Life insurance
-
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..?
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం గతంలో కంపెనీలిచ్చే సరెండర్ వాల్యూ పెరగనుంది. ప్రస్తుతం కంపెనీలు అమలు చేస్తున్న నియమాలు ఎలా ఉన్నాయో, కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సరెండర్ వాల్యూ వస్తుందో తెలుసుకుందాం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. ఉదాహరణకు ఎల్ఐసీలో వినయ్(35) వనే వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీను ఎంచుకున్నాడనుకుందాం. పాలసీ కాలం ముప్పై ఏళ్లు. పాలసీ మొత్తం రూ.10 లక్షలుగా భావిస్తే, వినయ్ నెలవారీ దాదాపు రూ.3,175 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏటా రూ.38,100 చెల్లించాలి. ఐదేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించాలరనుకుందాం. రూ.38,100*5 మొత్తం రూ.1,90,500. ఐదేళ్ల తర్వాత వినయ్ తన పాలసీను సరెండర్ చేస్తే తనకు 30-35 శాతం సరెండర్, ఇతర ఛార్జీలు విధించి రూ.1,27,863 మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా రూ.62,637 నష్టపోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?కొత్త నిబంధనల ప్రకారం సరెండర్ చేసే పాలసీపై సరెండర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను తగ్గించనున్నారు. దాంతో పాలసీదారుడికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఇదిలాఉండగా, కేవలం డబ్బు కోసమే పాలసీను సరెండర్ చేయాలనుకునేవారికి మరో అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పైన తెలిపిన ఉదాహరణలో వినయ్ చెల్లించిన ఐదేళ్ల పాలసీ ప్రీమియంను ఉపయోగించి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీను సరెండర్ చేస్తే రూ.1,27,863 వస్తుంది కదా. అదే తన పాలసీపై లోన్‌కు వెళితే సుమారు రూ.89,500 వరకు పొందే అవకాశం ఉంది. దాంతో పాలసీ కొనసాగించేలా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. -
బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు బీమా సంస్థలు ఇప్పటికే సన్నద్ధం అయ్యాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించిన సరెండర్ వ్యాల్యూ నిబంధనలను ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించడం గమనార్హం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. దీనివల్ల పాలసీ సరెండర్‌పై పాలసీదారులు సరైన విలువను పొందలేకపోయేవారు. నూతన నిబంధనలతో పాలసీ కమీషన్లో మార్పులు చోటు చేసుకోవచ్చని, ప్రీమియం రేట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ గౌవర్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు -
బీమాపై జీఎస్టీ కోతకు ఓకే!
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పట్ల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయం వచి్చంది. దీనిపై వచ్చే నెల చివర్లోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గల మంత్రుల బృందాన్ని (జీవోఎం) కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ నివేదిక అందిన తర్వాత దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో బీమా పాలసీలపై ప్రీమియం తగ్గింపు ప్రధానంగా చర్చకు వచి్చంది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండడంతో పన్ను రేటు తగ్గింపు పట్ల చాలా రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కలి్పంచనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సరీ్వస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. కేన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు: కొన్ని రకాల కేన్సర్ ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి.. కేదార్నాథ్ తదితర పర్యటనల కోసం వినియోగించుకునే హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చార్టర్ హెలీకాప్టర్లపై ఎప్పటి మాదిరే 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. ఆన్లైన్ గేమింగ్‌పై 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్టీని అమలు చేయడం వల్ల ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. -
జీవిత బీమా ఐపీవోపై కన్ను
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సీఆర్ఏఎంసీలోనూ...మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(సీఆర్ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది. నిధుల సమీకరణబాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
గల్ఫ్ కార్మీకులకు జీవిత బీమా..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల తరహాలోనే గల్ఫ్ కార్మీకులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణకు చెందిన 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గల్ఫ్ దేశాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మీకుల సమస్యలను పట్టించుకుంటాయన్న అభిప్రాయం ఉందని, కానీ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల గల్ఫ్ విధానాలు అధ్యయనం చేసి రూపొందించిన డాక్యుమెంట్లో సవరణలు, సూచనల కోసం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ భేటీకి గల్ఫ్ కార్మీకుల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఏజెంట్లకు చట్ట బద్ధత ఉండేలా..రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు కాకుండా ఏ కార్మీకుడినీ ఏజెంట్లు దేశం దాటించే పరిస్థితి లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డి కేంద్రమంత్రి అవుతారని భావిస్తున్నా.. ‘కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు నా మిత్రులు బాధపడితే శత్రువులు మాత్రం నా పని అయిపోయిందని సంతోషించారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఎన్నికలొచ్చి ఎంపీనయ్యా. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యా. ఆ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యా. జీవన్‌రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని భావిస్తున్నా. కేంద్రంలో తెలంగాణ గల్ఫ్ కార్మీకుల పక్షాన మాట్లాడేందుకు, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపేందుకు నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. సాయం చేసేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదు: జీవన్‌రెడ్డి గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడం ద్వారా గల్ఫ్ కార్మీకులు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని జీవన్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్ నుంచి ప్రతి యేటా 200 వరకు శవపేటికలు వచ్చేవని, పదేళ్లలో 2 వేల మంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.100 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదని విమర్శించారు. గల్ఫ్ గోస లేకుండా చూడండి సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గల్ఫ్ గోస లేకుండా చూడాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సెల్‌ను పటిష్టం చేయాలని, గల్ఫ్ దేశాల్లోని ఎంబసీల్లో తెలుగువారిని నియమించాలని, ప్రత్యేక గల్ఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని కోరారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతగా గల్ఫ్ నుంచి తెచ్చిన ఖర్జూరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ అంతర్జాతీయ కన్వీనర్ మంద భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.5 లక్షల బీమా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, పోలీసుల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను సైతం ఎస్‌హెచ్‌జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్ ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది. 61 లక్షల మంది మహిళలకు బీమా 18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు. -
పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం
న్యూఢిల్లీ: పట్టణ ప్రజల్లో జీవిత బీమా పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి జీవిత బీమా రక్షణ ఉన్నట్టు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ (ఐపీక్యూ) 6.0లో ద ప్రొటెక్షన్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 45కి చేరుకుందని, ఇది ఐపీక్యూ 5.0లో 43గానే ఉందని తెలిపింది. ప్రజల్లో రక్షణ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఐదేళ్ల ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ను పరిశీలించి చూస్తే ఐపీక్యూ 1.0లో 35 నుంచి ఐపీక్యూ 6.0లో 45కు చేరుకుందని, పది పాయింట్లు పెరిగినట్టు వివరించింది. ఆర్థిక సామర్థ్యాలను నిర్మించుకునే దిశగా పట్టణ ప్రజల ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రొటెక్షన్ క్వొటెంట్ 49 పాయింట్లతో దక్షిణ భారత్ ఆర్థికంగా ఎంతో రక్షణ కలిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత పశి్చమ భారత్ 42 పాయింట్ల నుంచి 46 పాయింట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పట్టణ ప్రజల ఆర్థిక రక్షణ స్థాయిలను లెక్కించేందుకు ఐపీక్యూ అచ్చమైన కొలమానంగా మారినట్టు మ్యాక్స్‌లైఫ్ ఎండీ, సీఈవో ప్రశాంత్ త్రిపాఠి అన్నారు. -
టర్మ్ ప్లాన్స్.. అన్నీ ఒకటి కాదు!
జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణిలో మార్పు వస్తోంది. అయినా, ఇప్పటికీ అధిక శాతం మంది బీమా ప్లాన్‌ను రాబడి కోణం నుంచే చూస్తుంటారు. చివరిలో ఎంతొస్తుందని అడుగుతారు. అందుకే బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్లను ఎక్కువగా మార్కెటింగ్ చేస్తుంటారు. కానీ, బీమా అర్థం వేరు. ఒక వ్యక్తి మరణం కారణంగా కుటుంబం ఆరి్థకంగా కష్టాలు పడకుండా ఆదుకునే సాధనం ఇది. బీమా రక్షణను ఈ కోణంలోనే తీసుకోవాలి. అచ్చమైన బీమా కవరేజీ ఇచ్చేదే టర్మ్ ఇన్సూరెన్స్. కానీ, ఇందులోనూ పలు రకాలు ప్రవేశించాయి. నిక్షేపంగా జీవించి ఉంటే మాకేంటి..? అని ప్రశ్నించే వారి కోసం టర్మ్ ప్లాన్‌ను బీమా సంస్థలు వినూత్నంగా అందిస్తున్నాయి. కానీ, ఏది తీసుకోవాలి..? దీనికి సమాధానం కావాలంటే నిపుణుల విశ్లేషణ తెలుసుకోవాల్సిందే. తన కుటుంబ క్షేమం కోరేవారు తీసుకోవాల్సిన బీమా పాలసీ ఏదన్నా ఉందంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పాలి. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ ఇందులో లభిస్తుంది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఇందులో చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. దీంతో కట్టిన ప్రీమియం గంగపాలేనా? అని ఆలోచించే వారి కోసం బీమా సంస్థలు పరిష్కారాన్ని కనుగొన్నాయి. సగటు మనిషి ఆలోచనా తీరుకు అనుగుణంగా, చెల్లించిన ప్రీమియం చివర్లో వెనక్కి వచ్చే ఆప్షన్‌తోనూ టర్మ్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టాయి. అలాగే, పాలసీ గడువు ముగియకపోయినా కానీ, మధ్యలో వైదొలిగితే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే రకాన్ని కూడా తీసుకొచ్చాయి. కానీ, పాలసీదారు తనకు నిజంగా ప్రయోజనకరమైన పాలసీ తీసుకున్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. టర్మ్ పాలసీలో రకాలు టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది రెగ్యులర్ టర్మ్ ప్లాన్. దీన్నే లెవల్ టర్మ్ ప్లాన్ అని కూడా అంటారు. పాలసీదారులు తమ అభీష్టం మేరకు నిరీ్ణత వయసు వరకు (నిరీ్ణత కాలానికి) కవరేజీని తీసుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు నూరేళ్ల కాలానికీ కవరేజీని ఆఫర్ చేస్తుంటే, కొన్ని గరిష్టంగా 85 ఏళ్లకే రక్షణను పరిమితం చేస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్‌లో రెండో రకం టీఆర్‌వోపీ. అంటే టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18 శాతం జీఎస్టీని మినహాయించి మిగిలినది వెనక్కిచేస్తాయి బీమా సంస్థలు. మూడో రకం జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు బీమా సంస్థలు దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మిగిలిన రెండు రకాల కలయికగా ఇది ఉంటుంది. పాలసీ కాల వ్యవధిలోనే కట్టిన ప్రీమియంలు వెనక్కి ఇవ్వాలని కోరొచ్చు. వీటిల్లో మూడో రకం 2022 నుంచే అందుబాటులోకి వచి్చంది. మ్యాక్స్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తదితర సంస్థలు జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. వీటిల్లో రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కాకుండా మిగిలిన రెండు రకాల పట్ల మొగ్గు చూపించేట్టు అయితే, ముందుగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. వ్యత్యాసాలు... రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్‌లో.. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు పాలసీదారు ఏ కారణంతో మరణించినా, పరిహారాన్ని నామినీకి చెల్లిస్తారు. పరిహారం మొత్తాన్ని ఒకే విడత లేదంటే, వాయిదాలుగానూ తీసుకోవచ్చు. కేవలం ఈ రిస్క్ వరకే ఈ పాలసీ పరిమితం. గడువు ముగిసేలోపు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ తిరిగి రాదు. దీన్ని చౌక ప్లాన్‌గానూ చెబుతారు. కోటి రూపాయిల కవరేజీ సైతం 30 ఏళ్ల ఆరోగ్యకరమైన వ్యక్తికి రూ.12వేల కంటే తక్కువ వార్షిక ప్రీమియానికి వచ్చేస్తుంది. టీఆర్‌వోపీ (పాలసీ గడువు తీరిన తర్వాత ప్రీమియం వెనక్కి వచ్చేవి) ప్లాన్‌లో పాలసీ గడువులోపు పాలసీదారు మరణించినట్టయితే నామినీకి పరిహారం వస్తుంది. పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18% జీఎస్టీని తగ్గించి ఇస్తారు. కానీ, రెగ్యులర్ టర్మ్ ప్లాన్లతో పోలిస్తే ఇవి ఖరీదుగా ఉంటాయి. రెగ్యులర్ టర్మ్ ప్లాన్ ప్రీమియం కంటే 2 రెట్ల వరకు అధిక ప్రీమియం వీటి కోసం చెల్లించాల్సి వస్తుంది. ఇలా అదనంగా వసూలు చేసే ప్రీమియంను సంప్రదాయ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, గడువు తీరిన తర్వాత పాలసీదారులకు బీమా కంపెనీలు చెల్లిస్తుంటాయి. అదనంగా చెల్లించే మొత్తం నుంచే తమ ప్రీమియం వెనక్కి వస్తుందన్న వాస్తవాన్ని పాలసీదారులు గుర్తించాలి. జీరో కాస్ట్ ప్లాన్‌లో పాలసీ గడువు కంటే ముందుగానే వైదొలగొచ్చు. ఒక వ్యక్తి తన ఆరి్థక బాధ్యతలు ముగిశాయని భావించినప్పుడు లేదంటే పదవీ విమరణ తర్వాత పాలసీ గడువు ఇంకా మిగిలి ఉన్నా వైదొలగడానికి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఇలా ముందస్తుగానే తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి 18% జీఎస్టీని మినహాయించి బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేస్తాయి. దీంతో పాలసీ రద్దయిపోతుంది. దీనివల్ల బీమా సంస్థలకు ప్రయోజనం.. వృద్ధాప్యానికి వచి్చన పాలసీదారు తప్పు కోవడం వల్ల వాటికి క్లెయిమ్ రిస్క్ తగ్గుతుంది. వాస్తవం ఏంటి? జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే, ఎలాంటి చార్జీలు ఉండవని, దీన్నే చౌక ప్లాన్ అని పొరబడే అవకాశం లేకపోలేదు. ‘‘కొన్ని ప్లాన్లకు జీరోకాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే లేబుల్ వేయడం ఎందుకంటే.. ప్రత్యేకంగా వైదొలగడం, ప్రీమియం వెనక్కి వచ్చే ఆప్షన్ వల్లే. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అనుసరించే మార్కెటింగ్ ఎత్తుగడల్లో భాగమే ఇది’’ అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. ప్రీమియం వెనక్కి వస్తుంది కనుక, జీరోకాస్ట్గా బీమా కంపెనీలు వీటిని వర్ణిస్తున్నాయి. అయినా, పాలసీదారు ఎప్పడంటే అప్పుడు పాలసీ నుంచి తప్పుకోవడం కుదరదని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ రిషబ్ గార్గ్ స్పష్టం చేశారు. కనీస కాల వ్యవధి ముగిసి, ఆరి్థక బాధ్యతలు తీరిన తర్వాతే ఇందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘జీరో కాస్ట్ అనేది మైండ్ గేమ్. ఈ పాలసీ కోసం నేడు చెల్లించే ప్రీమియం విలువ, చివర్లో బీమా సంస్థ తిరిగిచ్చే ప్రీమియం కంటే చాలా ఎక్కువ’’అని వివరించారు. ఏమిటి మార్గం? టర్మ్ పాలసీ కాల వ్యవధి సాధారణంగా 30–40 ఏళ్లు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఉద్యోగం వచి్చన నాటి నుంచే జీవిత బీమా కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచన. కనుక రిటైర్మెంట్ వరకు తీసుకోవడం ఎంతో అవసరం. 60 ఏళ్ల నాటికి కూడా ఆరి్థక బాధ్యతలు తీరుతాయో, లేదో అన్న సందేహంతో 75 ఏళ్లు, 85 ఏళ్ల వరకు కూడా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, కొన్ని పాలసీల్లో వయసు ఆధారంగా ఫీచర్లను బీమా సంస్థలు పరిమితం చేస్తుంటాయి. జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఆరి్థక బాధ్యతలు తీరిన వెంటనే పాలసీ నుంచి వైదొలగొచ్చు. దీనివల్ల ప్రీమియంలు వెనక్కి వస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగియక ముందే ప్రీమియంల కోసం వైదొలగడం సరికాదు. దీనివల్ల జీవిత బీమా రక్షణను కోల్పోవాల్సి వస్తుంది. రెగ్యులర్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి ప్రీమియం ఎంత? ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్‌లో ప్రీమియం ఎంత? ఈ రెండింటి మధ్య అంతరం చెప్పుకోదగినంత ఉంటుంది. కనుక చివర్లో ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్ కాకుండా రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మేర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే.. దీర్ఘకాలంలో భారీ మొత్తమే సమకూరుతుందని ఎన్నో నిదర్శనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐప్రొటెక్ట్ స్మార్ట్ జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్’ 60 ఏళ్ల వయసు వచ్చే వరకు రూ.కోటి కవరేజీ తీసుకునేట్టు అయితే ప్రీమియం రూ.16,287గా ఉంది. రెగ్యులర్ ప్లాన్‌లో ఇదే కవరేజీకి ప్రీమియం రూ.12,686. వ్యత్యాసం రూ.3,601. రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలే మొత్తాన్ని ప్రతి నెలా రూ.300 చొప్పున (ఏడాదికి రూ.3,600) ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే 12 శాతం రాబడి అంచనా ప్రకారం 30 ఏళ్లకు రూ.10.5 లక్షలు సమకూరుతుంది. రిస్క్ తీసుకోని డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసుకున్నా రూ.4.5 లక్షలు సమకూరుతుంది. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ ప్లాన్ సైతం జీరోకాస్ట్గానే సమకూరుతుంది. ఇక్కడ చెప్పుకున్నట్టు జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ కోసం ఏటా రూ.16,287 చొప్పున 30 ఏళ్లలో రూ.4.89 లక్షలు చెల్లించుకోవాలి. చివరి వరకు జీవించి ఉంటే, చెల్లించిన మొత్తం నుంచి 18 శాతం జీఎస్టీ మినహాయిస్తారు. అప్పుడు చేతికి వచ్చేది రూ.4 లక్షలు. ఇక కనిపించని చార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. మరి అవే ప్రీమియంలు వెనక్కి వచి్చనప్పుడు పన్ను వర్తించొచ్చు. ఇతర రకాలు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్.. ఏటా కవరేజీ పెరిగే ప్లాన్‌కు విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా 60–65 ఏళ్లకు వచ్చే సరికి ఆరి్థక బాధ్యతలు తగ్గిపోతుంటాయి. అటువంటప్పుడు ఈ ఆప్షన్లో ఏటా నిరీ్ణత శాతం మేర సమ్ అష్యూరెన్స్ తగ్గుతూ వెళుతుంది. ఇందులోనూ ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. ఇతర ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం తక్కువ. లమ్సమ్, పీరియాడిక్ పేమెంట్స్.. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత చెల్లించేవి లమ్సమ్. ఒకేసారి అంత మొత్తం చేతికి వస్తే, దాన్ని ఆదాయంగా మలుచుకోవడం సమస్యగా భావించేవారు, పీరియాడిక్ పేమెంట్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించిన సందర్భంలో పరిహారాన్ని నెలవారీ చొప్పున పదేళ్ల పాటు చెల్లించేలా ఎంపిక చేసుకోవచ్చు. సగం పరిహారం ఏక మొత్తంలో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా తీసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్.. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంపిక చేసుకున్న కాలానికి అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి టర్మ్‌ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. 70 ఏళ్లకు వచ్చే సరికి టర్మ్ ప్లాన్ ముగిసిపోతుంది. అప్పుడు కావాలంటే దాన్ని మరింత కాలానికి బీమా పాలసీ కింద మార్చుకోవచ్చు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. లిమిటెడ్ పే, సింగిల్ పే.. రెగ్యులర్ ప్లాన్‌లో ఎంపిక చేసుకున్న కాలం అంతటా నిరీ్ణత రోజులకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తుండాలి. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో ఆరంభంలోనే ఒకసారి ప్రీమియం చెల్లించాలి. రెగ్యులర్‌గా ప్రీమియం కట్టే వెసులుబాటు లేని వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇక లిమిటెడ్ పే ప్రీమియం ప్లాన్‌లో.. పాలసీ కాల వ్యవధి అంతటా కాకుండా, కొన్నేళ్ల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్లు వచ్చే వరకు 50 ఏళ్ల కాలానికి టర్మ్ ప్లాన్ ఎంపిక చేసుకున్నాడని అనుకుందాం. 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారంగా భావిస్తే లిమిటెడ్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 5–10–15 ఏళ్లు ఇలా లిమిటెడ్ పేలో ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధి ఉంటుంది. -
Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్‌కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం... ‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. అనుభవాలను మర్చిపోవద్దు.. జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది. 2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన చతుర్వేది తెలిపారు. ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్‌తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్‌పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు. కవరేజీ చాలినంత.. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి. రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్‌కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు. ఎలాంటి కవరేజీ..? ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం. ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్‌డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్‌కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారం తగ్గాలంటే..? హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది. -
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్‌ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్‌చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్‌ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్‌లో చాలామంది ఇన్సూరెన్స్‌ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్‌పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్‌మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్‌లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్‌కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కొత్త తరహా టర్మ్ ప్లాన్స్..
జీవిత బీమాకు సంబంధించి అత్యంత సరళమైన పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది పాలసీదారు కన్నుమూసిన పక్షంలో, వారు తమ జీవితకాలంలో చెల్లించిన ప్రీమియంలకు ప్రతిగా వారి కుటుంబసభ్యులకు (లబ్ధిదారులకు) నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తామంటూ బీమా కంపెనీ ఇచ్చే హామీ. కొత్త ఇన్వెస్టర్లు సాధారణంగానే సరళమైన, సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అన్వేషిస్తుంటారు కాబట్టి వారి కేటగిరీలో టర్మ్ ప్లాన్లకు ఆదరణ ఉంటోంది. ఈ పాలసీల కాలవ్యవధి 15 నుంచి 40 ఏళ్లు, అంతకు పైబడి ఉంటుంది. తమకు అనుకూలమైన కాలవ్యవధిని పాలసీదారు ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభమయ్యే సమయానికి పాలసీదారు వయస్సు, ఎంచుకున్న మొత్తం సమ్ అష్యూర్డ్ బట్టి ప్రీమియం ఉంటుంది. వార్షిక ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునేందుకు చాలా మటుకు బీమా కంపెనీల వెబ్సైట్లలో ఉండే ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్క్యులేటర్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ ఒకవేళ పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి మొత్తం సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఇన్సూరెన్స్ కాల వ్యవధి తీరేంత వరకు పాలసీదారు జీవించే ఉన్న పక్షంలో వారు మొత్తం సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ల రూపంలో వడ్డీని కూడా పొందే విధమైన పాలసీలూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు దీనికి అదనంగా ప్రత్యేక అలవెన్సులు, బహుమతులు, లాయల్టీ అడిషన్ వంటివి కూడా ఇస్తున్నాయి. టర్మ్ ప్లాన్లకు ఎందుకింత ఆదరణ.. వివిధ ప్రొఫెషన్స్‌కు చెందిన కస్టమర్లు తమకు అవసరమైనవి ఎంపిక చేసుకునేలా వివిధ ఫీచర్లు, సరళమైన ఆప్షన్స్‌తో టర్మ్ ప్లాన్లు లభిస్తాయి. కొన్ని ప్లాన్లు డెత్ క్లాజ్‌తో వచ్చినప్పటికీ యాక్సిడెంటల్ డెత్, శాశ్వత వైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి ఆప్షన్స్‌తో పాటు నిర్దిష్ట వయస్సుకు వచ్చాకా పెన్షన్ పొందేటువంటి అదనపు క్లాజ్లతో కూడా లభిస్తుంటాయి. ఇక కొన్ని టర్మ్ ప్లాన్లలో మనీ బ్యాక్ ఫీచర్ ఉంటుంది. ఈ తరహా పాలసీలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి సమ్ అష్యూర్డ్‌లో నిర్దిష్ట శాతం మొత్తాన్ని పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ చెల్లింపులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కింద ఇన్‌కం ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిల్లల చదువు లేదా వివాహం లేదా వ్యాపారంపై పెట్టుబడి పెట్టుకోవడం వంటి ఖర్చుల కోసం పాలసీదారుకి ఈ మొత్తం ఉపయోగపడగలదు. కొన్ని టర్మ్ ప్లాన్లలో చెల్లించాల్సిన ప్రీమియాన్ని తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కొందరు ప్రొఫెషనల్స్‌కు సంపద ఉండొచ్చు. దానితో పాటు కట్టాల్సిన బకాయిలు, అప్పులూ ఉండొచ్చు. అలాంటి వారు తమకు ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ప్రీమియాన్ని చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా వారు పెట్టుబడి పెట్టడం కోసం పెద్ద మొత్తంలో నగదును కేటాయించాల్సిన అవసరం లేకుండా, అలాగే అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా తమ ఆర్థిక భవిష్యత్తును భద్రపర్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదు. ఎండోమెంట్ పాలసీగా లేదా నెలవారీ యాన్యుయిటీలతో కూడుకున్న పెన్షన్ ఫండ్‌లాగా మార్చుకునే సౌలభ్యంతో కూడా పలు టర్మ్ పాలసీలు లభిస్తున్నాయి. ఆ విధంగానూ ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీ, ప్రీమియాన్ని సవరించే అవకాశం ఉన్నప్పటికీ, మారే తమ అవసరాలకు అనుగుణమైన బీమా పాలసీ ప్రయోజనాలను పాలసీదారు పొందవచ్చు. కొందరు ప్రొఫెషనల్స్ తమ టర్మ్ ప్లాన్లను హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకోవాలనుకోవచ్చు. అలాంటప్పుడు సర్వైవల్ ప్రయోజనాలు లభించవు. దానికి బదులుగా పాలసీదారు మరణానంతరం, పాలసీ మెచ్యూరిటీ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బీమా కంపెనీ చెల్లిస్తుంది. కొత్త తరహా ప్లాన్స్ .. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు టర్మ్ పాలసీల్లో పలు కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. డెత్ క్లాజ్‌తో పాటు కొన్ని టర్మ్ ప్లాన్లు 64 పైచిలుకు కీలక అనారోగ్యాలు, వ్యాధులకు కవరేజీ అందిస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్ 40 ఏళ్ల పైబడిన కాలానికి ఉన్నా, పాలసీదారులు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని విధమైన పాలసీలూ ఉన్నాయి. సదరు వయస్సుకు వచ్చాకా రిటైర్ అయ్యే ప్రొఫెషనల్స్ ఈ తరహా టర్మ్ పాలసీలతో ప్రయోజనం పొందవచ్చు. ఇక కొన్ని కొత్త రకం ప్లాన్లను చూస్తే.. వరుసగా పదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత కొన్ని ప్రీమియంలను దాటవేసేందుకు వీలు కల్పించేవీ ఉంటున్నాయి. తద్వారా పాలసీదారులకు ఒక ఏడాది, రెండేళ్ల పాటు కాస్త వెసులుబాటు లభించగలదు. ఏదైతేనేం.. తమ భవిష్యత్తు అలాగే తాము ప్రేమించే వారి భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు టర్మ్ పాలసీలపై ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం కాగలదు. ఆలస్యం చేసే కొద్దీ వయస్సును బట్టి ప్రీమియం భారం కూడా పెరిగిపోతుంది కాబట్టి.. దీన్ని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. -
మహిళలూ.. డబ్బులు సంపాదిస్తుంటే.. పెట్టుబడులు ఎలా పెట్టాలో ఇలా తెలుసుకోండి!
పురుషులతో సమానత్వం కోసం మహిళలు దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా.. నేడు మహిళలకు సముచిత స్థానం ఏర్పడింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పురుషులతో సమానంగా మహిళలూ సొంతం చేసుకుంటున్నారు. స్త్రీలు కేవలం చదువుతోనే ఆగిపోవడం లేదు. కెరీర్ కొనసాగిస్తూ, ఎన్నో విజయాలను నమోదు చేస్తున్నారు. ఉన్నత శిఖరాల దిశగా దూసుకుపోతున్నారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడుతూ, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో, తమ సంపదను పెంచుకునేందుకు వారికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల విధానాలు, ప్రణాళికలు అవసరం అవుతాయి. పరిశీలించి చూస్తే ఆర్జించే మహిళల్లో అధిక శాతం మంది పెట్టుబడులు, ఆర్థిక విషయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు, మదుపు గురించి అంతగా తెలియదనే ధోరణి వారిలో కనిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి తెలుసుకోవాలి. జీవిత భాగస్వాములపై ఆధారపడక్కర్లేకుండా తమ సంపదను తామే నిర్వహించుకునే సామర్థ్యాలు అవసరం. ఈ దిశగా ఏం చేయాలన్నది చర్చించే కథనమే ఇది. మహిళలే ఎందుకు? మన దేశంలో చాలా మంది మహిళలు తమ పెట్టుబడుల వ్యవహారాలను భర్త లేదా తండ్రికే విడిచిపెడుతుంటారు. దీంతో వారికి పెట్టుబడుల వ్యవహారాల గురించి తెలియకుండా పోతుంది. కానీ, ఇది సరికాదు. సంపాదన ఒకరిది అయినప్పుడు, నిర్వహణ బాధ్యతలు మరొకరిపై మోపడం ఎందుకు..? ఇల్లాలిగానే కాదు, ఒంటరిగానూ మహిళలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. సంపాదనను సంపదగా మలిచేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మహిళలకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. కారు కొనుక్కోవాలని, ఆభరణాలు కొనుగోలు చేయాలని, మంచి ట్రిప్లెక్స్ విల్లా సమకూర్చుకోవాలని, సెలవుల్లో ఎక్కడికైనా పర్యటించి రావాలనే కోరికలు, లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన అడుగులు పెట్టుబడుల రూపంలో వేయాలి. ఆర్థిక, పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించేందుకు మహిళలు ఆర్జనా పరులే కానక్కర్లేదు. గృహలక్ష్మి అయినా సరే ఈ విషయాలు తెలిసి ఉండడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. కుటుంబ లక్ష్యాల కోసం మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించడం ఎలాగో తెలుసుకోవాలి. మహిళలు తమ పిల్లల కోసం, కుటుంబ బాధ్యతల కోసం లేదంటే తల్లిదండ్రుల కోసం కెరీర్ మధ్యలో పలు సందర్భాల్లో విరామం తీసుకుంటుంటారు. తమ జీవిత భాగస్వాములతో పోలిస్తే అధిక కాలం జీవించే అవకాశాలు ఉంటాయి. కనుక మహిళలకు తప్పకుండా పెట్టుబడుల వ్యవహారాలు తెలిసి ఉండాలి. నైపుణ్యాలు అవసరం.. పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం అన్నది నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మొదటగా అసలు అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి? అనేది తెలుసుకోవాలి. తర్వాత వాటిల్లో ఏది తమకు అనుకూలమన్నది తేల్చుకోవాలి. పెట్టుబడుల్లో దేనికీ గ్యారంటీ ఉండదు. వివిధ సాధనాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మెరుగైన నిర్ణయాలకు వీలుంటుంది. పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ ధోరణుల గురించి ఆన్లైన్లో సమాచారాన్ని అందించే పోర్టళ్లు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. పెట్టుబడుల ఆరంభించే ముందు నెలవారీ నగదు ప్రవాహాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చులపై స్పష్టత ఉండాలి. నెలవారీ వేతనం, అద్దె ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చేదంతా ఆదాయం కిందకే వస్తుంది. ఖర్చుల్లో తప్పనిసరి, తప్పనిసరి కాదు అని రెండు భాగాలు చేసుకోవాలి. విచక్షణారహితం కానివి అంటే.. ఇంటికి చెల్లించే అద్దె, గృహ రుణ చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు తదితరాలు. విచక్షణారహితం అంటే విలాసం, వినోదం కోసం చేసే ఖర్చులు. వీటి ఆధారంగా నెలవారీ ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. దీంతో నెలవారీ బడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు. లక్ష్యాలపై స్పష్టత.. పెట్టుబడికి లక్ష్యాలు తోడు కావాలి. అప్పుడే స్పష్టమైన మార్గం తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి. అలాగే, ఐదేళ్లు, పదేళ్లు? ఇలా ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. లేదంటే 5–10 ఏళ్లలో సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. లేదంటే 20–30 ఏళ్లకు వచ్చే రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి నిధిని సమకూర్చుకోవడం కావచ్చు. ఇలా లక్ష్యాలన్నింటినీ నిర్ణయించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో దానికి ఉన్న సమయం, ఎంత మొత్తం కావాలి, అందుకు నెలవారీగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందుకు అనుకూలించే పెట్టుబడి సాధనాలపై స్పష్టత తెచ్చుకోవాలి. అత్యవసర నిధి అన్నింటికంటే ముందు అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఏ కారణం వల్ల అయినా ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. లేదా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రమాదం కారణంగా ఉద్యోగానికి తాత్కాలికంగా వెళ్లలేకపోవచ్చు. ఇలాంటి ఊహించని ఖర్చులను ఎదుర్కోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం అత్యవసర నిధి. అత్యవసర నిధి అనేది ఎప్పుడైనా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సాధనం. దీనివల్ల కష్ట కాలంలో రుణాలను ఆశ్రయించకుండా దీని సాయంతో గట్టెక్కవచ్చు. సాధారణంగా అత్యవసర నిధి మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. దీన్ని సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. బ్యాంక్ ఖాతా లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ అత్యవసర నిధి ఏర్పాటుకు సరిపడా నగదు ప్రవాహం లేకపోతే, ఏవైనా అవసరాలను తగ్గించుకుని అయినా ఇన్వెస్ట్ చేయాలి. బీమా రక్షణ మహిళలకు జీవిత బీమా పాలసీ అవసరమా? చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. మహిళలకు కూడా జీవిత బీమా కావాలి. ఎందుకంటే వారు లేని లోటును పూర్తిగా కాకపోయినా, కొంత అయినా అధిగమించేందుకు జీవిత బీమా రక్షణ సాయపడుతుంది. బీమా రక్షణ ఉంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే, వారిపై ఆధారపడిన వారు ఇబ్బందుల పాలు కాకుండా ఉంటుంది. జీవిత బీమా అంటే జీవితంపై పెట్టుబడి పెట్టేది. భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేది. చాలా మంది వివాహం అయి, తమకంటూ కుటుంబం ఏర్పాటైన తర్వాతే జీవిత బీమా గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదు. యుక్త వయసులోనే జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. జీవితంలో వివిధ దశల్లో, పెరిగే తమ బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ మొత్తాన్ని సవరించుకుంటూ వెళ్లాలి. ఇది భవిష్యత్తుకు భరోసానిచ్చేదిగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మహిళలకు ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యల రిస్క్ ఎక్కువ. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. పోర్ట్‌ఫోలియో నిర్వహణ మహిళలు పెట్టుబడుల నిర్వహణలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడాన్ని గమనించొచ్చు. ఇదంతా గతం నుంచి ఉన్న ధోరణి వల్లేనని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల నిర్వహణ ఎలా? అన్న సందేహం ఎదురైతే.. ముందు తమ బలాల గురించి తెలుసుకోవాలి. రిస్క్‌కు దూరంగా సంప్రదాయ ధోరణితో ఉంటే డివిడెండ్ చెల్లించే కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు, యుటిలిటీ సంస్థలను పరిశీలించొచ్చు. రిస్క్ తీసుకునే వారు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. అయితే మొత్తం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట కాకుండా, వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం తప్పనిసరి. తమ జీవిత లక్ష్యాల సాకారానికి, మెరుగైన విశ్రాంత జీవనానికి.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు మహిళల ముందు ఎన్నో మార్గాలున్నాయి. ఇందుకోసం వెంటనే పెట్టుబడులు ప్రారంభించాలి. చాలా ముందుగా ఆరంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో సంపద వేగంగా వృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించి జీవిత లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీతోపాటు డెట్, బంగారం తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిపుణుల నిర్వహణలో, తగినంత వైవిధ్యం, రిస్క్ బ్యాలన్స్తో నడిచే మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఇదే తెలియజేస్తున్నాయి. స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసేంత విషయ పరిజ్ఞానం, సమయం లేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం. పరిమిత పెట్టుబడితోనే ఎన్నో రకాల కంపెనీలు, రంగాల్లో ఎక్స్పోజర్ లభిస్తుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు కొనుగోలు వ్యయం తగ్గి, అధిక రాబడి లభిస్తుంది. -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
బీమా పాలసీని వెనక్కి ఇచ్చేస్తే..?
విష్ణు స్వరూప్ (30) పేరిట రెండు జీవిత బీమా ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం తనకు ఉద్యోగం వచి్చన కొత్తలో ఆ పాలసీలను విష్ణు పేరిట ఆయన తండ్రి ప్రారంభించారు. వీటి కోసం ఏటా రూ.50,000 ప్రీమియంను విష్ణు స్వయంగా చెల్లిస్తున్నారు. ఈ రెండింటి రూపంలో వస్తున్న బీమా రక్షణ రూ.10 లక్షలు. కాల వ్యవధి 20 ఏళ్లు. ఎందుకోగానీ తాను తీసుకున్న బీమా ఉత్పత్తులు తగినంత రక్షణ ఇవ్వడం లేదన్న అభిప్రాయం అతడిలో కలిగింది. దీంతో ఓ ఆరి్థక సలహాదారుడిని సంప్రదించాడు. పాలసీల పూర్తి వివరాలు, విష్ణు ఆదాయం, జీవిత లక్ష్యాలన్నింటినీ సమగ్రంగా విశ్లేíÙంచిన అనంతరం.. వెంటనే సదరు రెండు ఎండోమెంట్ పాలసీలను సరెండ్ చేసేయాలని ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. నిపుణుడిని సంప్రదిస్తే కానీ, ఆ పాలసీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న విషయం అతడికి బోధపడలేదు. విష్ణు మాదిరే ఎండోమెంట్ పాలసీలకు భారీ ప్రీమియం చెల్లించే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు జీవిత బీమా అంటే ఎక్కువ మందికి తెలిసింది ఎండోమెంట్ పాలసీల గురించే. టర్మ్ ఇన్సూరెన్స్ ఇటీవలి కాలంలోనే ఆదరణను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ఎండోమెంట్ పాలసీలు గతంలో ప్రజల సహజ పొదుపు మనస్తత్వం కోణం నుంచి అభివృద్ధి చేసినవి. అంతేకానీ, అచ్చమైన బీమా రక్షణ కోసం కావు. పెట్టుబడుల సాధనాలు, రాబడులపై అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ, టర్మ్ పాలసీల ప్రాధాన్యం తెలిసి వస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణిస్తే కుటుంబానికి మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకునేవి టర్మ్ ప్లాన్లు. కాల వ్యవధి ముగిసే రోజు వరకు జీవించి ఉంటే రూపాయి తిరిగి రాదు. దీనికి భిన్నంగా.. పాలసీ కాల వ్యవధిలో మరణించినా లేక పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉన్నా.. ఈ రెండు సందర్భాల్లోనూ ఎంతో కొంత ముట్టజెప్పేవి ఎండోమెంట్ ప్లాన్లు. ఇవి తక్కువ బీమా రక్షణ, తక్కువ రాబడితో కూడినవి. బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్ల విక్రయానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. దీనిపై వారికి లభించే కమీషన్ ఎక్కువగా ఉంటుంది. మొదటి ఏడాది ప్రీమియంలో 10–25 శాతం వరకు వారికి కమీషన్‌గా ముడుతుంది. అంతేకాదు రెండో సంవత్సరం నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియంపై 5–7 శాతం కమీషన్‌గా ఏజెంట్లకు ఆదాయం వస్తూనే ఉంటుంది. టర్మ్ ప్లాన్ల పైనే ఇదే స్థాయిలో కమీషన్ ఉంటుంది. కాకపోతే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువ కనుక కమీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. దేశ వాసుల్లో చాలా మందికి ఎండోమెంట్ ప్లాన్లే ఉన్నాయి. తెలిసిన ఏజెంట్ బలవంతం పెట్టాడని, స్నేహితులు, బంధువులు సూచించారని చెప్పి వీటిని తీసుకోవడం కనిపిస్తుంది. చెల్లిస్తున్న ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ ఇవ్వని, ప్రీమియం భారంతో కూడిన ఇలాంటి ఎండోమెంట్ ప్లాన్లను వదిలించుకునే మార్గం ఉంది. సరెండర్ చేసేయడమే.. ఎందుకు సరెండర్ చేయాలి..? తాము తీసుకున్న జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్‌లో తగినంత కవరేజీ లేదని, ప్రీమియం ఎక్కువగా ఉందని అనిపిస్తే దాన్ని నిలిపివేయడంలో ఎలాంటి తప్పు లేదు. జీవిత బీమా ప్లాన్ తీసుకునేది ఎందుకు..? తమకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకూడదనే. తమపై ఆధారపడిన వారు, అసాధారణ సందర్భాల్లో కష్టాలు పడకూడదంటే అందుకు తగినంత కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాల్సిందే. పిల్లల విద్య ఆగిపోకూడదు. వారి రోజువారీ జీవనం, ఇతర వ్యయాలు అన్నింటినీ జీవిత బీమా పరిహారం ఆదుకునే విధంగా ఉండాలి. అందుకే వార్షిక ఆదాయానికి ఎంతలేదన్నా కనీసం పది రెట్ల మేరకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. విష్ణు స్వరూప్నే ఉదాహరణగా తీసుకుందాం. అతడు రూ.10 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.50వేలు చెల్లిస్తున్నాడు. కానీ, కేవలం రూ.20 వేల వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా విష్ణు రూ.1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో విష్ణు అదే పనిచేశాడు. ఉన్న ఎండోమెంట్ ప్లాన్లను సరెండ్ చేశాడు. రూ.1.5 కోట్ల టర్మ్‌ప్లాన్ తీసుకున్నాడు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.25,000. ఎండోమెంట్ పాలసీల్లో బీమా రక్షణతోపాటు, ఎంతో కొంత రాబడి ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, ఇందులో వాస్తవం ఏంటన్నది పాలసీదారులకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి 4.5–5.5 శాతం మించి ఉండదు. అరుదైన సందర్భాల్లోనే రాబడి 6 శాతం ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం కూడా దీర్ఘకాల సగటు అదే స్థాయిలో ఉంది. దీంతో నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్‌పై ఏటా 5 శాతం సింపుల్ గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీ కింద రూ.21 లక్షలు వస్తుంది. రాబడి రేటు 6.22 శాతం. ద్రవ్యోల్బణం 6 శాతం (సగటున) మినహాయిస్తే నికర రాబడి 0.22 శాతమే. అదే ఈక్విటీ పథకాల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే రాబడి వార్షికంగా 10–12 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. డెట్ సాధనాల్లోనూ 7 శాతం మేర రాబడి వస్తుంది. పాలసీని నిలిపివేస్తే..? ఎండోమెంట్ ప్లాన్ గురించి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, ఇక వద్దనుకుంటే పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండిపోవడం. లేదంటే పాలసీని సరెండర్ చేయడమే సరైనది. పాలసీలో కవరేజీ, రాబడి ఆకర్షణీయంగా లేదని అసంతృప్తిగా ఉంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఆగిపోవచ్చు. కాల వ్యవధి తర్వాత ఫండ్ వెనక్కి వస్తుంది. దీన్నే పాలసీ పెయిడప్ అని అంటారు. మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందన్నది బీమా సంస్థ చెబుతుంది. అంతేకాదు, జీవిత బీమా కవరేజీ కూడా కొనసాగుతుంది. కాకపోతే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు అనుగుణంగా జీవిత బీమా కవరేజీని తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. అప్పుడు రూ.10 లక్షలకు బదులు రూ.2.5 లక్షల జీవిత బీమా కవరేజీ కాల వ్యవధి ముగిసే వరకు లభిస్తుంది. పెయిడప్ చేసే నాటికి జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్, బోనస్‌లు కలిపి పెయిడప్ వ్యాల్యూని నిర్ణయిస్తారు. సరెండర్ ఎప్పుడు చేయాలి? బీమా పాలసీల్లో సరెండర్ పెనాల్టీ ఎంతో ఎక్కువగా ఉంటుందని భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ నితిన్ మెహతా తెలిపారు. పాలసీ సరెండర్ చేయడానికి ముందే, ఎదురయ్యే ఆరి్థక ప్రతికూలతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకుని సరెండర్ చేసే ముందు ఎంత వస్తుందన్నది తెలుసుకోవాలి. ఎండోమెంట్ ప్లాన్‌కు ప్రీమియం ఇక చెల్లించడం కష్టంగా ఉందని భావిస్తే అప్పుడు సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? పెయిడప్‌గా మారిస్తే గడువు ముగిసిన తర్వాత ఎంతొస్తుందన్నది విశ్లేíÙంచుకోవాలి. సరెండర్ చేసినా లేక పెయిడప్ చేసినా.. అదే సమయంలో టర్మ్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. లేదంటే అసులు లక్ష్యమే దెబ్బతింటుంది. రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేసేయాలని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి ఏటా రూ.50,000 ప్రీమియం రూపంలో ఆదా అవుతుంది. అప్పుడు ఏటా రూ.20,000 ప్రీమియంపై రూ.కోటి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. మిగిలిన రూ.30వేలను ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే ఏటా 12 శాతం సగటు రాబడి అంచనా ఆధారంగా 15 ఏళ్ల తర్వాత రూ.12.50 లక్షలు సమకూరుతుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయడం వల్ల వచి్చన మొత్తాన్ని తీసుకెళ్లి ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కూడా ఏటా 12 శాతం చొప్పున 15 ఏళ్లలో వృద్ధి చెందుతుంది. బీమా, పెట్టుబడిని కలిపి చూడకూడదు. అచ్చమైన బీమా రక్షణ ఏర్పాటు చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి కోసం మేలైన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. పాలసీ కాల వ్యవధి ముగియకముందే దాన్నుంచి వైదొలగాలని అనుకుంటే, సరెండర్ వేల్యూని వెనక్కి పొందొచ్చు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించారు, ఎంత చెల్లించారు, బోనస్, పెయిడప్ వేల్యూ ఆధారంగా సరెండర్ వేల్యూ ఎంతన్నది ఉంటుంది. ఇందుకు సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ చార్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సరెండర్ ఫ్యాక్టర్ 35 శాతం అనుకుంటే.. రూ.10 లక్షల పాలసీలో రూ.3.5 లక్షలు పాలసీదారునికి దక్కుతుంది. పాలసీ తీసుకుని కాల వ్యవధి పెరుగుతూ వెళుతున్న కొద్దీ, ఈ సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ 70 శాతం వరకు చేరుతుంది. ‘‘కాల వ్యవధికి ముందే పాలసీని సరెండర్ చేస్తే తీవ్రంగా నష్టపోవాలి. సరెండర్ ఫీజుల రూపంలో అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోతారు. కొన్ని కేసుల్లో బోనస్ వంటివి కూడా రావు. కనుక పాలసీ నియమ, నిబంధనలను చదివి అర్థం చేసుకోవాలి’’అని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ‘ఫైనాన్షియల్ స్మార్ట్’ సీఈవో నీతా మెనెజెస్ సూచించారు. సరెండర్ వేల్యూ విషయంలో బీమా సంస్థల మధ్య ఏకరూపత కనిపించదు. కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకమైన సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్చార్ట్లను ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో అయితే చాలా దారుణంగా, నామమాత్రంగా సరెండర్ వేల్యూని నిర్ణయిస్తున్నారు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ఆధారంగా సరెండర్ వేల్యూని కొన్ని ఖరారు చేస్తున్నాయి. సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? సమ్ అష్యూర్డ్: రూ.10లక్షలు పాలసీ కాల వ్యవధి: 20 ఏళ్లు వార్షిక ప్రీమియం: రూ.50వేలు బోనస్ అడిషన్ ఏటా: రూ.50వేలు సరెండర్ కాల వ్యవధి 5ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్ల తర్వాత తర్వాత తర్వాత పెయిడప్ వేల్యూ (రూ.లక్షల్లో) 5 10 15 సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ (శాతంలో) 35 50 70 సరెండర్ వేల్యూ (రూ.లక్షల్లో) 1.75 5 10.50. -
వందేళ్ల వరకు ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు. అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు. వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. -
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే, వాటి మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్నును ఏ విధంగా లెక్కించాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలకు మించితే పాలసీ గడువు తర్వాత అందుకునే మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 తర్వాత నుంచి రూ.5 లక్షలకు మించి ప్రీమియం ఉండే పాలసీల మెచ్యూరిటీపై పన్ను అమల్లోకి వచ్చిన విషయం గమనార్హం. అంతకుముందు వరకు పాలసీల ప్రీమియం ఎంతన్న దానితో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
జీవిత బీమా.. రాబడి చూడొద్దు
జీవిత బీమా అనగానే.. ప్రీమియం ఎంత.. రాబడి ఎంత..? అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికీ జీవిత బీమా విషయంలో ఎక్కువ మంది ఎంపిక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే. ఇందుకోసం భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. ఒకవైపు బీమా కవరేజీ. మరోవైపు రాబడి. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా తప్పు. రాబడి రేటు చాలా తక్కువ. సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువేనని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ స్పష్టంగా తేల్చుకోవాల్సింది ఏమిటంటే.. కావాల్సింది బీమా రక్షణా? లేక రాబడా? ఈ అంశాలను వివరించే కథనం ఇది... సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి బీమా జ్యోతి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను చెల్లిస్తుంది. 55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై రూ.50 చొప్పున వస్తుంది. అంటే మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది. ప్రత్యామ్నాయం... బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైనా బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా అచ్చమైన జీవిత బీమా రక్షణను ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పై ఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేల లోపే. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. బీమా జ్యోతి ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా జ్యోతితో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. కాంపౌండింగ్ ఉండదు.. విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది. ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గ్యారంటీడ్/ పార్టిసిపేటింగ్ బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ను ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో చెల్లిస్తారు. ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటున్నట్టు అయితే, కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమి యంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. -
మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్
సాక్షి,ముంబై: దేశీయంగా ప్రధాన బ్యాంకులు తమ డెబిట్‌కార్డులపై వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. డెబిట్ కార్డులతో, మెజారిటీ బ్యాంకులు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని అందిస్తాయి. డెబిట్ కార్డులకు ఉచిత బీమా ఉంటుంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తోపాటు, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే కవరేజ్‌ని ఒకసారి చూద్దాం. (కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!) కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద మరణ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకు అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ చేయడానికి, ఏటీఎం లావాదేవీ, పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీ లేదా ఆన్లైన్ కొనుగోలు లాంటి విషయాల్లో ఘటనకు, లేదా ప్రమాద తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్క సారైనా కార్డ్‌ని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీని అందజేస్తుంది. దీని రూ. 6 లక్షల వరకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డ్‌లతో మర్చంట్, ఆన్లైన్ పోర్టల్లలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది. (మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్: నామినీ నమోదు ఎలా?) ఎస్బీఐ ఎయిర్‌లైన్ అందించే కవరేజీకి అదనంగా, ఎస్బీఐ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి విభిన్న విమానయాన ప్రమాద మరణ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ నష్ట బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్‌లైన్ టిక్కెట్‌ను కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అదీ ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఉపయోగించాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం ఉండదు. ఒక వేళ కార్డ్ దారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, బీమా కవరేజ్ దాదాపు రెట్టింపు అవుతుంది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఎస్బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎస్బీఐ గోల్డ్‌కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డ్‌కు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డ్‌కు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డ్‌కు రూ. 5 లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్‌కార్డ్‌కు రూ. 10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసిన 90 రోజులలోపు, రూ. 1 లక్షల వరకు నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 1 కోటి వరకు లభించే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినహా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే ప్రమాద బీమా కవరేజీ రూ. 5 లక్షలు. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
ఎగాన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!