Sanjeev Puri
-
వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్‌పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
రుణ రహితంగా ఐటీసీ హోటల్స్!
కోల్‌కత: హోటల్స్ వ్యాపారం బలమైన బ్యాలెన్స్ షీట్‌తోపాటు రుణ రహితంగా ఉంటుందని ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పురి గురువారం తెలిపారు. కొత్త సంస్థ ఉనికిలోకి వచ్చినప్పుడు అవసరమైన రుణం, ఈక్విటీ లేదా వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని సమీకరించగలదని అన్నారు. అటువంటి మూలధనం ఎప్పుడు అవసరమో నిర్ణయించడం కొత్త సంస్థ బోర్డుకి సంబంధించినదని కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విశ్లేషకులతో ఆయన ఈ విషయాలను చెప్పారు. నూతన కంపెనీ ద్వారా హోటల్స్ వ్యాపారంలో పెట్టుబడులను కొనసాగిస్తామని వెల్లడించారు. అపార అవకాశాలతో ఇది సరైన సమయం. కొత్త కంపెనీ వృద్ధి బాట పట్టడంలో సహాయపడటానికి ఐటీసీ సంస్థాగత బలాల మద్దతు ఉంటుందని సంజీవ్ పురి వివరించారు. హోటల్స్ వ్యాపారాన్ని ఒక కొత్త సంస్థగా విడదీయడానికి జూలై 24న ఐటీసీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత నూతన కంపెనీలో ఐటీసీ నేరుగా 40 శాతం ఈక్విటీని కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం కంపెనీ వాటాదారుల సొంతం అవుతుంది. -
లైఫ్‌స్టైల్ రిటైలింగ్‌కు ఐటీసీ టాటా
న్యూఢిల్లీ: లైఫ్‌స్టైల్ రిటైలింగ్ బిజినెస్ నుంచి వైదొలగినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బిజినెస్ పోర్ట్‌ఫోలియోపై వ్యూహాత్మక సమీక్ష తదుపరి ఇందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల క్రితం విల్స్ లైఫ్‌స్టైల్ బ్రాండుతో ఐటీసీ ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఫార్మల్, క్యాజువల్, డిజైనర్ వేర్సహా పలు దుస్తులను విక్రయించడంతోపాటు.. జాన్ ప్లేయర్స్ బ్రాండుతో పురుషుల క్యాజువల్స్, డెనిమ్స్, ఫార్మల్స్ తదితరాలను సైతం మార్కెటింగ్ చేసింది. అయితే 2019లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా లైఫ్‌స్టైల్ రిటైలింగ్ బిజినెస్‌ను తగ్గించుకుంది. జాన్ ప్లేయర్స్ బ్రాండును రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. కొన్ని పాత స్టోర్స్లోగల విల్స్ బ్రాండు నిల్వలను విక్రయిస్తున్నట్లు గత నెలలో కంపెనీ చైర్మన్ సంజీవ్ పురి వెల్లడించిన విషయం విదితమే. -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం
అగ్రి బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి ► కొత్త వ్యాపార విభాగాలపైనా కసరత్తు ► ఐటీసీ సీఈవో సంజీవ్ పురి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మరిన్ని హెల్త్‌కేర్ తదితర కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి కొన్ని నెలలకు మార్కెట్లో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టే దిశగా.. త్వరలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా విక్రయించడం ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ‘రాబోయే రోజుల్లో ఆలూ, గోధుమ మొదలుకుని పళ్లు, ఇతర కూరగాయలు, సముద్ర ఆహారోత్పత్తులు వంటివాటిపై మరింతగా దృష్టి పెట్టనున్నాం’ అని ఆయన వివరించారు. అలాగే ఉల్లి డీహైడ్రేట్స్పైనా కసరత్తు చేస్తున్నామని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని పురి తెలిపారు. ఐటీసీ ఆదాయాల్లో ప్రస్తుతం 58% వాటా పొగాకుయేతర వ్యాపార విభాగాలైన ఎఫ్ఎంసీజీ, హోటల్, అగ్రి బిజినెస్, పేపర్ మొదలైన వాటిదే. హెల్త్‌కేర్ టీమ్ ఏర్పాటు ప్రక్రియ.. ఇక, హెల్త్‌కేర్ వ్యాపార విభాగంపై స్పందిస్తూ ఇందుకు సంబంధించి ప్రస్తుతం టీమ్‌ను తయారుచేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతోనే వివిధ వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవలం షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కోణానికే పరిమితం కాకుండా దాని పునాదిపై సామాజిక ప్రయోజనాలకూ పాటుపడాలన్నది ఐటీసీ వ్యూహమని పురి పేర్కొన్నారు. ఇండియా ఫస్ట్ వ్యూహం కింద 2030 నాటికల్లా వ్యాపారాలు, వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా 1 కోటిపైగా మందికి జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐటీసీ, దాని గ్రూప్ సంస్థల్లో 32,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తూ, సుమారు 60 లక్షల మందికి జీవనోపాధి దక్కేలా కృషి చేస్తోంది. అగ్రి బిజినెస్, విలువ జోడింపు వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఐటీసీ ప్రస్తుతం సుమారు 20 కన్జూమర్ గూడ్స్, లాజిస్టిక్స్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. -
ఐటీసీ కొత్త సీఓఓగా సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా సంజీవ్ పురి నియమితులయ్యారు. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, సీఓఓగా, పూర్తికాల డెరైక్టర్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. సంజివ్ పురిని డెరైక్టర్(ఎఫ్ఎంసీజీ బిజినెస్)గా పి.ధోబలే స్థానంలో గత ఏడాది డిసెంబర్ 6న కంపెనీ నియమించింది.