నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్‌బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
ఎల్‌అండ్‌టీకి భారీ ప్రాజెక్టులు
అధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్‌లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్‌ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్ల టర్న్‌కీ నిర్మాణం చేపడతారు. ఖతార్‌లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్‌లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment