public sector undertaking
-
పబ్లిక్ ఇష్యూ యోచనలో ఐఐఎఫ్‌సీఎల్
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2024–25)లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ పీఆర్ జైశంకర్ పేర్కొన్నారు. ఇందుకు త్వరలోనే కన్సల్టేషన్ కార్యక్రమానికి తెరతీయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 100% వాటా ఉంది. కంపెనీ ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 750 ప్రాజెక్టులకు రూ. 2.5 లక్షల కోట్ల రుణాలందించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 1,076 కోట్ల నికర లాభం ఆర్జించగా.. ఈ ఏడాది(2023–24) రూ. 1,500 కోట్ల లాభం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. -
వైజాగ్ స్టీల్‌కు జేఎస్పీఎల్ నిధులు
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది. సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్పీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్‌ను జేఎస్‌పీఎల్‌కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్పీఎల్తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
హెచ్ఏఎల్లో 3.5% వాటా అమ్మకం
ముంబై: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్ఎస్ విండో ఓపెన్ కానుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్, సీపీఎస్ఈల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే. -
ఎస్బీఐ లాభం @ రూ. 6,068 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే. మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి. -
ఆస్తులమ్మితే నజరానా ఆఫర్లు దారుణం.. కేంద్రంపై మంత్రి హరీశ్ ధ్వజం
సిద్దిపేట జోన్: ‘కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతోంది.. రైలు, ఎల్ఐసీ, విమానాశ్రయాలు.. చివరికి ఆర్టీసీ బస్టాండ్లు కూడా అమ్ముకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది.. పైగా ప్రభుత్వ ఆస్తులను అమ్మితే నజరానా ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇవ్వడం దారుణం.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించిన ఆధునిక బస్టాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆర్టీసీకి ఏటా రూ.1500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటీవల తాను తిరుపతిలో శ్రీవారి దర్శనానికి మూడు గంటల పాటు కాలినడకన వెళ్తుండగా పలువురు భక్తులు పరిచయమయ్యారని హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి వారిని ఆరా తీయగా, తెలంగాణలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధితో సమానంగా నిలబడే స్థాయి తమ రాష్ట్రాలకు లేదని వారు చెప్పారని వివరించారు. కాగా సిద్దిపేట బస్టాండ్ నుంచి సికింద్రాబాద్‌కు మంత్రి హరీశ్‌రావు బస్ టికెట్లు ఇవ్వగా, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల కిషన్ కొనుక్కొని అందులో సికింద్రాబాద్ వరకు ప్రయాణించారు. -
హెచ్‌పీసీఎల్ డివిడెండ్ రూ. 14
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 40 శాతం రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 3,018 కోట్లు ఆర్జించింది. క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 12.44 డాలర్లకు బలపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ పుష్ప కుమార్ జోషి పేర్కొన్నారు. 2021 క్యూ4లో 8.11 డాలర్ల జీఆర్ఎం మాత్రమే లభించింది. అయితే చౌకగా కొనుగోలు చేసిన నిల్వల లాభాలను మినహాయిస్తే ఒక్కో బ్యారల్ చమురు శుద్ధిపై 6.42 డాలర్ల మార్జిన్లు సాధించినట్లు జోషి వెల్లడించారు. కాగా.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకపు నష్టాలు మార్జిన్ల లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరినప్పటికీ మార్చి 22 నుంచి మాత్రమే వీటి ధరలను పెంచడం ప్రభావం చూపినట్లు వివరించారు. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 14 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3.72 లక్షల కోట్ల ఆదాయం, రూ. 6,383 కోట్ల నికర లాభం సాధించినట్లు జోషి తెలియజేశారు. 2020–21లో హెచ్‌పీసీఎల్ రూ. 2.69 లక్షల కోట్ల టర్నోవర్ సాధించగా.. రూ. 10,664 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్యూ4లో దేశీయంగా 10.26 మిలియన్ టన్నులను విక్రయించగా.. అంతక్రితం 3.83 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి 4 శాతం వృద్ధి సాధించింది. ఇక పూర్తి ఏడాదిలో 6 శాతం అధికంగా 37.65 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఎల్పీజీ అమ్మకాలు 4.4 శాతం పుంజుకుని 7.7 ఎంటీకి చేరాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5% నీరసించి రూ. 240 వద్ద ముగిసింది. -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్‌కు బ్రేక్! ముగ్గురిలో ఇద్దరు వెనక్కి
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీలో వాటా కొనుగోలుకి బిడ్స్ దాఖలు చేసిన మూడు సంస్థలలో రెండు వెనకడుగు వేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో బిడ్డర్లు రేసు నుంచి తప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. కంపెనీలోగల 52.98% వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. నవంబర్‌కల్లా కనీసం 3 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం ఒకే సంస్థ రేసులో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
బీవోబీ లాభం రెట్టింపు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెట్టింపై రూ. 2,197 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ3లో రూ. 1,061 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు వడ్డీ ఆదాయం పెరగడం, ప్రొవిజన్లు తగ్గడం దోహదపడింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 14 శాతం ఎగసి రూ. 8,552 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,557 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.77 శాతం నుంచి 3.13 శాతానికి బలపడ్డాయి. ఎన్పీఏలకు చెక్ ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.48 శాతం నుంచి 7.25 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు సైతం 2.39 శాతం నుంచి 2.25 శాతానికి వెనకడుగు వేశాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,830 కోట్లుకాగా.. రికవరీలు రూ. 20,32 కోట్లు, అప్గ్రెడేషన్లు రూ. 1,272 కోట్లకు చేరాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,450 కోట్ల నుంచి రూ. 2,506 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.47 శాతంగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు, ఫీజు ఆదాయంలో నమోదైన వృద్ధిని ఇకపైనా కొనసాగించే వీలున్నట్లు బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా పేర్కొన్నారు. -
ఎస్బీఐ లాభం జూమ్
ముంబై: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 62 శాతంపైగా జంప్ చేసి రూ. 8,432 కోట్లను తాకింది. బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2020–21) క్యూ3లో కేవలం రూ. 5,196 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం సహకరించింది. తాజా సమీక్షా కాలంలో ని కర వడ్డీ ఆదాయం 6.5 శాతం పుంజుకుని రూ.30 ,687 కోట్లకు చేరింది. దేశీయంగా నికర వడ్డీ మా ర్జి న్లు 3.34 శాతం నుంచి 3.4 శాతానికి బలపడ్డాయి. తగ్గిన ప్రొవిజన్లు ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.77 శాతం నుంచి 4.5 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 1.34 శాతానికి పెరిగాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు 59 శాతం నీరసించి రూ. 2,306 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 12,137 కోట్ల నుంచి రూ. 10,090 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.23 శాతంగా నమోదైంది. కోవిడ్ రిజల్యూషన్ ప్రణాళిక 1, 2లలో భాగంగా రూ. 32,895 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇవి మొత్తం లోన్‌బుక్‌లో 1.2 శాతానికి సమానం. ఆరు ఖాతాల అమ్మకం ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల(ఏఆర్‌సీలు)కు విక్రయించేందుకు ఆరు మొండి(ఎన్పీఏ) ఖా తా ల ను ఎంపిక చేసినట్లు ఎస్బీఐ వెల్లడించింది. వీటి వి లువ రూ. 406 కోట్లుకాగా.. జాబితాలో పాట్నా బ క్తియార్‌పూర్ టోల్‌వే(రూ. 231 కోట్లు), స్టీల్‌కో గు జరాత్(రూ. 68 కోట్లు), జీవోఎల్ ఆఫ్‌షోర్(రూ. 5 1 కోట్లు), ఆంధ్రా ఫెర్రో అలాయ్స్(రూ. 27 కో ట్లు), గురు ఆశిష్ ట్యాక్స్‌ఫ్యాబ్(రూ. 17 కోట్లు)లను పేర్కొంది. పలు అంశాల్లో ప్లస్ బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ నిరవధికంగా మెరుగుపడుతోంది. ట్రెజరీ ఆదాయంలో స్వల్ప సమస్యలున్నప్పటికీ.. వడ్డీ, ఇతర ఆదాయాల్లో వృద్ధి సాధించింది. రుణ నాణ్యత తక్కువ ప్రొవిజన్లకు దారి చూపింది. అనిశ్చితుల కారణంగా భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు తగిన స్థాయిలో కంటింజెన్సీ కేటాయింపులు చేపట్టాం. రూ. 1,700 కోట్ల అదనపు ప్రొవిజన్లు చేపట్టాం. – ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా -
మేకిన్ ఇండియా కాదు.. సేల్ ఇన్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానిది మేకిన్ ఇండియా కాదని, సేల్ ఇన్ ఇండియా పాలసీ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలతో కలిసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ‘సేవ్ పీఎస్‌యూ– సేవ్ ఇండియా’నినాదంతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్‌లో ప్రభుత్వరంగ సంస్థల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో వినోద్‌కుమార్ సమావేశమయ్యారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఏర్పా టుకు నిర్ణయం తీసుకున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, హెచ్ఎంటీ – ప్రాగా టూల్స్, మిథాని, డీఆర్డీ ఎల్, ఈసీఐఎల్, మింట్, పోస్టల్, డీఎల్ఆర్ఎల్, పలు బ్యాంకుల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం నుంచే కేంద్రంపై సమర శంఖారావాన్ని పూరిస్తున్నట్లు వినోద్ కుమార్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం ‘కేంద్ర సంస్థలను ప్రైవేటీకరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. ప్రభుత్వసంస్థలను ప్రైవేట్ పరం చేయడమంటే రిజర్వేషన్లు తొలగించడమే. ఈ సంస్థల్లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు లక్ష యాభై వేల మంది పని చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలతో పాటు దేశ రక్షణ శాఖను సైతం ప్రైవేట్‌కు అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. మిథాని, బీడీఎల్ సంస్థలను అమ్మేందుకూ సిద్ధమయ్యారు’అని వినోద్ అన్నారు. -
కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.16,517.24 కోట్ల డివిడెండ్ లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. తాజాగా సెయిల్ నుంచి రూ.483 కోట్లు, మాంగనీస్ ఓర్ ఇండియా నుంచి రూ.63 కోట్లు, ఎంఎస్టీసీ నుంచి రూ.20 కోట్ల డివిడెండ్ అందినట్లు తుహిన్ కాంత పాండే వివరించారు. -
బీపీసీఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 1,502 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,076 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 50,617 కోట్ల నుంచి రూ. 89,687 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో 6.84 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేసింది. గత క్యూ1లో 5.4 ఎంటీ చమురు మాత్రమే రిఫైన్ చేసింది. మార్జిన్లు అప్..: ప్రస్తుత సమీక్షా కాలంలో ఒక్కో బ్యారల్‌పై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 4.12 డాలర్లను తాకాయి. గత క్యూ1లో బీపీసీఎల్ 0.39 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. కాగా.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలోగల మొత్తం 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. ఈ ఏడాదిలోగా ప్రైవేటైజేషన్‌ను పూర్తి చేయనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తాజాగా స్పష్టం చేశారు. ఫలితాల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% బలహీనపడి రూ. 448 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,209 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 864 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం బలపడటం, మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 2.59 శాతం నుంచి 3.12 శాతానికి పుంజుకోవడంతో గ్లోబల్ స్థాయిలో 2.52 శాతం నుంచి 3.04 శాతానికి ఎగశాయి. గతేడాది 2.7 శాతంగా నమోదైంది. -
ఎల్ఐసీకి ఐటీ రీఫండ్ రూ. 11,500 కోట్లు
ముంబై: ఆదాయ పన్ను రీఫండ్స్ కింద రూ. 11,500 కోట్లు అందుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తెలిపింది. ఇందులో సింహ భాగాన్ని పాలసీదారులకు అందజేయనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 2007-08 నుంచి 2009-10 అసెస్మెంట్ ఇయర్స్‌కి సంబంధించిన కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించాయి. రీఫండ్స్‌ను రెండు విడతలుగా అందుకున్నట్లు ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో రీఫండ్ అందుకోవడం ఇదే ప్రథమం అని వివరించాయి. అయితే, ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ దీనిపై అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఎల్ఐసీ చట్టం 1956లోని సెక్షన్ 26 ప్రకారం ఎల్ఐసీకి వచ్చే ఐటీ రీఫండ్స్లో 95 శాతం మొత్తం పాలసీదారులకు, మిగతాది డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.