చర్యలు చేపడుతుందన్నారు. ఆస్తులను విక్రయించడం, లాభసాటిగా లేని బ్యాంకు శాఖలను మూసివేయడం, వ్యాపార పునర్వవ్యస్థీకరణ చర్యలు చేపట్టడం వంటివి కూడా పరిష్కారాల్లో భాగంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంచి చర్యే: బ్యాంకర్లు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు... దివాళా బాంక్రప్టసీ కోడ్, సర్ఫేసీ, రుణ రికవరీ ట్రిబ్యునల్ చట్టాలకు సవరణలు ఇవన్నీ కూడా ఎన్‌పీల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆర్బీఐకి అధికారాలు ఇవ్వడం సమస్యకు ప్రభావవంతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. బ్యాంకులు సత్వరమే ఈ నిబంధనల ఆసరాతో ప్రయోజనాలను అందుకోవాలి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ పూర్తి పరిష్కారానికి సమయం ఎన్పీఏలకు పరిష్కారానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టం పెద్ద అడుగు. పరిష్కార ప్రక్రియకు వెంటనే మొదలయ్యేలా చేస్తుంది. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి సమయం తీసుకుంటుంది. అయితే, పరిష్కారం కోసం ఓ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మార్గంలో సాగిపోతే పురోగతి ఉంటుంది. – చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆర్బీఐ మరింత జోక్యం ఎందుకు: రేటింగ్ ఏజెన్సీలు ఎన్పీఏల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో క్షేత్ర స్థాయిలో ఫలితం చూపించడానికి సమయం పడుతుందని రేటింగ్ ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. వాణిజ్య బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో మరింత సునిశిత పరిశీలనకు ఆర్బీఐను అనుమతించడాన్ని ప్రశ్నించాయి. ఎన్పీఏల పరిష్కారం విషయంలో ఇప్పటి వరకూ నెలకొన్న ఉదాసీనతను తాజా ఆర్డినెన్స్ పరిష్కరించాల్సి ఉందని ఇండియా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. వాణిజ్య రుణాల జారీ విషయంలో నియంత్రణ సంస్థ జోక్యానికి అవకాశం కల్పించడాన్ని వాటి సమర్థ నిర్వహణ విషయంలో ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందని తెలిపింది. క్రిసిల్ మాత్రం సానుకూలమని వ్యాఖ్యానించింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
-
గుదిబండగా మారిన ఎన్పీఏలు
► భూసేకరణ, ఇతర ఇబ్బందులతో ఆగిన ప్రాజెక్టులు ► ముడి పదార్థాల సరఫరా సమస్యలు ► రుణాలు చెల్లించలేని పరిస్థితికి కార్పొరేట్ సంస్థలు ► దీంతో పెరిగిపోయిన ఎన్పీఏలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభానికి గురి చేసిన వసూలు కాని మొండి బకాయిల (ఎన్పీఏలు/నిరర్థక ఆస్తులు) సమస్యకు చికిత్స చేసేందుకు ఎట్టకేలకు కేంద్రం నడుం బిగించింది. ఫలితమే బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించడం. దీనికి మార్కెట్లు కూడా చాలా సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్ షేర్లు గురువారం లాభాల్లో ముగియడమే ఇందుకు నిదర్శనం. నిజానికి ఎన్పీఏల సమస్య ఈ స్థాయికి చేరడం విధానాల్లో లోపంగానే కనిపిస్తోంది. కొంచెంగా మొదలై... గత ఐదేళ్లలోనే ఎన్పీఏల పెరుగుదల భారీగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2012 మార్చి నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలు రూ.1.3 లక్షల కోట్లు. 2016 సెప్టెంబర్ నాటికి అవి రూ.6.7 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. నిరర్థక ఆస్తులన్నింటినీ గుర్తించి వాటికి కేటాయింపులు చేయడం ద్వారా 2017 మార్చి నాటికి తమ ఖాతా పుస్తకాలను ప్రక్షాళన చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన హయాంలో నిర్దేశించారు. 2015 సెప్టెంబర్ నాటికి రూ.3.4 లక్షల కోట్లుగా ఉన్న స్థూల ఎన్పీఏలు ఏడాదిలోనే 2016 సెప్టెంబర్ నాటికి రెట్టింపు కావడం గమనార్హం. విధానపరమైన సమస్యలు ఎన్పీఏలకు ఓ కారణంగానూ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నో భారీ ప్రాజెక్టులు భూసేకరణ పరమైన అడ్డంకుల కారణంగా నిలిచిపోయాయి. దీనికితోడు ముడి పదార్థాల సరఫరా పరంగానూ ఇబ్బందులు తలెత్తడంతో ఆయా ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్న సంస్థలు ఇక్కట్ల పాలయ్యాయి. ఇక ఆర్థిక సంక్షోభం దరిమిలా క్షీణించిన డిమాండ్ తిరిగి పుంజుకోకపోవడంతో చాలా రంగాల్లో మిగులు ఉత్పత్తికి దారితీసింది. దీంతో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం పడకేసింది. ఇక బ్యాంకులు సైతం కార్పొరేట్ సంస్థలకు రుణాలిచ్చే విషయంలో సరైన పరిశీలనలు చేపట్టకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గుడ్డిగా వ్యవహరించడం కూడా సమస్యను తీవ్రతరం చేసింది. రుణాలు తీర్చే సామర్థ్యం తగ్గుదల ఆర్బీఐ పలు పథకాలను ప్రకటించినప్పటికీ ఎన్పీఏల సమస్యకి పరిష్కారం లభించలేదు. మూలంలోనే సమస్య ఉండడంతో మొండి బకాయిలు కట్టలు తెంచుకున్నాయి. దేశీయ సంస్థల రుణ చెల్లింపుల సామర్థ్యం సైతం దెబ్బతిన్నది. ముఖ్యంగా విద్యుత్తు, స్టీల్ రంగాల్లోని ప్రముఖ కంపెనీలకూ ఈ పరిస్థితి ఎదురైంది. ఆర్బీఐ గత డిసెంబర్లో విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం భారీ రుణాలు తీసుకున్న సంస్థల వాటా బ్యాంకుల మొత్తం రుణాల్లో 56 శాతంగా ఉండగా... మొత్తం ఎన్పీల్లో ఈ సంస్థల వాటా 88 శాతం కావడం గమనించాల్సిన అంశం. 40–50 పెద్ద సంస్థలపై దృష్టి సారిస్తే చాలు ఎన్పీఏల సమస్య పరిష్కారమైపోతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇటీవలే పేర్కొన్నారు. బ్యాంకులకు కష్టాలు పెరుగుతున్న ఎన్పీఏలకు బ్యాంకులు తమ లాభాల్లోంచి కేటాయింపులు చేయాల్సి రావడం వాటికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్పీఏలకు కేటాయింపుల కారణంగా గత ఆరు నెలలుగా అవి నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇవి సమీప కాలంలోనూ పరిష్కారమయ్యేలా లేవు. ఎందుకంటే ఒత్తిడిని ఎదుర్కొంటున్న (సకాలంలో తీర్చలేని) మంచి రుణాలకు సైతం బ్యాంకులు కేటాయింపులు చేయాలని ఆర్బీఐ ఇటీవలే సూచించింది. ఈ విధమైన సమస్యలు 2019 నాటికి బాసెల్–3 మూలధన అవసరాలను చేరుకునే విషయంలో బ్యాంకులకు అవరోధంగా నిలుస్తున్నాయి. -
ప్రభుత్వ సంస్థలకు ‘మొండి’ ప్రాజెక్టులు
► వ్యూహరచనలో కేంద్రం ► ఎన్పీఏల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ)అప్పగించే కీలక వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో బుధవారం బ్యాంకింగ్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపిన కేంద్రం, ఇదే క్రమంలో మరింత ముందుకు వెళ్లడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌యూలకు ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడానికి తగిన నిబంధనల సవరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం చేస్తుంది. ప్రధాని కీలక సమీక్ష సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గత వారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఒక నిర్ధిష్ట రంగం ప్రాజెక్టులను సంబంధిత మంత్రిత్వశాఖకు అప్పగించే వ్యూహంపై కేంద్రం ప్రత్యేకించి దృష్టి పెట్టింది. వివిధ రంగాలకు సంబంధించి భారీ ఎన్పీఏలను గుర్తించాలని, ఆయా రంగాల వివరాలను సంబంధిత మంత్రిత్వశాఖలకు తెలియజేయాలని ఇప్పటికే బ్యాంకింగ్‌కు కూడా సంకేతాలు అందాయి. అలాగే ఆయా అంశాలకు సంబంధించి వ్యూహాలను రూపొందించే పనిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిజీగా ఉన్నాయి. పరస్పర ప్రయోజనం లక్ష్యం... తక్కువ స్థాయి ధర వద్ద... ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టుల కొనుగోలు ప్రభుత్వ రంగ సంస్థలకు లాభదాయక అంశమయితే, ఎన్పీఏల భారం తగ్గడం బ్యాంకులకు సానుకూల అంశమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ పరస్పర ప్రయోజన లక్ష్యంగా సమస్య ఎన్పీఏల పరిష్కార ప్రణాళికలు రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్పీఏలు 2015 మార్చిలో రూ.2.67 లక్షల కోట్లు ఉంటే,, 2016 మార్చి నాటికి ఈ మొత్తం రూ.5.02 లక్షలకోట్లకు పెరగడంతో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్పీఏల పరిష్కారం దిశలో ఆర్బీఐకి కీలక అధికారాలను అప్పగించే నిర్ణయాలను బుధవారం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ప్రత్యేకించి బ్యాంకింగ్ చట్ట సవరణలు ఎన్పీఏల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని ఫైనాన్స్ కార్యదర్శి అశోక్ లవాసా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు. -
యాక్సిస్‌కు ఎన్పీఏల సెగ!
► క్యూ4 లాభం 43% డౌన్; 1,225 కోట్లు ► నికర మొండి బకాయిలు 2.11 శాతం ► పూర్తి ఏడాదికి లాభం రూ.3,953 కోట్లు న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకుకు మొండిబకాయిల (ఎన్పీఏ) సెగ గట్టిగా తగిలింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో లాభం 43 శాతం తరిగిపోయింది. ఈ కాలంలో బ్యాంకు రూ.1,225 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.2,154 కోట్లు కావడం గమనార్హం. వసూలు కాని మొండిబకాయిలకు నిధుల కేటాయింపులు చేయడమే లాభాలు తరిగిపోవడానికి కారణమని బ్యాంకు తెలియజేసింది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.13,593 కోట్లు. స్థూల ఎన్పీఏలు అంతకుముందు ఇదే కాలంలో ఉన్న 1.67 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగిపోయాయి. నికర ఎన్పీఏలు సైతం 0.70 శాతం నుంచి 2.11 శాతానికి చేరాయి. దీంతో ఎన్పీఏల కోసం ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ.2,581 కోట్లను కేటాయించి పక్కన పెట్టాల్సి వచ్చింది. 2015–16 మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు రూ.1,168 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికం. అయితే, 2016 డిసెంబర్ త్రైమాసికంలో కేటాయింపులు రూ.3,795 కోట్ల కంటే కొంచెం తగ్గాయి . స్థూల ఎన్పీఏలకు మార్చి త్రైమాసికంలో నికరంగా రూ.4,811 కోట్లు జతయ్యాయి. ఇదే సమయంలో వసూలైన బకాయిలు రూ.2,804 కోట్లుగానే ఉన్నాయి. దీంతో రూ.1,194 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు బ్యాంకు తెలిపింది. ఇక 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్జించిన లాభం రూ.3,953 కోట్లుగా ఉంది. 2015–16లో వచ్చిన లాభం రూ.8,223 కోట్లతో పోలిస్తే 52.65 శాతం తరిగిపోయింది. ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ.50,359 కోట్ల నుంచి రూ.56,233 కోట్లకు వృద్ధి చెందింది. కంపెనీకి ఇన్నాళ్లూ దన్నుగా నిలిచిన కార్పొరేట్ రుణాల విభాగం ఫ్లాట్‌గా కొనసాగగా, రిటైల్ రుణ విభాగం మాత్రం 21 శాతం వృద్ధితో బ్యాంకుకు కీలకంగా నిలిచింది. ఈ దృష్ట్యా భవిష్యత్తులో రిటైల్ రుణాలపై మరింత దృష్టి సారించనున్నట్టు బ్యాంకు తెలిపింది. ఇంకా తమ ముందు సవాళ్లున్నట్టు బ్యాంకు సీఎఫ్‌వో జైరామ్ శ్రీధరన్ పేర్కొన్నారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుపై రూ.5 (250శాతం) డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంకు షేరు ధర బుధవారం అర శాతం పెరిగి రూ.517 వద్ద క్లోజయింది. -
ఎన్పీఏల పరిష్కారానికి ప్రాధాన్యం: జైట్లీ
న్యూయార్క్: మొండిబకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. మంగళవారమిక్కడ విదేశీ వ్యవహారాల మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య భారత్ బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. ‘‘ఇది ఒక సవాలే. అయినా, పరిష్కరించగలమన్న నమ్మకం ఉంది. 20 నుంచి 30 పెద్ద అకౌంట్ల వల్లే ఈ సమస్య తలెత్తింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇదేమీ పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదు. ప్రపంచం మందగమనంలో ఉన్నా... భారత్ 15 నుంచి 18 శాతం వార్షిక ఆదాయ వృద్ధిని నమోదుచేసుకుంటోంది. ఇదే తీరు మున్ముందూ కొనసాగుతుంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీతో పలు లాభాలు కలుగుతాయి’’ అని వ్యాఖ్యానించారు. 2016 డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.6,06,911 కోట్లుకు చేరాయి. ఒత్తిడిలో ఉన్న రుణ పరిమాణం (పునర్వ్యవస్థీకరించిన రుణాలు, స్థూల ఎన్పీఏలు) మొత్తం రూ. 9.64 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఈ మొత్తం రూ.8,97,000 కోట్లు. అంటే నాలుగు నెలలు గడిచే సరికే ఈ పరిమాణం దాదాపు 7.5 శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. -
ఎస్బీఐ మొండిబకాయిలు పైపైకి
⇒ ఏడాదిలో 50 శాతం అప్... ⇒ అనుంబంధాల విలీనంతో మరింత భారం ⇒ భారీగా పెరగనున్న ఎన్పీఏ కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐని మొండిబకాయిలు (ఎన్పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఈ భారం మరింత ఎగబాకనుంది. గతేడాది(2016) డిసెంబర్ నాటికి బ్యాంక్ స్థూల ఎన్పీఏలు ఏకంగా 48.6 శాతం పెరిగిపోయాయి. రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది డిసెంబర్‌నాటికి ఈ మొత్తం రూ.72,792 కోట్లుగా నమోదైంది. ఇక నికర ఎన్పీఏలైతే 52.6 శాతం ఎగబాకడం గమనార్హం. అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఇప్పుడు ఎన్పీఏలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్ నాటికి ఐదు అనుబంధ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 173 శాతం దూసుకెళ్లి.. రూ.55,164 కోట్లకు చేరడం గమనార్హం. 2015 డిసెంబర్ చివరికి ఈ మొత్తం రూ.20,218 కోట్లు మాత్రమే. ఇక నికర ఎన్పీఏలైతే 219 శాతం ఎగిశాయి. ‘అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎన్పీఏలకు ప్రొవిజనింగ్ కవరేజీలో మార్పులు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంక్ ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి 59 శాతంగా ఉంది. అయితే, పరిశ్రమలో 100 శాతం కవరేజీ విధానం ఎక్కడా లేదు. ఎన్పీఏల కాలవ్యవధి ఆధారంగా నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తాం’ అని ఎస్బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా పేర్కొన్నారు. -
మొండి బకాయిలు గుదిబండే..!
ఐడియాలు కాదు.. పరిష్కారం కావాలి.. ⇒ 2016 డిసెంబర్ నాటికి స్థూల ఎన్పీఏలు రూ.7 లక్షల కోట్లు ⇒ ఒత్తిడిలో ఉన్నవీ కలుపుకుంటే ఇవి సుమారుగా రూ.9 లక్షల కోట్లు ⇒ ఇప్పటి వరకు కేటాయింపులు రూ.3 లక్షల కోట్లే ⇒ రూ.6 లక్షల కోట్లు ఇంకా అందించాల్సి ఉంది ⇒ సమస్య ఆగిపోలేదు... ఎన్పీఏలు పెరిగితే దెబ్బే ⇒ మెకిన్సే ఇండియా హెడ్ రెన్నీ థామస్ న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకుల మొండి బకాయిలకు కావాల్సింది ఐడియాలు కాదని, సరైన పరిష్కారమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. స్థూల మొండి బకాయిలు గత డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లను దాటాయి. ఒత్తిడిలో ఉండి పునరుద్ధరించిన రుణాలు సైతం మొండి బకాయిలు (ఎన్పీఏ)గా మారే అవకాశం ఉందనుకుంటే మొత్తం ఎన్పీఏలు రూ.9 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ రూ.9 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో బ్యాంకులు ఇప్పటి వరకు సర్దుబాటు చేసినవి రూ.3 లక్షల కోట్లేనని, మిగిలిన రూ.6 లక్షల కోట్ల మాటేమిటని మెకిన్సే అండ్ కో దేశీయ విభాగం అధిపతి రెన్నీ థామస్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దేశీయ బ్యాంకుల ఎన్పీఏలపై ఆయన ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సంఖ్య అనేది ఓ సమస్య కాదని, దీనికి పరిష్కారమన్నది మాత్రం కనిపించడం లేదన్నారు. మొండి బకాయిలు ఇంకా...? మొండి బకాయిలు ఇప్పటిస్థాయికంటే ఇక పెరగబోవని బ్యాంకర్లు పేర్కొంటుండగా... రెన్నీ థామస్ దీంతో ఏకీభవించడం లేదు. ‘‘ఎన్పీఏల పెరుగుదల పారిశ్రామిక స్తబ్ధతకు దారితీసింది. ఫలితంగా మరిన్ని రుణాలు మొండి బకాయిలుగా మారనున్నాయి. పారిశ్రామిక ఆర్థిక స్తబ్ధత ఆర్థిక గణాంకాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తిలో వృద్ధి కేవలం 0.3 శాతంగానే ఉంది. స్థూల పెట్టుబడుల స్వరూపంలో తగ్గుదల జీడీపీ వృద్ధి అంచనాల్లో వ్యక్తమవుతోంది. వీటన్నింటినీ చూస్తే, ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్ష పూర్తయినప్పటికీ మొండి బకాయిలు అన్నవి ఇంకా గరిష్ట స్థాయికి చేరలేదని అర్థమవుతోంది’’ అని థామస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మరింత నిదానిస్తే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. పరిష్కారమేంటి...? ఎన్పీఏల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న విషయంలో ఐడియాలకు కొదవు లేదు. వ్యూహాత్మక రుణ పునరుద్ధరణ, ఎస్4ఏ తదితర పథకాలను ఆర్బీఐ ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేకుంటే... రుణ గ్రహీత కంపెనీల రుణ బకాయిల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకోవడం, ప్రైవేటు రీకన్స్ట్రక్షన్ కంపెనీల(ఏఆర్సీ)ను తెరపైకి తీసుకురావడం జరిగింది. దివాళా కోడ్‌ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. విరాళ్ ఆచార్య సూచనలు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య గత మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎన్పీఏల సమస్యకు రెండు పరిష్కారాలను సూచించారు. ‘‘ఒకటి ప్రైవేటు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం. ఇందులో ప్రభుత్వం కల్పించుకోదు. స్వల్ప కాలంలో ఆర్థికంగా ఆచరణ సాధ్యమయ్యే ఆస్తులను ఇది చక్కబెడుతుంది. ఆస్తుల పునరావాసం, చివరికి అవి అమ్ముడుపోయే వరకు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీయే వాటిని నిర్వహిస్తుంది. రెండోది నేషనల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు. విద్యుత్ వంటి కీలకమైన రంగాల్లో ఒత్తిడిలో ఉన్న ఆస్తులకు పరిష్కారం చూపే విషయంలో ఇది కఠినంగా వ్యవహరిస్తుంది’’ అని విరాళ్ ఆచార్య వివరించారు. అయితే, ఇండోనేషియా, స్పెయిన్‌లో అనుసరించిన విధానాలు ఇక్కడ పాటించతగినవిగా రెన్నీ థామస్ సూచించారు. అమెరికాలో ఉన్న సమస్యాత్మక ఆస్తుల పునరావాస కార్యక్రమం కూడా అధ్యయనం చేయతగ్గదన్నారు. అయితే, అక్కడి ప్రభుత్వాల తరహాలో భారత సర్కారు కట్టుబడి ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. నికర విలువకు దగ్గరగా ఎన్పీఏలు ‘‘బ్యాంకుల ఎన్పీఏలు రూ.9లక్షల కోట్లుగా ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు వీటికి కేటాయించింది రూ.3 లక్షల కోట్లే. వీటిని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం నికర విలువ రూ.8లక్షల కోట్లతో పోల్చి చూస్తే అది అసౌకర్య పరిస్థితే. అదే సమయంలో మరిన్ని ఎన్‌పీఏలకూ అవకాశం ఉంది. ఈ గణాంకాలే ఆందోళన కలిగిస్తున్నాయి’’ అన్నది రెన్నీ థామస్ వ్యక్తీకరించిన అభిప్రాయం. -
ఎన్పీఏల పరిష్కారంపై మరింత స్పష్టత కావాలి
ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్పష్టీకరణ ముంబై: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి సంబంధించి మరింత స్పష్టత, ప్రణాళిక, మార్గదర్శకాలు అవసరమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ విలేకరులతో అన్నారు. ‘‘ఒత్తిడిలో ఉన్న ఆస్తుల సమస్య పరిష్కారం ఎలా అన్న అంశం కోసం మేము ఎదురుచూస్తున్నాం. ఇందుకు సంబంధించి మరింత స్పష్టత, పారదర్శకాలు అవసరం’’ అని ఆమె అన్నారు. తగిన ప్రణాళికలు, మార్గదర్శకాలు లేకుంటే, సమస్య పరిష్కారం దిశలో ముందుకు వెళ్లడం కష్టమవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. ‘మొండిబకాయిల వచ్చే నష్టాలను ఒకేసారి కాకుండా, త్రైమాసికాల వారీగా భర్తీచేసే వెసులుబాటు ఉండాలి. సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు ఒక నిర్ణయం తీసుకుంటే, దానిని తరువాత సవాలు చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ మేరకు తగిన మార్గదర్శకాలు అవసరం’ అని భట్టాచార్య చెప్పారు. ముంబైలో కొరియా డెస్క్... కొరియా డెవలప్మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ముంబైలో కొరియా డెస్క్‌ను ఎస్బీఐ బుధవారం ఏర్పాటు చేసింది. రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి, పెట్టుబడులకు సహాయ,సహకారాలను అందించడం ఈ డెస్క్ ఏర్పాటు లక్ష్యం. రెండు దేశాల మధ్య గత ఆర్థిక సంవత్సరంలో ద్వైవార్షిక వాణిజ్యం 17 బిలియన్ డాలర్లు. -
బ్యాంకుల నుంచి కేంద్రానికి తగ్గనున్న డివిడెండ్
• ఈసారి రూ. 1,000 కోట్ల కన్నా తక్కువే • కొంతైనా చెల్లించలేమని చేతులెత్తేసిన కొన్ని బ్యాంకులు • డీమోనిటైజేషన్, ఎన్పీఏలే కారణం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావాలు, మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి కేంద్రానికి వచ్చే డివిడెండ్ తగ్గవచ్చని తెలుస్తోంది. ఇది రూ. 1,000 కోట్ల కన్నా తక్కువే ఉండొచ్చని సమాచారం. కొన్ని పీఎస్‌బీలు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికే డివిడెండ్ చెల్లించకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ మంజూరీ అంతంత మాత్రంగా ఉండటం, ఎన్పీఏల భారం తదితర అంశాలతో లాభాలు తగ్గనుండటంతో తాము డివిడెండ్ చెల్లించలేమంటూ పలు పీఎస్‌బీల అధిపతులు.. ఆర్థిక శాఖకు ఇప్పటికే తెలియజేసినట్లు వివరించాయి. గతేడాది జూన్ ఆఖరు నాటికి రూ. 5,50,346 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల స్థూల ఎన్పీఏలు సెప్టెంబర్ 30 నాటికి రూ. 6,30,323 కోట్లకు పెరిగాయి. ఇక పెద్ద నోట్ల రద్దు దరిమిలా బ్యాంకింగ్ కార్యకలాపాలపై రెండు నెలల పాటు ప్రతికూల ప్రభావం పడటంతో వాటి ఆదాయం ఆ మేర తగ్గినట్లు పరిశీలకుల అంచనా. నోట్ల రద్దు అనంతరం రుణాల మంజూరీ రికార్డు కనిష్టం 5.3 శాతం స్థాయిని తాకింది. మరింత మూలధనం కావాలంటూ కోరుతున్న బ్యాంకులు.. ఈ పరిస్థితుల్లో డివిడెండ్ చెల్లించలేకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్బీల్లో ప్రభుత్వానికి మెజారిటీ వాటాలు ఉంటాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం లాభాల్లో ఉన్న బ్యాంకులు తమ ఈక్విటీలో కనీసం 20%మైనా లేదా పన్ను అనంతర లాభాల్లో 20 శాతం గానీ (ఏది ఎక్కువైతే అది) డివిడెండ్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వివిధ అంశాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా 16 పీఎస్‌బీలు 2015–16లో డివిడెండ్ చెల్లించలేదు. దీంతో కేంద్రానికి పీఎస్‌బీల నుంచి రావాల్సిన డివిడెండ్ ఆదాయం సుమారు 67% క్షీణించి రూ. 1,445 కోట్లకు తగ్గిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,336 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం కాస్త తక్కువ ఇచ్చినా.. ఎస్బీఐ సహా ఆరు బ్యాంకులు మాత్రమే డివిడెండ్ చెల్లించాయి. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఎస్బీఐ అత్యధికంగా రూ. 1,214.6 కోట్లు కట్టింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% తక్కువే. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రితం కట్టిన దాంట్లో మూడింట ఒక్క వంతు రూ. 85 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఐదో వంతు రూ. 12.4 కోట్లు కట్టింది. అలహాబాద్ బ్యాంక్, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి డివిడెండ్ చెల్లించనే లేదు. -
ఆర్థిక వ్యవస్థకు కొత్తరూపు..!
ప్రజలు, వృద్ధి రేటుకు కొద్దిగా సమస్యే.. ♦బ్యాంకుల మొండిబకాయిలు ఆందోళనకరం ♦కార్పొరేట్ రంగం పనితీరు మెరుగుపడింది ♦ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్బీఐ వెల్లడి... ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్), వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో భారత్ ఆర్థిక వ్యవస్థ స్వరూపం మారిపోనుందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పేర్కొంది. అయితే, వీటివల్ల ఆర్థిక వృద్ధి రేటుపై కొంత ప్రతికూల ప్రభావంతోపాటు ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని అభిప్రాయపడింది. మరోపక్క, బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్పీఏ)పై ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం విడుదల చేసిన 14వ ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో ఆర్బీఐ ఈ కీలక అంశాలను ప్రస్తావించింది. దీంతోపాటు 2015–16 ఏడాదికిగాను భారత బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ధోరణి, ప్రగతిపై కూడా నివేదిక(ఆర్టీపీ)ను విడుదల చేసింది. బ్యాంకులకు ఎన్పీఏల దెబ్బ... ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో దేశ కార్పొరేట్ రంగం పనితీరు మెరుగుపడిందని.. కానీ, టర్నోవర్ తగ్గుముఖం రిస్క్ మాత్రం నెలకొందని ఆర్బీఐ పేర్కొంది. బడా కార్పొరేట్ కంపెనీల కారణంగానే మొండిబకాయిలు తీవ్రంగా పెరిగిపోయినట్లు కూడా వెల్లడించింది. ‘ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే... ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల వ్యాపార వృద్ధి మందకొడిగానే కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ నష్టాల్లోకి జారిపోయింది. మార్చి–సెప్టెంబర్ మధ్య బ్యాంకుల మొండిబకాయిలు మరింత పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణం. బ్యాంకుల మొత్తం స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది మార్చి నాటికి 7.8 శాతంగా ఉంటే.. సెప్టెంబర్‌కల్లా ఇవి 9.1 శాతానికి ఎగబాకాయి. దీంతో పునర్వ్యవస్థీకరించిన రుణాలతో సహా మొత్తం ఎన్పీఏలు 11.5 శాతం నుంచి 12.3 శాతానికి చేరాయి. బ్యాంకింగ్ రంగం ప్రధానంగా పీఎస్‌బీలు తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కొంటున్నప్పటికీ దేశ ఫైనాన్షియల్ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ స్థిరంగానే ఉంది. స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మరింత ఎగబాకవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి’ అని నివేదిక తెలిపింది. 2018 మార్చికల్లా ఎన్పీఏలు 10 శాతం పైకి... వచ్చే ఏడాది మార్చినాటికి స్థూల ఎన్పీఏలు 9.8 శాతానికి పెరిగిపోవచ్చని.. ఇక 2018 మార్చికల్లా 10.1%కి కూడా చేరొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. పీఎస్‌బీల మొండిబకాయిలు మరింత పేరుకుపోతాయని కూడా తెలిపింది. ‘మార్చికల్లా ప్రభుత్వ బ్యాంకుల మొత్తం స్థూల ఎన్పీఏలు 12.5%కి చేరవచ్చు. 2018 మార్చినాటికి ఇవి 12.9 శాతానికి ఎగబాకే అవకాశం ఉంది. తీవ్రమైన ఆర్థిక ప్రతికూలతలు నెలకొంటే ఈ పరిమాణం మరింతగా పెరిగిపోవచ్చు’ కూడా అని ఆర్బీఐ అభిప్రాయపడింది. రియల్టీ రంగానికి నియంత్రణ సంస్థ ఏర్పాటు తర్వాత ఈ రంగంలో స్పెక్యులేటివ్ కార్యకలాపాలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని.. దీనివల్ల గృహ రుణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా ఆర్బీఐ పేర్కొంది. డీమోనిటైజేషన్ కారణంగా ఇప్పటికే రియల్టీ రంగం దెబ్బతిందంటూ పరిశ్రమ వర్గాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీపీలో ఏం చెప్పిందంటే... తీవ్రమైన మొండిబకాయిలతో కేటాయింపులు(ప్రొవిజనింగ్) పెరగడం, రుణ వృద్ధి పడిపోవడంతో 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశీ బ్యాంకింగ్ రంగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే, రిటైల్ రుణ విభాగంలో మాత్రం రెండంకెల వృద్ధి నమోదైంది. అదేవిధంగా గతేడాది బ్యాంకుల వడ్డీ రాబడులు, వడ్డీయేతర ఆదాయాలు తీవ్రంగా దిగజారాయి. దీనివల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ నికర లాభాలు 60 శాతంపైగా ఆవిరైపోయాయి. విదేశీ ప్రతికూలతలు... అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో మన వాణిజ్య వృద్ధి మందగించవచ్చని ఆర్బీఐ అభిప్రాయపడింది. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) పెరిగే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ‘రెమిటెన్సుల(ప్రవాసీయుల నుంచి దేశంలోకి వచ్చే నిధులు) ప్రవాహం దిగజారుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో మన ఎగుమతులతో పోలిస్తే.. దిగుమతులు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా దేశం నుంచి విదేశీ నిధులు వెనక్కిపోవచ్చని భావిస్తున్నాం. రూపాయి విలువపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు’ అని నివేదికలో అంచనా వేసింది. ఎంఎస్ఎంఈలకు ఊరట... నోట్ల రద్దు కారణంగా తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు ఆర్బీఐ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు తమ బోర్డుల ఆమోదం మేరకు ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ పరిమితిని అమలు చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఈ అదనపు రుణ కల్పన అనేది వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఒక్కసారి మాత్రమే అందించేందుకు ఆస్కారం ఉంటుందని, ఆతర్వాత తాజా వర్కింగ్ క్యాపిటల్ విషయంలో సాధారణ నిబంధనలనే పాటించాలని పేర్కొంది. భవిష్యత్తులో గణనీయమైన మార్పులు... డీమోనిటైజేషన్ ప్రభావంతో డిజిటల్ రూపంలో చెల్లింపులు భారీగా పెరగనున్నాయి. దీనివల్ల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రజలకు మరిన్ని రుణాలు అందుబాటులోకి వస్తాయి. మొత్తంమీద రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రజలకు ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలకు స్వల్పకాలికంగా విఘాతం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఫైనాన్షియల్ మార్కెట్లలో తలెత్తే ఒడిదుడుకులను తగినవిధంగా ఎదుర్కొనేలా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. జీఎస్టీ, దివాలా చట్టం అమలుతో ఆర్థిక వ్యవస్థపై మొండిబకాయిల ఒత్తిడి తగ్గుతుంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. వృద్ధి రేటు తాజాగా కాస్త తడబాటుకు గురవుతోంది. దేశీ బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న మొండిబకాయిల ఒత్తిడికి కొంతమేరకు గత పరిణామాలే కారణం. అయితే, పారదర్శకత పెంపునకు చేపట్టిన చర్యలతో దేశ ఫైనాన్షియల్ వ్యవస్థ మళ్లీ పునరుత్తేజం చెందేందుకు దోహదం చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్నాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, కమోడిటీ ధరల పెరుగుదలతో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో రిస్కులను పెంచుతోంది. – ఎఫ్ఎస్ఆర్ నివేదిక ముందుమాటలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నల్లధనం కట్టడిపై... నల్లధనాన్ని అరికట్టాలంటే కఠినమైన జరిమానాలు, ఆమోదయోగ్యమైన పన్నుల విధానాలను అమలు చేయడమే అత్యుత్తమ మార్గమని ఆర్బీఐ పేర్కొంది. అదేవిధంగా పాలనను మెరుగుపరచడం, పౌర సేవల నాణ్యతను పెంచడంతో పాటు నియంత్రణల మోతాదును తగ్గించడం కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. ఇందుకు ఉదాహరణను కూడా ప్రస్తావించింది. అమెరికాలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను ఒక శాతం పెంచడం వల్ల వ్యవస్థలో నల్లధనం 1.4% మేర ఎగబాకేందుకు దారితీసిందని తెలిపింది. అదేవిధంగా నియంత్రణ సూచీలో ఒక శాతం పెరుగుదలతో నల్లధనం 10% పెరిగిపోవచ్చని వివరించింది. అమెరికా ఉదాహరణనే పేర్కొంటూ... ‘పన్ను ఆదాయాలు తగ్గిపోవడంవల్ల ప్రభుత్వాలు పన్ను రేట్లను పెంచేందుకు పురిగొల్పుతుంది. దీనివల్ల నల్లధనం అనేది మరింత పోగుపడేందుకు దారితీస్తుంది. అయితే, ప్రత్యక్ష పన్ను ఆదాయాలపై బ్లాక్ మనీ ప్రభావం ఆందోళనరమే. కానీ, పరోక్ష పన్నులు, ఆర్థిక వృద్ధికి తోడ్పాటులో దీని పాత్ర చర్చనీయాంశం. ఓఈసీడీ నివేదిక ప్రకారం చూస్తే.. షాడో ఎకానమీ(ఆర్థిక వ్యవస్థలో నల్లధనం లేదా సమాంతర ఆర్థిక వ్యవస్థ) అనేది సవాలే అయినప్పటికీ ప్రపంచంలోని సగం మంది కార్మికులు దీనిద్వారానే ఉపాధి పొందుతుండటం గమనార్హం. విదేశీ పాలసీ మ్యాగజీన్లోని ఒక కథనంలో ప్రపంచ బ్లాక్ మనీ మార్కెట్ విలువ దాదాపు 10 ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(మొదటిది అమెరికా)గా దీన్ని పేర్కొనవచ్చు. అంతేకాదు ఇది వేగంగా వృద్ధి చెందుతోంది కూడా’ అని వివరించింది. -
బ్యాంకులపై పెరగనున్న ఎన్పీఏల ఒత్తిడి
• రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్’ అంచనా • చైనాలోనూ ఇదే తీరని అభిప్రాయం ముంబై: భారత్ అలాగే చైనా బ్యాంకులపై మొండిబకారుుల (ఎన్పీఏ) ఒత్తిడి 2017లో పెరుగుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ తన తాజా నివేదికలో అంచనావేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తగిన ఆదాయాలు, మూలధనం ఉన్నప్పటికీ ఎన్పీఏల సమస్య బ్యాంకింగ్‌కు తప్పదని అంచనావేసింది. ఆయా పరిస్థితులు ఆర్థికంగానూ భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలకు కొంత ఇబ్బందికరమైన అంశాలేనని పేర్కొంది. ఈ మేరకు ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల బ్యాంక్‌లకు సంబంధించి 2017 అవుట్‌లుక్‌ను ఫిచ్ విడుదల చేసింది. పలు దేశాల్లో అటు కంపెనీల పరంగా, ఇటు గృహ అవసరాల పరంగా రుణ భారాలు 2009 నుంచీ పెరుగుతూ వస్తున్నాయని, ఇది 2017లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని నివేదిక వివరించింది. ఆసియా వర్థమాన మార్కెట్లో ఆర్థిక వృద్ధి 2017లో 6.4 శాతంగా ఉంటుందని సంస్థ అభిప్రాయపడింది. ఇతర ప్రాంత దేశాలతో పోల్చితే ఈ వృద్ధి రేటు అధికమైనప్పటికీ, 2010-14 సగటు 7.8 శాతం కన్నా ఇది తక్కువన్న విషయం గమనార్హమని పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం నేపథ్యంలో డాలర్ బలోపేతం కావడం- డాలర్ డినామినేటెడ్ రుణ చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్‌కు భారంగా మారుతున్న అంశమని నివేదిక పేర్కొంది. ట్రంప్ ప్రతిపాదిస్తున్న రక్షణాత్మక విధానాలు ప్రపంచ వాణిజ్యంపై ప్రత్యేకించి వర్థమాన ఆసియా ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూలత చూపే వీలుందని నివేదిక అంచనావేసింది. ఆయా అంశాలూ బ్యాంకింగ్ రుణ నాణ్యతపై ప్రభావం చూపే అంశాలేనని విశ్లేషించింది. -
పీఎస్‌యూల మెడకు ఎన్పీఏలు!
• డిఫాల్ట్ అరుున ప్రైవేటు కంపెనీల ఆస్తుల టేకోవర్‌కు కేంద్రం ఒత్తిడి • మార్చి 31 డెడ్‌లైన్ దగ్గరపడుతుండటమే కారణం • వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలు... ముంబై: కొండలాపేరుకుపోతున్న మొండిబకారుుల(ఎన్పీఏ) సమస్య ఒకపక్క బ్యాంకులను బెంబేలెత్తిస్తుంటే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)కు కొత్త సమస్య వచ్చిపడింది. బ్యాంకులకు కోట్ల రూపారుుల్లో అప్పులు ఎగ్గొట్టి.. డిఫాల్ట్ అరుున ప్రైవేటు కంపెనీల ఆస్తులను టేకోవర్ చేసుకోవాలంటూ పీఎస్యూలపై మోదీ సర్కారు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. తద్వారా బ్యాంకుల మొండిబాకారుులను బ్యాలెన్‌సషీట్ల నుంచి తొలగించాలన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రధానంగా పీఎస్‌యూ స్టీల్, విద్యుత్, షిప్పింగ్ కంపెనీలపై కేంద్రం దృష్టిపెట్టింది. అరుుతే, ఇందుకు ఆయా కంపెనీలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గడువు ముంచుకొస్తోంది... ఎన్పీఏల సమస్య పరిష్కారం కోసం బ్యాంకులు తమ మొండిబకారుులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తిగా ప్రకటించి.. వాటికి తగిన కేటారుుంపులు(ప్రొవిజనింగ్) చేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మొండిబకారుులను వదిలించుకోవడానికి డిఫాల్ట్ అరుున కంపెనీలను వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఆర్) పేరుతో టేకోవర్ చేసుకునే అధికారాలను కూడా ఆర్బీఐ బ్యాంకులకు కట్టబెట్టింది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని బ్యాంకులు చర్యలు కూడా తీసుకొని.. కొన్ని డిఫాల్ట్ కంపెనీల్లో మెజారిటీ వాటాలను దక్కించుకున్నారుు కూడా. అరుుతే, దేశంలో అత్యధికంగా మొండిబకారుులు పేరుకుపోరుున స్టీల్, విద్యుత్, షిప్పింగ్ వంటి రంగాలకు చెందిన అనేక కంపెనీలకు సంబంధించి మొండిబకారుులను బ్యాలెన్‌సషీట్ల నుంచి తొలగించడం బ్యాంకులకు కత్తిమీదసామే. దీంతో కేంద్రం పీఎస్‌యూల నుంచి ఆయా ఆస్తులను కొనిపించి.. బ్యాంకులకు ఆ మేరకు రుణ బకారుుల నుంచి విముక్తి కలిగించే ప్రణాళికను రూపొందించింది. ఒక్క విద్యుత్ రంగంలోనే ఎన్పీఏలు రూ.4 లక్షల కోట్లకు ఎగబాకినట్లు అంచనా. ఇక స్టీల్ రంగానికి చెందిన కంపెనీల మొండిబకారుులు కూడా సుమారు రూ.3.5 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. 23 కంపెనీల జాబితా... తీవ్రమైన మొండిబకారుుల సమస్య ఎదుర్కొంటున్న ఈ మూడు రంగాలను గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా గత నెలలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అగ్రగామి బ్యాంక్ చీఫ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎస్బీఐ అధిపతి అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ.. స్టీల్, విద్యుత్, షిష్పింగ్ రంగాలకు చెందిన 23 కంపెనీల జాబితాను బ్యాంకులకు అందించినట్లు ఆయా వర్గాలు వెల్లడించారుు. ఈ కంపెనీల మొత్తం మొండిబకారుుల విలువ రూ. లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్యాంకులకు ఈ గుదిబండను తగ్గించేందుకు పీఎస్‌యూలు ఆయా కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేయాలని సూచించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించారుు. ఈ జాబితాలో భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్టోస్ట్రీల్ వంటివి ఉన్నారుు. జైట్లీతో భేటీకి సెరుుల్, ఎన్టీపీసీ, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లకు చెందిన సీఎండీలు కూడా హాజరయ్యారు. సెయిల్ నో...! మొండిబకారుుల సమస్యలో కూరుకుపోరుు.. నష్టాల్లో ఉన్న కంపెనీలకు చెందిన ఆస్తులను బ్యాంకర్లతో ఒప్పందం ద్వారా కొనుగోలు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెరుుల్ ప్రాథమికంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అరుుతే, బ్యాంకర్లు మొండిబకారుుల విషయంలో కొంత వెసులువాటును కల్పిస్తే... సెరుుల్ ఈ ప్రతిపాదనలను పరిశీలించే అవకాశం ఉందని జైట్లీ సమావేశం తర్వాత ప్రధాని కార్యాలయానికి ఉక్కు శాఖ తెలియజేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారుు. ఈ వ్యవహారంపై సెరుుల్ ఉన్నతాధికారులెవరూ ఇంకా నోరు విప్పడం లేదు. ఎన్పీఏలను విక్రరుుంచేందుకు బ్యాంకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొనేవారు లేకపోవడంతో బ్యాంకులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ప్రత్యామ్నాయంగా పీఎస్యూలతోనే డిఫాల్ట్ కంపెనీల వాటాలను కొనిపించేలా ప్రభుత్వం బ్యాంకులకు దారిచూపిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నారుు. ఇలా అరుుతే, బ్యాంకులు తమ బకారుుల్లో 30-40 శాతం మేర వదులుకున్నా, ఎవరూ దీనిపై ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా ఉంటుందనేది ఈ చర్యల ప్రధానోద్దేశమని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. -
పెద్దనోట్ల రద్దు ఎక్కడికి దారితీస్తుందో
దేశంలో 'మాంద్యం' తప్పదా? (ఇంటర్నెట్ ప్రత్యేక కథనం) హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశంలో ఆర్థికమాంద్యానికి దారితీస్తుందా? నోట్ల రద్దు తర్వాత అవసరమైనంత కరెన్సీని అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఇప్పటికే పలు వ్యాపారాలు కుదేలయ్యాయి. బ్యాంకుల నుండి సరిపడినంత డబ్బు తీసుకునే వెసులుబాటు లేక చిన్నవ్యాపారులు చితికిపోతున్నారు. మార్కెట్లో వారు సైతం డబ్బుతోనే సరుకులు కొనుగోలు చేయవలసి రావడం చేత క్రమేపి వారి వ్యాపారాలు మందగిస్తున్నాయి. చాలా దుకాణాల్లో సరుకులు సన్నగిలిపోయాయి. స్థిరాస్తి లావాదేవీలు స్తంభించాయి. వ్యవసాయక కొనుగోళ్లు, అమ్మకాల్లో మున్నెన్నడూ ఎరుగని స్తబ్ధత ఏర్పడింది. ఈ ఏడాది కురిసిన మంచి వర్షాల వల్ల ఒనగూరే ప్రయోజనాన్ని కూడా ఈ చర్య వల్ల చేజేతులారా దెబ్బతీసుకున్నట్లైంది. రబీ సీజన్-లో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల దగ్గరి నుంచి వ్యవసాయ కూలీలకు చెల్లింపుల వరకు అంతా అయోమయం నెలకొంది. పండిన పంటలకు కూడా గిట్టుబాటయ్యే ధరలు లేని దుస్థితి. వ్యవసాయ రంగం అంతా ప్రధానంగా నగదు చెల్లింపులపైనే నడుస్తుండడం వల్ల ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వ్యతిరేక ఫలితాలనే ఇవ్వనుందని ప్రముఖ గణాంకవేత్త ప్రొఫెసర్ ప్రణబ్ కే సేన్ అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ సారి వార్షిక వృద్ధిరేటు 7 శాతం కంటే తక్కువగానే నమోదు కావచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్య చలామణి మందగించడంతో పాటు లెక్కల్లోకి రాని డబ్బు యావత్తు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే అవకాశం లేకపోవడం మూలాన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 1.1 మేరకు తగ్గవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) కి చెందిన ప్రొఫెసర్ ఎన్ ఆర్ భానుమూర్తి హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు తగ్గితే దానిని రెసిషన్ గా వ్యవహరిస్తారు. ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు కాస్త తగ్గి 7.1 శాతంగా నమోదైంది. నిరుడు ఇదే త్రైమాసికంలో ఇది 7.5 శాతంగా ఉండింది. మంచి వర్షాల వల్ల 2016 -17లో 8 శాతం వార్షిక వృద్ధిరేటు ఉండగలదని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆ స్థాయి వృద్ధిరేటును సాధించడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు అంటున్నారు. 1978లో వెయ్యి నోటు రద్దు జరిగినప్పుడు కూడా 25 శాతం డబ్బు బ్యాంకుల్లోకి రాలేదు. ఈసారి కూడా 25 శాతం నల్లధనం బ్యాంకుల్లో జమకాకపోవచ్చునని SBI రూపొందించిన ఒక నివేదిక అంచనా వేసింది. దేశంలో ఈ పర్యాయం 45 లక్షల కోట్ల రూపాయల నల్లధనంలో కనీసం 20 శాతం- అంటే రూ. 9 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ కాకపోవచ్చునని ఆ నివేదిక పేర్కొంది. నిజానికి ఇది 20 లక్షల కోట్ల యినా కావచ్చు. అంతకు మించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే దేశంలో నల్లధనం ఎంతన్నది ఎవరికీ అంతుచిక్కనిది. దానిమీద అంచనాలు కట్టడం అన్నివేళలా వాస్తవం కాకపోవచ్చు. ప్రభుత్వానికి చిక్కని ప్రత్యామ్నాయమార్గాల ద్వారా నల్లధనం మార్పిడికి కూడా కొన్ని అవకాశాలు ఉండనే ఉన్నాయి. రోజూ వారి లావాదేవీల్లో నోట్ల వినియోగంపై ఆర్బీఐ చెబుతున్న గణాంకాలు మురిగిపోయిన అప్పులు! ఇక దేశంలో ప్రభుత్వరంగబ్యాంకుల నిరర్థక ఆస్తుల (NPA) విలువ కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుతం అవి 7.6 శాతం చేరుకున్నాయి. అవి 2017 మార్చి నాటికి 8.5 శాతానికి చేరవచ్చునని అంచనా. 2015-16 త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఏకంగా 5.8 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గోడకు కొట్టిన సున్నం లాంటి తిరిగిరాని మురి(ని)గిపోయిన అప్పులు! విజయ మాల్యా వంటివాళ్ల చేతుల్లోకి అవి చేరిపోయాయి. ఈ కారణంగా 25 ప్రభుత్వబ్యాంకుల్లో ఇప్పటికే కనీసం 15 బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2017-18 సంవత్సరానికిగాను క్రెడిట్ అవసరాల నిమిత్తం ప్రభుత్వరంగబ్యాంకులకు 36 వేల కోట్ల రూపాయల మేరకు నిధులు కావాలి. మోదీ ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంక్, స్టార్టప్ ఇండియా, గోల్డ్ మానిటైజేషన్ వంటి పథకాలు బ్యాంకుల కష్టాలను మరింత పెంచాయి. ప్రభుత్వపథకాలేవీ సరిగా అమలు కాకపోవడానికి బ్యాంకుల వద్ద వాటికి సరిపడా ద్రవ్యం లేకపోవడం ఒక ప్రధాన కారణం. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వం ఆశిస్తోంది ప్రధానంగా "ద్రవ్యం" కావచ్చు. అయితే అది ఏ మేరకు అందివస్తుందో కాలమే తేల్చాలి! దేశంలో 4 కోట్ల మంది చిన్నతరహా వ్యాపారులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన జాతీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం 8 శాతం వాటాను కలిగి ఉంది. దీనికి (Micro, small and medium enterprises - MSME) వస్తువుల ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతులలో40 శాతం వాటా ఉండడం విశేషం. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికంగా ఉద్యోగితను కల్పించే రంగం ఇది. ఇప్పుడు పెద్దనోట్ల రద్దుతో ఈ రంగం పెనుసంక్షోభంలో చిక్కుకుపోయింది. కరెన్సీ లభ్యత తగ్గిపోవడమంటే అది ప్రజల కొనుగోలుశక్తి తగ్గడమే. కొనుగోలు శక్తిని ప్రభుత్వం హరించడమంటే అది దేశంలో వస్తూత్పత్తికి గిరాకీ తగ్గించడమే అవుతుంది. అలా ఇది ద్రవ్యోల్బణం నుండి తొలుత ద్రవ్యమాంద్యానికి...అంతిమంగా ఆర్థిక మాంద్యానికీ దారితీస్తుందన్న భయసందేహాలు కలుగుతున్నాయి. బ్యాంకుల జాతీయకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పలువురు స్వతంత్ర ఆర్థికవేత్తలతో విపులంగా చర్చించారు. దాని లాభనష్టాలను బేరీజు వేశాకే ప్రకటన చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం తమ ఆలోచనలకు తలాడించే ఆర్థికశాఖ అధికారులపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుపై పెద్దగా అధ్యయనం లేకుండానే నిర్ణయం తీసుకోవడం వల్ల దాని దుష్పరిమాణాలకు సిద్ధం కావలసిందేనని ప్రభాత్ పట్నాయక్ వంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి 2014 నుండే వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల వాడకం విపరీతంగా పెరిగింది. (దీనిని గ్రాఫ్ ద్వారా చూడవచ్చు). రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో రూ.16.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిలో రూ.6.3 లక్షల కోట్లు అంటే 38.6 శాతం వెయ్యి రూపాయల నోట్లు. కాగా రూ.7.8 లక్షల కోట్లు అంటే 47.8 శాతం ఐదు వందల రూపాయల నోట్లు. వీటి రద్దుతో ఏకంగా 86.4 శాతం కరెన్సీని చెల్లుబాటు కాకుండా చేశారు. ఒకనాటి చాయ్-వాలాగా చెప్పుకునే మోదీ ఇప్పుటి చాయ్-వాలాలతో సహా రోజువారీ కష్టం మీద బతికే బడుగుజీవులకు మాత్రం పూట గడవకుండా చేశారు. ప్రశ్నార్థకంగా మారనున్న నిత్యవసర సరుకుల వినియోగం పెరిగిన ధరలు! తాజా వినియోగ ధరల సూచీ ప్రకారం దేశంలో 2016 అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ లో ఇది 4.39. కాగా నిరుడు 5 శాతంగా ఉండింది. అధికారిక గణాంకాల ప్రకారం "ద్రవ్యోల్బణం" తగ్గింది. కానీ ఆహార దినుసుల ధరలు ఏ మాత్రం తగ్గలేదు. పైగా మరింత పెరిగాయి. రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై 2016 త్రైమా సికంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆహారద్రవ్యోల్బణం కుదిపివేసింది. పప్పుధాన్యాలకు సంబంధించి తెలంగాణలో సగటున 37.6 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. అలాగే మసాలా దినుసుల్లో 15.4 శాతం, పండ్లధరల్లో 13.1 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పప్పుధాన్యాలకు సంబం ధించి 34.7 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు వెల్లడైంది. పెద్దనోట్లను ఆకస్మికంగా రద్దు చేయడంతో మోదీ దేశంలో ఒక మోస్తరు ధనవంతుల నల్లధనానికి ఒక మేరకు చెక్ పెట్టగలిగి ఉండవచ్చు. కానీ ద్రవ్యం సరిపడా చలా మణిలో లేని పరిస్థితులను సృష్టించడం అంతిమంగా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రద్దు చేయదలిస్తే వెయ్యి నోట్లను ఎందుకు అంత విస్తారంగా, అనాలోచితంగా చలామణిలోకి తెచ్చినట్లో మోదీ మాత్రమే చెప్పగలరు. ఏదిఏమైనా దశలవారీగా, శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా చేయవలసిన పనిని హఠాత్తుగా చేయడం వల్ల దుష్పరిమాణాలు తప్పకపోవచ్చు. ఒక మంచి పనిని సరైన రీతిలో చేయకపోవడం కూడా చెడుఫలితాలకే దారితీస్తుందని మోదీ ఆలస్యంగానైనా గ్రహించవలసి వస్తుంది. -
ఐసీఐసీఐ లాభం 3,102 కోట్లు
క్యూ2లో స్వల్పంగా 3.2% వృద్ధి.. భారీగా పెరిగిన మొండిబకాయిలు... స్థూల ఎన్పీఏలు 6.82 శాతానికి... భారీగా ఎగబాకిన ఎన్పీఏ కేటాయింపులు ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే)నికర లాభం స్వల్పంగా 2.3 శాతం మాత్రమే పెరిగి రూ. 3,102 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,030 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు(ఎన్పీఏ) కేటాయింపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం లాభాలపై ప్రభావం చూపింది. ఇక బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం క్యూ2లో రూ.22,759 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ. 16,106 కోట్లతో పోలిస్తే 41 శాతం పెరిగింది.కన్సాలిడేటెడ్‌గా చూస్తే..: బీమా, మ్యూచువల్ఫండ్ తదితర అనుంబంధ సంస్థలన్నింటితో(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) కలిపి చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 13 శాతం దిగజారి రూ.2,979 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.3,419 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.25,138 కోట్ల నుంచి రూ.32,435 కోట్లకు చేరింది. 29 శాతం వృద్ధి నమోదైంది. మొండిబకాయిలు పైపైకి...: సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు రెట్టింపు స్థారుులో 6.82 శాతానికి ఎగబాకాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి 3.77 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా చూస్తే రూ.15,858 కోట్ల నుంచి రూ.32,178 కోట్లకు చేరాయి. అయితే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 5.87 శాతం(రూ.27,194 కోట్లు)తో పోలిస్తే దాదాపు 1 శాతం పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.65 శాతం(రూ.6,759 కోట్లు) నుంచి 3.57 శాతానికి(రూ.16,215 కోట్లు) ఎగబాకాయి. తొలి త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 3.35 శాతం(రూ.15,041 కోట్లు)గా ఉన్నాయి. ఇక క్యూ2లో బ్యాంక్ మొత్తం ప్రొవిజన్‌స అండ్ కంటింజెన్సీస్(ఇతర అవసరాల కోసం) రూ.7,083 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఈ మొత్తం రూ.942 కోట్లు మాత్రమే. ‘క్యూ2లో అదనంగా రూ.3,588 కోట్ల కేటాయింపులు జరపడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మరింత పటిష్టం చేశాం. ఇందులో కొన్ని స్టాండర్డ్ రుణాలకు సంబంధించి రూ.1,678 కోట్లు కూడా ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ ప్రాతిపదికన రూ.1,515 కోట్ల కేటాయింపులు జరిపాం’ అని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూ2లో తాజాగా రూ.8000 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. సోమవారం బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో 3.36 శాతం లాభంతో రూ.279 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. కాగా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఐసీఐసీఐ ఏడీఆర్ సోమవారం ఒకానొక దశలో 6 శాతంపైగా ఎగబాకి 8.62 డాలర్లను తాకడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ2లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.5,253 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్ఐఐ రూ.5,251 కోట్లుగా ఉంది. వడ్డీయేతర ఆదాయం మాత్రం మూడింతలై రూ.3,007 కోట్ల నుంచి రూ.9,120 కోట్లకు దూసుకెళ్లింది. పధానంగా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓ ద్వారా బ్యాంక్ తన వాటాలో 12.63 శాతాన్ని విక్రరుుంచింది. దీని ద్వారా లభించిన మొత్తంతో కలిపితే క్యూ2లో ఇతర ఆదాయం రూ. 5,682 కోట్లుగా నమోదైంది. జూలై-సెప్టెంబర్ కాలంలో బ్యాంక్ రిటైల్ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం డిపాజిట్లు 17 శాతం వృద్ధితో సెప్టెంబర్ చివరినాటికి రూ.4,49,071 కోట్లకు పెరిగారుు. మొత్తం రుణాలు రూ.4,54,256 కోట్లకు చేరాయి. రుణ వృద్ధి 11 శాతంగా నమోదైంది. బ్యాంకు మొత్తం ఏటీఎంలు 14,295, బ్రాంచ్‌లు 4,468కి చేరాయి. అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స నికర లాభం క్యూ2లో రూ.415 కోట్ల నుంచి రూ. 419 కోట్లకు పెరిగింది. లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స లాభం రూ.143 కోట్ల నుంచి రూ.171 కోట్లకు ఎగసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ నికర లాభం రూ.83 కోట్ల నుంచి రూ.130 కోట్లకు పెరిగింది. కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల్లో 80 శాతం పరిశీలనలో ఉంచిన(వాచ్‌లిస్ట్) రూ.44,000 కోట్ల రుణ ఖాతాల నుంచే ఉన్నాయి. మా కార్పొరేట్ ఖాతాదారులు కొన్ని కంపెనీలతో కుదుర్చుకున్న తాజా ఒప్పందాలు పూర్తయితే... మొండిబకాయిలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జేపీ అసోసియేట్స్ సిమెంట్ విభాగాన్ని అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు రూ.16,500 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందం, ఎస్సార్ ఆయిల్‌ను రూయాలు రాస్‌నెఫ్ట్ కన్సార్షియంకు విక్రయిస్తూ తాజాగా కుదుర్చుకున్న డీల్‌లు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి ఇప్పటికే కొంత బకాయి మొత్తాన్ని అందుకున్నాం. ప్రస్తుతం వాచ్‌లిస్ట్ పరిమాణం రూ.32,490 కోట్లకు తగ్గింది. 6-9 నెలల కాలంలో ఇది మరింత తగ్గుతుందని భావిస్తున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ -
30 శాతం తగ్గిన యునెటైడ్ బ్యాంకు లాభం
న్యూఢిల్లీ: మొండి బకాయిలు రెట్టింపు కావడంతో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.61.86 కోట్లుగా నమోదు కాగా, తాజాగా అది రూ.43.53 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం సైతం రూ.2,927 కోట్ల నుంచి రూ.2,893 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో వసూలు కాని స్థూల, నికర మొండి బకాయిలు 82 నుంచి 95 శాతం మేర పెరగడం, వాటికి చేసిన నిధుల కేటయింపులతో లాభాలు తరిగినట్టు తెలుస్తోంది. స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ) రూ.11,134 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో ఇవి 16.26 శాతానికి సమానం. గతేడాది ఇదే త్రేమాసికంలో ఎన్పీఏలు రూ.6,112 కోట్లు (మొత్తం రుణాల్లో 8.90 శాతం)గానే ఉన్నారుు. నికర ఎన్పీఏలు సైతం రూ.7,185 కోట్లుగా, మొత్తం రుణాల్లో 11.19 శాతంగా ఉన్నాయి. -
మొండిబకాయిలు సమస్య కాదు..
వార్కా(గోవా): బ్యాంకుల్లో అంతకంతకూ పేరుకుపోతున్న మొండి బకాయిలు(ఎన్పీఏ) పెద్ద సమస్య కాదని ప్రముఖ బ్యాంకర్, బ్రిక్స్ దేశాలు ప్రమోట్ చేసిన న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్డీబీ) ప్రెసిడెంట్ కేవీ కామత్ పేర్కొన్నారు. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఎనిమిదవ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో దీని గురించి(ఎన్పీఏలు) ఆందోళనచెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా ట్రెజరీ లాభాలు(ప్రభుత్వ బాండ్లలో చేసిన పెట్టుబడులకు సంబంధించి) బ్యాంకులకు రూ.2.5 లక్షల కోట్ల లాభాన్ని బ్యాలెన్స్ షీట్స్‌లో చూపించవచ్చు. ఎన్పీఏలు, ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. అంతేకాదు బ్యాంకుల మూలధన పరిస్థితిని మెరుగుపరుస్తుంది’ అని కామత్ చెప్పారు. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా ఇప్పటివరకూ బ్యాంకులకు రూ. లక్ష కోట్ల(ఈల్డ్‌లు తగ్గడంద్వారా మార్క్-టు-మార్కెట్ ప్రాతిపదికన) ప్రయోజనం లభించిందన్నారు. రానున్న కాలంలో మరో 1 శాతం మేర వడ్డీరేట్ల తగ్గుదలను అంచనా వేస్తున్నామని.. దీనివల్ల మరో రూ.1.5 లక్షల కోట్ల లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 8.7%కి(దాదాపు రూ.9 లక్షల కోట్లు) ఎగబాకాయి. మరోపక్క, బాసెల్-3 నిబంధనల ప్రకారం 2019 నాటికి బ్యాంకులకు 90 బిలియన్ డాలర్ల మూలధన నిధులు అవసరమవుతాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజా నివేదికలో పేర్కొంది. కాగా, గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఆర్బీఐ కీలక పాలసీ వడ్డీరేటు(రెపో)ను 1.75% తగ్గించడం తెలిసిందే. ఎన్పీఏలపై చర్యలు బాగున్నాయి.. మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనే విషయంలో బ్యాంకులు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు బాగున్నాయని కామత్ వ్యాఖ్యానించారు. ‘సమస్యాత్మక రుణాల గుర్తింపు అనేది పూర్తయింది. ఇక వీటిపై తగిన నిర్ణయం తీసుకోవడమే ఇప్పుడు చాలా కీలకమైన అంశం. మరోపక్క, బ్యాంకులకు నిధుల లభ్యత కూడా పెరిగిన నేపథ్యంలో సమస్యలు తగ్గాయనే చెప్పొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఎన్డీబీ నుంచి 2.5 బిలియన్ డాలర్ల రుణాలు మౌలిక రంగ ప్రాజెక్టులకు ఎన్డీబీ రుణాలను భారీగా పెంచనుందని బ్యాంక్ ప్రెసిడెంట్ కేవీ కామత్ తెలిపారు. ‘ఈ ఏడాది ఇప్పటివరకూ 911 మిలియన్ డాలర్ల రుణాలను(ఇందులో భారత్‌కు 250 మిలియన్ డాలర్లు) ఎన్డీబీ అందించింది. డిసెంబర్ నాటికి రుణాలు బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా. వచ్చే ఏడాది(2017) రెట్టింపునకు పైగా 2.5 బిలియన్ డాలర్ల రుణాలను ఇవ్వాలన్నది ఎన్డీబీ లక్ష్యం’ అని ఆయన వెల్లడించారు. భారత్‌కు రుణ సదుపాయాన్ని పెంచేందుకు త్వరలో మసాలా బాండ్ల(రూపాయి డినామినేషన్లో విదేశీ ఇన్వెస్టర్లకు బాండ్లను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ) జారీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా కామత్ చెప్పారు. రుణ అవసరాల కోసం వచ్చే ఏడాది ఎన్డీబీ 1.5 బిలియన్ డాలర్లను సమీకరించనుందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రమోట్ చేసిన ఎన్డీబీ... షాంఘై ప్రధాన కేంద్రంగా గతేడాది కార్యకలాపాలను ప్రారంభించింది. మహిళా డెరైక్టర్ల విషయంలోపీఎస్యూలు విఫలం: కిద్వాయ్ కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో నియమించేందుకు నైపుణ్యంగల మహిళలు లేరంటూ సాకులు చూపడాన్ని ప్రముఖ బ్యాంకర్ నైనాలాల్ కిద్వాయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది అసంబద్ధం, హాస్యాస్పదం’ అంటూ ఆమె మండిపడ్డారు. బ్రిక్స్ సదస్సుల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో మహిళా డెరైక్టర్ల నియామకంలో ప్రభుత్వ అలసత్వంపై హెచ్ఎస్బీసీ ఇండియా మాజీ చీఫ్ కిద్వాయ్ విమర్శలు గుప్పించారు. ‘ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇతరత్రా సివిల్ సర్వీసెస్‌లో మహిళా ప్రాతినిథ్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. అయితే, పీఎస్‌యూల్లో మహిళా డెరైక్టర్లను పెంచడంలో మాత్రం సమస్యేంటో అర్థం కావడం లేదు. కార్పొరేట్ కంపెనీల డైరక్టర్ల బోర్డుల్లో మహిళలకు సమాన ప్రాతినిథ్యం లభించేవిధంగా చట్టాలను అమలుచేయాల్సిన అవసరం ఉంది. లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి’ అని కిద్వాయ్ పేర్కొన్నారు. కాగా, 68 లిస్టెడ్ పీఎస్‌యూల్లో సగానికిపైగా మహిళా డెరైక్టర్లను నియమించుకోలేదని(2015 మార్చి డెడ్‌లైన్) తాజాగా ప్రైమ్‌డేటా బేస్ నివేదిక వెల్లడించడం గమనార్హం. -
సంస్కరణలు బాగుంటే రేటింగ్ అప్‌గ్రేడ్
మూడీస్ సంకేతాలు... • ఒకటి రెండేళ్లలో నిర్ణయం ఉంటుందని వెల్లడి • ప్రైవేటు పెట్టుబడులు మందగమనం, • ఎన్పీఏలు స్పీడ్ బ్రేకర్లన్న అభిప్రాయం • నేడు ఆర్థిక శాఖ అధికారులతో భేటీ న్యూఢిల్లీ: సంస్కరణలు తగిన విధంగా అమలు జరుగుతున్నాయని భావిస్తే- ఒకటి, రెండు సంవత్సరాల్లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ పెంచుతుందని ఆ సంస్థ సావరిన్ గ్రూప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మారియో డిరాన్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనం, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య, సంస్కరణల నెమ్మది ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ స్పీడ్ బ్రేకరని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. ‘అధమ’ స్థాయికి ఇది ఒక అంచె ఎక్కువ. భారత్ రేటింగ్‌కు సంబంధించి సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై మూడీస్-ఇక్రా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా మారియో ఇంకా ఏం చెప్పారంటే.. ⇒ ద్రవ్యలోటు, స్థిరత్వం దిశలో వేగవంతమైన చర్యలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే రుణ నిష్పత్తి తగ్గింపు, మౌలిక రంగం పురోగతికి చర్యలు, రుతుపవన ఒడిదుడుకుల సవాళ్ల తుది ఫలితానికి లోబడి రేటింగ్ అప్‌గ్రేడ్ ఉంటుంది. అంతా సానుకూలంగా ఉంటే, 12 నుంచి 18 కాలంలో రేటింగ్ పెంపు అవకాశం ఉంది. ⇒ సంస్కరణల అమలు తీరు బాగుందనే భావిస్తున్నాం. అయితే ప్రైవేటు పెట్టుబడులు బలహీనతే సమస్యగా ఉంది. ⇒ పెండింగ్ సంస్కరణల్లో ముఖ్యంగా ఆరున్నాయి. భూ సమీకరణ బిల్లు, కార్మిక చట్టాల సంస్కరణ, మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి ప్రయోజనాలు తగిన విధంగా అమలు, పన్ను వ్యవస్థ అలాగే ప్రభుత్వ బ్యాంకింగ్‌లో సంస్కరణలు ఈ ఎజెండాలో కీలకమైనవి. ⇒ ఎన్పీఏలు, ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనానికి తోడు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, దేశంలో పలు సంస్కరణల్లో ఏకాభిప్రాయ సాధన ప్రతికూలాంశాల్లో ఉన్నాయి. ⇒ ఇన్వెస్టర్, కార్పొరేట్ స్థాయిల్లో విశ్వాసం మరింత బలపడాలి. తద్వారా వ్యాపార వాతావరణం మెరుగుపడాలి. ⇒ జీఎస్టీ బిల్లు పార్లమెంటులో ఆమోదం, దివాలా కోడ్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం కట్టడి దిశలో ద్రవ్య, పరపతి విధాన చర్యలు క్రెడిట్ పాజిటివ్ కోణంలో కీలకాంశాలు. విధానపరమైన అంశాల్లో పారదర్శకత, విశ్వసనీయత, అవినీతి నిరోధానికి చర్యలు ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాగత పటిష్టతకు దోహదపడుతున్న చర్యల్లో కొన్ని. భారత్ బ్యాంకింగ్ బెటర్: బీఐఎస్ బ్యాంకింగ్ సవాళ్లకు సంబంధించి చైనాకన్నా భారత్ పరిస్థితులు బాగున్నాయని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఆయా అంశాలకు సంబంధించి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చినా భారత్ పరిస్థితి బాగుందని పేర్కొంది. 40 ఆర్థిక వ్యవస్థల డేటాను పరిశీలించి బీఐఎల్ రూపొందించిన డేటా ప్రకారం- 2016 మొదటి త్రైమాసికంలో భారత్ క్రెడిట్-జీడీపీ నిష్పత్తి మిగిలిన దేశాలతో పోల్చితే తక్కువగా - 2.9 శాతంగా ఉంది. బ్రిక్ దేశాలలో ఇదే బెటర్. 2015 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఇది 3 శాతం. చైనా విషయంలో ఈ రేటు భారీగా 28.4 శాతం నుంచి 30.1 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయంగా వివరించింది. బ్రెజిల్-రష్యాల విషయంలో వరుసగా ఈ రేటు 4.6 శాతం, 3.7 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌పీఐల పన్ను ఆందోళనలను పరిశీలిస్తాం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పన్నుల విషయంలో లేవనెత్తిన కొన్ని ఆందోళలను పరిష్కరించడంపై దృష్టిపెడతామని ఆర్థిక శాఖ హామీనిచ్చింది. అదేవిధంగా భారత్‌లోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా సంస్థలు ఇచ్చిన సూచనలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి దిగ్గజాలతో సహా మొత్తం 35 ఎఫ్‌పీఐలకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో దాదాపు మూడు గంటల పాటు సమావేశంలో పాల్గొన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు, ప్రస్తుత పటిష్టస్థాయిపై ఎఫ్‌పీఐల్లో ఎలాంటి సందేహాలు లేవు. మన మార్కెట్లో మరిన్ని అవకాశాల కోసం ఈ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. భవిష్యత్తు అత్యంత ఆశావహంగా కనిపిస్తోంది’ అని భేటీ తర్వాత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వ్యాపారాలకు అత్యంత సానుకూల దేశంగా భారత్‌ను నిలబెట్టడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని ఆయన వివరించారు. -
మొండిబకాయిలే సవాల్..
• బ్యాంకులకు మరిన్ని నిధులిచ్చేందుకు బడ్జెట్ పరమైన పరిమితులు... • సొంతంగా సమీకరణపై దృష్టిపెట్టాలి... • ఆర్థిక వ్యవస్థ మెరుగైతే ఎన్పీఏలు తగ్గుతాయ్.. • పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో భేటీ తర్వాత • ఆర్థిక మంత్రి జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలు(ఎన్పీఏ) సవాలుగా మారాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ)కు భారీగా నిధులను ఇచ్చే విషయంలో బడ్జెట్ పరంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయని... సొంతంగా నిధుల సమీకరణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన సూచించారు. శుక్రవారమిక్కడ పీఎస్బీ చీఫ్‌లతో బ్యాంకుల పనితీరు సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లపై కొన్ని ఎన్పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల రుణాల మంజూరుకు అడ్డుకట్టపడుతోంది. ఎన్పీఏల సమస్య ఇలాగే కొనసాగడమో లేదంటే శాశ్వతంగా ఉండిపోయేది కూడా కాదు. అయితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ఈ ఇక్కట్లు తగ్గుముఖంపట్టడంతోపాటు రుణాలిచ్చేందుకు నిధులు కూడా అందుబాటులోకి వస్తాయి. పీఎస్బీలకు మరిన్ని మూలధన నిధులను అందించేందుకు మేం సుముఖమే. కానీ, బడ్జెట్ పరంగా పరిమితులు ఉన్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఎన్పీఏల విక్రయానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడటం లేదని బ్యాంకుల చీఫ్‌లు ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. ఎన్పీఏల విక్రయానికి అవసరమైతే బ్యాంకులకు ఆర్థిక సేవల విభాగం సహకారం అందిస్తుందన్నారు. ఈ ప్రతికూలతలు సద్దుమణిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు వీలవుతుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని సాధిస్తాం... ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2014-15లో 5.43 శాతం(రూ.2.67 లక్షల కోట్లు) నుంచి 2015-16 నాటికి 9.32 శాతానికి(రూ.4.76 లక్షల కోట్లు) పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దివాళా చట్టం అమలు; సర్ఫేసీ, డీఆర్టీ చట్టాల్లో సవరణలు వంటి పలు చర్యలను ఇటీవల ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్నాయని.. వీటిని సమర్ధంగా అమలు చేస్తే బ్యాంకులు ఎన్పీఏల సమస్యను ధీటుగా ఎదుర్కోగలవని జైట్లీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయని ఆయన పేర్కొన్నారు. కాగా, నిధుల కొరతను ఎదుర్కొంటున్న 13 పీఎస్బీలకు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా తొలివిడత రూ.22,915 కోట్ల మూలధనాన్ని కేంద్రం ఇటీవలే సమకూర్చిది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఈ ఏడాది మరిన్ని నిధులను కేంద్రం అందించనుంది. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మేర మూలధన నిధులను ఇచ్చింది. కాగా, వ్యవసాయ రుణాలపై మాట్లాడుతూ.. ఈ రంగానికి అత్యధిక రుణాలే తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలిచ్చే లక్ష్యాన్ని సాధించగలమని జైట్లీ పేర్కొన్నారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి పూర్తి మద్దతు ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి కట్టుబడిఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని జైట్లీ తేల్చిచెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకుల(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావంకోర్, పాటియాలా, మైసూర్)తో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను ఎస్బీఐలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం తెలిసిందే. ‘ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి మద్దతు పలికింది. కేబినెట్ కూడా ఓకే చెప్పింది. నిబంధనల ప్రకారమే విలీనం పూర్తవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయడం విదితమే. మరోపక్క, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ విలీనం వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 73.98% వాటా ఉంది. దీన్ని దశలవారీగా 49%కి తగ్గించుకోవాలన్నది కేంద్రం యోచన. ద్రవ్యోల్బణం తగ్గుదలను ఆర్బీఐ పరిగణించాలి.. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలను(ఆగస్టులో 5.05 శాతం) దృష్టిలోపెట్టుకొని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రానున్న పాలసీ సమీక్ష(అక్టోబర్ 4న)లో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. ‘వచ్చే నెలలో జరిగే సమీక్షలో ఆర్బీఐ/ఎంపీసీ(ఒకవేళ అప్పటికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైతే) ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నా. ఆర్బీఐ అనేది అత్యంత బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థ. దాని నిర్ణయంకోసం మనం ఎదురుచూడటంతో పాటు విశ్వసించాలి కూడా’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో గడిచిన సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొన సాగించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు మరో రెండేళ్లు కష్టాలే!
♦ భారత బ్యాంకులపై ఒత్తిడి కొనసాగుతుంది ♦ ఆస్తుల నాణ్యత, లాభాల పరంగా సమస్యలుంటాయి ♦ ఎన్పీఏలు పెరుగుతాయి: ఎస్ అండ్ పీ రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ/ముంబై: ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకులపై ఒత్తిడి కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. సమస్యాత్మక రంగాల్లోని కంపెనీలకు అధిక రుణాలిచ్చిన ఫలితంగా ఎన్పీఏలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేసింది. ఫలితంగా ఆస్తుల నాణ్యత, లాభాలు, క్యాపిటలైజేషన్ పరంగా మరో ఏడాది నుంచి రెండేళ్ల పాటు బ్యాంకులపై ఒత్తిడి ఉంటుందని తెలిపింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత పరంగా బలహీన ధోరణి కొనసాగితే ఆర్థిక సవాళ్లు పెరిగినట్లు భావించాల్సి వస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అనలిస్ట్ గీతాచుగ్ చెప్పారు. ‘భారత్, చైనా బ్యాంకులపై ఆర్థికపరమైన కష్టాల నీలినీడలు’ పేరిట ఈ రెండు దేశాల్లోని బ్యాంకులను ఆస్తుల నాణ్యత, లాభాలు, క్యాపిటలైజేషన్, రుణాల వృద్ధి పరంగా పోల్చి నివేదిక రూపొందించింది. నివేదికలోని అంశాలివీ... ♦ భారత్ బ్యాంకుల మాదిరిగా చైనా బ్యాంకులు సైతం ఇవే సమస్యలతో కూడిన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ♦ భారత్, చైనా బ్యాంకులపై అధిక ఆర్థికపరమైన సవాళ్లు వాటి పరపతి అవకాశాలకు ప్రతిబంధకం. ♦ భారత్ పారిశ్రామికోత్పత్తిలో పురోగతి తక్కువగా ఉండడం, చైనాలో అధిక పారిశ్రామికోత్పత్తి వల్ల బ్యాంకులపై ఆస్తుల నాణ్యత పరమైన ఒత్తిడి కొనసాగుతుంది. బ్యాంకుల వడ్డీ మార్జిన్లలో క్షీణత ‘అధిక మొండిబకాయిలు, కార్పొరేట్ల రుణాలపై దృష్టి వల్ల భారత్‌లోని బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎంలు) కుచించుకుపోతాయి. రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు ఇకపైనా తగ్గిస్తాయి. అయితే, రుణాలపై అధిక వ్యయాల కారణంగా లాభాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉండకపోవచ్చు’ అని ఎస్అండ్పీ అనలిస్ట్ అమిత్ పాండే తెలిపారు. మూడేళ్లలో బ్యాంకులకు రూ. 2.5 లక్షల కోట్లివ్వాలి బాసెల్ -3 నిబంధనల ప్రకారం ఉండాల్సిన మూలధనానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల నిధులు అందించాల్సి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకులు భారీ మొండి బకాయిల సమస్యలో చిక్కుకున్నాయని, ఇపుడవి మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే పరిస్థితిలో లేవని, కనుక నిధుల పరంగా ప్రభుత్వంపై ఆధారపడక తప్పదని ఎస్అండ్పీ అనలిస్ట్ గీతాచుగ్ చెప్పారు. ‘అవసరమైన మూలధనాన్ని సమీకరించలేకపోతే అవి కొత్త రుణాలివ్వలేవు. దానివల్ల మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తుంది. చివరికది బ్యాంకుల మధ్య స్థిరీకరణకు దారితీస్తుంది. బలహీన, అసమర్థ బ్యాంకుల్ని బలమైన బ్యాంకులు చేజిక్కించుకోవచ్చు’’ అని గీతాచుగ్ వివరించారు. బ్యాంకులు ఎన్పీఏలను 8.5%గా పేర్కొన్నప్పటికీ తమ అంచనా ప్రకారం ఇవి 13%గా ఉండవచ్చన్నారు. భారత్ కంటే చైనాలో ఎన్పీఏల సమస్య తక్కువన్నారు. మేకిన్ ఇండియాకు మౌలిక వసతులే అడ్డంకి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి మౌలిక వసతుల లేమి పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్అండ్పీ తెలియజేసింది. మౌలిక వసతుల లోపం కారణంగా జీడీపీలో 5 శాతం వరకు అదనంగా వ్యయం అవుతున్నట్లు ఎస్అండ్పీ అనలిస్ట్ అభిషేక్ దంగ్రా తెలిపారు. మౌలిక వసతుల్లో వృద్ధితో ఎగుమతుల పరంగా పోటీతత్వం పెరుగుతుందనే అంచనాలున్నట్టు చెప్పారు. ‘‘ఎగుమతులకు కేంద్రంగా ఉన్న చైనా సైతం మౌలిక వసతుల పరంగా సమస్యలు ఎదుర్కొంటోంది. మౌలిక వసతుల అభివృద్ధి కోసం వెచ్చించే ప్రతి రూపాయి జీడీపీకి రూ.2 తెచ్చిపెడుతుంది. జీఎస్టీ బిల్లు ఆమోదమనేది లాజిస్టిక్స్, తయారీ రంగాలకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’’ అని దంగ్రా వివరించారు. ‘‘సరైన నియంత్రణ విధానంతో ఈ రంగానికి మేలు జరుగుతుంది. చక్కని నియంత్రణ వల్ల దేశీయంగా విద్యుదుత్పత్తి రంగం టర్న్ అరౌండ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి’’ అన్నారాయన. ప్రభుత్వం రవాణా రంగంపై వ్యయాన్ని పెంచినా, అధిక రుణ భారంతో ప్రాజెక్టులు ఆలస్యం కావొచ్చని హెచ్చరించారు. నిధుల పరంగా ప్రభుత్వానికి ఉన్న పరిమితులతో... ప్రైవేటు రంగం పాత్ర తప్పనిసరి అని స్పష్టంచేశారు. -
2017 నాటికి కుప్పకూలనున్న భారత బ్యాంకులు
న్యూఢిల్లీ: భారత బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలను రుణంగా తీసుకొని ఎగవేసిన వారిలో మనకు ప్రత్యక్షంగా కనిపించేది లిక్కర్ బారెన్ విజయ్ మాల్యానే కావచ్చు. ఇలా ఎగవేస్తున్న టాప్ వంద కంపెనీల్లో ఆయన ఒక భాగం మాత్రమే. విజయ్ మాల్యా తొమ్మిదివేల కోట్ల రూపాయలను ఎగవేయగా, ఆయనలాగా ఎగవేసిన వారి మొత్తం రుణాలు 1.14 లక్షల కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇక వసూలు కావనుకొని బ్యాంకులు ఇప్పటికే నిరర్థక ఆస్తుల కింద లెక్కించిన రుణాల మొత్తం 3.6 లక్షల కోట్ల రూపాయలు. వాయిదాలు గడిచిపోయినప్పటికీ చెల్లించని వారి రుణాల మొత్తాన్ని కలుపుకుంటే 6.7 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందట. భారత బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై తాజాగా విడుదలైన ఆర్థిక సుస్థిరత నివేదికే ఈ అంశాలను వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2017 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. 6.7 లక్షల కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా వసూలయ్యే అవకాశం ఎలాగు లేదని రిసెర్చ్ అండ్ క్రెడిట్ రేటింగ్ సంస్థలే తెలియజేస్తున్నాయి. భారత బ్యాంకుల నుంచి ఐదు కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకున్న వారి సంఖ్య మొత్తం రుణ గ్రహీతల్లో 58 శాతం ఉండగా, మొత్తం డీ ఫాల్టర్లలో వీరి సంఖ్య 86.4 శాతం ఉండడం గమనార్హం. వేలాది కోట్ల రూపాయలను ఎగవేసిన వారిలో వంద ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఉండడం దిగ్భ్రాంతికరమైన విషయం. నిరర్థక ఆస్తుల కింద మొండిబకాయిలుగా మారిన రుణాలు గత సెప్టెంబర్ నెలలో 5.1 శాతంకాగా, మార్చి నెలనాటికి అది 7.6 శాతానికి పెరిగింది. 2017 నాటికి 9.3 శాతానికి పెరుగుతుందని ఆర్థిక సుస్థిర నివేదిక అంచనావేసింది. మొండి బకాయిలను 2017లోగా వసూలుచేసి క్లియర్ బ్యాలెన్స్ షీటును రూపొందించాలని దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వేలాది కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్న 500 మంది డీఫాల్టర్లలో 240 మంది రుణాలను చెల్లించే పరిస్థితుల్లోనే లేరని ఆర్థిక సుస్థిరత నివేదికనే తెలియజేస్తుంటే ఇంక ఆర్బీఐ గవర్నర్ ఉత్తర్వులను బ్యాంకులు ఎలా అమలు చేయగలగుతాయి. మొండి బకాయిలపై కఠిన చర్యలను తీసుకొని నిరర్థక ఆస్తుల విలువను తగ్గించుకోలేకపోయినట్లయితే బ్యాంకులు కుప్పకూలే ప్రమాదం తప్పదు. -
బ్యాంకుల చేతికి జేపీ!
♦ కంపెనీ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించిన రుణదాతలు ♦ ఎస్డీఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఐసీఐసీఐ ♦ త్వరలో విధివిధానాలను చర్చించనున్న బ్యాంకర్లు ♦ అల్ట్రాటెక్‌తో సిమెంట్ ప్లాంట్ల విక్రయం ఒప్పందానికి బ్రేక్! ముంబై: భారీ అప్పుల్లో కూరుకుపోయిన.. జేపీ అసోసియేట్స్ గ్రూప్‌ను బ్యాంకులు తమ ఖాతాలో వేసుకోనున్నాయి. జేఏఎల్‌కు భారీస్థాయిలో రుణాలిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాయి. దీంతో జేపీ గ్రూప్ ప్రధాన కంపెనీ జేఏఎల్ తమ సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించడం కోసం కుదుర్చుకున్న రూ.15,900 కోట్ల ఒప్పందానికి బ్రేక్ పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ అకౌంట్‌ను మొండిబకాయి(ఎన్పీఏ) ల్లోకి చేర్చామని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక తమ అప్పులకు సరిపడా కంపెనీలో వాటాను తీసుకోవడం కోసం వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఏ) ప్రక్రియను ఆరంభించినట్లు ఆయన తెలిపారు. ఎస్డీఆర్ ప్రక్రియ పూర్తయితే జేఏఎల్లో మెజారిటీ వాటా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లినట్లే లెక్క. కంపెనీ యాజమాన్య, నియంత్రణ అధికారాలన్నీ ఇక రుణదాతలు నియమించే వ్యక్తులే చూసుకుంటారు. కాగా, ఎస్డీఆర్ విధివిధానాలు, షరతులతో పాటు జేపీ-అల్ట్రాటెక్ సిమెంట్ డీల్‌పై చర్చించేందుకు త్వరలో జాయింట్ లెండర్స్ ఫోరమ్(జేఏఎఫ్) మరోసారి సమావేశం కానుందని ఎస్బీఐ అధికారి వెల్లడించారు. అల్ట్రాటెక్‌తో డీల్‌ను ఆమోదించాలా వద్దా అనేది ఫోరమ్ నిర్ణయిస్తుందన్నారు. జేఏఎఫ్కు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వం వహిస్తోంది. రుణ భారం రూ.58 వేల కోట్లపైనే... జేపీ అసోసియేట్స్‌కు ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం రూ.58,250 కోట్ల అప్పులు లెక్కతేలాయి. ఇందులో ఎస్బీఐ వాటా రూ.7,000 కోట్లుగా అంచనా. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుకు జేఏఎల్ రుణ బకాయిని చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్డీఆర్ ప్రక్రియకు తెరతీసింది. ఎస్డీఐఆర్కు జూన్ 28 రిఫరెన్స్ తేదీగా కూడా పేర్కొన్నట్లు జేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఎస్డీఆర్ను అమోదించడం లేదా తిరస్కరించేందుకు జేపీ అసోపసియేట్స్కు బ్యాంకర్లు మూడు నెలల గడవు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సిమెంట్ ప్లాంట్ల విక్రయంపై అనిశ్చితి ఎఫెక్ట్... అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు జేఏఎల్ ఆస్తుల విక్రయంపై దృష్టిసారించింది. అయితే, ఈ ప్రయత్నాలేవీ సజావుగా సాగకపోవడంతో కంపెనీ బకాయిల చెల్లింపు విషయంలో చేతులేత్తేసేందుకు దారితీసింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో తమకున్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి 31న దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. ఎస్డీఆర్ నేపథ్యంలో దీనిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. -
చిత్తశుద్ధితోటే విత్త వృద్ధి
సమకాలీనం పేరున్న నాయకుడో, బడా పారిశ్రామికవేత్తో, ఓ కంపెనీయో బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని వార్తలు వచ్చినపుడు సామాన్యుల బుర్రను తొలిచే ప్రశ్న ఒకటే! ఏ రైతో, చిరుద్యోగో, చిన్న వ్యాపారో పదివేలో, ఇరవైవేలో అప్పు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసి, గ్యారెంటీలు-కౌంటర్ గ్యారెంటీలతోనే రుణాలిచ్చే బ్యాంకులు ఈ ‘బడా’ల ముందు ఎందుకు బోల్తాపడతాయి? వారి నుంచి అప్పు తిరిగి రాబట్టుకునే విధానాలు ఎందుకుండవు? కాస్త లోతుగా పరిశీలిస్తే వీరి బండారం బయటపడుతుంది. ఈమధ్య బ్యాంకులు తరచూ వార్తల్లో ఉంటున్నాయి. అది మంచి కార ణాలతో అయితే ఫరవాలేదు, కానీ, చెడు కారణాలతో కావడమే బాధాకరం. వైద్యుడు, జీవనది, మంచి చెడులు చెప్పే పండితుడితో పాటు అప్పిచ్చేవా డున్న ఊళ్లోనే ఉండాలని సుమతీ శతకకారుడు బద్దెన రాశాడు. అప్పులిచ్చే సదుపాయం, అంటే బ్యాంకింగ్ వ్యవస్థకు అప్పట్నుంచే మనవాళ్లు అంత ప్రాధాన్యతనిచ్చారు. సంపద సంగతెలా ఉన్నా... డబ్బు ఉన్నపుడు, లేనపుడు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నుంచి పుట్టిన ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పాటు విలువలతో నడిచిందీ నేలపైన. ఇటీవలి కాలం వరక్కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు షావుకార్లు అతి తక్కువ వడ్డీరేట్లపైన రుణాలిచ్చేవారు. రుణ గ్రహీత కూడా అవసరానికి తీసుకొని తన చేయి తిరగ్గానే వడ్డీతోసహా తిరిగి చెల్లించేవాడు. ఒకటీ, అర కేసుల్లో ఎవరైనా దుర్బుద్ధితో ఎగ్గొట్టడానికి యత్నించినా, వారి బంధువుల్ని పిలిపించో, గ్రామస్తుల సమక్షంలోనో చిన్నపాటి చర్చ, పంచాయతీ పెట్టి దారికి తెచ్చుకునేవారు. తర్వాతి కాలంలో వాటి స్థానే వ్యవస్థీకృతమైన బ్యాంకులొచ్చాయి. కొంతకాలం పాటు రెండు వ్యవస్థలూ సమాంతరంగా నడిచాయి. కొన్నిచోట్ల ఇంకా నడుస్తున్నాయి! ఇంకొకరి అవసరాన్ని తమ అవకాశంగా మలచుకొని ఇబ్బడి ముబ్బడి వడ్డీలు, చక్రవడ్డీలతో కాల్చుకు తినే అప్పులవాళ్లు కూడా ఎక్కువయ్యారు. షావుకార్లు, కాబూలీవాలాలు, మైక్రో ఫైనాన్స్‌ల నుంచి ఇవాళ్టి కాల్‌మనీ కాల సర్పాల వరకు రూపాంతరం చెందిందీ ప్రైవేటు అప్పుల వ్యవస్థ. అప్పు తెచ్చుకొని ముంచేవాళ్లు తయారయ్యారు. చట్టం నీడలో, తగు రక్షణ ఏర్పా ట్లతో వ్యవస్థీకృతంగా ఉంటాయనుకునే బ్యాంకుల్ని ముంచే మహాటోకరా గాళ్లూ తయారయ్యారు. అది కార్పొరేట్ రంగమే కావడం దురదృష్టం. భారత బ్యాంకింగ్ వ్యవస్థకు పట్టిన ఈ జాడ్యమే మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి పెను సవాల్ విసురుతోంది. 2008లో, 2012లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో అమెరికా, ఐరోపాదేశాల వంటి అభివృద్ధి చెందిన సమాజాలు అతలాకుతలమైనపుడు, మనం తట్టుకొని నిలబడగలిగామంటే అందుకు పటిష్టమైన మన బ్యాంకింగ్ వ్యవస్థే కారణమని నిపుణులు విశ్లేషిం చారు. ఆ విశ్వాసం ఇప్పుడు సడలుతోంది. బడాచోర్... పెద్దప్పుల కార్పొరేట్లే! మొన్నటి మార్చి మాసాంతానికి మన బ్యాంకుల మొండి బకాయిలు, లోగడ ఎప్పుడూ లేనంత అధికంగా రూ.5.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి నికరంగా నిరర్థక ఆస్తులు(ఎన్పీయే). వాటిని అర్థవంతమైన ఆస్తులుగా మార్చే ప్రక్రియ ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్టుగానే సాగుతోంది. మధ్య తరగతి, ఎగువ-దిగువ మధ్య తరగతి కుటుంబాల వాళ్లు కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డిపాజిట్లతో ఖజానా నింపుకునే బ్యాంకుల్ని బడా చోర్లు కొల్లగొట్టడం వల్లే నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ స్ఫూర్తే భంగపడుతోంది. పెరుగుతున్న ఈ మొండి బకాయిల భారం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కుంగిపోయే ప్రమాద పరిస్థితులు అధికమౌతున్నాయని భారత రిజర్వు బ్యాంక్ తాజా (ఆర్థిక స్థిరత్వ) ద్వైవార్షిక నివేదిక హెచ్చరించింది. గత సెప్టెంబరులో 5.1 శాతంగా ఉన్న ఈ స్థూల మొండి బకాయిలు ఆరు మాసాల్లో 7.6 శాతానికి పెరిగాయనీ, ఇదే పరిస్థితి కొనసాగితే... 2017 నాటికి 9.3 శాతాన్ని దాట వచ్చనీ అంచనా వేసింది. అదే సమయంలో రుణ వృద్ధి రేటు తగ్గడం మరింత నిరాశాజనకమని ఈ నివేదికకు రాసిన ముందు మాటలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత సెప్టెంబరులో 9.4 శాతంగా ఉన్న రుణ వృద్ధిరేటు మార్చినాటికి 8.8 శాతానికి పడిపోయింది. పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుంటున్న భూరి గ్రహీతల మొండిబకాయిల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. మొత్తం మొండి బకా యిల్లో భూరి రుణ గ్రహీతలవే 86.4 శాతం ఉండగా, అగ్రభాగాన ఉన్న వంద మంది రుణ గ్రహీతల వాటాయే 22 శాతం! మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే ఆరుమాసాల కాలంలో బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీ ఎఫ్‌సీ) నిలకడగా వృద్ధి సాధించాయి. భారత బ్యాంకింగ్ రంగం సంక్షుభిత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచ పరిస్థితితో పోల్చినపుడు మన ఆర్థిక వ్యవస్థ దృఢంగానే ఉందని రాజన్ అంటున్నారు. అయితే, మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా దృఢ విధానాలు, వ్యవస్థాగత సంస్క రణలు అత్యవసరమని ఆయన అభిప్రాయం. ఎందుకీ దుస్థితి? పేరున్న నాయకుడో, బడా పారిశ్రామికవేత్తో, ఓ కంపెనీయో బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని వార్తలు వచ్చినపుడు సామాన్యుల బుర్రను తొలిచే ప్రశ్న ఒకటే! ఏ రైతో, చిరుద్యోగో, చిన్న వ్యాపారో పదివేలో, ఇరవై వేలో అప్పు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసి, గ్యారెంటీలు-కౌంటర్ గ్యారెంటీలతోనే రుణాలిచ్చే బ్యాంకులు ఈ ‘బడా’ల ముందు ఎందుకు బోల్తా పడతాయి? వారి నుంచి అప్పు తిరిగి రాబట్టుకునే విధానాలెందుకుండవు? కాస్త లోతుగా పరిశీలిస్తే వీరి బండారం సులభంగానే బయటపడుతుంది. అన్నిసార్లూ మోసాలే కాకపోవచ్చు! ఒకోసారి స్థాయికి, సామర్థ్యానికి మించిన విస్తరణలకు వెళ్లి, సరిగా నిర్వహించలేక కంపెనీలు, కార్పొరేట్లు బొక్క బోర్లా పడుతాయి. అప్పుడూ బ్యాంకులు మునగాల్సిందే! బుద్ధి వక్రిం చిన వారు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు బురిడీ కొట్టే ఉదంతాలూ ఉంటాయి. పలుకుబడితో రుణాలు పొందడం, ఆయా కంపె నీల్ని పనిగట్టుకు దివాలా తీయించడం, ఈ లోపున సదరు కంపెనీల ఆస్తుల్ని ఇతరేతర కంపెనీలకు దారి మళ్లించడం, మొదటి కంపెనీల్ని డొల్ల పరిచి అప్పులిచ్చిన బ్యాంకుల్ని నిలువునా ముంచడం... ఇదీ తంతు. రైతులకు రుణ వితరణ విషయంలో కటువుగా ఉండే బ్యాంకులు కార్పొరేట్లకు దాసోహమం టాయనేది సామాజిక శాస్త్రవేత్తల విమర్శ. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేం దుకు రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు హామీలిచ్చి, గద్దెనెక్కాక రైతుకు టోకరా ఇచ్చే ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంటి నాయకులూ ఉంటారు. ‘మాఫీ’ పద ్ధతే మంచిది కాదని, అది ఖాతాదారుడి అప్పు తీర్చే సంస్కృతిని నశింపజేస్తుందని నీతులు చెప్పే బ్యాంకులు, కార్పొరేట్ పెద్దల గడ్డాలు పట్టుకొని ‘వన్‌టైమ్ సెటిల్మెంట్’కి రమ్మని బతి మాలుతూ రెండు నాల్కల ధోరణి చూపుతాయి. ఏ రుణాలైతేనేం, 2015లోనే బ్యాంకులు మాఫీ చేసిన (రిటన్ ఆఫ్) రుణ మొత్తం 52,000 కోట్ల రూపాయ లని ఆర్బీఐ చెబుతోంది. మరేమిటి పరిష్కారం? కార్పొరేట్ మొండి బకాయిల సమస్యను అధిగమించే యుద్ధానికి వెళ్లేట ప్పుడు బ్యాంకులు ఉత్తిచేతులతో కాకుండా వినూత్న ఆయుధ సంపత్తితో వెళ్లాలని అరుంధతీ భట్టాచార్య (ఎస్బీఐ) అంటారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు పేరుకుపోతూ ఆర్థిక వ్యవస్థే డోలాయమానమైనపుడు పరిస్థితిని అధిగమించడానికిగాను రిజర్వు బ్యాంకు, కేంద్రం చేపడుతున్న చర్యల్లో పెద్ద పురోగతి లేదు. వ్యూహాత్మక రుణ పునర్ వ్యవస్థీకరణ (ఎస్డీయార్) వంటివి పెద్దగా ఫలించడం లేదు. ఈ వ్యవహారాల్లో న్యాయస్థానాల తీర్పుల అమలు కూడా అంతంతమాత్రమే. ప్రపంచ ఆర్థిక మాంద్యం దరిమిలా ఉత్పన్నమైన దుస్థితిని అధిగమించడానికి తదనంతర కాలాలలో వివిధ దేశాల్లో వేర్వేరు పద్ధతులను అనుసరించారు. అవి కొంతమేర ఫలితమిచ్చాయి. కొన్ని చోట్ల వికటించాయి. ఇటలీలో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి తటస్థ ఏజెన్సీ ద్వారా ఆస్తుల ఆర్థిక పరిపుష్టికి యత్నించారు. స్పెయిన్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఇటువంటి యత్నాలు వికటించిన అనుభవాలున్నాయి. అమెరికాలో ప్రభు త్వమే ఆయా ఆస్తుల్ని కొనుగోలు చేసి ట్రబుల్డ్ అసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్ (టిఏఆర్పీ) అమలు చేసింది. మన దేశంలో పూర్తిగా ప్రభుత్వమే భారం మోసే పద్ధతి సాధ్యపడదు. అందుకు, మన ఆర్థికపరిమితులు అనుమతిం చవు. మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల వల్ల దెబ్బతిన్న బ్యాంకుల పరిపుష్టికి రిజర్వుబ్యాంకు (సెంట్రల్ బ్యాంకు) ఎమర్జెన్సీ నిధుల్ని ఉపయోగించాలనే ఓ కొత్త ఆలోచన తెరపైకి వస్తోంది. ఇది, ఆర్థిక మంత్రిత్వశాఖ ముఖ్య సలహా దారు అరవింద్ సుబ్రహ్మణియన్ యోచన అంటున్నారు. రాజన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. చైనాలో ‘డెట్ ఈక్విటీ కన్వర్షన్’ పద్ధతి అనుసరించారు. దెబ్బతిన్న కంపెనీలు బాకీపడ్డ మొత్తాల్లో సగం వరకు ఈక్విటీ కింద మార్చుకునే వెసులుబాటును మన రిజర్వుబ్యాంకు ఇటీవల కల్పించింది. ఫలితాలెలా ఉంటాయో చూడాలి. ప్రపంచ చేదు అనుభవాల తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్మెఫ్) నిపుణుడొకరు మన పునరు ద్ధరణకు 3 పరిష్కారాల్ని సూచిస్తున్నారు. 1) సమస్య మరింత జటిలం కాక ముందే సత్వర, ప్రభావవంతమైన చర్యల్ని ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం చేప ట్టాలి. బ్యాంకులు కూడా నిజాల్ని దాచి, రుణాల్ని పెంచుతూ పోవడం కాకుండా ఆస్తుల నాణ్యతపై చర్చకు సిద్ధపడాలి. 2) రుణదాత-గ్రహీత ఇరు వురి వైపు నుంచి సానుకూల యోచనతో, అప్పు కట్టలేని స్థితిలో ఉన్న కంపె నీల పెట్టుబడుల నిర్వహణలో మార్పులకైనా సిద్ధపడేలా చర్యలుండాలి. 3) బ్యాలెన్స్ షీట్లో సర్దుబాట్లు కాకుండా బ్యాలెన్స్ సర్దుబాటుకు యత్నించాలి. కంపెనీ-కార్పొరేట్ల నిర్వహణ సామర్థ్యాన్ని, సమస్యల్ని ప్రభావితం చేసే పరిష్కారాలకు విధాన నిర్ణేతలు సిద్ధం కావాలి. బ్యాంకుల విలీనంపైనా సందేహాలు విలీన ప్రక్రియ ద్వారా దేశంలోని నలభై, యాభై బ్యాంకుల్ని అయిదారు బ్యాంకులుగా చేయాలనే ప్రతిపాదనకు కార్యాచరణ మొదలైంది. ఎస్బీ హెచ్‌తో సహా ఓ అయిదు బ్యాంకుల్ని ఎస్బీఐలో విలీనం చేసే ప్రక్రియను మొదట చేపట్టారు. ఇది తీవ్ర విమర్శల్నెదుర్కొంటోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు లక్ష నుంచి పది లక్షల కోట్ల రూపాయల రుణం అందించే ప్రపంచ స్థాయి బ్యాంకుల్ని దేశంలో తయారుచేసే క్రమంలో ఇది చేపట్టినట్టు చెబుతున్నారు. ఇదొక సాకు మాత్రమేనని, విలీన ప్రక్రియ వెనుక కార్పొరేట్ శక్తుల దురుద్దేశాలున్నాయని ఉద్యోగ సంఘాల వారు, నిపుణులు పేర్కొంటు న్నారు. విలీనం ద్వారా బ్యాంకుల సామర్థ్యం పెరుగుతుందని, ఫలితంగా సత్వర సేవలతో పాటు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలివ్వగలరనే వాదనా ఉంది. మానవ సంబంధాలన్నీ సారంలో ఆర్థిక సంబంధాలే అన్న కారల్ మార్క్స్ భావాల సారంలాగా నేడు ప్రతి మనిషి జీవితంలో అవిభాజ్య భాగ మైన బ్యాంకులు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన రంగాన్ని సరైన దిశలో నడపాల్సిన బాధ్యత పాలకులదే! దిలీప్ రెడ్డి, 'సాక్షి' ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్, ఈమెయిల్: dileepreddy@sakshi.com -
రుణ వృద్ధి మందగమనానికి ఎన్పీఏలే కారణం
అధిక వడ్డీరేట్లు కారణం కాదన్న రాజన్ బెంగళూరు: మొండి బకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి బ్యాంకింగ్ ఎదుర్కొంటున్న ఒత్తిడే బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం పేర్కొన్నారు. రుణ వృద్ధి మందగమనానికి అధిక వడ్డీరేట్ల వ్యవస్థ కారణమన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ‘బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల సమస్య పరిష్కారం’ అనే అంశంపై పారిశ్రామిక సంస్థ- అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. వడ్డీరేట్లు తగ్గిస్తే... రుణ వృద్ధి బాగుంటుందని భావించడం సరికాదని పేర్కొన్నారు. ఎన్పీఏల సమస్య ఉన్నప్పటికీ పరిశ్రమలకు ప్రత్యేకించి మౌలిక రంగానికి బ్యాంకింగ్ తగిన రుణ అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారమయితే.. అది వడ్డీరేట్ల తగ్గింపునకూ దోహదపడుతుందని వివరించారు. 2015-16లో రుణ వృద్ధి రేటు ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయిలో 8.6%కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇదే సంవత్సరంలో మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 % నుంచి 8%కి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటు తర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50% తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5%కి దిగివచ్చింది. బ్యాంకింగ్ మూలధనానికి ఆర్బీఐ మిగులు నిధులు సరికాదు కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన కల్పనకు ఆర్బీఐ మిగులు నిధులు సమకూర్చాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం రూపొందించిన ఆర్థిక సర్వే చేసిన సూచనలను రాజన్ తోసిపుచ్చారు. ఇది తగిన ఆలోచన కాదని, పరస్పర ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తుందన్నారు. అయితే వీలయినంత ఎక్కువ డివిడెండ్‌ను ఆర్బీఐ ప్రభుత్వానికి చెల్లిస్తే.. తద్వారా ప్రభుత్వం బ్యాంకింగ్‌కు తగిన మూలధనం సమకూర్చగలుతుందనీ వ్యాఖ్యానించారు. అంతేగానీ ఆర్బీఐ తనకుతానుగా ప్రత్యక్షంగా బ్యాంకింగ్‌కు నిధుల సమకూర్చడం సరైన ఆలోచన కాదని వివరించారు. 2010-11లో ఆర్బీఐ రూ.15,009 కోట్ల మిగులును కేంద్రానికి బదలాయించింది. 2014-15కి ఇది రూ.65,896 కోట్లకు పెరిగింది. మోసాలపై నిఘా..: ఉద్దేశపూర్వక ఎగవేతదారులను గుర్తించేందుకు, బ్యాంకింగ్ మోసాల నివారణకు, ఆయా సమాచారాన్ని విచారణా సంస్థలకు అందించేందుకు ఒక కమిటీని ఆర్బీఐ ఏర్పాటు చేసినట్లు రాజన్ తెలిపారు. తప్పు చేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరని అన్నారు. జాబితా నుంచి నన్ను తీసేయవద్దు..: తాను పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్నానన్న ధోరణిలో కొందరు రాస్తున్న వ్యాసాలను గత కొద్ది రోజులుగా చూస్తున్నానని రాజన్ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో నవ్వులు పూయిం చాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా పలు అంశాలపై దేశంతో తన అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘‘ఇంకా నేను బాధ్యతల్లోనే కొనసాగుతున్నాను. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉంటాను. బహుశా భారత్‌లోనే ఎక్కువ కాలం గడపొచ్చు. కనుక నన్ను జాబితాలోనుంచి తీసేయకండి’’ అని రాజన్ నవ్వుతూ అన్నారు. -
ఎగవేతదారులపై నిఘా నేత్రం!
డిటెక్టివ్‌ల సహాయాన్ని ఆశ్రయిస్తున్న బ్యాంకింగ్ * డిఫాల్టర్ల లావాదేవీలు తెలుసుకునే ప్రయత్నం న్యూఢిల్లీ: మొండిబకాయిలు (ఎన్పీఏ), అలాగే ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు బ్యాంకింగ్ వినూత్న రీతిలో ప్రైవేట్ డిటెక్టివ్‌ల సహాయాన్ని తీసుకుంటోంది. కోట్లాది రూపాయల్లో బ్యాంకులకు టోపీ పెట్టినవారు ఎక్కడ ఉంటున్నారు? ఏమి చేస్తున్నారు.? వారి ఆర్థిక లావాదేవీలు ఏమిటి?వంటి అంశాలను డిటెక్టివ్లు రహస్యంగా విచారించి సంబంధిత బ్యాంక్ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. ఇందుకు సంబంధించి డిటెక్టివ్‌ల ఎంపికకు... సంబంధిత ఏజెన్సీలను సంప్రదించడం, ప్రకటనల వంటి ప్రక్రియలో బ్యాంకింగ్ నిమగ్నమయినట్లు సమాచారం. నిజానికి గతంలో చిన్న ఎగవేతదారుల విషయంపై కొన్ని బ్యాంకులు ఇలాంటి చర్యలు తీసుకునేవని, అయితే ఇప్పుడు బడా వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంపై పలు బ్యాంకులు దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ ఆఫ్ ఇండియా (ఏపీడీఐ) కున్వర్ విక్రమ్ సింగ్ తెలిపారు. రుణ గ్రహీత, గ్యారెంటార్, డెరైక్టర్ వంటి ఎగవేత సంస్థ కీలక వ్యక్తుల వివరాలను తెలుసుకునే విషయంలో ఒక్కొక్క కేసుకూ రూ.7,500 ఒక ప్రముఖ బ్యాంక్ చెల్లిస్తున్నట్లు డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి పేర్కొంది. బ్యాంకింగ్ రికార్డుల్లో లేని ఆస్తులను గుర్తిస్తే.. రూ.20,000 చెల్లిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. -
ఇతరులతో పోలిస్తే మెరుగే కానీ..
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోత ♦ 0.2% తగ్గించిన ప్రపంచ బ్యాంక్ ♦ ఈ ఏడాది 7.6 శాతంగా అంచనా... ♦ ఎన్పీఏలతో కార్పొరేట్ రుణాలకు గండి ♦ రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవటం కూడా ప్రతికూలమే ♦ తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: దేశ వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ స్వల్పంగా కోత విధించింది. ఈ ఏడాది(2016)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండొచ్చని తాజాగా అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక అంచనాలు’ పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం చెప్పింది. వచ్చే రెండేళ్ల(2017, 18)కు వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 7.7 శాతానికి చేర్చింది. అయితే, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వృద్ధి పరుగులు తీస్తోందని... మొత్తంమీద 2016-17 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల కాలంలో భారత్ వృద్ధి రేటు 7.6-7.7 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. దేశీయ డిమాండ్ దన్ను... గతేడాది(2015-16)లో వృద్ధి 7.6 %కి(0.4% పెరుగుదల) పుంజుకోవడానికి ప్రధానంగా దేశీయ డిమాండ్ పెరగటమే కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా వృద్ధికి ఆసరాగా నిలుస్తున్నాయి. 2014 అక్టోబర్‌లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు 37% వృద్ధి చెందాయి’’ అని నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ.. ♦ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌లో మందగమనం ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో తయారీ రంగం 9.3 శాతం పుంజుకుంది. ♦ ఇతర పెద్ద వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాపార సెంటిమెంట్ బలంగా ఉంది. ♦ స్టార్టప్ సంస్థల జోరు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేవలు, ఈ-కామర్స్‌లో కొత్తకొత్త స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. ♦ ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో వేగం పెరగడం ఉద్యోగాల సృష్టికి వీలుకల్పిస్తోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో కొనసాగడం, వేతనాల్లో పెరుగుదలతో ప్రజల వాస్తవ ఆదాయాలు జోరందుకొని అర్బన్ వినిమయం ఎగబాకుతోంది. ♦ విద్యుదుత్పత్తి, రోడ్లు, రైల్వేలు, అర్బన్ ఇన్ఫ్రాలో ప్రభుత్వ వ్యయం పెరగడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో పాటు సరఫరాపరమైన అడ్డుంకులు కూడా తొలగుతున్నాయి. ♦ వరుసగా రెండేళ్లు సరైన వర్షపాతం లేకపోవడంతో గ్రామీణ వినియమం తీవ్రంగా పడిపోవడం మాత్రం ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశమే. ♦ 2015 నుంచి 5 సార్లు వడ్డీరేట్లలో కోత విధించినప్పటికీ కార్పొరేట్ రంగ రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడం దీనికి కారణం. ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీ కోత... అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం, కమోడిటీ రేట్ల పతనం, అంతర్జాతీయ వాణిజ్యంలో బలహీనతల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ఈ ఏడాది 2.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. జనవరిలో అంచనా వేసిన 2.9 శాతంతో పోలిస్తే అర శాతం తగ్గించడం గమనార్హం. ఇక చైనా వృద్ధి గతేడాది స్థాయిలోనే 6.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వృద్ధి మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నీ తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తీవ్ర పేదరికంలో ఉన్న ప్రజలకు బాసటగా నిలవాలని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బ్యాంకులను బలోపేతం చేస్తాం
♦ వృద్ధి జోరుకు ఇది చాలా కీలకం ♦ అవసరమైతే మరింత మూలధనం ♦ ఎగవేతదారులను వదిలిపెట్టం.. ♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఒసాకా/న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉందని, వృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకు వీలుగా వ్యవస్థలో ఏవైనా లోపాలు, అడ్డంకులు ఉంటే సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) పనితీరును మెరుగుపరచడం, వాటిని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తద్వారా వృద్ధి జోరుకు బ్యాంకులు ఆసరాగా నిలిచేందుకు దోహదం చేస్తుందన్నారు. పీఎస్‌బీల సీఈఓలతో నేడు(సోమవారం) సమీక్షా సమావేశం, ఆర్బీఐ పాలసీ సమీక్ష రేపు(మంగళవారం) జరగనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘మొండిబకాయిల రికవరీ విషయంలో ప్రభుత్వం బ్యాంకులకు తగినన్ని అధికారాలిచ్చింది. ఆర్థికంగా బ్యాంకులను మరింత పరిపుష్టం చేయాల్సిందే. అవసరమైతే బడ్జెట్లో ప్రకటించినదానికంటే అధికంగానే మూలధన నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బ్యాంకుల అధిపతులుతో జరిగే సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించనున్నాం’ అని జైట్లీ వివరించారు. ఇక ఆర్బీఐ పాలసీ సమీక్షపై మీకున్న అంచనాలేంటన్న ప్రశ్నకు... నిర్ణయం వెలువడటానికి ముందు తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. రుణ ఎగవేతదారులను నిద్రపోనివ్వం... బ్యాంకులకు రుణ బకాయిలను చెల్లించకుండా ఎగవేసిన వాళ్లను(డిఫాల్టర్ల)ను వదిలిపెట్టబోమని, వాళ్లకు నిద్రలేకుండా చేస్తామని జైట్లీ హెచ్చరించారు. మొండిబకాయిల కారణంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చి క్వార్టర్లో రూ.15,000 కోట్లకు పైగా భారీ నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, కొన్ని రంగాల్లో వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం వల్లే చాలావరకూ ఎన్పీఏలు ఎగబాకుతున్నాయని, అంతేకానీ దీనికి మోసాలు కారణం కాదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఎన్పీఏలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) పెరగడంవల్లే ఎక్కువ బ్యాంకులు నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని.. నిర్వహణపరంగా వాటి పనితీరు బాగానే ఉందన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇప్పుడున్న స్థాయికంటే మరింత పెరిగితే మన ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనని జైట్లీ అభిప్రాయపడ్డారు. క్రూడ్ ధర తాజాగా ఏడు నెలల గరిష్టానికి(బ్యారెల్ 50 డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ లాభం డౌన్.. షేరు జూమ్!
♦ క్యూ4లో 66 శాతం తగ్గిన నికర లాభం; రూ.1,264 కోట్లు ♦ ఆదాయం రూ.53,527 కోట్లు; 10 శాతం పెరుగుదల ♦ భారీగా పెరిగిన మొండిబకాయిలు... ♦ స్థూల ఎన్పీఏలు 4.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరిక ♦ షేరుకి రూ.2.6 చొప్పున డివిడెండ్ ♦ 10 శాతం దూసుకెళ్లిన షేరు ధర... కోల్‌కతా: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ను మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 66 శాతం దిగజారి రూ.1,264 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,742 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు ప్రొవిజనింగ్(కేటాయింపులు) రెట్టింపునకు పైగా ఎగబాకడం లాభాలు దిగజారేందుకు దారితీసింది. ఇక క్యూ4లో మొత్తం ఆదాయం రూ. రూ.48,616 కోట్ల నుంచి రూ.53,527 కోట్లకు పెరిగింది. 10 శాతం వృద్ధి చెందింది. ఎన్పీఏలు ఇలా...: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.5 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇవి 4.25 శాతమే. మొత్తం రుణాల్లో విలువ పరంగా చూస్తే... స్థూల ఎన్పీఏలు రూ.56,725 కోట్ల నుంచి రూ.98,173 కోట్లకు ఎగబాకాయి. ఇక నికర ఎన్పీఏల విషయానికొస్తే... 2.12 శాతం (రూ.27,591 కోట్లు) నుంచి 3.81 శాతానికి (రూ.55,807 కోట్లు) చేరాయి. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ మార్చి క్వార్టర్లో రెట్టింపునకు పైగా(144 శాతం) పెరిగి రూ.12,140 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ ప్రొవిజనింగ్ రూ.4,986 కోట్లు మాత్రమే. కాగా, క్యూ4లో కొత్తగా రూ.30 వేల కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారినట్లు బ్యాంక్ వెల్లడించింది. పూర్తి ఏడాదికి చూస్తే... గడచిన 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎస్బీఐ నికర లాభం రూ. 9,951 కోట్లకు తగ్గింది. 2014-15 ఏడాదిలో లాభం రూ.13,102 కోట్లతో పోలిస్తే 24 శాతం క్షీణించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.1,74,973 కోట్ల నుంచి రూ. 1,91,844 కోట్లకు ఎగసింది. దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఎస్బీఐ డెరైక్టర్ల బోర్డు రూ.2.60 డివిడెండ్‌ను ప్రకటించింది. ♦ క్యూ4లో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.27 శాతంగా నమోదైంది. ♦ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.9 శాతం వృద్ధితో రూ.14,712 కోట్ల నుంచి రూ. 15,291 కోట్లకు చేరింది. ♦ వడ్డీయేతర(ఫీజులు ఇతరత్రా) ఆదాయం 25.6 శాతం ఎగబాకి రూ. 10,696 కోట్లకు దూసుకెళ్లింది. ♦ క్యూ4లో రుణ వృద్ధి 13 శాతంగా నమోదైంది. మార్చి నాటికి బ్యాంక్ మొత్తం రుణాలు రూ.15.09 లక్షల కోట్లకు చేరాయి. ఇక డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ.17.3 లక్షల కోట్లకు పెరిగాయి. షేరు రయ్... మొండిబకాయిలు(ఎన్పీఏ) భారీగా పెరగడంతోపాటు, లాభాలు దిగజారినప్పటికీ ఎస్బీఐ షేరు మాత్రం దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర ఒకానొక దశలో 10 శాతం మేర ఎగసి రూ.202 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6.5 శాతం లాభంతో రూ.196 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రధాన సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఎస్బీఐయే కావడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.9,160 కోట్లు ఎగబాకింది. ఇది రూ1,51,801 కోట్లకు చేరింది. ఎస్బీఐ లాభం మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఉందని ఏంజెల్ బ్రోకింగ్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్(బ్యాంకింగ్) సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. ఎన్పీఏల సమస్యతో ఇతర పీఎస్‌యూ బ్యాంకులన్నీ తీవ్రమైన నష్టాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ మాత్రం లాభాలను కొనసాగిస్తుండడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుబంధ బ్యాంకుల విలీనానికి రూ. 3,000 కోట్ల వ్యయం.. ఆర్బీఐ మొండిబకాయిల సమీక్ష(ఏక్యూఆర్) నిబంధనల కారణంగా మార్చి క్వార్టర్లో రూ.9,000 కోట్ల రుణాలను ఎన్పీఏలుగా పరిగణించడంతో ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. లాభాలు దిగజారడానికి ఇది కూడా ప్రధాన కారణం. మరోపక్క, రూ.31,000 కోట్ల రుణ ఖాతాలను ప్రత్యేక పరిశీలన జాబితాలో చేర్చాం. ఇందులో విద్యుత్, ఇనుము-ఉక్కు ఇంజనీరింగ్, చమురు-గ్యాస్, నిర్మాణ రంగాలకు చెందిన కంపెనీల ఖాతాలు ఉన్నాయి. ఈ జాబితాలోని రుణాల్లో 70 శాతం మొండిబకాయిలుగా మారే అవకాశం ఉంది. ఇక గతేడాది క్యూ4లో కొత్తగా ఎన్పీఏలుగా మారిన రూ.30 వేల కోట్లలో రూ.1,000 కోట్లు చిన్న మధ్యస్థాయి సంస్థలు(ఎస్ఎంఈ), వ్యవసాయ రుణాలకు సంబంధించినవి. మిగతా రూ.29,000 కోట్లు బడా, మధ్యస్థాయి కార్పొరేట్ కంపెనీలవే. అయితే, రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే.. ఎన్పీఏలు దిగొస్తాయని భావిస్తున్నాం. ఇక 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనం వల్ల ఎస్బీఐ నిర్వహణా సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే నిధుల సమీకరణ భారం కూడా దాదాపు ఒకశాతం మేర తగ్గుతుంది. విలీన ప్రక్రియకు దాదాపు రూ.3,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
ఎన్పీఏల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం!
బీబీబీ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడి న్యూఢిల్లీ: ఆందోళనకరంగా ఉన్న బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన రాయ్, ఈ దిశలో ఒక ‘ఇంటర్మీడియట్ మెకానిజం’ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారంలో బ్యాంక్ మేనేజ్మెంట్కు కూడా ఈ యంత్రాంగం తగిన సౌలభ్యం కల్పిస్తుందని ఆయన తెలిపారు. వివిధ బ్యాంకులకు సంబంధించి ఎన్పీఏల సమస్య పరిష్కారంలో అనుసరించాల్సిన ప్రక్రియను విశ్లేషించి, అమలు చేయడంపై ప్రతిపాదిత యంత్రాగం కృషి చేస్తుందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాయ్ పేర్కొన్నారు. ఒక మొండిబకాయిలకు సంబంధించి ప్రైసింగ్ నిర్ణయం విషయంలో సైతం ఈ యంత్రాంగం బ్యాంకింగ్‌కు సహకరిస్తుందని అన్నారు. అయితే ఈ యంత్రాంగం ఎప్పుటి నుంచీ అమల్లోకి వస్తుందన్న ప్రశ్నకు మాత్రం ఆయన నిర్ధిష్ట సమాధానం చెప్పలేదు. యంత్రాంగం విధివిధాన ప్రక్రియ మొత్తం పదిహేను రోజుల్లో పూర్తవుతుందని మాత్రం సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు అవకాశం ఉందా అన్న ప్రశ్నకు రాయ్ సమాధానం ఇస్తూ... మొండి బకాయిల పరిష్కారం, రుణ ప్రక్రియలో పారదర్శకత, ఖాళీల భర్తీ తొలి ప్రాధాన్యతలని వివరించారు. అనంతరమే హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు, బ్యాంకుల విలీనం వంటి అంశాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. జాయింట్ లెండింగ్పై త్వరలో మార్గదర్శకాలు! బ్యాంకుల జాయింట్ లెండింగ్ అంశంపై అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఆర్బీఐ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మొండిబకాయిల పరిష్కారం అంశంలో న్యాయ ప్రక్రియ అడ్డంకి అవుతుందన్న భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తగిన సమయంలో అన్ని వ్యవస్థలూ తగిన విధంగా పనిచేస్తాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. -
ఎస్బీహెచ్ లాభం రూ.253 కోట్లు
ఎన్పీఏలకు భారీ కేటాయింపులతో తగ్గుదల * ఈ ఆర్థిక సంవత్సరం లాభాల్లో 20% వృద్ధి లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) నికర లాభం 43% క్షీణించి రూ. 253 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 446 కోట్లు. ఆర్బీఐ ప్రొవిజనింగ్ ఆదేశాకు అనుగుణంగా రానున్న కాలంలో మొండిబకాయిల రిస్కులను ఎదుర్కొనేందుకు కూడా భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో లాభాల పరిమాణం తగ్గిందని, లేకపోతే మెరుగ్గానే ఉండేదని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ ఆదివారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు. ఎకానమీ వృద్ధి ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం, డిమాండ్ మందగించడం, ఖాతాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలు.. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్పీఏ) పెరుగుదలకు కారణమవుతున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, రాబోయే రోజుల్లో ఎన్పీఎ భారం తగ్గి.. నికర వడ్డీ మార్జిన్లు క్రమంగా మెరుగుపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. తాజాగా ఆరు కంపెనీలు వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) పరిధిలో వచ్చాయని, వీటిలో రెండు ఖాతాల పరిమాణం సుమారు రూ. 400 కోట్ల మేర ఉండగలదని ముఖర్జీ పేర్కొన్నారు. చాలా మటుకు ఇన్ఫ్రా సంస్థలకు గడ్డు కాలం తొలగినట్లేనని, పరిస్థితులు క్రమంగా మెరుగుపడగలవని ఆయన చెప్పారు. పంట రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి రెండో విడత నిధులు కూడా అందాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఎస్బీహెచ్ నిర్వహణ ఆదాయం రూ. 1,720 కోట్ల నుంచి రూ. 1,629 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 5% క్షీణించి రూ. 1,214 కోట్ల నుంచి రూ. 1,156 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్ 3.15% స్థాయిలో నమోదైంది. పూర్తి సంవత్సరానికి.. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీహెచ్ నికర లాభం 19 శాతం తగ్గుదలతో రూ. 1,317 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు పడిపోయింది. స్థూల నిరర్ధక ఆస్తులు 5.75 శాతానికి చేరి రూ. 6,591 కోట్లుగాను, నికర నిరర్థక ఆస్తులు 3.37 శాతం స్థాయిలో రూ. 3,743 కోట్ల మేర ఉన్నాయి. వ్యాపార పరిమాణం రూ. 2,54,599 కోట్లకు చేరింది. రాబోయే క్వార్టర్లలో కూడా మొండి బకాయిలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు మూడు రెట్లు అధికంగా రూ. 1,900 కోట్ల మేర జరిపినట్లు వివరించారు. రుణాల మంజూరీ 5 శాతం వృద్ధితో రూ. 1,14,369 కోట్లకు చేరింది. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు (కాసా) డిపాజిట్లు సుమారు 13 శాతం పెరుగుదలతో రూ. 48,703 కోట్లకు చేరాయి. కాసా నిష్పత్తి 23 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ప్రధానమంత్రి జన ధన యోజన కింద తెరిచిన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 860గా ఉంటోందని, మొత్తం 35.37 లక్షల ఖాతాల్లో దాదాపు రూ. 546 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని ముఖర్జీ చెప్పారు. విస్తరణ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిపాజిట్ల వృద్ధి 17-18 శాతం మేర, రుణాల వృద్ధి 12 శాతం మేర ఉండాలని నిర్దేశించుకున్నట్లు ముఖర్జీ చెప్పారు. అలాగే, నికర లాభాల్లో దాదాపు 20-25 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మరో 125 శాఖలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ముఖర్జీ చెప్పారు. ప్రస్తుతం మొత్తం 1,933 శాఖలు ఉండగా.. వీటిలో 776 తెలంగాణలో, 435 ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నాయి. ఇప్పటికే 51 ఈ-కనెక్ట్ కేంద్రాలు ఉండగా కొత్తగా మరో 25 ప్రారంభించనున్నట్లు ముఖర్జీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 1,200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం జరిగిందని వివరించారు. -
ఐసీఐసీఐపై బకాయిల బండ
♦ క్యూ4 నికర లాభం 87% డౌన్; 407 కోట్లు ♦ 11 ఏళ్ల కనిష్టస్థాయి ఇది... ♦ ఎన్పీఏలకు భారీ ప్రొవిజనింగ్, ♦ కంటింజెన్సీ రిజర్వ్‌కు కేటాయింపుల ప్రభావం ♦ 5.82 శాతానికి పెరిగిన స్థూల ఎన్పీఏలు ♦ షేరుకి రూ.5 చొప్పున డివిడెండ్... ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంకును మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడుతున్నాయి. గడిచిన దశాబ్దంపై కాలంలో ఎన్నడూలేనంత నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో(2015-16, క్యూ4)లో ఏకంగా 87 శాతం దిగజారి రూ.407 కోట్లకు పడిపోయింది. గడిచిన 11 ఏళ్లలో లాభాలు ఇంత తక్కువ నమోదుచేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే మార్చి త్రైమాసికంలో లాభం రూ.3,084 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిల పెరుగుదలతో కేటాయింపులు(ప్రొవిజనింగ్) అత్యంత భారీగా ఎగబాకడం, రానున్న కాలంలో ఎదురయ్యే ఎన్పీఏ రిస్కులను తట్టుకోవడానికి వీలుగా రూ.3,600 కోట్లతో ఒక ప్రత్యేక కంటింజెన్సీ నిధి(రిజర్వ్)ని ఏర్పాటు చేయడం లాభాలు ఘోరంగా పడిపోయేందుకు దారితీసింది. మొండిబకాయిలపై సమీక్ష(ఏక్యూర్)లో భాగంగా 150 కార్పొరేట్ రుణ ఖాతాలకు సంబంధించి బ్యాంకులన్నీ ప్రొవిజనింగ్‌ను తప్పనిసరిగా చేయాల్సిందేనని ఆర్బీఐ గతేడాది చివర్లో ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక బ్యాంకులు డిసెంబర్, ప్రస్తుత మార్చి క్వార్టర్లో వీటికి కేటాయింపులను చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇనుము-ఉక్కు, మైనింగ్, రిగ్గులు, విద్యుత్, సిమెంట్ రంగాల్లో రానున్న కాలంలో ఎన్పీపీఏల రిస్కులు ఉండొచ్చన్న కారణంగా కంటింజెన్సీ రిజర్వును నెలకొల్పినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. కాగా, మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌గా బ్యాంక్ మొత్తం ఆదాయం 13% పెరిగి రూ.28,217 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.24,914 కోట్లుగా ఉంది. కాగా, మార్కెట్ వర్గాలు క్యూ4లో నికర లాభం రూ.3,770 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కంటింజెన్సీ రిజర్వును పరిగణనలోకి తీసుకుంటే లాభం అంచనాల మేరకే ఉందని బ్రోకరేజి సంస్థ ఎంకే గ్లోబల్ అభిప్రాయపడింది. స్టాండెలోన్ లాభం 76 శాతం క్షీణత.. ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను మాత్రమే చూస్తే(స్టాండెలోన్ ప్రాతిపదికన) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో రూ.702 కోట్లకు దిగజారింది. అంతక్రితం ఏడాది క్యూ4లో లాభం రూ. 2,922 కోట్లతో పోలిస్తే 76 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.16,235 కోట్ల నుంచి రూ.18,591 కోట్లకు చేరింది. 14.5 శాతం పెరిగింది. భారీగా పెరిగిన మొండిబకాయిలు... మార్చి క్వార్టర్(క్యూ4)లో కొత్తగా రూ.7,000 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయని ఐసీఐసీఐ వెల్లడించింది. దీంతో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 5.82%కి(రైటాఫ్‌లు పోను రూ.26,211 కోట్లు) ఎగబాకాయి. అంత క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 3.78%(రూ.15,095 కోట్లు) కాగా, డిసెంబర్ క్వార్టర్లో 4.72%(రూ.21,149 కోట్లు)గా ఉన్నాయి. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ రూ.1,345 కోట్ల(అంతక్రితం ఏడాది క్యూ4) నుంచి ఈ క్యూ4లో రూ.3,326 కోట్లకు పెరిగిపోయాయి. మార్చి క్వార్టర్లో కొత్తగా ఎన్పీఏలుగా మారిన రూ.7,000 కోట్ల రుణాల్లో 60%మేర ఆర్బీఐ ఏక్యూఆర్ నిబంధనల కారణంగా నమోదైనవేనని బ్యాంక్ పేర్కొంది. రూ.2,700 కోట్లు మాత్రం పునర్వ్యవస్థీకరించిన రుణాల నుంచి ఎన్పీఏలుగా మారాయని తెలిపింది. కాగా, రూ.8,573 కోట్ల విలువైన పునర్వ్యవస్థీకరణ రుణాలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇక నికర ఎన్పీఏలు కూడా మార్చి క్వార్టర్లో 1.61%(రూ.6,256 కోట్లు) నుంచి 2.98%కి(రూ.12,963 కోట్లు) ఎగబాకాయి. గతేడాది డిసెంబర్ క్వార్టర్లో ఇవి 2.28%(రూ.9,908 కోట్లు). పూర్తి ఏడాదికి చూస్తే... స్టాండెలోన్‌గా గతేడాది నికర లాభం కూడా 13 శాతం పడిపోయి రూ.11,175 కోట్ల నుంచి రూ.9,726 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.61,267 నుంచి రూ.68,062 కోట్లకు పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ రూ. 2 ముఖ విలువైన ఒక్కో షేరుకి రూ.5 చొప్పున డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. ♦ జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 6 శాతం వృద్ధి తో రూ.5,404 కోట్లుగా నమోదైంది. ♦ వడ్డీయేతర ఆదాయం ఏకంగా 46 శాతం ఎగబాకి రూ.5,109 కోట్లకు దూసుకెళ్లింది. మ్యుంగా లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా లభించిన రూ.2,131 కోట్లు దీనికి దోహదం చేసింది. ♦ నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.57% నుంచి 3.37%కి తగ్గింది. ♦ ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ.237 వద్ద ముగిసింది. ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓకి ఓకే.. అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా మరింత వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం మెజారిటీ వాటానే అట్టిపెట్టుకుంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, కమోడిటీ ధరల తగ్గుముఖంతోపాటు దేశీయంగా వృద్ధి రికవరీ ఇంకా మందకొడిగానే ఉండటం.. రుణగ్రహీతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులు కుదుటపడాలంటే మరికొంతకాలం పట్టొచ్చు. మొండి బకాయిల కుదుపుల నేపథ్యంలో ఈ ఏడాది(2016-17)లో కార్పొరేట్ రుణా ల వృద్ధి 5-7% మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం. ప్రధానంగా రైల్వేలు, రోడ్లు, డిఫెన్స్ వంటి పనితీరు బాగున్న రంగాలపైనే దృష్టిసారిస్తున్నాం. ఇక గతేడాది రిటైల్ రుణాల వృద్ధి 16.4% కాగా, దీన్ని ఈ సంవత్సరంలో 18%కి పెంచుకోనున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ -
మార్కెట్ విలువను మించిన పీఎస్‌యూ బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి రూ. 100కు సమానమైన షేర్లు మీ దగ్గర ఉన్నాయా ? అయితే రూ.150 విలువైన మొండి బకాయిల భారం మీ నెత్తిన ఉన్నట్లే. ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ విలువకు ఒకటిన్నర రెట్లకు అంటే రూ. 4 లక్షల కోట్లకు మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొండి బకాయిలుగా మారే అవకాశమున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మొండి బకాయిల విలువ రెట్టింపై రూ.8 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ప్రైవేట్ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ బ్యాంకుల విలువలో 7% వరకే ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఎస్బీఐ సహా మొత్తం లిస్టైన 24 బ్యాంకుల మొండి బకాయిలు రూ.3,93,035 కోట్లుగా ఉన్నాయి. ఇది ఈ 24 బ్యాంకుల మార్కెట్ విలువ రూ.2,62,955 కోట్లతో పోల్చితే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల్లో మూడు నెలలలోపు ఎలాంటి చెల్లింపులు రుణగ్రస్తుడి నుంచి రాకపోతే ఆ రుణాన్ని మొండి బకాయిగా వ్యవహరిస్తారు. ఎస్బీఐ మినహా చాలా బ్యాంక్‌ల స్థూల మొండిబకాయిలు వాటివాటి మార్కెట్ విలువను మించి పోయాయి. -
బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకం తీరు మారాలి
మొండిబకాయిల పెరుగుదలకు ప్రస్తుత ప్రక్రియ కూడా కారణమే ♦ సీఏ సిలబస్‌లో మార్పులు; ♦ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కేంద్రాలు ♦ ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం దేవరాజ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిటర్ల నియామకాల ప్రక్రియ మారటం కూడా నిరర్థక ఆస్తుల(ఎన్పీఏ) పెరుగుదలకు పరోక్షంగా కొంత కారణమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్ ఎం.దేవరాజ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో బ్యాంకుల స్థాయిలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆడిటర్లను పంపేదని, ఇపుడైతే నియామకాల ప్రక్రియను బ్యాంకుల చీఫ్లకే అప్పజెప్పిందని ఆయన గుర్తు చేశారు. ‘‘దీనివల్ల ఆయా బ్యాంకులు మెరుగైన పనితీరు కనపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా తమకు అనుకూలంగా ఉండే ఆడిటర్లను నియమించుకోవటం జరుగుతోంది. పెపైచ్చు అయిదారుగురు అవసరమైన చోట ఇద్దరు ముగ్గురినే తీసుకోవ డం, వారిక్కూడా అంతగా అవగాహన లేకపోవడం వంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎన్పీఏల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయనే చెప్పాలి’’ అని దేవరాజ రెడ్డి వివరించారు. ఐసీఏఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బుధవారమిక్కడ తొలిసారి విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు అధిక వ్యాపారం ఉండే దాదాపు 20 శాతం శాఖల్లోనే ఆడిటింగ్ జరుగుతోందని, దీని వల్ల పూర్తి స్వరూపంపై అవగాహన లభించడం లేదని ఆయన చెప్పారు. ‘‘అందుకే మళ్లీ మొత్తం ఆడిటర్ల నియామకాల్ని రిజర్వు బ్యాంకే తీసుకోవాలంటూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని తెలియజేశారు. ద్రవ్య విధానాలు, పన్ను చట్టాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రీ బడ్జెట్ మెమోరాండంను కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి కొత్త ప్రమాణాలు.. ప్రైవేట్ రంగం తరహాలో ప్రభుత్వ విభాగాలు ఛార్టర్డ్ అకౌంటెంట్ల సేవల్ని వినియోగించుకోవటం లేదని దేవరాజ రెడ్డి చెప్పారు. డబుల్ అకౌంటింగ్ విధానం సహా కొన్ని అంశాలపై సిబ్బందికి అంతగా అవగాహన లేకపోవడం కూడా దీనికి కొంత కారణం కావొచ్చన్నారు. సీఏల సేవలను సక్రమంగా వినియోగించుకుంటే.. డిఫెన్స్ తదితర రంగాల్లో వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ‘‘బడ్జెటింగ్ తదితర అంశాలపై భారతీయ రైల్వేస్‌కు సేవలందిస్తున్నాం. కొత్త అకౌంటింగ్ ప్రమాణాల (ఇండ్ ఏఎస్) అమలుకు కూడా సీఏలు సర్వసన్నద్ధంగా ఉన్నారు. రూ. 500 కోట్ల పైచిలుకు టర్నోవరున్న కంపెనీలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, బీమా.. బ్యాంకింగ్ రంగాలకు మాత్రం 2018 నుంచి ఈ ప్రమాణాలు అమలు కానున్నాయి’’ అని ఆయన తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ .. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరింత మంది విద్యార్థులకు సీఏ చదువును అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కేంద్రాన్ని దాదాపు రూ.30 కోట్లతో విస్తరించేందుకు 3-4 ఎకరాలు కావాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగాం. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ కోరాం. అనంతపురం, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒకో కేంద్రానికి రూ.3 కోట్లు ఖర్చవుతుంది. వీటికి స్థలం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే స్థలం కొంటాం’’ అని వివరించారు. కొత్త పరిణామాలకు అనుగుణంగా సీఏ కోర్సు పాఠ్యాంశాల్లోనూ పలు మార్పులు ప్రతిపాదించామని, ఇవి ఈ ఏడాది నవంబరు లేదా వచ్చే ఏడాది మే నుంచి ప్రవేశపెట్టే అవకాశముందని దేవరాజ రెడ్డి వెల్లడించారు. అలాగే, ఫౌండేషన్ స్థాయికి ఇంటర్మీడియెట్ ప్రాథమిక అర్హతగా మార్చామని చెప్పారు. ప్రస్తుతం ఐసీఏఐకి దేశవ్యాప్తంగా 153 శాఖలు, సుమారు 2.5 లక్షల మంది సభ్యులు, 8.75 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మోసాల కట్టడి చర్యలను ఆడిటర్లు సమీక్షించాలి: ఐసీఏఐ న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలో రూ.కోటి పైగా అవకతవకలు జరిగాయని సందేహాలు వ్యక్తమైతే వాటి పరిష్కారానికి సదరు సంస్థ తీసుకున్న చర్యలను వాటి ఆడిటర్లు సమీక్షించాలని ఐసీఏఐ సూచించింది. ‘‘ఆ సదరు చర్యలతో సంతృప్తి చెందకపోతే దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా కంపెనీ యాజమాన్యానికి తెలపాలి. ఆ తరవాత 45 రోజుల్లో కంపెనీ సరైన చర్యలు తీసుకోకపోతే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలో లేదో పరిశీలించాలి’’ అని పేర్కొంది. -
మార్చి క్వార్టర్లోను లాభాలు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) మరింత పెరుగుతాయని, ఫలితంగా లాభాలు తగ్గుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. మూడో త్రైమాసికంలోనూ ఎన్పీఏల పెరుగుదల వల్లే లాభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. జపాన్ ఇన్వెస్టర్ల కోసం ఏర్పాటు చేసిన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని జపాన్ ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలకు తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అక్కణ్ణుంచి నిధులు సమీకరించే భారతీయ వ్యాపారవేత్తలకు తోడ్పాటునిస్తుందని కూడా చెప్పారామె. -
బ్యాంకు షేర్లు బేజార్..
♦ ఏడాదిలో 50-66 శాతానికి పైగా నష్టం ♦ 20 పీఎస్‌యూ బ్యాంకుల ఉమ్మడి విలువ హెచ్డీఎఫ్సీ కన్నా తక్కువే ♦ వివిధ ఒత్తిళ్లతో భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్లు ♦ షేర్ల పతనానికి ఎన్పీఏలే ప్రధాన కారణమంటున్న విశ్లేషకులు ♦ అవసరమున్నా... నిధులు సమీకరించలేని దుస్థితి మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గట్టిది. ప్రభుత్వ బ్యాంకులు అంత బలంగా ఉండటం వల్లే ఇప్పటికీ కింది స్థాయి వరకూ కొంతలో కొంతైనా రుణాలందుతున్నాయి. కాకపోతే ఆ బ్యాంకులకిపుడు నిరర్థక ఆస్తుల సెగ తీవ్రంగానే తగులుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రభావాలతో బడా బాబులకు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవటంతో అవి కొండలా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు తెస్తుండటంతో... రాబోయే రోజుల్లో ఎన్పీఏలు మరింత పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఫలితం... స్టాక్ మార్కెట్లో వీటిపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతూ... నానాటికీ పాతాళానికి పడిపోతున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :రెండేళ్ల కిందట మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్న అంచనాలు... ఆ అంచనాలకు తగ్గట్టే భారీ మెజారిటీతో మోదీ అధికారంలోకి రావటం... ఇవన్నీ గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లను పరుగులు పెట్టించాయి. ప్రభుత్వం మారినా బ్యాంకుల్లో పరిస్థితి మారకపోవటంతో ఇన్వెస్టర్లు వాస్తవంలోకి వచ్చారు. దీంతో దాదాపు అన్ని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లూ ఇపుడు నాలుగైదేళ్ల కనిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ 17 శాతం నష్టపోతే... పీఎస్‌యూ బ్యాంక్ సూచీ మాత్రం 47 శాతం నష్టపోయింది. వీటిలో పది బ్యాంకులైతే 50 నుంచి 66 శాతం వరకూ నష్టపోయాయి. ఒక్క జనవరి నెలలోనే పీఎస్‌యూ బ్యాంకులు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ప్రస్తుతం చాలా పీఎస్‌యూ బ్యాంకులు వాటి పుస్తక విలువ(బుక్ వేల్యూ) కంటే మూడు నుంచి నాలుగు రెట్ల కనిష్ట స్థాయిలో కదులుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎస్బీఐ మినహా ఇతర పీఎస్‌యూ బ్యాంకులన్నిటి మార్కెట్ విలువ... ప్రైవేటు రంగంలోని ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ కంటే తక్కువ ఉందంటే ఈ షేర్లు ఏ విధంగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చాలా పీఎస్‌యూ బ్యాంకుల షేర్ల ధరలు ఇపుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... ఇంకా కిందకు పడే అవకాశాలున్నాయన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతుండటంతో కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. మొండి బకాయిలే అసలు సమస్య.. మొండి బకాయిల సమస్య తీరిపోయినట్లేనని బ్యాంకులు ఐదేళ్ల నుంచి ప్రకటిస్తున్నా.,. వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6 శాతం దాటిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ పీఎస్‌యూ బ్యాంకుల ప్రక్షాళనకు చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం ఎన్పీఏలు మరింత పెరిగేటట్లు చేస్తోంది. 2017వ సంవత్సరం మార్చి నాటికల్లా బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని, తద్వారా మొండి బకాయిల సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాకుండా 150 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అన్ని రకాల రుణాలకూ పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయాలని కూడా చెప్పింది. దీంతో ఇంతకాలం వడ్డీలు కడుతూ... పునర్ వ్యవస్థీకరణ పేరుతో స్టాండర్డ్ అసెట్స్‌గా చూపిస్తున్న వాటిని కూడా ఇప్పుడు ఎన్పీఏలుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక కంపెనీ తీసుకున్న రుణం ఎన్పీఏగా మారకుండా ఉండాలంటే కనీసం వడ్డీనైనా చెల్లించాలి. కొన్ని కంపెనీలు ఆ వడ్డీ కూడా చెల్లించకపోవటంతో... అందుకోసం బ్యాంకులు కొత్త రుణాలిచ్చేవి. ఆర్బీఐ ఆదేశాలతో ఇక ఇలా చేయటం కుదరదు. దీంతో కలుగులో దాక్కున్న ఎన్పీఏలు కూడా బయటకు వస్తున్నాయని కార్వీ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల చెప్పారు. ఈ ఏఎన్పీఏలకు ప్రొవిజనింగ్ కేటాయింపుల వల్ల ఈసారి చాలా బ్యాంకులు నష్టాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ చర్యలన్నిటి వల్లా పీఎస్‌యూ బ్యాంకుల ఎన్పీఏలు 8-9 శాతానికి చేరవచ్చనే అంచనాలున్నాయి. బ్యాంకులపై పెరుగుతున్న ఒత్తిడి అంతర్జాతీయంగా వృద్ధిరేటు మందగించటం, రాజకీయ ఒత్తిళ్లతో అడ్డగోలుగా కార్పొరేట్ సంస్థలకు రుణాలివ్వడం వంటి కారణాల వల్ల పీఎస్‌యూ బ్యాంకులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్ఫ్రా, విద్యుత్ పంపిణీ, మెటల్ రంగాలకు పీఎస్‌యూ బ్యాంకులు అధికంగా రుణాలిచ్చాయి. దీనికి భిన్నంగా ప్రైవేటు బ్యాంకులు రిటైల్ రుణాలను ఎక్కువగా నమ్ముకోవడం వలే ్ల ప్రైవేటు బ్యాంక్ షేర్లు అంతగా పతనం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్పీఏలు, బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకునేంత వరకు పీఎస్‌యూ బ్యాంకులపై ఒత్తిడి ఇదే విధంగా ఉంటుందని జెన్‌మనీ జేఎండీ కె.సతీష్ చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో రిస్క్ చాలా ఉంది కాబట్టి వీటికి దూరంగానే ఉండమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. నిధుల సేకరణ కష్టమే.. పెరుగుతున్న ఎన్పీఏలను సర్దుబాటు చేయటానికి, బాసెల్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ నిధులు అవసరమవుతాయి. వచ్చే నాలుగేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులకు రూ.1.72 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరమవుతుందని అంచనా. ఇందులో రూ.70,000 కోట్లను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది. ఈ ఏడాది రూ.25,000 కోట్లు సమకూరుస్తామని కేంద్రం చెప్పగా ఇప్పటి వరకు 13 పీఎస్‌యూ బ్యాంకులకు రూ.20,088 కోట్ల మూలధనాన్ని కేటాయించింది. వివిధ మార్గాల ద్వారా బ్యాంకులు ఇంకా రూ.1.1 లక్షల కోట్లు సమకూర్చుకోవాలి. కానీ ఇప్పటికే షేర్ల ధరలు బాగా పడిపోవడం, పుస్తక విలువ కంటే చాలా తక్కువ రేట్లలో ట్రేడ్ అవుతుండటంతో బ్యాంకులకు నిధుల సేకరణ కష్టంగా మారింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గించుకొని, నికర వడ్డీ లాభదాయకత పెంచుకుంటేనే ఈ రంగ షేర్లు పుంజుకుంటాయని జగన్నాథం చెప్పారు. -
పేమెంట్ బ్యాంకుల పోటీని తట్టుకుంటాం
విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్ రామారావు * బిజినెస్ కరస్పాండెంట్లకు అధిక ఆదాయ కల్పనపై దృష్టి * వడ్డీరేట్లు తగ్గినా కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ కనబడటం లేదు... * ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరో ఏడాది సమయం పట్టొచ్చు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీరేట్లు తగ్గుతున్నా కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ కనిపించడం లేదని, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బ్యాంకు మేనేజర్ల సమీక్షా సమావేశానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ మరో ఆరు నెలలు వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవంటున్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు... డిమాండ్ లేదు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించినా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. అలాగే రిటైల్ రుణాల్లో గృహరుణాలు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆటో రుణాలకు మాత్రమే గిరాకీ ఉంది. మొత్తం మీద చూస్తే రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇదే విధమైన పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఏడాది తర్వాత ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నాం. తగ్గే అవకాశాలు తక్కువ తగ్గుతున్న పారిశ్రామికోత్పత్తి, రుణాలకు డిమాండ్ లేకపోవడం వంటి అంశాలున్నప్పుడు సాధారణంగా వడ్డీరేట్లు తగ్గాలి. కానీ అటువంటి అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కారణం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తోడు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు వంటి భయాలే. అలాగే డిపాజిట్ల రేట్లు తగ్గించకుండా రుణాల రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదు. డిపాజిట్ల రేట్లు తగ్గిస్తే పెన్షనర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే సమయంలో పోస్టాఫీసు చిన్న మొత్తాల పథకాల నుంచి డిపాజిట్ల సేకరణకు బ్యాంకులు పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తే మరో ఆరు నెలల పాటు వడ్డీరేట్లు ఇలాగే స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఎన్పీఏలు తగ్గుతున్నాయ్.. రుణాలకు డిమాండ్ లేకపోయినా.. ఎన్పీఏలు తగ్గుముఖం పట్టడం ఒక సానుకూల వాతావరణం. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విజయా బ్యాంక్ అతి తక్కువ ఎన్పీఏలను కలిగి ఉన్నది. సెప్టెంబర్ నాటికి మా స్థూల ఎన్పీఏలు 3.98 శాతం మాత్రమే. నికర ఎన్పీఏలు 2.84 శాతం. రానున్న కాలంలో ఈ శాతాన్ని మరింత తగ్గించడానికి కృషి చేస్తున్నాం. ఉదయ్‌తో తగ్గనున్న లాభాలు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రకటించిన ‘ఉదయ్’ పథకం వల్ల రెండు శాతం వడ్డీని నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాం. దీనివల్ల తాత్కాలికంగా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపినా, ఈ నిర్ణయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. మా బ్యాంకు డిస్క్ంలకు ఇచ్చిన రుణాల విలువ రూ. 7,800 కోట్లు. 12 శాతం వృద్ధి..: ఈ ఏడాది వ్యాపారంలో 12 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. గతేడాది రూ. 2.10 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చినాటికి రూ. 2.35 లక్షల కోట్లు దాటొచ్చు. వచ్చే నాలుగు నెలల్లో మరో 150 శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,755 శాఖలను కలిగి ఉంది. గ్రామీణ మార్కెట్‌పై దృష్టి పేమెంట్ బ్యాంకులు, చిన్న బ్యాంకుల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడమే ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) వ్యవస్థను మరింత పటిష్టం చేసి వారికి మరింత ఆదాయం ఆర్జించే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నాం. పెన్షన్ పంపిణీ, రుణాల రికవరీ వంటి బాధ్యతలను బీసీలకు అప్పజెప్పాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఒకొక్క బీసీ సగటున నెలకు రూ. 5,000 ఆర్జిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సంపాదనను రూ. 10,000కు పెంచాలన్నదే మా లక్ష్యం.