FIEO
-
పది దేశాలకు మరింతగా ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ తోడ్పాటు, పటిష్టమైన మార్కెటింగ్ వ్యూహాలతో పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు 112 బిలియన్ డాలర్ల మేర పెంచుకోవచ్చని వివరించింది. సదరు దేశాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో దేశీ సంస్థలు పాల్గొనేందుకు, విక్రేతలు–కొనుగోలుదారుల సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించడంలో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఒక స్కీమును రూపొందించవచ్చని ఎఫ్ఐఈవో తెలిపింది. అలాగే, విదేశాల్లోని దిగుమతి సంస్థలు, దేశీ ఎగుమతి సంస్థల మధ్య సమావేశాలు నిర్వహించడంలో ఆయా దేశాల్లోని భారతీయ మిషన్లు పరిశ్రమకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొంది. తయారీ రంగంలో భారత్ సామర్థ్యాలను సదరు దేశాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చని ఎఫ్ఐఈవో వివరించింది. ‘112 బిలియన్ డాలర్ల మేర మరింతగా ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న 10 దేశాల్లో అమెరికా (31 బిలియన్ డాలర్లు), చైనా (22 బిలియన్ డాలర్లు), యూఏఈ (11 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (8.5 బిలియన్ డాలర్లు), జర్మనీ (7.4 బిలియన్ డాలర్లు), వియత్నాం (9.3 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (5 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (5.4 బిలియన్ డాలర్లు), ఇండొనేషియా (6 బిలియన్ డాలర్లు), మలేషియా (5.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి‘ అని ఎఫ్ఐఈవో తెలిపింది. 2030 నాటికి ఉత్పత్తులు, సేవల ఎగుమతులను 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్లకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. 2022–23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► నివేదిక ప్రకారం పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలో వజ్రాలు, వాహనాలు, ఆభరణాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, మెరైన్ ఉత్పత్తులు, దుస్తులు, క్రిమిసంహాకరాలు, ఇనుము .. ఉక్కు, టీ, కాఫీ మొదలైనవి ఉన్నాయి. ► అమెరికాకు డైమండ్లు (3.7 బిలియన్ డాలర్లు), మోటర్ వాహనాలు (2.2 బిలియన్ డాలర్లు), ఆభరణాలు (1.4 బిలియన్ డాలర్లు), టెలిఫోన్ సెట్లు, ఇతరత్రా వాయిస్/ఇమేజ్ ట్రాన్స్మిషన్ పరికరాలు (1.3 బిలియన్ డాలర్లు) మొదలైన వాటి ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ► చైనాకు మోటర్ వాహనాలు, ఆటో విడిభాగాలు, ఆభరణాలు, పశుమాంసం, రొయ్యలు, మిరియాలు, గ్రానైట్, ఆముదం, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవచ్చు. ► జర్మనీకి అల్యూమినియం, కాఫీ, దుస్తులు, జీడిపప్పు, మోటర్ వాహనాలు, ఆభరణాలు ఎగుమతి చేయొచ్చు. ► బ్రిటన్‌కు వజ్రాలు, ఆభరణాలు, రొయ్యలు, కలప ఫరి్నచరు, బియ్యం, బ్లాక్ టీ, టర్బోజెట్లు, ఆటో విడిభాగాలు, శాండ్‌స్టోన్, పిల్లల దుస్తుల ఎగుమతులను పెంచుకోవచ్చు. ► ఇండొనేషియా, మలేíÙయాకు ఇనుము..ఉక్కు ఐటమ్లు, ఆటో విడిభాగాలు, క్రిమిసంహారకాలు, అల్యూమినియం మిశ్రమ లోహాలు, రాగి క్యాథోడ్లు, రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులను మరింతగా ఎగుమతి చేయొచ్చు. ► ఎగుమతులు పెరగడం వల్ల దేశీయంగా ఉద్యోగాల కల్పనకు, తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ మారకాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది. -
ఎఫ్ఐఈవో, బిజినెస్ రష్యా ఎంవోయూ
న్యూఢిల్లీ: భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో), బిజినెస్ రష్యాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం ఇచ్చిపుచ్చుకోనున్నట్టు తెలిపింది. రష్యా వ్యాపార మండలి, ఎఫ్ఐఈవో సంయుక్తంగా ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారులు–విక్రయదారుల సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేయడంతోపాటు, జాయింట్ వెంచర్ల ఏర్పాటు విషయంలో తమ దేశ సంస్థలకు సహకారం అందించనున్నాయి. ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 50 మంది భారత ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ కుదిరింది. రెడీ టూ ఈట్ మీల్స్, ఫిష్ మీల్, జంతువులకు దాణా, సోయాబీన్ తదితర ఉత్పత్తుల విషయంలో జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై ప్రతినిధుల బృందం దృష్టి పెట్టనున్నట్టు ఎఫ్ఐఈవో బోర్డ్ సభ్యుడు ఎన్కే కగ్లివాల్ తెలిపారు. భారత ప్రతినిధుల బృందానికి కగ్లివాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆగ్రో, ఆహార ప్రాసెసింగ్ ఎగుమతులు 750 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు వచ్చే మూడేళ్లలో పెంచుకోవాలన్నది లక్ష్యమని తెలిపారు. కొన్ని అంశాల పరిష్కారానికి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, బ్యాంకర్ల అదనపు కృషి చేయాల్సి ఉంటుందని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. -
త్వరలో 10 బిలియన్ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు
కోల్‌కతా: రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్ వివరించారు. ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్) 400 శాతం పెరిగాయి. ఇక భారత్ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. 750 బిలియన్ డాలర్ల టార్గెట్ సాధిస్తాం.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్ కాకుండా) 65 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్ చెప్పారు. -
జీఎస్టీ మినహాయింపు పొడిగించండి, నిర్మలా సీతారామన్‌కు ఎఫ్ఐఈవో లేఖ
కోల్‌కతా: ఎగుమతుల రవాణా చార్జీలకు సంబంధించి సెప్టెంబర్ 30తో ముగిసిన జీఎస్టీ మినహాయింపును మళ్లీ పొడిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో కోరింది. పొడిగించని పక్షంలో, వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో నిధులపరంగా తాము మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. ఆర్థిక మంత్రికి ఎఫ్ఐఈవో ఈ మేరకు లేఖ రాసింది. 2018లో ఈ స్కీమును ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఇప్పటివరకూ రెండు సార్లు పొడిగించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగిసింది. దీన్ని పొడిగించకపోతే ఎగుమతుల రవాణా చార్జీలపై ఎగుమతిదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎగుమతుల రవాణా రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో జీఎస్టీ విధిస్తే మరింత భారంగా మారుతుందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. -
ఎగుమతులు... కొత్త చరిత్ర!
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘‘భారత్ 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని మొదటిసారి అధిగమించింది. మన రైతులు, చేనేతకారులు, ఎంఎస్ఎంఈలు, తయారీదారులు, ఎగుమతిదారులు అందరినీ ఈ విజయాన్ని సాధించినందుకు అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర భారత్ ప్రయాణానికి ఇది కీలకం‘‘అంటూ మోదీ ట్వీట్ చేశారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల సహకారంతో.. ట్విట్టర్లోనే ప్రధాని కొన్ని గ్రాఫిక్స్‌ను కూడా పోస్ట్ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు..: ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడానికి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, తోలు, కాఫీ, ప్లా స్టిక్, రెడీమేడ్ వస్త్రాలు, మాంసం, డెయిరీ, సము ద్ర ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు మద్దతుగా నిలిచాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతు లు నిజం గా గొప్ప మైలురాయిగా భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. రవాణా పరంగా ఎన్నో సవాళ్లు ఉన్నాకానీ, అదనంగా 100 బిలియన్ డాలర్ల ఎగుమతులు పెంచుకోగలిగినట్టు చెప్పారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలకుతోడు, పీఎల్ఐ పథకాలు ఎగుమతుల వృద్ధికి సాయపడినట్టు తెలిపారు. 37 శాతం అధికం.. దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్ డాలర్లుగా మార్చి 21 నాటికి నమోదైనట్టు తెలిపింది. 2020–21లో 292 బిలియన్ డాలర్లు, 2018–19లో 330 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
ఎగుమతుల మార్కెట్ లో మన వాటాను కాపాడుకోవాలి!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో భారత్ తొలుత తన ఎగుమతుల వాటాను పరిరక్షించుకోడానికి కృషి చేయాలని, అటు తర్వాత వృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పేర్కొన్నారు. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. వివిధ మార్పులకు గురవుతున్న ఎగుమతుల రంగంలో మన వాటా పరిరక్షణకు విభిన్న వ్యూహాలను అవలంభించాల్సి ఉంటుందని అన్నారు. ధర, నాణ్యతా ప్రమాణాలు, ఒప్పందాలు, మౌలిక రంగం పురోగతి, నిబంధనల సరళీకరణ, తగిన ఆర్థిక సౌలభ్యత వంటి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. మందగమనంలో కేవలం 2.8 శాతం వృద్ధి సాధిస్తున్న ప్రపంచ వాణిజ్య విపణిలో భారత్ తన వాటాను కాపాడుకోవడంపైనే తక్షణం దృష్టి పెట్టాలన్నారు. 16 నెలలుగా భారత్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా... క్షీణత నెలకొన్న సంగతి తెలిసిందే. దిగుమతుల బిల్లు తగ్గడం తగిన కరెంట్ అకౌంట్‌లోటు కొనసాగడానికి కారణమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వార్షిక ఎగుమతుల అవార్డులు ‘నిర్యాత్ శ్రీ’, ‘నిర్యాత్ బంధు’లను పలువురికి ప్రదానం చేశారు. -
ఎగుమతులు పడ్డాయ్!
* జనవరిలో 11 శాతం క్షీణత * దిగుమతులదీ ఇదీ పరిస్థితి * వాణిజ్యలోటు 8.32 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2015 జనవరిలో నిరుత్సాహం కలిగించాయి. 2014 ఇదే నెలతో పోల్చితే విలువలో అసలు వృద్ధి లేకపోగా 11.19 శాతం తగ్గిపోయాయి (క్షీణత). 2015 జనవరిలో ఎగుమతుల విలువ 23.88 బిలియన్ డాలర్లు. 2014 ఇదే నెలలో ఈ పరిమాణం 26.89 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ స్థాయికి ఎగుమతుల రేటు పడిపోవడం రెండున్నర సంవత్సరాల కాలంలో (2012 జూలైలో 14.8 శాతం) ఇదే తొలిసారి. ఇక దిగుమతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 11.39 శాతం క్షీణించి 32.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల పడిపోవడం వరుసగా ఇది రెండవనెల. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 8.32 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు గడచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి ఇంత తక్కువ స్థాయిని నమోదుచేసుకుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విలువ తగ్గడం దీనికి (తక్కువ స్థాయి వాణిజ్యలోటు) ప్రధాన కారణం. చమురు దిగుమతుల బిల్లు 37.46 శాతం పడిపోయి కేవలం 8.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిరాశలో కీలక రంగాలు కాటన్ యార్న్ (- 9.15 శాతం), రసాయనాలు(-10.52), ఫార్మా(-0.16 శాతం), రత్నాలు, ఆభరణాల (-3.73 శాతం) రంగాల నుంచి ఎగుమతులు భారీగా లేకపోవడం మొత్తం ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపింది. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు కూడా నిరాశగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్ మెరుగుపడినప్పటికీ, యూరోపియన్ యూనియన్, జపాన్‌లో మందగమన పరిస్థితులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. బంగారం దిగుమతులు ఇలా...: కాగా 2015 జనవరిలో బంగారం దిగుమతులు 8.13 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-జనవరి మధ్య...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య ఎగుమతులు 2.44 శాతం వృద్ధితో 265.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 2.17 శాతం పెరుగుదలతో 383.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 118.37 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 340 బిలియన్ డాలర్ల ఎగుమతులను కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రోత్సాహకాలు అవసరం: ఎఫ్ఐఈఓ ఎగుమతుల రంగం పునరుత్తేజానికి తగిన విధాన చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టాలని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ దిశలో విదేశీ వాణిజ్య విధానాన్ని త్వరలో ఆవిష్కరించాలని సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరేలా కనబడ్డం లేదని అన్నారు. -
రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) ప్రకటించిన నిర్యత్‌శ్రీ అవార్డును పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వంకా రవీంద్రనాథ్ అందుకున్నారు. సోమవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో ఎగుమతుల విషయంలో విశేష ప్రతిభ కనబరిచిన వ్యాపారవేత్తలకు ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్ అయిన వంకా రవీంద్రనాథ్ తలనీలాల ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మహిళలకు ఉపాధి కల్పించడం, విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టడంలో గుర్తించదగిన ప్రతిభ, వృద్ధి చూపినందుకు ఆయనను ఈ అవార్డు వరించింది. -
లక్ష్యాన్ని మించనున్న ఎగుమతులు
ముంబై: తయారీ రంగం ఊపందుకోనుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ అధిగమించే అవకాశం ఉందని దేశీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) తెలిపింది. ‘అమెరికా, యూరోపియన్ యూనియన్లతో పాటు వర్థమాన దేశాల్లో అభివృద్ధి జోరందుకుంటోంది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు త్వరలోనే పెరుగుతాయి...’ అని ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు రఫీక్ అహ్మద్ సోమవారం మీడియాతో చెప్పారు. గత నెల(జూలై)లో ఎగుమతుల వృద్ధి రేటు 7.33 శాతానికి తగ్గిపోగా దిగుమతులు 4.25 శాతం పెరిగాయి. అంకెల్లో చూస్తే జూలైలో ఎగుమతులు 2,772 కోట్ల డాలర్లు కాగా దిగుమతులు 3,995 కోట్ల డాలర్లు. గత నెలలో ఎగుమతులు పది శాతానికి మించి పెరుగుతాయని భావించామని అహ్మద్ చెప్పారు. ఇంజినీరింగ్, కెమికల్స్, ఔషధాలు, దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా ఉన్నప్పటికీ రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, జౌళి ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయన్నారు. దాని ప్రభావం మొత్తం ఎగుమతులపై పడిందని వివరించారు. జూలైలో చమురు దిగుమతులు 12.75 శాతం పెరిగి 1,435 కోట్ల డాలర్లకు, చమురేతర దిగుమతులు 0.03 శాతం వృద్ధితో 2,560 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. బంగారం దిగుమతులు 26.39 శాతం క్షీణించి 181 కోట్ల డాలర్లకు చేరాయని తెలిపారు. ఎగుమతులు మే నెలలో 12.4 శాతం, జూన్‌లో 10.22 శాతం వృద్ధిచెందాయని అన్నారు. స్వల్పంగా పెరగనున్న వాణిజ్యలోటు: సిటీ న్యూఢిల్లీ: వాణిజ్యలోటు (దిగుమతులు-ఎగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 142 బిలియన్ డాలర్లు ఉండవచ్చని సిటీగ్రూప్ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఈ లోటు 139 బిలియన్ డాలర్లు. ఇక కరెంట్ అకౌంట్ లోటు (క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసం) 39.3 బిలియన్ డాలర్లు (జీడీపీ పరిమాణంలో 1.9 శాతం) ఉంటుందనీ అంచనావేసింది. డాలర్ మారకంలో రూపాయి రూ.59-62 శ్రేణిలో ఉంటుందని విశ్లేషించింది.