ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. జూన్ 30న బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.410 కోట్లను డిఫాల్ట్ చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకునేలా అప్పు ఇచ్చిన బ్యాంకులు ఇంటర్‌క్రెడిటర్ అగ్రిమెంట్(రుణ గ్రహీతలు డిఫాల్ట్ అయితే రిస్క్ తగ్గించే ఒప్పందం)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు రూ.14,000 కోట్లు టర్మ్ లోన్‌లు ఉన్నాయి. రూ.15,000 కోట్లు షార్ట్ టర్మ్ లోన్‌లు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ లోన్, రూ.4,000 కోట్ల షార్ట్ టర్మ్ లోన్, రూ.1,400 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించింది. కెనరా బ్యాంక్ రూ.3,800 కోట్ల రుణాలు, ఇండియన్ బ్యాంక్ రూ.1,400 కోట్ల టర్మ్ లోన్ ఇచ్చింది. అయితే ఇటీవల రుణదాతలకు చెల్లించాల్సిన రూ.410 కోట్లు డిఫాల్ట్ చేయడంతో బ్యాంకులు ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్(ఐసీఏ)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ డిఫాల్ట్ అయిన నెలలోపు ఐసీఏపై సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. తద్వారా నష్టాల్లో ఉన్న కంపెనీని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకోవచ్చు. అయితే 75% మంది రుణదాతలు నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ చర్య అమలు అవుతుంది.
సంస్థ ఇటీవల చేసిన డిఫాల్ట్ నగదు ఇంకా సాంకేతికంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పీఏ) అవ్వలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది రుణదాతలు తాము ఇచ్చిన అప్పులకుగాను సంస్థలో 15 శాతం కేటాయింపులు పూర్తి చేశారు. డిఫాల్ట్ నిర్ణయం ప్రకటించిన 90 రోజుల తర్వాత లోన్ ఖాతా ఎన్‌పీఏగా మారుతుంది. ఆ సమయంలో బ్యాంకులు కనీసం 15 శాతం కేటాయింపులు కలిగి ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణ
ఈ వ్యవహారంపై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ..‘వైజాగ్‌స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ సంస్థ రుణాలకు ప్రభుత్వ హామీ ఉండదు. సంస్థ ప్రస్తుతం కేవలం 30 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీ కస్టమర్లు తమ చెల్లింపులు సరిగా చేయడంలేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల ప్రారంభంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. సొంతంగా ఉక్కు గనులు కేటాయిస్తే కంపెనీ లాభాల్లోకి వెళ్తుందని అధికారులు, కార్మికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment