న్యూఢిల్లీ: ప్రైవేటైజేషన్ బాటలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్) విలువ నిర్ధారణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఐబీబీఐలో రిజిస్టరైన సంస్థలకు ఆహ్వానం పలికింది. తద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్ (వైజాగ్ స్టీల్) ఆస్తుల విలువ మదింపునకు తెరతీసింది. ఈ ఏడాది జనవరి 27న వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాను విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందస్తు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెరసి అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీలలో వాటాలు సహా వైజాగ్ స్టీల్ అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దీంతో పీఎస్‌యూ కంపెనీలలో ప్రభుత్వ ఈక్విటీలను నిర్వహించే దీపమ్.. ఈ నెల 11న ప్రతిపాదనల ఆహ్వానాన్ని(ఆర్‌ఎఫ్‌పీ) ప్రకటించింది. తద్వారా దివాలా, రుణ ఎగవేతల దేశీ బోర్డు(ఐబీబీఐ)లో రిజిస్టరైన కంపెనీల నుంచి బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్ దాఖలుకు ఏప్రిల్ 4 వరకూ గడువిచ్చింది. వేల్యుయర్‌గా ఎంపికయ్యే సంస్థ ఆర్‌ఐఎన్‌ఎల్ విలువ మదింపుతోపాటు కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయంలోనూ ప్రభుత్వానికి సహకరించవలసి ఉంటుంది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థలలో వాటాల విలువసహా.. ప్లాంటు, మెషీనరీ, భూములు, భవనాలు, ఫర్నీచర్, సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాలను మదింపు చేయవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment