
టారిఫ్‌లను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది
ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి
యూఎస్ టారిఫ్‌లతో తలెత్తే సంక్షోభాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు వేగంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల భారత్‌సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన నేపథ్యంలో పురి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన టారిఫ్‌లను ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసేందుకు నిర్ణయించిన విషయం విదితమే. చైనాపై 145 శాతం సుంకాలు ప్రకటించినప్పటికీ కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్ తదితర కొన్ని ఎల్రక్టానిక్ ప్రొడక్టులను మినహాయించారు. ప్రతీకార టారిఫ్‌ల అమలు జులై 9 వరకూ వాయిదా పడినప్పటికీ యూఎస్ ఎగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమపై టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని పురి పేర్కొన్నారు. అయితే భారత్ వీటిని పటిష్టస్థాయిలో ఎదుర్కోగలదని అంచనా వేశారు. పలు దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకునేందుకు అవకాశాలున్నట్లు
తెలియజేశారు. ఈ ఏడాదిలోనే ఈయూ, యూకేతోపాటు యూఎస్‌తోనూ ఒప్పందాలపై సంతకాలకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
మార్చిలోనే చర్చలు మొదలు
యూఎస్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి(బీటీఏ) మార్చిలోనే చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం తొలి దశను సెప్టెంబర్–అక్టోబర్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030కల్లా 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించే లక్ష్యంతో ఇందుకు శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయంగా చూస్తే ఎఫ్‌టీఏ, సమీకృత ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), బీటీఏలుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. తద్వారా భాగస్వామ్య దేశాలు గరిష్ట సంఖ్యలో వస్తుసంబంధ వాణిజ్యంపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం చేస్తాయి.
ఇదీ చదవండి: ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
స్వల్ప కాలానికి అనిశ్చితులు
వినియోగ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలానికి అనిశ్చితులను ఎదుర్కోవలసి ఉంటుందని పురి తెలియజేశారు. అయితే పోటీతత్వం, డిజిటైజేషన్, ఫ్యూచర్ రెడీ పోర్ట్‌ఫోలియో తదితరాల ద్వారా భారత్ నిలదొక్కుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వల్పకాల అనిశ్చితి, అంచనాలకు అందని పరిస్థితులు ప్రపంచ వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చునని, దీంతో భారత్‌పై కొంతమేర ప్రతికూల ప్రభావానికి చాన్స్ ఉందని విశ్లేషించారు.