విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది.
సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్‌పీఎల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది.
దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్‌ను జేఎస్‌పీఎల్‌కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్‌పీఎల్‌తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు.
ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment