ఎల్‌ఐసీకి ఐటీ రీఫండ్ రూ. 11,500 కోట్లు
ముంబై: ఆదాయ పన్ను రీఫండ్స్ కింద రూ. 11,500 కోట్లు అందుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తెలిపింది. ఇందులో సింహ భాగాన్ని పాలసీదారులకు అందజేయనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 2007-08 నుంచి 2009-10 అసెస్‌మెంట్ ఇయర్స్‌కి సంబంధించిన కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించాయి. రీఫండ్స్‌ను రెండు విడతలుగా అందుకున్నట్లు ఎల్‌ఐసీ వర్గాలు తెలిపాయి.
కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో రీఫండ్ అందుకోవడం ఇదే ప్రథమం అని వివరించాయి. అయితే, ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్‌కే రాయ్ దీనిపై అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఎల్‌ఐసీ చట్టం 1956లోని సెక్షన్ 26 ప్రకారం ఎల్‌ఐసీకి వచ్చే ఐటీ రీఫండ్స్‌లో 95 శాతం మొత్తం పాలసీదారులకు, మిగతాది డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.