
మార్చిలో 42 బిలియన్ డాలర్లు
0.7 శాతం వృద్ధి
4 నెలల గరిష్టానికి దిగుమతులు
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు నాలుగు నెలల తర్వాత సానుకూలంగా మారాయి. మార్చి నెలలో 0.7 శాతం వృద్ధితో 41.97 బిలియన్ డాలర్లకు (రూ.3.6 లక్షల కోట్లు సుమారు) చేరాయి. వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు ఎగుమతులు 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దిగుమతులు 6.67 శాతం పెరిగి 720.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 14.05 బిలియన్ డాలర్లు కాగా.. గతేడాది మార్చిలో 15.33 బిలియన్ డాలర్ల చొప్పున ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 241 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దిగుమతులు ఈ ఏడాది మార్చిలో నాలుగు నెలల గరిష్టానికి చేరి 63.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
సేవల్లో వృద్ధి..
ఇక 2024–25 సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలసి 821 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023–24లో నమోదైన 778 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 5.5 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. 2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లు కాగా, 2024–25లో 383.51 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు అంచనా.
2023–24తో పోల్చితే 2024–25లో ఇంజనీరింగ్ ఎగుమతులు 109.3 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు, ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 29 బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు, ఫార్మా ఎగుమతులు 28 బిలియన్ డాలర్ల నుంచి 30.47 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తులు (63.34 బిలియన్ డాలర్లు) కెమికల్స్ రంగాల్లో (28.7 బిలియన్ డాలర్లు) ఎగుమతులు క్షీణించాయి.