ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం | ITC explores ways to venture into health and wellness market | Sakshi
Sakshi News home page

ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం

Published Tue, Sep 12 2017 12:19 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం

ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం

అగ్రి బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి
►  కొత్త వ్యాపార విభాగాలపైనా కసరత్తు
► ఐటీసీ సీఈవో సంజీవ్‌ పురి


న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మరిన్ని హెల్త్‌కేర్‌ తదితర కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి కొన్ని నెలలకు మార్కెట్లో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టే దిశగా.. త్వరలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా విక్రయించడం ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్‌ పురి చెప్పారు.

‘రాబోయే రోజుల్లో ఆలూ, గోధుమ మొదలుకుని పళ్లు, ఇతర కూరగాయలు, సముద్ర ఆహారోత్పత్తులు వంటివాటిపై మరింతగా దృష్టి పెట్టనున్నాం’ అని ఆయన వివరించారు. అలాగే ఉల్లి డీహైడ్రేట్స్‌పైనా కసరత్తు చేస్తున్నామని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని పురి తెలిపారు. ఐటీసీ ఆదాయాల్లో ప్రస్తుతం 58% వాటా పొగాకుయేతర వ్యాపార విభాగాలైన ఎఫ్‌ఎంసీజీ, హోటల్, అగ్రి బిజినెస్, పేపర్‌ మొదలైన వాటిదే.

హెల్త్‌కేర్‌ టీమ్‌ ఏర్పాటు ప్రక్రియ..
ఇక, హెల్త్‌కేర్‌ వ్యాపార విభాగంపై స్పందిస్తూ ఇందుకు సంబంధించి ప్రస్తుతం టీమ్‌ను తయారుచేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతోనే వివిధ వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవలం షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కోణానికే పరిమితం కాకుండా దాని పునాదిపై సామాజిక ప్రయోజనాలకూ పాటుపడాలన్నది ఐటీసీ వ్యూహమని పురి పేర్కొన్నారు.

ఇండియా ఫస్ట్‌ వ్యూహం కింద 2030 నాటికల్లా వ్యాపారాలు, వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా 1 కోటిపైగా మందికి జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐటీసీ, దాని గ్రూప్‌ సంస్థల్లో 32,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తూ, సుమారు 60 లక్షల మందికి జీవనోపాధి దక్కేలా కృషి చేస్తోంది. అగ్రి బిజినెస్, విలువ జోడింపు వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఐటీసీ ప్రస్తుతం సుమారు 20 కన్జూమర్‌ గూడ్స్, లాజిస్టిక్స్‌ హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement