Rashtriya Ispat Nigam Limited
-
వైజాగ్ స్టీల్‌కు జేఎస్పీఎల్ నిధులు
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది. సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్పీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్‌ను జేఎస్‌పీఎల్‌కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్పీఎల్తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
వైజాగ్ స్టీల్ విలువ నిర్ధారణకు సై
న్యూఢిల్లీ: ప్రైవేటైజేషన్ బాటలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) విలువ నిర్ధారణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఐబీబీఐలో రిజిస్టరైన సంస్థలకు ఆహ్వానం పలికింది. తద్వారా ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్) ఆస్తుల విలువ మదింపునకు తెరతీసింది. ఈ ఏడాది జనవరి 27న వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాను విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందస్తు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెరసి అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీలలో వాటాలు సహా వైజాగ్ స్టీల్ అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీఎస్‌యూ కంపెనీలలో ప్రభుత్వ ఈక్విటీలను నిర్వహించే దీపమ్.. ఈ నెల 11న ప్రతిపాదనల ఆహ్వానాన్ని(ఆర్ఎఫ్పీ) ప్రకటించింది. తద్వారా దివాలా, రుణ ఎగవేతల దేశీ బోర్డు(ఐబీబీఐ)లో రిజిస్టరైన కంపెనీల నుంచి బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్ దాఖలుకు ఏప్రిల్ 4 వరకూ గడువిచ్చింది. వేల్యుయర్‌గా ఎంపికయ్యే సంస్థ ఆర్ఐఎన్ఎల్ విలువ మదింపుతోపాటు కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయంలోనూ ప్రభుత్వానికి సహకరించవలసి ఉంటుంది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థలలో వాటాల విలువసహా.. ప్లాంటు, మెషీనరీ, భూములు, భవనాలు, ఫర్నీచర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలను మదింపు చేయవలసి ఉంటుంది. -
స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 17,980 కోట్లు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,980 కోట్లు టర్నోవర్ సాధించింది. దీంతో గత ఏడాది కంటే 14 శాతం వృద్ధి సాధించినట్టయింది. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వివరాలను ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్ ఏజీఎంలో పాల్గొన్న సీఎండి, డైరెక్టర్లు సంస్థ ఉత్పత్తులు,ఎగుమతులు 0.497 మెట్రిక్ టన్నుల నుంచి 1.308 మెట్రిక్ టన్నులకు పెరిగాయన్నారు. గత ఏడాది కంపెనీ నికర నష్టం రూ.3,910 కోట్లు కాగా ఈ ఏడాది రూ.789 కోట్లకు తగ్గిందన్నారు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20 శాతం కాగా ఈ ఏడాది 24 శాతానికి పెరిగాయన్నారు. సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అండర్ సెక్రటరీ సుభాష్ కుమార్, స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు వి.వి.వేణుగోపాలరావు, డి.కె. మహంతి, కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ సీతా సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి -
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు సాధించింది. జులై నెలలో 540.8 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిపింది. ఏప్రిల్-జులై మధ్య 1,538 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపినట్లు ఆర్ఐఎన్ఎల్ ట్విటర్లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఆ 4 నెలల్లో 48 శాతం అదనంగా విక్రయించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కార్మికులు గత రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. Stellar performance by #RINL Vizag Steel in the month July'21&till July in FY'22. #RINLmktng Registered highest ever Since inception:July monthly Sales of Saleable Steel of 540.8 thousand tons also with a growth of 38%more than 390.5 thousand tons CPLY.@SteelMinIndia @RCP_Singh pic.twitter.com/EewF9sY5NG — RINL (@RINL_VSP) August 3, 2021 -
పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్
వైజాగ్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలంపిక్ రజత పతక విజేత పీవీ సింధు మరో ప్రత్యేకతను తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాతి గాంచిన వైజాగ్ స్టీల్ సంస్థ , రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైంది. బేస్‌లైన్ వెంచర్స్, డైరెక్టర్ , మరియు సహ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణన్ ఈ ఒప్పంద వివరాలు వెల్లడించారు. దీంతో వైజాగ్ స్టీల్ అథ్లెట్ రంగంలో ప్రధాన భాగస్వామి మారిందని చెప్పారు. దీని ప్రకారం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మరియు దేశీయ పోటీలలో సింధు ఆడే సమయంలో ఆమె జెర్సీ మీద కంపెనీ బ్రాండ్ లోగో ఉండనుందని తెలిపారు. సింధు ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 ర్యాంక్ ఆటగాళ్ళ మధ్య రియో ఒక ఒలింపిక్ రజత పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది తనకు అత్యంత ముఖ్యమైన ఎండార్స్మెంట్ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ క్యాలెండర్ లో నెలకు కనీసం మూడు ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్స్ కు విస్తరించిన నేపథ్యంలో ర్యాంకింగ్స్ మెరుగుకు ఆర్ఐఎన్ఎల్ విశ్వసనీయ బ్రాండ్ అనిసంతోసం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తన ఆట మీద దృష్టికి సహాయపడుతుందిని పేర్కొంది. సింధు, వైజాగ్ స్టీల్ రెండూ భారతదేశం యొక్క అమూల్యమైన ఆస్తులు అని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి మధుసూదన్ చెప్పారు . తాజా బాండ్ వారికి, దేశానికి గర్వకారణమన్నారు.