
మనకు సవాళ్లు.. అవకాశాలు!
ఫార్మా, ఐటీ, రత్నాభరణాల ఎగుమతులు పటిష్టం చేసుకోవచ్చు
దేశీయ ఎగుమతిదార్ల అంచనాలు
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపును 90 రోజుల పాటు నిలిపివేయాలన్న అమెరికా, చైనా నిర్ణయంతో భారత్‌కు సవాళ్లు ఉన్నప్పటికీ, నిర్దిష్ట వ్యాపార అవకాశాలు కూడా ఉంటాయని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడమనేది అంతర్జాతీయంగా వాణిజ్య స్థిరత్వానికి సానుకూలాంశమని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు.
టారిఫ్‌ల తగ్గింపు వల్ల, ఎల్రక్టానిక్స్, మెషినరీ, రసాయనాలు వంటి అధిక విలువ చేసే ఉత్పత్తులకు సంబంధించి అమెరి–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎగియవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంతో భారత ఎగుమతిదార్లకు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి మార్కెట్లో చొచ్చుకుపోయిన భారత ఎగుమతిదార్లకు పోటీ పెరగవచ్చని రాల్హన్ చెప్పారు. కానీ, ఆ రెండు దేశాల వాణిజ్య పరిధిలోకి రాని ఇతర రంగాలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభించగలదన్నారు.
ఫార్మా ఏపీఐలు, ఐటీ ఆధారిత సరీ్వసులు, రత్నాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రసాయనాల్లాంటి ఎగుమతులను పటిష్టపర్చుకోవచ్చని రాల్హన్ చెప్పారు. విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాణిజ్యంలో మరింత ప్రాధాన్యం దక్కేలా అమెరికాతో భారత్ క్రియాశీలకంగా సంప్రదింపులు జరపడం శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. అలాగే టారిఫ్‌ల తగ్గింపనేది తాత్కాలికమే కావడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవకుండా హెడ్జింగ్ చేసుకునేందుకు కంపెనీలు పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) స్కీమ్, మేకిన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లో ఉత్పత్తిని పెంచుకునేందుకు మొగ్గు చూపవచ్చని రాల్హన్ చెప్పారు. చైనా నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువలా వచి్చపడకుండా ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాలని మరో ఎగుమతిదారు చెప్పారు.
వ్యయాలు తగ్గించుకోవాలి..
మన ఎగుమతులపై అమెరికాలో సుంకాల రేటు చైనాతో పోలిస్తే తక్కువే ఉన్నప్పటికీ.. వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితమే చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు విధించినప్పుడు 10 శాతం శ్లాబ్‌లో ఉన్న భారత్ వైపు మొగ్గు ఎక్కువగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుత 30 శాతంతో పోల్చినప్పుడు మనం ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. గతంలో ఉన్నంత ప్రయోజనం ఉండదని శ్రీవాస్తవ చెప్పారు.
టారిఫ్‌లను ప్రతిపాదిత 26 శాతానికి పెంచకుండా, 10 శాతం స్థాయిలోనే కొనసాగించేలా అమెరికాతో సంప్రదింపుల ద్వారా భారత్ స్మార్ట్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచాలని ఆయన సూచించారు. వాణిజ్య విధానానికే పరిమితం కాకుండా భారత్ అత్యవసరంగా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని, లాజిస్టిక్స్‌ను ప్రక్షాళన చేయాలని, నిబంధనలు అంచనాలకు అందే విధంగా ఉండేలా విధానాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడంపై సంప్రదింపులు జరుగుతున్నందున 90 రోజుల పాటు చాలా మటుకు సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు అమెరికా, చైనా అంగీకారానికి వచ్చాయి.
ఫార్మా రేట్ల కోతతో భారత్‌పై ఒత్తిడి: జీటీఆర్‌ఐ
ప్రి్రస్కిప్షన్ ఔషధాల రేట్లను 30–80 శాతం వరకు తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలతో అంతర్జాతీయంగా ఫార్మా రేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయని జీటీఆర్‌ఐ తెలిపింది. అమెరికాలో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఫార్మా సంస్థలు ఇతర దేశాల్లో తాము ధరలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తాయని పేర్కొంది. ఇందుకోసం పేటెంట్ చట్టాలను మార్చే విధంగా భారత్‌లాంటి దేశాలపై ఒత్తిడి తేవొచ్చని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికి చౌకగా ఔషధాలను అందించేందుకు ఉపయోగపడుతున్న తన పేటెంట్ చట్టాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరాదని సూచించారు. మన జనరిక్స్‌పై ప్రపంచం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ మోడల్‌ను పరిరక్షించడమనేది భారత్‌కి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రపంచానికి కూడా అవసరమని వివరించారు.