బ్యాంకుల చేతికి జేపీ!
♦ కంపెనీ ఖాతాను ఎన్‌పీఏగా ప్రకటించిన రుణదాతలు
♦ ఎస్‌డీఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఐసీఐసీఐ
♦ త్వరలో విధివిధానాలను చర్చించనున్న బ్యాంకర్లు
♦ అల్ట్రాటెక్‌తో సిమెంట్ ప్లాంట్ల విక్రయం ఒప్పందానికి బ్రేక్!
ముంబై: భారీ అప్పుల్లో కూరుకుపోయిన.. జేపీ అసోసియేట్స్ గ్రూప్‌ను బ్యాంకులు తమ ఖాతాలో వేసుకోనున్నాయి. జేఏఎల్‌కు భారీస్థాయిలో రుణాలిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐలు ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాయి. దీంతో జేపీ గ్రూప్ ప్రధాన కంపెనీ జేఏఎల్ తమ సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించడం కోసం కుదుర్చుకున్న రూ.15,900 కోట్ల ఒప్పందానికి బ్రేక్ పడ్డట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ అకౌంట్‌ను మొండిబకాయి(ఎన్‌పీఏ) ల్లోకి చేర్చామని ఎస్‌బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక తమ అప్పులకు సరిపడా కంపెనీలో వాటాను తీసుకోవడం కోసం వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ(ఎస్‌డీఏ) ప్రక్రియను ఆరంభించినట్లు ఆయన తెలిపారు.
ఎస్‌డీఆర్ ప్రక్రియ పూర్తయితే జేఏఎల్‌లో మెజారిటీ వాటా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లినట్లే లెక్క. కంపెనీ యాజమాన్య, నియంత్రణ అధికారాలన్నీ ఇక రుణదాతలు నియమించే వ్యక్తులే చూసుకుంటారు. కాగా, ఎస్‌డీఆర్ విధివిధానాలు, షరతులతో పాటు జేపీ-అల్ట్రాటెక్ సిమెంట్ డీల్‌పై చర్చించేందుకు త్వరలో జాయింట్ లెండర్స్ ఫోరమ్(జేఏఎఫ్) మరోసారి సమావేశం కానుందని ఎస్‌బీఐ అధికారి వెల్లడించారు. అల్ట్రాటెక్‌తో డీల్‌ను ఆమోదించాలా వద్దా అనేది ఫోరమ్ నిర్ణయిస్తుందన్నారు. జేఏఎఫ్‌కు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వం వహిస్తోంది.
రుణ భారం రూ.58 వేల కోట్లపైనే...
జేపీ అసోసియేట్స్‌కు ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం రూ.58,250 కోట్ల అప్పులు లెక్కతేలాయి. ఇందులో ఎస్‌బీఐ వాటా రూ.7,000 కోట్లుగా అంచనా. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుకు జేఏఎల్ రుణ బకాయిని చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్‌డీఆర్ ప్రక్రియకు తెరతీసింది. ఎస్‌డీఐఆర్‌కు జూన్ 28 రిఫరెన్స్ తేదీగా కూడా పేర్కొన్నట్లు జేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఎస్‌డీఆర్‌ను అమోదించడం లేదా తిరస్కరించేందుకు జేపీ అసోపసియేట్స్‌కు బ్యాంకర్లు మూడు నెలల గడవు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
సిమెంట్ ప్లాంట్ల విక్రయంపై అనిశ్చితి ఎఫెక్ట్...
అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు జేఏఎల్ ఆస్తుల విక్రయంపై దృష్టిసారించింది. అయితే, ఈ ప్రయత్నాలేవీ సజావుగా సాగకపోవడంతో కంపెనీ బకాయిల చెల్లింపు విషయంలో చేతులేత్తేసేందుకు దారితీసింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో తమకున్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి 31న దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. ఎస్‌డీఆర్ నేపథ్యంలో దీనిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.