ఏటీఎఫ్‌పై జీఎస్టీకి నో! | States Did Not Allow ATF under GST Ambit | Sakshi
Sakshi News home page

ఏటీఎఫ్‌పై జీఎస్టీకి నో!

Published Sun, Dec 22 2024 9:03 AM | Last Updated on Sun, Dec 22 2024 9:36 AM

States Did Not Allow ATF under GST Ambit

రాష్ట్రాలు సమ్మతించడం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మల 

 జీవిత బీమాపై పన్ను తగ్గింపు నిర్ణయం వాయిదా

జైసల్మేర్‌: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను (ఏటీఎఫ్‌) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం తెలిపారు. 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముడి పెట్రోలియం డీజిల్‌ ఉత్పత్తుల్లో భాగమని భావిస్తున్నందున ఏటీఎఫ్‌ను వేరుగా చూడలేమని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని ఆమె చెప్పారు. రుణ నిబంధనలను పాటించనందుకు రుణగ్రహీతల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వసూలు చేసే జరిమానా ఛార్జీలపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్‌ తాజాగా నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ చెల్లింపులను ప్రాసెస్‌ చేసే పేమెంట్‌ అగ్రిగేటర్లు జీఎస్టీ మినహాయింపునకు అర్హులు. ఫిన్‌టెక్‌ సరీ్వసెస్, పేమెంట్‌ గేట్‌వేలకు ఇది వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఎగవేతకు ఆస్కారం ఉన్న వస్తువుల కోసం ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను కౌన్సిల్‌ ఆమోదించింది. 

ఆరోగ్య బీమాపై..  
బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రుల బృందానికి మరింత సమయం అవసరమని, పన్నుల హేతుబదీ్ధకరణపై జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి చెప్పారు. టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను, అలాగే ఆరోగ్య బీమా కవర్‌ కోసం సీనియర్‌ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. రూ.5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్‌ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీ మినహాయించాలని బృందం సూచించింది.  

పాత ఈవీలపై పన్ను.. 
పాత ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయిస్తే ఎటువంటి జీఎస్టీ ఉండదు. అయితే కంపెనీ లేదా పాత కార్ల అమ్మకాల్లో ఉన్న నమోదిత విక్రేత ఈవీ/పెట్రోల్‌/డీజిల్‌ కారును విక్రయిస్తే మార్జిన్‌ విలువపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బలవర్ధకమైన (ఫోరి్టఫైడ్‌) బియ్యంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అయితే జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్టు వివరించారు. పాప్‌కార్న్‌పై పన్ను రేటు మారలేదని జీఎస్టీ కౌన్సిల్‌ వివరణ ఇచి్చంది. 50 శాతం పైగా ఫ్లైయాష్‌ కలిగి ఉన్న ఆటోక్లేవ్డ్‌ ఏరేటెడ్‌ కాంక్రీట్‌ (ఏసీసీ) బ్లాక్స్‌పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి కుదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. మిరియాలు, ఎండు ద్రాక్షలను వ్యవసాయదారుడు సరఫరా చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement