ఎగుమతులు పడ్డాయ్!
* జనవరిలో 11 శాతం క్షీణత
* దిగుమతులదీ ఇదీ పరిస్థితి
* వాణిజ్యలోటు 8.32 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2015 జనవరిలో నిరుత్సాహం కలిగించాయి. 2014 ఇదే నెలతో పోల్చితే విలువలో అసలు వృద్ధి లేకపోగా 11.19 శాతం తగ్గిపోయాయి (క్షీణత). 2015 జనవరిలో ఎగుమతుల విలువ 23.88 బిలియన్ డాలర్లు. 2014 ఇదే నెలలో ఈ పరిమాణం 26.89 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ స్థాయికి ఎగుమతుల రేటు పడిపోవడం రెండున్నర సంవత్సరాల కాలంలో (2012 జూలైలో 14.8 శాతం) ఇదే తొలిసారి. ఇక దిగుమతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 11.39 శాతం క్షీణించి 32.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దిగుమతుల పడిపోవడం వరుసగా ఇది రెండవనెల. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 8.32 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు గడచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి ఇంత తక్కువ స్థాయిని నమోదుచేసుకుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విలువ తగ్గడం దీనికి (తక్కువ స్థాయి వాణిజ్యలోటు) ప్రధాన కారణం. చమురు దిగుమతుల బిల్లు 37.46 శాతం పడిపోయి కేవలం 8.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
నిరాశలో కీలక రంగాలు
కాటన్ యార్న్ (- 9.15 శాతం), రసాయనాలు(-10.52), ఫార్మా(-0.16 శాతం), రత్నాలు, ఆభరణాల (-3.73 శాతం) రంగాల నుంచి ఎగుమతులు భారీగా లేకపోవడం మొత్తం ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపింది. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు కూడా నిరాశగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్ మెరుగుపడినప్పటికీ, యూరోపియన్ యూనియన్, జపాన్‌లో మందగమన పరిస్థితులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి.
బంగారం దిగుమతులు ఇలా...: కాగా 2015 జనవరిలో బంగారం దిగుమతులు 8.13 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఏప్రిల్-జనవరి మధ్య...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య ఎగుమతులు 2.44 శాతం వృద్ధితో 265.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 2.17 శాతం పెరుగుదలతో 383.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 118.37 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 340 బిలియన్ డాలర్ల ఎగుమతులను కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ప్రోత్సాహకాలు అవసరం: ఎఫ్‌ఐఈఓ
ఎగుమతుల రంగం పునరుత్తేజానికి తగిన విధాన చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టాలని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. ఈ దిశలో విదేశీ వాణిజ్య విధానాన్ని త్వరలో ఆవిష్కరించాలని సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరేలా కనబడ్డం లేదని అన్నారు.