trade deficit
-
స్పల్పంగా తగ్గిన ఎగుమతులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో స్వల్పంగా ఒక్క శాతం తగ్గి 38.01 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా దిగుమతులు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్లో పెట్రోలియం, రత్నాభరణాలు, రసాయనాల ఎగుమతుల వృద్ధి నెమ్మదించింది. అయితే, జౌళి, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా నమోదయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఎగుమతుల గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. వాణిజ్య గణాంకాలను సమగ్రంగా విశ్లేషించే విదంగా కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫాంను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా వాణిజ్యానికి సవాళ్లతోపాటు కమోడిటీలు, లోహాల ధరల్లో హెచ్చుతగ్గులే ఎగుమతుల క్షీణతకు దారి తీసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 1.6 శాతం పెరిగి 321.71 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.15 శాతం పెరిగి 532.48 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 189.74 బిలియన్ డాలర్ల నుంచి 210.77 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర వివరాల్లోకి వెళ్తే.. → డిసెంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 29 శాతం క్షీణించి 4.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ఏకంగా 35.11 శాతం పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. 24 నెలల్లో ఇది గరిష్ట స్థాయి. → బంగారం దిగుమతులు 55 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులు 211 శాతం పెరిగి 421.91 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → సేవల రంగం ఎగుమతులు 31.63 బిలియన్ డాలర్ల నుంచి 32.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి. → సవరించిన గణాంకాల ప్రకారం 2024 నవంబర్‌లో ఎగుమతులు 5 శాతం తగ్గి 32.03 బిలియన్ డాలర్లకు క్షీణించగా, దిగుమతులు 16 శాతం పెరిగి 63.86 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 31.83 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్‌లో పసిడి దిగుమతులను 9.84 బిలియన్ డాలర్లకు సవరించారు. → డిసెంబర్లో అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు భారత్ అత్యధికంగా ఎగుమతులు చేయగా .. చైనా స్విట్జర్లాండ్, థాయ్‌ల్యాండ్, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. -
బాబోయ్ రూపాయ్
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్... దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. → అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. → మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. → పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది. సేవలూ బాగున్నాయ్... సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్ మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు). -
వణికిస్తున్న వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఏప్రిల్‌లో ఆందోళన కలిగించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, సమీక్షా నెల్లో ఎగుమతుల విలువ కేవలం ఒక శాతం పెరిగి (2023 ఇదే నెలతో పోల్చి) 35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల విలువ ఇదే కాలంలో 10.25 శాతం ఎగసి 54.09 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ⇒ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, పెట్రోలియం ప్రొడక్టులు, ఫార్మా ఎగుమతులు బాగున్నాయి. ⇒ విలువైన మెటల్స్ దిగుమతులు రెట్టింపై 3.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ⇒ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 20.22% పెరిగి 16.5 బిలియన్ డాలర్లుకు ఎగసింది. ⇒ 30 కీలక రంగాల్లో 13 వస్తు ఎగుమతుల్లో పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో కాఫీ, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయి.2023–24లో రికార్డు మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక రికార్డు. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్ డాలర్లు. సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్ డాలర్లు. సేవలు ఇలా... తొలి అంచనాల ప్రకారం ఏప్రిల్‌లో సేవల ఎగుమతులు 29.57 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 25.78 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 16.97 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 13.96 బిలియన్ డాలర్లు. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుంది.. అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం కొంత సానుకూలంగానే ప్రారంభమైంది. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నాం. – సునిల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి -
India exports: రెడ్ సీ సవాళ్లున్నా.. ఎగుమతులు రయ్!
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం ప్రాంతంలో అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను జనవరిలో భారత్ వస్తు ఎగుమతులు అధిగమించాయి. 2023 జనవరిలో పోలి్చతే 2024 జనవరిలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. విలువలో 36.92 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక రెండు నెలల క్షీణత అనంతరం జనవరిలో వస్తు దిగుమతులు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 17.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎర్ర సముద్రం సంక్షోభం ఎగుమతిదారులపై ప్రభావం చూపుతోంది. వారు తమ వస్తువులను యూరప్– ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు రవాణా చేయడానికి – ఆఫ్రికాను చుడుతూ కేప్ ఆఫ్ గాడ్ హోప్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దీనితో రవాణా వ్యయం తడిసి మోపెడవుతోంది. సరకు రవాణాలో 14 రోజుల ఆలస్యంతోపాటు బీమా వ్యయాలు కూడా పెరిగాయి. యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా ఎర్ర సముద్రం– మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రానికి కలిపే కీలకమైన షిప్పింగ్ మార్గం బాబ్–ఎల్–మండేబ్ జలసంధి చుట్టూ పరిస్థితి తీవ్రరూపం దాలి్చంది. ముఖ్యాంశాలు... ► సమీక్షా నెల జనవరిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు 4.33 శాతం పెరిగి 16.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి దిగుమతులు ఏకంగా 174 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 10 నెలల్లో క్షీణత కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 10 నెలల కాలంలో ఎగుమతుల విలువ 4.89% క్షీణించి 353.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులు కూడా 6.71% పడిపోయి 561.12 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 207.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల విలువలో క్రూడ్ ఆయిల్ విలువ 15.91% పడిపోయి 146.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు 301.7% పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవలు..ఓకే ఇదిలాఉండగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జనవరిలో 32.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపింది. 2023లో ఈ విలువ 28 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఈ విలువ 267.5 బిలియన్ డాలర్ల నుంచి 284.45 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
చైనాతో వాణిజ్యలోటును ఎలా తగ్గిద్దాం?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కీలక వాణిజ్య అంశాలు, సవాళ్లపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. కాలక్రమేణా చైనాతో భారత్ వాణిజ్య లోటును తగ్గించడం, తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులలో వాణిజ్య వ్యూహాల రూపకల్పన, సరఫరాల వ్యవస్థ (సప్లై చైన్)ను రక్షించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, దేశీయ తయారీ పరిశ్రమ పురోగతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో వాణిజ్యలోటు తగ్గింపు, దేశీయంగా తయారీ రంగం పురోగతిపై రెండు అధ్యయనాలకు నాయకత్వం వహించడానికి కన్సల్టెంట్ల నుండి నీతి ఆయోగ్ బిడ్లను ఆహ్వానించింది. భారతదేశం– చైనా మధ్య 2020 జూన్ నుంచి కొనసాగుతున్న గాల్వాన్ ఘర్షణ, ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా అంశం తెరమీదకు రావడం గమనార్హం. చైనాకు భారత్ ఎగుమతులకు సంబంధించి టారిఫ్, నాన్–టారిఫ్ అడ్డంకులు, నియంత్రణ వ్యవస్థ, మార్కెట్ లభ్యతా ఆందోళనలను కూడా ప్రతిపాదిత అధ్యయనం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి, ఈ దిశలో సవాళ్లను అధిగమించడానికి... గుర్తించిన రంగాలలో వృద్ధిని ప్రోత్సహించడానికి వ్యూహాలు– అనుసరించాల్సిన విధానాలను కూడా అధ్యయనం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. రెండు అధ్యయనాలకు సంబంధించి కన్సల్టెంట్ల బిడ్ల సమర్పణకు తుది గడువు నవంబర్ 7. గణాంకాలు, నిర్దిష్ట ప్రాముఖ్యత కలిగిన అంశాల సేకరణ, విశ్లేషణ, సిఫార్సుల రూపకల్పన కోసం మాత్రం ఆరు నెలల గడువు ఉంటుంది. తగ్గిన లోటు భారం! భారత్ వస్తు వాణిజ్య పరిమాణం 2021–22 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరింది. సమీక్షా కాలంలో వస్తు ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 191 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 73.3 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం వాణిజ్యలోటులో ఈ పరిమాణం దాదాపు 38 శాతం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి భారత్ వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 264 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇందులో చైనాతో వాణిజ్యలోటు 32 శాతంగానే ఉంది. విలువలో మాత్రం 83.1 బిలియన్ డాలర్లు. అయితే గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ తన వాణిజ్య భాగస్వామ్య దేశాలతో పోల్చితే... చైనాతోనే అత్యధిక వాణిజ్యలోటును కలిగి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ మాట్లాడుతూ, భారతదేశం దృష్టి కేవలం చైనాతో మొత్తం వాణిజ్య లోటుపై ఉండకూడదని, కొన్ని క్లిష్టమైన ఉత్పత్తుల కోసం బీజింగ్‌పై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రధాన లక్ష్యం ఉండాలని అన్నారు. చైనాతో భారత్ వాణిజ్య తీరిది... 2021 భారత్–చైనా మధ్య వస్తు ఎగుమతి–దిగుమతి గణాంకాల ప్రకారం.. భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ భారత్ దిగుమతుల విలువ 47 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాతి స్థానంలో ఇంటర్మీడియట్ వస్తువులు (30 బిలియన్ డాలర్లు), వినియోగ వస్తువులు (9.4 బిలియన్ డాలర్లు), ముడి పదార్థాలు ( బిలియన్ డాల ర్లు) ఉన్నాయి. ఇక భారత్ 11 బిలియన్ డాలర్ల ఇంటర్మీడియట్ వస్తువులను చైనాకు ఎగు మతి చేసింది. తరువాతి స్థానంలో ముడి పదార్థాలు (6 బిలియన్ డాలర్లు), వినియోగ వస్తువులు (3.4 బిలియన్ డాలర్లు), క్యాపిటల్ గూ డ్స్ (2.4 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. వెరసి చైనాతో వాణిజ్యలోటు క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి 45 బిలియన్ డాలర్లు, ఇంటర్మీడియట్ గూడ్స్‌కు సంబంధించి 19 బిలియన్ డాలర్లు, వినియోగ వస్తువుల విషయంలో 6 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఉంది. -
ఎకానమీకి ‘కరెంట్ అకౌంట్’ అనిశ్చితి
న్యూఢిల్లీ: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి అద్దం పడుతోంది. త్రైమాసికాల పరంగా చూస్తే, 2023 జనవరి– మార్చి మధ్య 0.2 శాతం ఉన్న కరెంట్ అకౌంట్ లోటు– క్యాడ్ (జీడీపీ విలువలో) తదుపరి త్రైమాసిక కాలంలో (2023 ఏప్రిల్–జూన్) మధ్య 1.1 శాతానికి పెరిగింది. విలువల్లో చూస్తే ఈ పరిమాణం 1.3 బిలియన్ డాలర్ల నుంచి 9.2 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఎగుమతులకన్నా దిగుమతులు భారీగా పెరగడం (వాణిజ్యలోటు) దీనికి కారణం. ఇక వార్షికంగా చూస్తే మాత్రం 2022 ఏప్రిల్–జూన్ మధ్య 2.1 శాతంగా ఉన్న క్యాడ్ తాజా సమీక్షా క్వార్టర్లో (2023 ఏప్రిల్–జూన్) 1.1 శాతానికి తగ్గడం గమనార్హం. విలువల్లో సైతం 17.9 బిలియన్ డాలర్ల నుంచి 9.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. వార్షికంగా (పోలి్చ) చూస్తే, అంతర్జాతీయంగా ఎకానమీ మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. త్రైమాసికంగా బలహీనతలు... ఇటీవలి నెలల్లో భారత్ వస్తు ఎగుమతులు క్షీణతలో కొనసాగుతున్నాయి. సేవల రంగానిదీ ఇదే ధోరణి. కంప్యూటర్ ఎగుమతుల్లో క్షీణత కనబడుతోంది. పర్యాటకం, వ్యాపార సేవల్లో కూడా ఇదే బలహీన ధోరణి నెలకొంది. విదేశాల్లో ఉద్యోగాలు చూసే భారతీయులు దేశానికి డాలర్ల పంపకంసహా వివిధ అంశాలకు సంబంధించిన ప్రైవేటు ట్రాన్స్ఫర్ రిసిట్స్ (ఆదాయాలు) త్రైమాసికంగా తగ్గుతున్నాయి. 2023 జనవరి–మార్చి మధ్య ఇలా దేశానికి వచి్చన మొత్తాల విలువ 28.6 బిలియన్ డాలర్లయితే, ఏప్రిల్–జూన్ మధ్య 27.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. దేశ దిగుమతుల భారం మరోవైపు పెరుగుతుండడం గమనార్హం. క్రూడ్ ధరలు ఇటీవల పెరగడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. భారత్ వస్తు ఎగుమతులు 2023 ఆగస్టులో వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ఎగుమతులు ఆగస్టులో 26.5 బిలియన్ డాలర్ల (2022 ఆగస్టు) నుంచి స్వల్పంగా 26.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2023–24లో 2.1 శాతానికి అప్! ఈ నేపథ్యంలో 2023–24 జూలై–ఆగస్టు త్రైమాసికంలో (క్యూ2) క్యాడ్ జీడీపీలో 2.3 శాతం (విలువల్లో 19 నుంచి 21 బిలియన్ డాలర్లు) విలువకు చేరవచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నయ్యర్ అంచనావేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ శాతం 2.1 శాతంగా (73 బిలియన్ డాలర్ల నుంచి 75 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. 2022–23లో క్యాడ్ జీడీపీలో 2 శాతం. విలువలోల 67 బిలియన్ డాలర్లు. విదేశీ రుణ భారం 629 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ రుణ భారం జూన్ ముగిసే నాటికి 629.1 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. మార్చితో ముగిసిన నెలతో (624.3 బిలియన్ డాలర్లు) పోలి్చచూస్తే ఈ విలువ 4.7 బిలియన్ డాలర్లు పెరిగింది. అయితే రుణ భారం జీడీపీతో పోలి్చతే ఇదే కాలంలో 18.8 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గింది. గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక రుణం (ఏడాదిపైన మెచ్యూరిటీ) మార్చితో పోలి్చతే 9.6 బిలియన్ డాలర్లు పెరిగి 505.5 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎగుమతులు.. మూడో నెలా మైనస్
న్యూఢిల్లీ: ప్రపంచ, దేశీయ తాజా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతి, దిగుమతి గణాంకాలు అద్దం పడుతున్నాయి. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ఎగుమతులు వరుసగా మూడవ నెల ఫిబ్రవరిలోనూ వృద్ధిలేకపోగా క్షీణతనే నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల విలువ 8.8 శాతం పడిపోయి, 33.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల్లోనూ 8.21 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. 2022 ఇదే నెలతో పోల్చితే ఈ విలువ 55.9 బిలియన్ డాలర్ల నుంచి 51.31 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వెరసి అధికారిక గణాంకాల ప్రకారం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 17.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య... 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య 11 నెలల్లో వస్తు ఎగుమతులు 7.5% పెరిగి, 406 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే కాలంలో దిగుమతులు 18.82% పెరిగి 653 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 247 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లు తాకాయి. 2022-23లో ఈ విలువను అధిగమిస్తున్నామన్న హర్షాతిరేకాలు భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ)సహా సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ► 11 నెలల్లో పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ గూడ్స్, బియ్యం, రెడీ మేడ్ దుస్తుల ఎగుమతులు పెరగ్గా, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాభరణాలు, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్, ప్లాసిక్, లినోలియం ఎగుమతులు క్షీణించాయి. ► పసిడి దిగుమతులు ఇదే కాలంలో భారీగా పడిపోయి, 45.12 బిలియన్ డాలర్ల నుంచి 31.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు 11 నెలల్లో 140.67 బిలియన్ డాలర్ల నుంచి 193.47 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
అవసరంలేని దిగుమతులను గమనిస్తున్నాం
న్యూఢిల్లీ: అవసరం లేని దిగుమతులను గమనిస్తున్నామని, ఆయా ఉత్పత్తుల దేశీ తయారీ పెంచడం తమ ప్రాధాన్యతని కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్ తెలిపారు. ఈ తరహా దిగుమతులను నివారించగలిగితే, వాణిజ్య లోటు దిగొస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వాణిజ్య లోటు 198 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం తెలిసిందే. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 115 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఎన్నో సవాళ్లు నెలకొన్నా భారత్ నుంచి ఎగుమతులు బలంగా ఉన్నట్టు మీడియాతో చెప్పారు. గతేడాది అసాధారణ స్థాయిలో ఎగుమతులు పెరగడంతో, ఆ బేస్ ప్రభావం వల్ల ఈ ఏడాది పెద్దగా వృద్ధి కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్ని శాఖలకు నెలవారీగా దిగుమతులు పెరుగుతున్న సమాచారాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. స్థానికంగా తయారీని పెంచాలన్నదే ఇందులో వ్యూహంగా పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం మన దేశ ఎగుమతులపై ప్రభావం పడింది. కానీ, దేశీ వినియోగ డిమాండ్ బలంగా ఉండడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. దీంతో వాణిజ్య లోటు విషయంలో ఒత్తిడి నెలకొంది’’అని వివరించారు. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో వాణిజ్యలోటు సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది (2021 జూన్‌లో ఈ విలువ 9.61 బిలియన్ డాలర్లు). దిగుమతుల బిల్లుపై క్రూడ్ ఆయిల్, బంగారం భారం పడుతుండడం గమనార్హం. ఈ పరిమాణం ఫారెక్స్ నిల్వలు తగ్గడంసహా కరెంట్ అకౌంట్ లోటు మరింత తీవ్రతకు (భారత్‌కు వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం), రూపాయి మరింత బలహీనతకు దారితీసే అంశం కావడం గమనార్హం. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తొలి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఎగుమతుల విభాగం ఇలా... ► నెలవారీ, వార్షికంగా చూసినా ఎగుమతుల వృద్ధి స్పీడ్ (17 శాతం) జూన్‌లో తగ్గడం గమనార్హం. 2022 మేలో ఎగుమతుల వృద్ధి 20.55 శాతం. 2021 జూన్‌లో ఈ రేటు ఏకంగా 48.34 శాతం. ► సమీక్షా నెల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. హై బేస్ కూడా దీనికి కారణమన్నది విశ్లేషణ. ► కాగా పెట్రోలియం ప్రొడక్టుల విలువ 98% ఎగసి 7.82 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.41% ఎగసి 3.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. దిగుమతుల తీరిది ► క్రూడ్ దిగుమతుల విలువ జూన్‌లో 94 శాతం పెరిగి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► బొగ్గు, కోక్ దిగుమతుల విలువ 1.88 బిలియన్ డాలర్ల నుంచి 6.41 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► పసిడి దిగుమతుల విలువ 169.5 శాతం ఎగసి 2.61 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతుల భారీ పెరుగుదల నేపథ్యంలో కేంద్రం వీటిపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బంగారం దిగుమతుల కట్టడి దీని లక్ష్యం. మొదటి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 47 శాతం పెరిగి 187.02 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 70.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 31.42 బిలియన్ డాలర్లు. రెట్టింపు కరెంట్ అకౌంట్ వాణిజ్యలోటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కరెంట్ అకౌంట్‌లోటు 13 బిలియన్ డాలర్లు. అయితే ఇది జూన్ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. 2022–23లో క్యాడ్ 100 నుంచి 105 బిలియన్ డాలర్లు నమోదుకావచ్చు. 2022లో ప్రతి నెలా 20 డాలర్లపైనే వస్తువులకు సంబంధించి వాణిజ్యలోటు కొనసాగుతుందని భావిస్తున్నాం. అయితే సేవల రంగం నుంచి ఎగుమతుల పురోగమనం కొంత ఊరటనిచ్చే అంశం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
భారత్‌కు వాణిజ్యలోటు గుబులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేనెల్లో 15.46 శాతం పెరిగి 37.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు విలువ 56.14 శాతం ఎగసి 60.62 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 23.33 బిలియన్ డాలర్లగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఎగుమతులు ఇలా... ► ఎగుమతులకు సంబంధించి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల వంటి రంగాల పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. ►ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 7.84 శాతం పెరిగి 9.3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌లు విషయంలో ఈ రేటు 52.71 శాతం పెరిగి 8.11 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గత ఏడాది మేలో 2.96 బిలియన్ డాలర్లు ఉంటే, తాజా సమీక్షా నెల్లో 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 12 శాతం పెరిగి విలువలో 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఫార్మా ఎగుమతులు 5.78 శాతం ఎగసి 1.98 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 23% పురోగ తితో 1.36 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతుల తీరిది... ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు మే నెల్లో 91.6 శాతం పెరిగి 18.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులు మే 2 బిలియన్ డాలర్ల (2021 మేలో) నుండి 5.33 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► బంగారం దిగుమతులు 677 మిలియన్ డాలర్ల నుంచి భారీగా 5.82 బిలియన్ డాలర్లకు ఎగశాయి. తొలి రెండు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) ఎగుమతులు 22.26 శాతం పెరిగి 77.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు ఇదే కాలంలో 42.35 శాతం ఎగసి 120.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చితే 21.82 బిలియన్ డాలర్ల నుంచి 43.73 బిలియన్ డాలర్లకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. భారత్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు (దాదాపు 600 బిలియన్ డాలర్లు) దాదాపు 12 నెలల దిగుమతులుకు సరిపోతాయన్నది అంచనా. అయితే వాణిజ్యలోటు పెరుగుదల కొంత ఇబ్బందికరమైన పరిణామం. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారానికీ ఇది దారితీస్తుంది. 2022–23లో క్యాడ్ 2 శాతం దాటుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2021–22ను అధిగమిస్తాం ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్ఐ స్కీమ్ వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
దేశ వాణిజ్యలోటు రూ.20.88 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరిలో 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో వాణిజ్యలోటు 13.12 బిలియన్ డాలర్లు. క్రూడ్ దిగుమతుల బిల్లు భారం వల్ల వాణిజ్యలోటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్య గణాంకాలు పరిశీలిస్తే, ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 36 శాతం పెరిగి 55.45 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 20.88 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం, మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఏకంగా 69 శాతం పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) 15.28 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. విభాగాల వారీగా... - ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 9.65 శాతం తగ్గి 4.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. - ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29.53 శాతం పెరిగి 6.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - ఇక ఇంజనీరింగ్ గూడ్స్ (32 శాతం), పెట్రోలియం (88.14 శాతం), రసాయనాల (25.38 శాతం) విభాగాలు మంచి పురోగతితో విలువల్లో వరుసగా 9.32 బిలియన్ డాలర్లు, 4.64 బిలియన్ డాలర్లు, 2.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - ఫార్మా ఎగుమతుల విలువ 1.78 శాతం పడిపోయి 1.96 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరినా... ఇక ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 46.09 శాతం పెరిగి 374.81 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 59.33 శాతం పెరిగి 550.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో వాణిజ్యలోటు 2020–21 ఇదే కాలంతో పోలి్చచూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 88.99 బిలియన్ డాలర్ల నుంచి 175.75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం సాధించే అవకాశాలు ఉండడం కొంతసానుకూల అంశమైనా, క్రూడ్ ధరల వల్ల వాణిజ్యలోటు తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. -
భారీగా పెరిగిన వాణిజ్యలోటు!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు సెప్టెంబర్‌లో భారీగా పెరిగింది. 22.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ లోటు 2.96 బిలియన్ డాలర్లు. ఎకానమీ రికవరీ, క్రియాశీలతకు వాణిజ్యలోటు పెరుగుదల సంకేతంగా భావించవచ్చని కొందరు ఆర్థికవ్తేతలు భావిస్తుండగా, వాణిజ్యలోటు భారీగా పెరిగిపోవడమూ మంచిదికాదని మరికొందరి వాదన. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం గణాంకాలను విడుదల చేసింది. ఎగుమతులు–దిగుమతులు ఇలా... సెప్టెంబర్‌లో ఎగుమతులు 2020 ఇదే నెలతో పోల్చి 22.63 శాతం పెరిగి 33.79 డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ 84.77 శాతం పెరిగి 56.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 22.60 బిలియన్ డాలర్లుగా ఉంది. మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. బంగారం దిగుమతులు 2020 సెప్టెంబర్‌లో 601 మిలియన్ డాలర్లయితే, 2021 ఇదే నెల్లో 5.11 బిలియన్ డాలర్లకు చేరింది. - చమురు దిగుమతుల విలువ 5.83 బిలియన్ డాలర్ల నుంచి 17.44 బిలియన్ డాలర్లకు ఎగసింది. - సెప్టెంబర్‌లో సానుకూల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతి రంగాలలో కాఫీ, జీడిపప్పు, పెట్రోలియం ఉత్పత్తులు, చేనేత, ఇంజనీరింగ్, రసాయ నాలు, తయారీ నూలు–దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, ప్లాస్టిక్, సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య.. ఇక ఎగుమతుల విలువ 2020 ఇదే కాలంతో పోల్చితే 57.53 శాతం పెరుగుదలతో 125.62 బిలియన్ డాలర్ల నుంచి 197.89 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు విలువ 81.67 శాతం ఎగసి 151.94 బిలియన్ డాలర్ల నుంచి 276 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 26.31 బిలియన్ డాలర్ల నుంచి 78.13 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య చమురు దిగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 32.01 డాలర్ల నుంచి 72.99 బిలియన్ డాలర్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యాలు సాధించగల విశ్వాసాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యక్తం చేస్తున్నారు. పలు దేశాలతో ఎఫ్‌టీఏ చర్చలు: గోయెల్ ఇదిలావుండగా, బ్రిటన్, యూరోపి యన్ యూనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) భారత్ కీలక చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ గురువారం పేర్కొన్నారు. మరో రెండు దేశాలు భారత్‌లో ఎఫ్టీఏకు అంగీకరించాయని కూడా వెల్లడించారు. అయితే ఆ దేశాల పేర్లను మంత్రి వెల్లడించలేదు. ఈ ఒప్పందం కింద సంబంధిత రెండు దేశాలూ తమ మధ్య వస్తు దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను తగ్గించుకుంటాయి లేదా పూర్తిగా ఎత్తివేస్తాయి. సేవల రంగంలో వాణిజ్యాన్ని పెంపొందించుకుంటాయి. పరస్పరం ఒకదేశంలో మరొకటి భారీగా పెట్టుబడుల ప్రణాళికలను రూపొందించుకుంటాయి. ప్రధాని గతి శక్తి–నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఐఎంపీ)న వల్ల పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగుతుందని పేర్కొన్నారు. స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. మౌలిక రంగంలో చక్కటి పురోగతికి ఈ ప్లాన్ దోహదపడుతుందని వివరించారు. చైనాతో సరిహద్దు వివాదాలో ఆ దేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చదవండి :భారత్‌లో అపార అవకాశాలు -
ఎగుమతులు 48.34% అప్
న్యూఢిల్లీ: ఏడు నెలల వరుస పురోగతిని కొనసాగిస్తూ, భారత్ ఎగుమతులు జూన్‌లో 48.34 శాతం పెరిగి 32.50 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 98 శాతం ఎగసి 41.87 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 9.37 బిలియన్ డాలర్లకు చేరింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం వెలువరించిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► పెట్రోలియం పొడక్టులు, రత్నాలు–ఆభరణాలు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్‌లో గణనీయంగా పెరిగాయి. ► దిగుమతుల్లో ఒక్క చమురును చూస్తే, ఈ విలువ 10.68 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020 జూన్‌తో పోల్చితే (4.93 బిలియన్ డాలర్లు) ఇది 116.51 శాతం అధికం. ► పసిడి దిగుమతులు 60 శాతం పెరిగి 970 మిలియన్ డాలర్లకు చేరాయి. మొదటి త్రైమాసికంలో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–జూన్ మధ్య ఎగుమతుల విలువ 86 శాతం పెరిగి 95.39 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 126.15 బిలియన్ డాలర్లకు (గత ఏడాది ఇదే కాలంలో 60.44 బిలియన్ డాలర్లు)ఎగసింది. వెరసి వాణిజ్యలోటు 30.75 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఒక్క చమురు దిగుమతులు సమీక్షా కాలంలో 13 బిలియన్ డాలర్ల (2020 ఏప్రిల్–జూన్) నుంచి 31 బిలియన్ డాలర్లకు ఎగశాయి. -
మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చిలో రికార్డు సృష్టించాయి. 58.23 శాతం పెరుగుదలతో 34 బిలియన్ డాలర్లుకు చేరాయి. ఒక నెల్లో ఎగుమతులు 34 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం భారత్ ఎగుమతుల చరిత్రలోనే ఇదే తొలిసారి. ఎగుమతుల పురోగతికి కేంద్రం తీసుకున్న పలు చర్యల ఫలితాలు మార్చిలో కనబడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక దిగుమతులు సైతం 52.89 శాతం పెరుగుదలతో 48.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 14.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020 మార్చి నెలలో ఎగుమతులు, దిగుమతులు అసలు వృద్ధి లేకుండా క్షీణతలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి అతి తక్కువ గణాంకాలే తాజా సమీక్షా నెలలో వృద్ధి పెరుగుదల శాతాల్లో ‘భారీ’గా కనబడ్డానికి కారణం. దీనినే బేస్ ఎఫెక్ట్‌గా పరిగణిస్తారు. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చి నెలలో ఎగుమతుల విలువ 34 శాతం క్షీణించి (2019 మార్చితో పోల్చి) 21.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ 2020 మార్చిలో 31.47 బిలియన్ డాలర్లుగా ఉంది. అప్పట్లో వాణిజ్యలోటు 9.98 బిలియన్ డాలర్లు. వాణిజ్యమంత్రిత్వశాఖ తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, తాజా సమీక్షా నెలలో ఇంజనీరింగ్, రత్నాలు-ఆభరణాలు, ఔషధ రంగాల నుంచి ఎగుమతులు సానుకూల వృద్దిని నమోదుచేశాయి. పసిడి దిగుమతులు సమీక్షా నెలలో 7.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం 7.4 శాతం క్షీణత కాగా 2020-21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019-20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ఇక ఇదే కాలంలో దిగుమతులు 18 శాతం క్షీణించి 474.71 బిలియన్ డాలర్ల నుంచి 388.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. చమురు దిగుమతుల విలువలు... మార్చిలో చమురు దిగుమతుల విలువ 1.22 శాతం పెరిగి 10.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 37 శాతం పడిపోయి 82.25 బిలియన్ డాలర్లుగా ఈ విలువ నమోదయ్యింది. చమురుయేతర దిగుమతుల విలువ మార్చిలో ఏకంగా 777.12 శాతం పెరిగి 37.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల బాట... కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్-నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. వరుసగా రెండవనెలా 2021 జనవరిలోనూ వృద్ధిబాటలో పయనించాయి. 6.16 శాతం వృద్ధితో 27.45 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఫిబ్రవరి నెలలోనూ భారత్ ఎగుమతులు వరుసగా మూడవనెలా పురోగతి బాటనే నడిచాయి. 0.67 శాతం వృద్ధితో 27.93 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ మార్చి 31వరకూ అనుసరించిన విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) మరో ఆరు నెలలు (సెప్టెంబర్ వరకూ) పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2015-20 మధ్య అనుసరించిన విదేశీ వాణిజ్య విధానాన్ని 2020 మార్చి 31వ తేదీన కేంద్రం 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగించింది. కొత్త పాలసీ విధాన రూపకల్పన పక్రియ ఇంకా చర్చల దశలోనే ఉందని, ఈ నేపథ్యంలో మరికొద్ది నెలలు ఇందుకు సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించవచ్చని ఇప్పటికే వచ్చిన వార్తలకు అనుగుణంగా బుధవారం ఎఫ్టీపీ పొడిగింపు (సెప్టెంబర్ వరకూ) అధికారిక నిర్ణయం వెలువడింది. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితి అనిశ్చితిగా ఉందని, పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాజా విధాన రూపకల్పన, అమలు మంచి ఫలితాలను అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వాణిజ్య వర్గాలు సమర్థిస్తున్నాయి. చదవండి: మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్ ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి! -
కరోనా కాలంలో ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా మూడవనెలా పురోగతి బాటనే నడిచాయి. 2021 ఫిబ్రవరిలో ఎగుమతులు 2020 ఇదే నెలతో పోల్చితే స్వల్పంగా 0.67 శాతం వృద్ధితో 27.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ కూడా ఇదే నెల్లో 6.96 శాతం పెరిగి 40.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2020 ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లు. సోమవారం వెలువడిన తాజా అధికారిక గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... చక్కటి ఎగుమతుల వృద్ధి తీరును నమోదుచేసుకున్న రంగాల్లో ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, బియ్యం (30.78 శాతం), తివాచీలు (19.46 శాతం), సుగంధ ద్రవ్యాలు (18.61 శాతం), ఔషధాలు (14.74 శాతం), పొగాకు (7.71 శాతం), రసాయనాలు (1.2 శాతం) ఉన్నాయి. ఆయిల్ సీడ్స్, తోలు, పెట్రోలియం ప్రొడక్టులు, జీడిపప్పు, రత్నాలు-ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, తేయాకు, ఇంజనీరింగ్ గూడ్స్, కాఫీ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మైనస్‌లో ఉన్నాయి. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య క్షీణతే..! ఆర్థిక సంవత్సరం 2020-21 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎగుమతులు 12.23 శాతం క్షీణతతో 256.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు కూడా 23.11 శాతం పడిపోయి 340.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు దిగుమతుల తీరిది... ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 16.63 శాతం క్షీణించి 8.99 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య ఈ దిగుమతుల పరిమాణం 40.18 శాతం పడిపోయి 72.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి భారీ పెరుగుదల.. వార్షికంగా 2020 ఫిబ్రవరితో పోల్చితే పసిడి దిగుమతులు భారీగా 2.36 బిలియన్ డాలర్ల నుంచి 5.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2020 మార్చి నుంచీ ఎగుమతులు ఇలా... కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చిన, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్-నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. వరుసగా రెండవనెలా 2021 జనవరిలోనూ వృద్ధిబాటలో పయనించాయి. 6.16 శాతం వృద్ధితో 27.45 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఫిబ్రవరి నెలలోనూ సానుకూల గణాంకాలే వెలువడినట్లు తాజా గణాంకాలు పేర్కొన్నాయి. కంటైనర్ల సమస్య ప్రధానం ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదుకావడానికి కంటైనర్ల కొరతే ప్రధాన కారణం. ఫిబ్రవరి చివరి వారంలో విపరీతమైన కంటైనర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రాంతంలో కంటైనర్ల కొరత ఉండడం ఇక్కడ ఒక సమస్య. చైనా నుంచి భారీ ఎగుమతుల కోసం ఖాళీ కంటైనర్లు ఆ దేశానికి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయి. ఇలా ఖాళీ కంటైనర్లు చైనాకు తిరిగి వెళ్లడానికి షిప్పింగ్ లైన్స్, కంటైనర్ కంపెనీలకు చైనా అధిక ప్రీమియంలనూ చెల్లిస్తోంది. ఎగుమతులు ఫిబ్రవరిలో కొంత తక్కువగా ఉన్నా, అటు ఆర్డర్ బుక్ ఇటు అంతర్జాతీయంగా డిమాండ్ విషయంలో సానుకూల పరిస్థితి, సంకేతాలే కనిపిస్తున్నాయి. రానున్న రోజులు, నెలల్లో మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ పక్షం నుంచి కూడా ఎగుమతిదారుల సమస్య పరిష్కారానికి పెద్దపీట వేయాలి. సకాలంలో కొత్త విదేశీ వాణిజ్య విధాన ప్రకటన, తగిన స్థాయిలో కంటైనర్లు లభ్యమయ్యేట్లు చూడ్డం, ఆర్‌ఓడీటీఈపీకి తగిన నిధుల విడుదల, రవాణా చార్జీలు తగ్గించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. - ఎస్కే షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ క్యూ4లో 4.9 శాతం వృద్ధి ఉండొచ్చు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి (క్యూ4) త్రైమాసికం ఎగుమతుల్లో 4.9 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో చమురుయేతర ఎగుమతులు విలువ 73.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. ఇదే జరిగితే 2019-20 ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోల్చుకుంటే ఇది 12 శాతం వృద్ధి నమోదయినట్లు. మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకూ ఎగుమతులు 74.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో నాన్-ఆయిల్ వాటా 65.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో మొత్తం ఎగుమతుల విలువ 279.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. 2019-20తో పోల్చితే ఇది 10.8 శాతం తక్కువ. బ్యాంక్ లీడింగ్ ఇండెక్స్ (ఈఎల్ఐ) నమూనా ప్రకారం ఈ ఏడాది మొత్తం ఎగుమతుల్లో నాన్-ఆయిల్ ఎగుమతుల వాటా 5.6 శాతం తగ్గి 256.8 బిలియన్ డాలర్లకు తగ్గవచ్చు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడమే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు తగ్గడానికి కారణం. బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా 2021-22లో ఎగుమతులు పురోగతి బాటనే నడిచే వీలుంది. - ఎగ్జిమ్ బ్యాంక్ -
ఆరోనెలా అగాధంలోనే ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా ఆరవ నెల ఆగస్టులోనూ క్షీణతలోనే కొనసాగాయి. 2019 ఆగస్టుతో పోల్చిచూస్తే, 12.66 శాతం క్షీణించి 22.70 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ ధోరణి దీనికి ప్రధాన కారణం. ఇక దేశీయంగా కూడా తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితులను సూచిస్తూ, దిగుమమతులు 26 శాతం క్షీణించాయి. విలువలో 29.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 6.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... * పెట్రోలియం, తోలు, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాలు, ఆభరణాలు ఎగుమతుల్లో క్షీణత నమోదయ్యింది. * పసిడి దిగుమతులు మాత్రం దాదాపు మూడురెట్లు పెరిగి 3.7 బిలియన్ డాలర్లకు చేరాయి. 2019 ఆగస్టులో ఈ విలువ 1.36 బిలియన్ డాలర్లు. * 5 నెలల్లో 20.72 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య చూస్తే, ఎగుమతులు 26.65 శాతం క్షీణతతో 97.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 43.73 శాతం క్షీణతతలో 118.38 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 20.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. (ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు ) -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్‌లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్‌లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
చైనాతో వాణిజ్య లోటు డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గించుకోవడంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశంతో భారత వాణిజ్య లోటు 48.66 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది 2018–19లో 53.56 బిలియన్ డాలర్లుగాను, 2017–18లో 63 బిలియన్ డాలర్లుగాను నమోదైంది. తాజాగా 2019–20లో చైనాకు ఎగుమతులు 16.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 65.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చైనాతో ఆందోళనకర స్థాయిలో భారీగా ఉంటున్న వాణిజ్య లోటును, ఆ దేశంపై ఆధారపడటాన్నీ తగ్గించుకునేందుకు భారత్ కొన్నాళ్లుగా పలు చర్యలు తీసుకుంటోంది. పలు ఉత్పత్తులకు సంబంధించి సాంకేతిక, నాణ్యతా నిబంధనలను సవరిస్తోంది. ఇందులో భాగంగానే దేశీ సంస్థలను దెబ్బతీసేంత చౌక రేటుతో భారత్‌లో చైనా కుమ్మరిస్తున్న పలు ఉత్పత్తులపై యాంటీ–డంపింగ్ సుంకాలు విధిస్తోంది. సాంకేతిక ఆంక్షల రూపకల్పనకు 371 ఉత్పత్తులను గుర్తించింది. వీటిల్లో ఇప్పటికే 150 పైగా ఉత్పత్తులకు నిబంధనలు రూపొందించింది. వీటి దిగుమతుల విలువ దాదాపు 47 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. ఇక నాణ్యతాపరమైన ఆంక్షల విషయానికొస్తే.. గడిచిన ఏడాది కాలంలో 50 పైగా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు (క్యూసీవో), ఇతరత్రా సాంకేతిక నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ఎలక్ట్రానిక్ గూడ్స్, బొమ్మలు, ఎయిర్ కండీషనర్లు, సైకిళ్ల విడిభాగాలు, రసాయనాలు, సేఫ్టీ గ్లాస్, ప్రెజర్ కుకర్లు, ఉక్కు ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. దిగుమతుల్లో 14 శాతం వాటా భారత దిగుమతుల్లో చైనా వాటా సుమారు 14 శాతంగా ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో ప్రధానంగా మొబైల్ ఫోన్స్, టెలికం, విద్యుత్ పరికరాలు, గడియారాలు, వాయిద్య పరికరాలు, బొమ్మలు, స్పోర్ట్స్ గూడ్స్, ఫర్నిచర్, మ్యాట్రెస్లు, ప్లాస్టిక్, ఎలక్ట్రికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రసాయనాలు, ఉక్కు, ఇనుము ఉత్పత్తులు, ఎరువులు, ఫార్మా ముడిపదార్థాలు, లోహాలు మొదలైనవి ఉంటున్నాయి. తగ్గిన ఎఫ్‌డీఐలు.. వాణిజ్య లోటుతో పాటు చైనా నుంచి భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కూడా పరిమాణం కూడా తగ్గింది. 2018–19లో 229 మిలియన్ డాలర్లుగా ఉన్న చైనా ఎఫ్‌డీఐలు 2019–20లో 163.78 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2000 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో చైనా నుంచి భారత్‌లోకి 2.38 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా ఆటోమొబైల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్ పరికరాలు, సర్వీసులు, ఎలక్ట్రానిక్స్‌లోకి ఈ ఎఫ్‌డీఐలు వచ్చాయి. భారత్‌తో సరిహద్దులున్న పొరుగు దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు సంబంధించి నిబంధనలను కేంద్రం ఇటీవల ఏప్రిల్‌లో కఠినతరం చేసింది. వీటి ప్రకారం ఆయా దేశాలకు చెందిన కంపెనీలు, వ్యక్తులు ఈ రంగంలో ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. -
వాణిజ్య యుద్ధానికి బ్రేక్
బీజింగ్/ఒసాకా: అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు అంగీకరించారు. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం పరిష్కారమయ్యేవరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించారు. ‘చైనాతో శత్రుత్వం లేదు. అమెరికా–చైనాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నా’ అని ట్రంప్ చెప్పినట్లు చైనా అధికార పత్రిక ‘చైనా డైలీ’ తెలిపింది. వాణిజ్య లోటుపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల కమిటీలు త్వరలో సమావేశమవుతాయని వెల్లడించింది. ట్రంప్‌తో భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందిస్తూ..‘పరస్పరం సహకరించుకుంటే అమెరికా–చైనాలు లబ్ధి పొందుతాయి. కానీ గొడవలకు దిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి’ అని చెప్పినట్లు చైనా డైలీ పేర్కొంది. అమెరికాతో ఉన్న 539 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్ గతంలో చైనాను డిమాండ్ చేశారు. అలాగే అమెరికా కంపెనీల మేధోపరమైన హక్కులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు చెందిన వాణిజ్య బృందాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సత్ఫలితాలు రాలేదు. దీంతో 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై 25 శాతం మేర సుంకాలను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది. అయితే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా తమకు నష్టం జరుగుతోందని గుర్తించిన ఇరుదేశాలు తాజాగా సయోధ్యకు ముందుకొచ్చాయి. హలో చెప్పాలని ఉంది ‘మీ ఇంటికొస్తా. మీ భూభాగంలో అడుగు పెడతా. హలో అని పలకరిస్తా. కరచాలనం చేస్తా. రెండు నిమిషాలు మాట్లాడినా చాలు’ అని ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కి ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ట్రంప్ ట్విట్టర్లో చర్చలకు రమ్మంటూ కిమ్‌ని ఆహ్వానించడంతో రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. -
ఎగసిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి ఎగిసింది. బుధవారం విడుదలైన వాణిజ్య గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధికం. క్రూడాయిల్, బంగారం దిగుమతులు గత నెలలో ఎగియడమే ఇందుకు కారణం. వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26 బిలియన్లు ఉండగా.. దిగుమతుల పరిమాణం 41.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2018 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కీలక రంగాల తగ్గుదల..: ఇంజనీరింగ్, వజ్రాభరణాలు, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్ ఉత్పత్తులు, ధాన్యం, కాఫీ తదితర విభాగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. దీంతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో తగ్గాయి. చమురు దిగుమతులు 9.26 శాతం పెరిగి 11.38 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురుయేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 54 శాతం ఎగిసి 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, తాజాగా పెట్రోలియం, చేతివృత్తులు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా రంగాల ఎగుమతులు మాత్రం సానుకూల వృద్ధి నమోదు చేశాయి. నిరాశపర్చే గణాంకాలు.. ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి అంత ఆశావహంగా లేదని వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) చైర్మన్ మోహిత్ సింగ్లా చెప్పారు. అయితే, సానుకూల ధోరణి కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు. టీ, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో సానుకూలత కనిపించినట్లు చెప్పారు. కార్మిక శక్తి అత్యధికంగా ఉండే అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండటంతో ఎగుమతుల గణాంకాలు నిరాశపర్చేవిగా ఉన్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. ‘నిధుల కొరతతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, రక్షణాత్మక ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా బలహీన వ్యాపార పరిస్థితులు, దేశీయంగా అనేక పరిమితులు తదితర అంశాల కారణంగా ఈ రంగాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఒక వైపు చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఇరాన్ నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో పసిడి, చమురు దిగుమతుల భారం ఎగుస్తుండటంతో వాణిజ్య లోటు మరింత పెరుగుతుండటంపై గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాల భయాలతో అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు మరింతగా దిగజారవచ్చన్నారు. రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై మరింత ఒత్తిడి పెరగవచ్చన్నారు. -
ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ షాక్..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రయోజనాలకు భారీ విఘాతం కలిగించే మరో నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి సుంకాలు లేకుండా ఏటా 560 కోట్ల డాలర్ల భారత ఎగుమతులకు అనుమతించే ప్రాధాన్య వర్తక విధానానికి స్వస్తి పలకాలని భావిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. సాధారణ ప్రాధాన్యతల వ్యవస్ధ (జీఎస్పీ) కింద అభివృద్ధి చెందుతున్న ప్రాయోజిత దేశంగా భారత్‌కు ఇస్తున్న హోదాను ఉపసంహరించాలని ప్రతిపాదిస్తున్నామని కాంగ్రెస్ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. భారత మార్కెట్లను ఇదే తరహాలో అమెరికాకు అందుబాటులో ఉంచాలన్న అమెరికా వినతిపై భారత్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను ఈ నిర్ణయంతీసుకుంటున్నానని ట్రంప్ వివరణ ఇచ్చారు. భారత్‌తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు భావిస్తున్నారు. 2017లో భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లుగా ఉందని అమెరికా ట్రేడ్ రిప్రంజేటివ్ కార్యాలయం అంచనా వేసింది. జీఎస్పీ కార్యక్రమం కింద ప్రపంచంలోనే అతిపెద్ద లబ్ధిదారుగా ఉన్న భారత్ 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారీగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్య ఇదే కావడం గమనార్హం. -
మరింత పెరిగిన వాణిజ్య లోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు వాణిజ్యలోటు అందోళన పెరుగుతోంటే అక్టోబర్ నెల నాటి గణాంకాలు మరింత ఆందోళన కరంగా వెలువడ్డాయి. అక్టోబరు వాణిజ్య లోటు 17.13 బిలియన్ డాలర్లకు పెరిగింది. అధిక ఆయిల్ ఇంపోర్ట్ బిల్ వాణిజ్య లోటు విస్తరించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరులో వాణిజ్య లోటు 13.98 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబర్ నెలలో ఎగుమతులు 17.86 శాతం పెరిగి 26.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.దిగుమతులు 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముడి దిగుమతిదారు ఇండియా, విదేశీ మార్కెట్ల నుండి చమురును 80 శాతం కొనుగోలు చేస్తోంది. అక్టోబర్ నెలలో దేశంలో చమురు దిగుమతులు 14.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం 52.64 శాతంగా నమోదైంది. -
వాణిజ్యలోటు భయాలు..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై వాణిజ్యలోటు భారం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఒక దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇది జూలైలో 18 బిలియన్ డాలర్లపైన నమోదయ్యింది. గడచిన ఐదేళ్లలో ఈ స్థాయి వాణిజ్యలోటు ఎప్పుడూ నమోదుకాలేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే... జూలైలో భారత్ ఎగుమతులు 14.32% పెరిగి (2017 ఇదే నెలతో పోల్చి) 25.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 22.54 బిలియన్ డాలర్లు. రత్నాలు, ఆభరణాలు (24.62% వృద్ధితో 3.18 బిలియన్ డాలర్లకు), పెట్రోలియం ఉత్పత్తుల (3 బిలియన్ల డాలర్ల నుంచి 3.9 బిలియన్ల డాలర్లకు) ఎగుమతులు భారీగా పెరిగాయిఇక దిగుమతులు 28.81 శాతం పెరిగి 33.99 బిలియన్ డాలర్ల నుంచి 43.79 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో ఈ రెండింటి మధ్యా నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2017 జూలైలో ఈ లోటు 11.45 బిలియన్ డాలర్లు.బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ మెటల్ దిగుమతులు 2.102 బిలయన్ డాలర్ల నుంచి 2.96 బిలియన్ల డాలర్లకు ఎగశాయి. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు వార్షికంగా 53.16 శాతం పెరిగాయి. దీనితో భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే చమురు దిగుమతుల బిల్లు 57 శాతం పెరిగి 12.35 బిలియన్ డాలర్లకు చేరింది. నాలుగు నెలల్లో... కాగా 2018 ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 94.76 బిలియన్ డాలర్ల నుంచి 14.23% వృద్ధితో 108.24 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 17% వృద్ధితో 146.26 బిలియన్ డాలర్ల నుంచి 171.20 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. సేవల ఎగుమతుల్లో స్వల్ప పెరుగుదల కాగా, జూన్ నెలలో దేశీయంగా ఎగుమతుల విలువ 0.89 శాతం పెరిగి (2017 జూన్ నెలతో పోల్చి చూస్తే) 10.3 బిలియన్ డాలర్లకు చేరింది. -
మరింత పెరిగిన వాణిజ్యలోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరంగా మారిన వాణిజ్య లోటు తాజాగా మరింత భయపెడుతోంది. మే నెలలో వాణిజ్య లోటు 14.62 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 15 శాతం పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. మే మాసానికి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ 14.62 బిలియన డాలర్లుగా నమోదైందని వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. గత ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 13.85 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఎగుమతులు 28.86 బిలియన్ డాలర్లు. గత ఏడాది 24.01 బిలియన్ డాలర్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 20.18శాతం వృద్ధిని సాధించాయి. దిగుమతులు 43.38 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 14.85 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతులు గత ఏడాది 37.86 బిలియన్ డాలర్లుగా ఉంది. ముడి చమురు దిగుమతులు 49.46 శాతం పెరిగి 11.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
సమసిన వాణిజ్య ఘర్షణలు!
బీజింగ్: అమెరికా–చైనా మధ్య మొదలైన వాణిజ్య ఘర్షణలు ఎట్టకేలకు సమసిపోయాయి. ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులను చైనా గణనీయంగా పెంచడం ద్వారా ఆ దేశంతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్ల తగ్గింపునకు తోడ్పాటు అందిస్తుంది. వాషింగ్టన్లో రెండు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమయం పాటు జరిగిన రెండో దశ చర్చల అనంతరం భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడింది. ఒకరిపై ఒకరు వాణిజ్య యుద్ధానికి ఇరుదేశాలు దిగరాదని నిర్ణయించాయి. ‘‘చైనా ప్రజల పెరుగుతున్న వినియోగ అవసరాలను తీర్చేందుకు, మెరుగైన ఆర్థికాభివృద్ధికి గాను అమెరికా ఉత్పత్తులు, సేవల కొనుగోళ్లను చైనా గణనీయంగా పెంచుతుంది’’ అని సంయుక్త ప్రకటన విడుదలైంది. దీనివల్ల అమెరికా వృద్ధి, ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలిచినట్టు ఆ ప్రకటన పేర్కొంది. చైనా ఒక నెల రోజుల్లోపు తమ వాణిజ్య లోటును 100 బిలియన్ డాలర్ల మేర తగ్గించాలని, 2020 నాటికి 200 బిలియన్ డాలర్ల మేర తగ్గించకపోతే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు మరో దేశ ఉత్పత్తులపై సుంకాల పెంపు చర్యలు కూడా తీసుకున్నాయి. వాణిజ్య లోటు తగ్గింపునకు చైనా అదనంగా దిగుమతులు చేసుకునేందుకు ముందుకు రావడంతో వివాదానికి ముగింపు పలికినట్టయింది. ఒప్పందం విధి, విధానాల ఖరారుకు గాను అమెరికా ఓ బృందాన్ని చైనాకు పంపిస్తుంది. ఈ చర్చల్లో అమెరికా తరఫున ట్రెజరీ సెక్రటరీ టి.ముంచిన్, వాణిజ్య సెక్రటరీ విల్బర్ ఎల్.రాస్, చైనా తరఫున ప్రతినిధి ఉపాధ్యక్షుడు లీహీ నేతృత్వం వహించారు. చైనా నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులకంటే...అమెరికా నుంచి చైనాకు జరిగే దిగుమతులు తగ్గడంవల్ల అమెరికా వాణిజ్యలోటు పెరిగిపోయింది. దీంతో ట్రంప్ ట్రేడ్వార్కు తెరతీసారు. ఇతర అంశాలపైనా అంగీకారం తయారీ, సేవలకు సంబంధించి వాణిజ్యం మరింత పెంపొందించుకునేందుకు సానుకూల వాతావరణం కల్పించాలని నిర్ణయించాయి. మేథో సంపత్తి హక్కులను పరస్పరం గౌరవించుకోవాలని, సహకారం పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ఈ దిశగా చైనా తన చట్టాల్లో సవరణలు తీసుకువస్తుంది. ఇరువైపులా పెట్టుబడులకు ప్రోత్సాహంపై అంగీకారం కుదిరింది. ‘మేడ్ ఇన్ చైనా 2025’లో భాగంగా పరిశ్రమలకు ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేయాలని, ప్రతీకార చర్యలకు దిగరాదని అమెరికా డిమాండ్ చేసింది. ‘‘ఈ అంశాలపై అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తూ ఆర్థిక, వాణిజ్య ఆందోళనలను సత్వరమే పరిష్కరించుకోవాలని రెండు వైపులా అంగీకారం కుదిరింది’’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఈ చర్చలు ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగినట్టు లీ చైనా పత్రికకు తెలిపారు. అమెరికా మంత్రులతో కూడిన బృందం చైనాలో పర్యటించి, సహచర మంత్రులతో పటిష్ట ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉందన్నారు. నెల క్రితం తమ దేశంలోకి దిగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు చెందిన 128 ఉత్పత్తులపై చైనా సుంకాలు పెంచేందుకు ప్రతిపాదించింది. తమ దేశ వాణిజ్యలోటు తగ్గింపునకు చైనా చర్యలు తీసుకోకపోతే 50 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో 106 అమెరికా ఉత్పత్తులపై కొత్తగా 25శాతం టారిఫ్ విధిస్తామని చైనా సైతం ప్రతిగా హెచ్చరించింది. కానీ, ఇరు దేశాలు తమ ఆదేశాలను ఇంతవరకు అమలు చేయలేదు. -
కొనసాగుతున్న రూపాయి పతనం
ముంబై: అటు ఎగుస్తున్న ముడి చమురు ధరలు... ఇటు పెరుగుతున్న వాణిజ్య లోటు మొదలైన అంశాల దెబ్బతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం ఏకంగా 52 పైసలు క్షీణించి 66.90 స్థాయికి పతనమైంది. ఒకే రోజు ఈ స్థాయిలో పడిపోవడం ఈ ఏడాది ఇది మూడోసారి. అలాగే, ఇది 14 నెలల కనిష్టం కూడా. చివరిసారిగా 2017 ఫిబ్రవరి 22 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. కార్పొరేట్లు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు భారీ ఎత్తున డిమాండ్ నెలకొనడంతో దేశీ కరెన్సీ గణనీయంగా క్షీణించింది. ఒక దశలో ఆర్బీఐ జోక్యం చేసుకున్నట్లుగా కనిపించినప్పటికీ.. పతనానికి అడ్డుకట్ట పడలేదు. మొత్తంమీద గతేడాది ఆరు శాతం పైగా బలపడిన రూపాయి.. ఈ ఏడాది మాత్రం ఆసియా కరెన్సీలన్నింటిలోకెల్లా అత్యధికంగా క్షీణించింది. అటు పౌండు, యూరో, జపాన్ యెన్‌తో పోల్చి చూసినా రూపాయి బలహీనంగా క్లోజయ్యింది. -
పుంజుకున్న ఎగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: గత జనవరిలో భయపెట్టిన భారత వాణిజ్యలోటు కొద్దిగా చల్లబడింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 4.5 శాతం దిగుమతులు 10.4 శాతం పెరిగాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4.5 శాతం పెరుగుదలతో 25.8 బిలియన్ల డాలర్ల ఎగుమతులను సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా వెల్లడించారు. ఫిబ్రవరి వాణిజ్య లోటు గత మాసంలోని 16.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే జనవరి 24.3 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఫిబ్రవరి ఎగుమతులు 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు 37.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, రసాయనాలు, వెండి, ముత్యాల దిగుమతి పెరగడంతో వాణిజ్య లోటు జనవరిలో 56 నెలల గరిష్ఠానికి (16.3 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. -
అక్టోబర్‌లో ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం అమలు అనంతరం ఎగుమతిదారులకు లిక్విడిటీపరమైన సమస్యల నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం తర్వాత ఎగుమతులు క్షీణించాయి. అక్టోబర్‌లో 1.12% మేర తగ్గాయి. గతేడాది అక్టోబర్‌లో 23.36 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి గత నెలలో 23.09 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. చివరిసారిగా 2016 ఆగస్టులో ఎగుమతులు క్షీణించాయి. టెక్స్టైల్స్, ఫార్మా, లెదర్, వజ్రాభరణాలు తదితర విభాగాల ఎగుమతులు కూడా క్షీణించాయి. గత నెల దిగుమతులు 7.6% వృద్ధితో 34.5 బిలియన్ డాలర్ల నుంచి 37.11 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు వెల్లువెత్తడంతో వాణిజ్య లోటు ఏకంగా మూడేళ్ల గరిష్టమైన 14 బిలియన్ డాలర్ల స్థాయికి ఎగిసింది. గతేడాది అక్టోబర్‌లో ఇది 11.13 బిలియన్ డాలర్లే. గత నాలుగు నెలలుగా రీఫండ్లు లేకపోవడం, జీఎస్టీ చెల్లింపులతో తాము నిధుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ఎగుమతులు మరింత క్షీణించకుండా సత్వరం చర్యలు తీసుకోవాలని, లేకపోతే నవంబర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగలదని తెలిపింది. ఎగుమతి, దిగుమతుల డేటాను పరిశీలిస్తే.. ♦ అక్టోబర్‌లో పసిడి దిగుమతులు మాత్రం 16 శాతం తగ్గి 2.94 బిలియన్ డాలర్లకే పరిమితం అయ్యాయి. చమురు దిగుమతులు 27.89 శాతం పెరిగి 9.28 బిలియన్ డాలర్లకు, చమురుయేతర దిగుమతులు 2 శాతం వృద్ధితో 27.83 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ పెట్రోలియం ఎగుమతులు 14.74%, ఇం జినీరింగ్ ఉత్పత్తులు 11.77%, రసాయనాల ఎగుమతులు 22.29% పెరిగాయి. ♦ 2017–18 ఏప్రిల్–అక్టోబర్ మధ్యలో మొత్తం ఎగుమతులు 9.62 శాతం పెరిగి 170.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 22.21 శాతం వృద్ధితో 256.43 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 86.14 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరీ దారుణం!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తుల విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమ దేశంలోనే ఉత్పత్తులను తయారు చేయాలంటూ కొన్నాళ్ల క్రితం అల్టీమేటం జారీ చేసిన ఆయన.. డ్రాగన్ కంట్రీతో వాణిజ్య వ్యవహారాలను సమీక్ష దిశగా అడుగులు వేశారు కూడా. అయితే ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. చైనా-అమెరికా ఇరుదేశాల వాణిజ్య ఒప్పందాల మూలంగా వర్తక లోటు చాలా భయంకరంగా ఉందని ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. బుధవారం కేబినెట్ అధికారులతో సమావేశం అయిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఒక్క చైనాతోనే కాదు.. దాదాపు ప్రతీ దేశం విషయంలోనే ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందని ట్రంప్ పేర్కొన్నారంట. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. దీంతో వర్తక ఒప్పందాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పొరుగుదేశాలు కెనడా, మెక్సికోలతో చేసుకున్న ఎన్ఏఎఫ్టీఏ ఒప్పందం సవరించాల్సిన అవసరం ఉందని, అలా కానీ పక్షంలో ఒప్పందం నుంచి బయటకు వచ్చేయాలని ట్రంప్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. వీసా విధానం మరింత కఠినతరం... న్యూయార్క్ ట్రక్కు ఉగ్రదాడి ప్రస్తావన ట్రంప్ భేటీలో తెచ్చారు. పాదచారులు, స్కూలు పిల్లలపై దారుణాది దారుణంగా ఉగ్రదాడికి పాల్పడిన వాడు సభ్య సమాజంలో నివసించేందుకు తగిన వ్యక్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాదిని క్వూబాలో ఉన్న గ్వాంటనామా బే జైలుకు తరలిస్తామని చెప్పారు. వాడిక జీవితాంతం జైల్లోనే ఉంటాడు అని ట్రంప్ తెలిపారు. వలస విధానమే మంచిదని, ఏ దేశం నుంచి పడితే ఆ దేశం నుంచి వచ్చిన వారికి అనుమతులు, వీసాలు ఇస్తూ పోతుంటే, ఇటువంటి అనర్థాలే జరుగుతాయన్నారు. వీసా విధానాన్ని మరింత కఠినం చేసి తీరుతామని, అమెరికాను సురక్షితంగా చేయడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. -
ఎగుమతులు ఓకే, కానీ..
► ఆగస్టులో 10% పైగా వృద్ధి ► ఆందోళనలో వాణిజ్య లోటు 11.65 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల వృద్ధి ఆగస్టులో 10.29 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయి వృద్ధి రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ఆగస్టులో ఎగుమతుల విలువ 23.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజ నీరింగ్, కెమికల్స్ ఎగుమతులు ఇందుకు సానుకూలంగా నిలిచాయని వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. అయితే హస్తకళలు, రత్నాలు ఆభరణాలు, పండ్లూ, కూరగాయల ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లో భారీ వృద్ధి... ఇక ఆగస్టు నెలలో దిగుమతులూ భారీగా పెరిగాయి. ఈ విలువ 21.02 శాతం పెరుగుదలతో 35.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11.65 బిలియన్ డాలర్లకు చేరింది. జూలైలో ఈ విలువ 11.40 బిలియన్ డాలర్లుకాగా, గత ఏడాది ఇదే నెలలో 7. 71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పసిడి దెబ్బ... దిగుమతులు భారీగా పెరిగి, వాణిజ్యలోటు కొంత ఆందోళన కలిగించడానికి బంగారం అధిక దిగుమతులూ కారణంగా నిలిచాయి. పసిడి దిగుమతులు దాదాపు 69 శాతం పెరిగి 1.88 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక మొత్తం దిగుమతుల వాటాలో చమురు దిగుమతులు 14.22 శాతం పెరిగి 7.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎగుమతులు 8.57 శాతం పెరిగి 118.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు 26.63 శాతం పెరిగి 181.71 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో వాణిజ్యలోటు ఈ కాలంలో 63.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. క్యాడ్ భారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.4 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో భారీగా 14.3 బిలియన్ డాలర్లు. దిగుమతులు పెరిగి ఏర్ప డిన అధిక వాణిజ్యలోటు దీనికి కారణం. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్ 0.4 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కూడా క్యాడ్ ఇప్పటికన్నా తక్కువగా 0.6 శాతంగా (3.4 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. క్యాడ్ ఎంత పెరిగితే అంతమేర ఆ దేశం ఇతర దేశాలకు రుణగ్రస్త దేశంగా మారుతుంది. ఇది ఆ దేశం మారక విలువ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. నాలుగేళ్లక్రితం ఇలాంటి సమస్యే వచ్చినప్పుడు కేంద్రం పసిడి దిగుమతులపై కఠిన నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. -
వాణిజ్యలోటు.. ఆందోళన!
జూలైలో భారీగా 11.44 బిలియన్ డాలర్లు ► భారీ పసిడి దిగుమతుల ప్రభావం ► ఎగుమతులు 8 నెలల కనిష్ట స్థాయి ► భారీగా పెరిగిన దిగుమతుల విలువ న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు జూలైలో భారీగా పెరిగింది. ఈ మొత్తం భారీగా 11.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అధిక పసిడి దిగుమతుల ప్రభావం దీనికి ప్రధాన కారణం. అయితే 2017 జూన్‌తో (12.96 బిలియన్ డాలర్లు) పోల్చితే వాణిజ్యలోటు తక్కువ. ఎగుమతులు 3.94 శాతం అప్... జూలైలో ఎగుమతుల వృద్ధి కేవలం 3.94 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. విలువ రూపంలో 2016 జూలైలో 21.68 బిలియన్ డాలర్లయితే, 2017 జూలైలో ఈ విలువ కేవలం 22.54 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూలై నెలలో ఫార్మా, రత్నాలు, ఆభరణాలు, రెడీ–మేడ్ దుస్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకాకపోగా, క్షీణత నెలకొంది. ఈ కీలక రంగాల్లో ఎగుమతులు తగ్గడం ఆందోళన కలిగిస్తోందని భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గణేష్ గుప్తా పేర్కొన్నారు. అయితే ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాలు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. దిగుమతులు 15.42 శాతం పెరుగుదల ఇక దిగుమతులు భారీగా 15.42 శాతం పెరిగాయి. విలువ రూపంలో 29.45 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో వాణిజ్యలోటు 11.44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పసిడి దిగుమతులు 95 శాతం పైకి... ఇక పసిడి దిగుమతులు 95 శాతం పెరిగాయి. వార్షికంగా ఈ విలువ 1.07 బిలియన్ డాలర్ల నుంచి 2.19 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇది కరెంట్ అకౌంట్‌లోటు (దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై ప్రతికూల ప్రభావం చూపే అంశం. చమురు దిగుమతులూ భారీనే.. ఇక జూలైలో క్రూడ్ దిగుమతులు భారీగా జరిగాయి. వార్షికంగా 15 శాతం వృద్ధితో 7.84 బిలియన్ డాలర్లుగా ఈ విలువ నమోదయ్యింది. ఇక మిగిలినవి పసిడిసహా చమురు యేతర దిగుమతులు. నాలుగు నెలల్లో చూస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే... ఎగుమతులు 8.91 శాతం వృద్ధితో 94.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 28.30% వృద్ధితో 146.25 బిలియన్ డాలర్లగా ఉంది. దీనితో వాణిజ్య విలువ ఈ కాలంలో 51.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
చైనా ఉత్పత్తుల కట్టడికి భారత్ కొత్త ఫార్ములా!
న్యూఢిల్లీ : చైనాతో వాణిజ్యం లోటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ లోటును తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. మార్కెట్లో చైనా ఉత్పత్తుల ప్రవేశాన్ని కట్టడి చేయాలని భావిస్తోంది. దీనికోసం ఓ కొత్త ఫార్ములాను సంధించాల్సిందేనని భారత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చైనాకు డ్యూటీ రాయితీలను తగ్గించడం లేదా ఆలస్యం చేయడం ద్వారా ఆ దేశ ఉత్పత్తులను మార్కెట్లోకి రావడాన్ని అడ్డుకట్ట వేయొచ్చని భారత్ భావిస్తున్నట్టు సమాచారం. అయినా కూడా లాభంలేకపోతే, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ట్రేడ్ ఒప్పందం కింద దిగుమతయ్యే చైనా ఉత్పత్తుల నెగిటివ్ జాబితా తయారుచేసి, వాటికి టారిఫ్ రాయితీలను ఇవ్వకూడదని ప్లాన్ వేస్తోంది. ఈ విషయాన్ని నవంబర్ 3-4వ తేదీన ఫిలిప్పీన్స్‌లో జరిగే మంత్రిత్వ శాఖల చర్చలో వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించనున్నారు. ఈ కొత్త కొత్త వ్యూహ్యాలతో చైనాతో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. 2015-16లో భారత్ నుంచి చైనాకు 9 బిలియన్ డాలర్ల(రూ.60,117కోట్లు) ఎగుమతులు జరిగితే, ఆ దేశం నుంచి భారత్ 61.7 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4,14,314కోట్లు) దిగుమతులు చేసుకుంది. అంటే చైనాతో భారత్ వాణిజ్యలోటు 52.7(సుమారు రూ.3,54,172కోట్లు) బిలియన్ డాలర్లు. ఉత్పత్తులు, సర్వీసులు, పెట్టుబడులు, పోటీ, ఆర్థిక, సాంకేతిక సహకారాలతో వివాద పరిష్కారం, మేధో సంపత్తి హక్కుల్లో ఈ ఆర్సీఈపీ ఓ సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దీనిలో 16 దేశాలు భాగస్వామ్యమై ఉంటాయి. 10 ఆగ్నేయాషియా దేశాల అసోసియేషన్, ఆరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద భాగస్వాములు. ఈ ఆరింటిలో ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, కొరియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. -
ఎగుమతులు యూ టర్న్
♦ 18 నెలల వరుస పతనం తర్వాత పెరుగుదల ♦ జూన్ నెలలో 1.27 శాతం వృద్ధి ♦ దిగివచ్చిన వాణిజ్య లోటు న్యూఢిల్లీ: ఏడాదిన్నర వరుస పతనం తర్వాత ఎగుమతులు పుంజుకున్నాయి. జూన్ నెలలో దేశీయ ఎగుమతుల్లో 1.27 శాతం వృద్ధి చోటు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల్లో ఎగుమతులు కలసివచ్చాయి. దీనికితోడు దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు సైతం దిగివచ్చింది. ♦ జూన్ నెలలో ఎగుమతులు 22.57 బిలియన్ డాలర్లు (రూ.1.51 లక్షల కోట్లు సుమారు)గా నమోదయ్యాయి. ఇది 1.27 శాతం పెరుగుదల. 2015 జూన్ నెలలో ఎగుమతులు 22.28 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ♦ దిగుమతుల్లో 7.33 శాతం క్షీణత చోటు చేసుకుంది. 2015 జూన్ నెలలో 33.11 బిలియన్ డాలర్లుగా ఉండగా... ఈ ఏడాది జూన్ లో 30.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ♦ ఫలితంగా జూన్ నెలలో వాణిజ్య లోటు 8.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. ఈ లోటు అంతకుముందు ఏడాది ఇదే నెలలో 10.82 బిలియన్ డాలర్లుగా ఉంది. ♦ ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ తగ్గడం, చమురు ధరల పతనంతో 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు తగ్గుతూ వచ్చాయి. ♦ పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 16.42 శాతం తగ్గాయి. ♦ బంగారం దిగుమతులు భారీగా క్షీణించాయి. జూన్‌లో 1.20 బిలియన్ డాలర్ల మేర బంగారం దేశంలోకి దిగుమతి అయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 38.54 శాతం తగ్గినట్టు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తక్కువగానే... ♦ అయితే, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చూస్తే మొత్తం మీద ఎగుమతుల విలువ 65.31బిలియన్ డాలర్లుగా ఉంది. 2015 జూన్ క్వార్టర్లో ఎగుమతులు 66.69 బిలియన్ డాలర్లు. -
చైనా అమెరికాను ‘రేప్’ చేస్తోంది: ట్రంప్
షికాగో: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చైనాపై విరుచుకుపడ్డారు. చైనా తన అనుచిత వాణిజ్య విధానాలతో అమెరికాను అత్యాచారం చేస్తోందని ధ్వజమెత్తారు. చైనా వాణిజ్యాన్ని అమెరికా వాణిజ్యంతో పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే చైనా అత్యాచారాలను కొనసాగనివ్వనని చెప్పారు. ఆదివారం ఇండియానాలోని ఫోర్ట్ వేన్లో నిర్వహించిన ఎన్నికల సభలో ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో చైనా ఎగుమతులు పెరిగిపోయాయంటూ కరెన్సీ అంశంలో చైనా చేస్తున్న మాయాజాలాన్ని తప్పుబట్టారు. ప్రపంచమార్కెట్లో తన ఉత్పత్తులను విక్రయించి ఎగుమతులు పెంచుకునేందుకు చైనా తన కరెన్సీపై గిమ్మిక్కులకు పాల్పడుతోందని, అమెరికా వాణిజ్యాన్ని దారుణంగా హత్యచేస్తోందన్నారు. -
'మా దేశాన్ని రేప్ చేయడానికి చైనాను అనుమతించం'
వాషింగ్ టన్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ల తరఫున ముందజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆ దేశం తమ దేశాన్ని రేప్ చేసిందని అన్నారు. దఫోర్ట్ వేయిన్, ఇండియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమెరికా వాణిజ్య లోటును గురించి చెబుతూ చైనాతో పోల్చి ప్రసంగించారు. 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా వాణిజ్యాన్ని చైనా దెబ్బతీస్తోందన్నారు. యూఎస్ వాణిజ్యంపై చైనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున 'రేప్' పదాన్ని ట్రంప్ ఉపయోగించారు. చైనాతో పోల్చితే యూఎస్ ఎక్కువ శక్తి వంతమైన దేశం అని తెలిపారు. చైనాపై తమకు ఎలాంటి కోపంలేదన్నారు. ఇంతకు ముందున్న నాయకుల అసమర్థత వల్లే అమెరికా వాణిజ్యం ఇలా తయారైందన్నారు. -
చైనాతో పెరిగిన భారత వాణిజ్య లోటు
బీజింగ్: చైనాతో భారత వాణిజ్య లోటు గత ఏడాది 4,487 కోట్ల డాలర్లకు పెరిగిందని చైనా ప్రభుత్వం తెలిపింది. ఎగుమతులు 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం స్వల్పంగా పెరిగి 7,164 కట్ల డాలర్లకు చేరిందని, 10,000 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని చేరలేకపోయిందని వివరించింది. చైనా ఎగుమతులు 5,825 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపింది. 2014లో 1,640 కోట్ల డాలర్లుగా ఉన్న చైనాకు భారత్ ఎగుమతులు గత ఏడాది 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని వివరించింది. -
ఎగుమతులు 11 వ‘సారీ’..
అక్టోబర్‌లో 17.5 శాతం క్షీణత * 11 నెలల నుంచీ ఇదే ధోరణి * దిగుమతులూ తగ్గుముఖం... * ఎనిమిది నెలల కనిష్టానికి వాణిజ్యలోటు న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణ ధోరణి వరుసగా 11వ నెలా కొనసాగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2014 అక్టోబర్ ఎగుమతుల విలువతో పోల్చితే 2015 అక్టోబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 17.5 శాతం క్షీణించాయి. విలువలో 25.89 బిలియన్ డాలర్ల నుంచి 21.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఇక ప్రధానంగా కమోడిటీ ధరల కనిష్ట స్థాయి, అలాగే దేశీయ మందగమన పరిస్థితులను దిగుమతులు ప్రతిబింబిస్తున్నాయి. ఈ రేటు 21 శాతం పడిపోయింది. విలువ 39.46 బిలియన్ డాలర్ల నుంచి 31.12 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ నెలలో చమురు దిగుమతులు 45.31 శాతం పడ్డాయి. విలువలో 6.84 బిలియన్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 10 శాతం క్షీణతతో 24.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 8 నెలల కనిష్టం...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఫిబ్రవరి తరువాత ఇదే తొలిసారి. ముఖ్య రంగాలు చూస్తే... పెట్రోలియం ప్రొడక్టులు (-57 శాతం), ముడి ఇనుము (-85.5 శాతం), ఇంజనీరింగ్ (-11.65 శాతం) రత్నాలు, ఆభరణాలు (-12.84 శాతం) విభాగాల ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బంగారం దిగుమతులూ తగ్గాయ్.. దేశ దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించే పసిడి దిగుమతులూ అక్టోబర్‌లో పడిపోయాయి. 59.5 శాతం క్షీణించాయి. విలువ 4.20 బిలియన్ డాలర్ల నుంచి 1.70 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి దోహదపడే అంశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దిగుమతుల విలువ భారీగా తగ్గడానికి పసిడి విలువ గణనీయంగా పడిపోవడం కారణం. ఏడు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) ఎగుమతులు 18% క్షీణించాయి. విలువ 154 బిలియన్ డాలర్లు. దిగుమతులు సైతం 15% తగ్గి 232 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్య లోటు 77 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడు నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 42% పడిపోయి 95 బిలియన్ డాలర్ల నుంచి 55 బిలియన్ డాలర్లకు పడిపోయింది. లక్ష్యం కష్టమే... గతేడాది దేశం 310 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అయితే ఈ ఏడాది 300 బిలియన్ డాలర్లనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ధోరణుల వల్ల ఈ లక్ష్య సాధన కూడా కష్టమేనని ఎగుమతుల సంస్థ... ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎస్సీ రెల్హాన్ అన్నారు. -
ఎగుమతులు డీలా...
మే నెలలో 20శాతం క్షీణత - ఆరు నెలలుగా ఇదే ధోరణి - దిగుమతులూ 17 శాతం మైనస్సే - వాణిజ్యలోటు 10 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతులు క్షీణిస్తూ... ఆర్థిక వ్యవస్థలోని నిరాశాజనక పరిస్థితిని మరోమారు స్పష్టంచేశాయి. అంతర్జాతీయ మందగమన ధోరణికి అద్దం పడుతూ, ఎగుమతులు ఏకంగా 20 శాతం క్షీణించాయి. దేశీయంగా డిమాండ్ లేకపోవటంతో దిగుమతులు సైతం 17 శాతం క్షీణించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలివీ... - 2014 మేలో ఎగుమతుల విలువ 27.99 బిలియన్ డాలర్లు. 2015 మేలో ఈ విలువ 22.34 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే అసలు వృద్ధిలేకపోగా 20 శాతంపైగా క్షీణించాయన్నమాట. ఎగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో పాటు, క్రూడ్ ధరలు కూడా దిగువ స్థాయిలో కొనసాగుతుండడం కారణం. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. మెటల్, పలు కమోడిటీ ధరలు కూడా తగ్గాయి. - 2014 మే నెల్లో దిగుమతులు 39.23 బిలియన్ డాలర్లు. ఇవి 2015 మే నెలలో 32.75 బిలియన్ డాలర్లకు పడ్డాయి. అంటే అసలు పెరుగుదల లేకపోగా 17 శాతం క్షీణించాయి. 2014 ఫిబ్రవరి తరువాత దిగుమతులు ఇంత తీవ్ర స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. - వెరసి ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు 10.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015 ఏప్రిల్ నెలలో ఈ పరిమాణం 11 బిలియన్ డాలర్లయితే, 2014 మే నెలలో ఈ విలువ 11.2 బిలియన్ డాలర్లుగా ఉంది. - మే నెలలో ప్రధాన ఎగుమతుల రంగాలైన పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్, కెమికల్స్ ప్రతికూల ఫలితాలను చూశాయి. - చమురు దిగుమతుల విలువ 40,97 శాతం తగ్గి 8.53 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురుయేతర దిగుమతుల విలువ సైతం 2.24 శాతం పడి, 24.21 బిలియన్ డాలర్లుగా ఉంది. - కాగా 2014 మేతో పోల్చితే బంగారం దిగుమతులు 10.47 శాతం పెరిగి 2,19 బిలియన్ డాలర్ల నుంచి 2.42 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రెండు నెలల్లో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు- ఏప్రిల్, మేలలో ఎగుమతులు (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చి) 17 శాతం పడ్డాయి. విలువ 44.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 12 శాతం క్షీణించాయి. ఈ విలువ 65.8 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 21.4 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్ఐఈఓ కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు- ఏప్రిల్, మేలలో ఎగుమతులు (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చి) 17 శాతం పడ్డాయి. విలువ 44.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 12 శాతం క్షీణించాయి. ఈ విలువ 65.8 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 21.4 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్ఐఈఓ కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. -
ఎగుమతులు... మళ్లీ నిరాశే!
⇒ ఏప్రిల్‌లో 14 శాతం క్షీణతతో 22 బిలియన్ డాలర్లగా నమోదు ⇒ వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో నిరాశపర్చాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2015 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14% క్షీణించాయి. 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. 2014 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 26 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే- ఎగుమతులు క్షీణ దశలో ఉండడం ఇది వరుసగా 5వ నెల. దిగుమతులూ తగ్గాయ్.. ⇒ ఇక ఇదే నెలలో దిగుమతులు కూడా 7 శాతం పైగా క్షీణించాయి. ఈ విలువ 36 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు దిగింది. వాణిజ్యలోటు ఇదీ...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2014 ఏప్రిల్ ఈ పరిమాణం 10 బిలియన్ డాలర్లు కాగా 2015 మార్చిలో 12 బిలియన్ డాలర్లు. మరిన్ని అంశాలు... ⇒ అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం. ⇒ పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు-ఆభరణాలు వంటి ప్రధాన ఎగుమతి విభాగాలు ప్రతికూల ఫలితాలు నమోదుచేసుకున్నాయి. ⇒ చమురు దిగుమతులు 43 శాతం తగ్గి, 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ⇒ చమురుయేతర దిగుమతులు 13 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు చేరాయి. ⇒ గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో దేశం 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 2013-14 కన్నా (314 బిలియన్ డాలర్లు) తక్కువగా 310.5 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. పసిడి మెరుపు... కాగా ఏప్రిల్‌లో ఒక్క బంగారం దిగుమతుల విలువ చూస్తే 78 శాతం పెరిగి 3.13 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం విలువ తగ్గడం, నియంత్రణల సడలింపు వంటి అంశాలు దీనికి కారణం. 2014 ఏప్రిల్‌లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు 2015 ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు చేరడానికి బంగారం దిగుమతులు పెరగడమూ ఒక కారణం. -
ఎగుమతుల లక్ష్యం మిస్...
⇒ 2014-15లో లక్ష్యం 340 బిలియన్ డాలర్లు ⇒ జరిగింది 311 బిలియన్ డాలర్లే ⇒ మార్చిలో భారీగా పెరిగిన వాణిజ్య లోటు ⇒ బంగారం దిగుమతుల పెరుగుదల ఎఫెక్ట్ న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్-2015 మార్చి) తీవ్ర నిరుత్సాహ పరిచాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం 340 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని ఎగుమతుల రంగం చేరుకోలేకపోయింది. కనీసం 2013-14 ఆర్థిక సంవత్సరం పరిమాణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 314 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో 311 బిలియన్ డాలర్ల వద్ద చతికిలపడిపోయాయి. అంటే వార్షికంగా చూసుకుంటే అసలు వృద్ధి లేకపోగా(-) 1.23 శాతం క్షీణించాయన్నమాట. ఇక వార్షికంగా దిగుమతులు - 0.5 శాతం క్షీణించి 450 బిలియన్ డాలర్ల నుంచి 448 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల విలువల వ్యత్యాసం వాణిజ్యలోటు ఆర్థిక సంవత్సరంలో 137 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చిలో భారీ వాణిజ్య లోటు మార్చి నెల విదేశీ వాణిజ్యానికి సంబంధించి, ఈ నెలలో భారీ వాణిజ్యలోటు ఏర్పడింది. వార్షికంగా (2014 మార్చితో పోల్చి) ఎగుమతులు 21 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఎగుమతుల రేటు పడిపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి. దిగుమతులు వార్షిక ప్రాతిపదికన చూస్తే- 13 శాతంపైగా తగ్గి 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఈ లోటు నాలుగు నెలల గరిష్ట స్థాయి. 2014 మార్చిలో వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ లోటు 7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ నుంచీ ఎగుమతుల రంగం క్షీణ దశలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మార్చి నెలలో 59.5 శాతం తగ్గాయి. రత్నాలు, ఆభరణాల విలువ 8.36 శాతం తగ్గింది. రసాయనాల ఎగుమతుల విలువ 5.36% పడింది. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 2.5% తగ్గాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ నాలుగు విభాగాల ఎగుమతుల వాటా దాదాపు 70 శాతం. భారీగా పెరిగి పసిడి దిగుమతులు... మార్చిలో వాణిజ్యలోటు పెరగడానికి దేశంలోకి బంగారం భారీ దిగుమతులు ఒక కారణం. 2014 మార్చి నెలతో పోల్చితే పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కలిసి వచ్చిన చమురు... ఇక చమురు దిగుమతుల విలువ 53% క్షీణించడం విశేషం. ఈ విలువ మార్చిలో 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినా... చమురు దిగుమతుల విలువ 16% పైగా తగ్గి 138 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ చమురు ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. ఇక చమురు యేతర దిగుమతుల విలువ 8.4% పెరిగి 310 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రత్యేక దృష్టి అవసరం: నిపుణులు ఎగుమతుల రంగం మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. ఎగుమతి చేస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరమని భారత్ ఉత్పత్తుల ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) డెరైక్టర్ జనరల్ అజయ్ సాహీ అభిప్రాయపడ్డారు. -
ఎగుమతులు పడ్డాయ్!
* జనవరిలో 11 శాతం క్షీణత * దిగుమతులదీ ఇదీ పరిస్థితి * వాణిజ్యలోటు 8.32 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2015 జనవరిలో నిరుత్సాహం కలిగించాయి. 2014 ఇదే నెలతో పోల్చితే విలువలో అసలు వృద్ధి లేకపోగా 11.19 శాతం తగ్గిపోయాయి (క్షీణత). 2015 జనవరిలో ఎగుమతుల విలువ 23.88 బిలియన్ డాలర్లు. 2014 ఇదే నెలలో ఈ పరిమాణం 26.89 బిలియన్ డాలర్లు. ఇంత తక్కువ స్థాయికి ఎగుమతుల రేటు పడిపోవడం రెండున్నర సంవత్సరాల కాలంలో (2012 జూలైలో 14.8 శాతం) ఇదే తొలిసారి. ఇక దిగుమతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 11.39 శాతం క్షీణించి 32.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల పడిపోవడం వరుసగా ఇది రెండవనెల. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 8.32 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు గడచిన తొమ్మిది నెలల్లో మొదటిసారి ఇంత తక్కువ స్థాయిని నమోదుచేసుకుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విలువ తగ్గడం దీనికి (తక్కువ స్థాయి వాణిజ్యలోటు) ప్రధాన కారణం. చమురు దిగుమతుల బిల్లు 37.46 శాతం పడిపోయి కేవలం 8.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిరాశలో కీలక రంగాలు కాటన్ యార్న్ (- 9.15 శాతం), రసాయనాలు(-10.52), ఫార్మా(-0.16 శాతం), రత్నాలు, ఆభరణాల (-3.73 శాతం) రంగాల నుంచి ఎగుమతులు భారీగా లేకపోవడం మొత్తం ఈ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపింది. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు కూడా నిరాశగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్ మెరుగుపడినప్పటికీ, యూరోపియన్ యూనియన్, జపాన్‌లో మందగమన పరిస్థితులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. బంగారం దిగుమతులు ఇలా...: కాగా 2015 జనవరిలో బంగారం దిగుమతులు 8.13 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-జనవరి మధ్య...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య ఎగుమతులు 2.44 శాతం వృద్ధితో 265.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 2.17 శాతం పెరుగుదలతో 383.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 118.37 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 340 బిలియన్ డాలర్ల ఎగుమతులను కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రోత్సాహకాలు అవసరం: ఎఫ్ఐఈఓ ఎగుమతుల రంగం పునరుత్తేజానికి తగిన విధాన చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టాలని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ దిశలో విదేశీ వాణిజ్య విధానాన్ని త్వరలో ఆవిష్కరించాలని సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరేలా కనబడ్డం లేదని అన్నారు. -
వాణిజ్యలోటు జూమ్!
నవంబర్‌లో ఏడాదిన్నర గరిష్ట స్థాయి 16.8 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు నవంబర్‌లో భారీగా పెరిగింది. ఇది 16.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సోమవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్‌లో ఎగుమతులు 2013 ఇదే నెలతో పోల్చిచూస్తే, 7.27 శాతం వృద్ధితో 25.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఇదే నెలలో 26.79 శాతం పెరుగుదలతో 42.82 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితం దేశానికి 16.8 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడింది. ఇది దాదాపు ఏడాదిన్నర గరిష్ట స్థాయి. అక్టోబర్‌లో ఈ లోటు 13.4 బిలియన్ డాలర్లు. 2013 నవంబర్‌లో ఈ పరిమాణం 9.2 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా నెల నవంబర్‌లో చమురు దిగుమతులు 9.7 శాతం తగ్గి, 11.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చమురుయేతర దిగుమతుల విలువ 49.6 శాతం వృద్ధితో 31.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల్లో... కాగా 2014 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ గడిచిన ఎనిమిది నెలల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఎగుమతుల విలువ 5.02 శాతం వృద్ధితో 215.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 4.65 శాతం వృద్ధితో 316.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 100.61 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ట్రాక్‌లోకి ఎగుమతులు
మే నెలలో 12.4 శాతం పెరుగుదల; 28 బిలియన్ డాలర్లు - గత 7 నెలల్లో తొలిసారి రెండంకెల వృద్ధి - ఇంజనీరింగ్, పెట్రో ఉత్పత్తులు, గార్మెంట్స్ ఎగుమతుల్లో మెరుగుదల ప్రభావం - 11.4 శాతం తగ్గిన దిగుమతులు; 39.23 బిలియన్ డాలర్లు - బంగారం దిగుమతులపై ఆంక్షల సడలింపునకు మార్గం సుగమం - దిగొచ్చిన వాణిజ్య లోటు; అయినా 10 నెలల గరిష్టం..11.23 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మెరుగుపడుతుండటంతో దేశీ ఎగుమతులకు జోష్ లభిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు 12.4 శాతం వృద్ధితో 28 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ 24.9 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 7 నెలల్లో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకోవడం, రెండంకెల వృద్ధి ఇదే తొలిసారి. ప్రధానంగా ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, గార్మెంట్స్ తదితర రంగాల ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదుచేయడం ఇందుకు దోహదం చేసింది. కాగా, మే నెలలో దిగుమతులు 11.4% తగ్గి... 39.23 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు కాస్త కుదుటపడింది. దీంతో పసిడి దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సడలించేందుకు మార్గం సుగమం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య లోటు ఊరట... ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు కూడా దిగొచ్చింది. క్రితం ఏడాది మే నెలలో 19.24 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది మేలో 11.23 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 10.1 బిలియన్ డాలర్ల కంటే అధికంగానే ఉండటంతోపాటు గడిచిన 10 నెలల్లో గరిష్టస్థాయికి చేరడం గమనార్హం. గతేడాది జూలైలో నమోదైన 12.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటే ఇప్పటిదాకా అత్యధిక స్థాయిగా ఉంది. గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... - పస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 8.87 శాతం ఎగబాకి 53.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 13.16 శాతం దిగొచ్చి 74.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 21.3 బిలియన్ డాలర్లుగా లెక్కతేలింది. - ఇక మే నెలలో చమురు దిగుమతులు 2.5 శాతం పెరిగి 14.46 బిలియన్ డాలర్లకు చేరాయి. - చమురేతర దిగుమతులు మే నెలలో 17.9 శాతం తగ్గుదలతో 24.76 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. - ఇక మే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు 22.09%, పెట్రోలియం ఉత్పత్తులు 28.7%, రెడీమేడ్ దుస్తులు(గార్మెంట్స్) 24.94%, ఫార్మా 10%, రసాయనాలు 13.8%చొప్పున వృద్ధి చెందాయి. ఇనుప ఖనిజం ఎగుమతులు 18.95 శాతం దిగజారి 72 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. - బంగారం దిగుమతులపై నియంత్రణల నేపథ్యంలో రత్నాభరణాల ఎగుమతులు నామమాత్రంగా 1.36%పెరిగి మే నెలలో 3.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రోత్సాహకర సంకేతమిది: ఖేర్ ‘గత 7 నెలల్లో మళ్లీ మొదటిసారిగా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని సాధించగలిగాం. ఇదే ధోరణి గనుక కొనసాగితే మళ్లీ పూర్తిస్థాయిలో పునరుత్తేజం దిశగా పయనించే అవకాశం ఉంది. ఇది చాలా ప్రోత్సాహకర సంకేతమే’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు. -
ఎగుమతులు మిస్
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు రివర్స్‌గేర్‌లోకి జారాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఎగుమతులు 3.15 శాతం క్షీణించి 29.57 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోపక్క, దిగుమతులు సైతం 2.11 శాతం తగ్గుదలతో 40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) మార్చి నెలలో స్వల్పంగా తగ్గి 10.5 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 10.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్చిలో ఎగుమతులు తగ్గడానికి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇతర కారకాలతో పాటు దేశీయంగా తయారీ రంగం పేలవ పనితీరూ కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉందని, వచ్చే నెలల్లో మెరుగుపడవచ్చని భారతీయ ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ వ్యాఖ్యానించారు. లక్ష్యానికి కొద్దిగా దూరంలో... గడిచిన 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 312 బిలి యన్ డాలర్లు మాత్రమే ఎగుమతులు జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. అయితే, 2012-13లో నమోదైన 300 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే దాదాపు 4 శాతం వృద్ధి నమోదైంది. ఇక దిగుమతులు 2012-13తో పోలిస్తే 8.11% తగ్గుదలతో 451 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 139 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2012-13లో వాణిజ్య లోటు 190 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనికి ప్రధానంగా వెండి, బంగారం దిగుమతులు భారీగా దిగిరావడమే కారణం. పుత్తడి-వెండి దిగుమతులు 40% డౌన్... గతేడాది(2013-14)లో వాణిజ్య లోటు కట్టడికి ప్రధానంగా బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడమే కారణం. ఈ రెండు విలువైన లోహాల దిగుమతులు 40% మేర క్షీణించి 33.46 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన కస్టమ్స్ సుంకం పెంపు(10%కి) ఇతరత్రా ఆంక్షలు వీటికి కళ్లెం వేసేందుకు దోహదపడ్డాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు లోహాల దిగుమతుల విలువ 55.79 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక ఈ ఏడాది మార్చిలో బంగారం, వెండి దిగుమతుల విలువ 2.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 3.33 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17.27% దిగుమతుల విలువ తగ్గడం గమనార్హం. -
అంతా తగ్గుదలే!
న్యూఢిల్లీ: జనవరిలో ఎగుమతి-దిగుమతుల రంగం మిశ్రమ ఫలితాలు చవిచూసింది. 2013లో ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో 3.79 శాతం వృద్ధి మాత్రమే నమోదయింది. అయితే బంగారం, వెండి దిగుమతుల తగ్గడం వల్ల ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం సానుకూల రీతిలో 9.92 బిలియన్ డాలర్లకు దిగింది. ఎగుమతుల్లో నిరాశ... జనవరిలో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగా ఉంది. 2013 అక్టోబర్ నుంచి ఎగుమతులు నిరాశాజనకంగా పడిపోతున్నాయి. అప్పట్లో ఎగుమతుల్లో 13.47 శాతం వృద్ధి నమోదుకాగా, నవంబర్‌లో 5.86 శాతం, డిసెంబర్లో 3.49 శాతం మాత్రమే వృద్ధి నమోదయింది. రత్నాలు- ఆభరణాలు, పెట్రోలియం వంటి ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం ఈ విభాగంపై ప్రభావం చూపినట్లు విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ అనుప్ పూజారి చెప్పారు. ఈ రెండు విభాగాల నుంచి ఎగుమతులు 2013 జనవరితో పోలిస్తే అసలు వృద్ధి లేకపోగా వరుసగా 13.1 శాతం, 9.39 శాతం చొప్పున క్షీణతను నమోదుచేశాయి. తగ్గిన దిగుమతులు... బంగారం, వెండి దిగుమతులు 2013 జనవరితో పోలిస్తే 77 శాతం పడిపోయి 7.49 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు సైతం 10.1 శాతం క్షీణించి 13.18 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ నియంత్రణల వల్ల ఏప్రిల్-జనవరి మధ్య ఈ రెండు విలువైన మెటల్స్ దిగుమతులు 37.8 శాతం క్షీణించి 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అంటే 2012 ఏప్రిల్-2013 జనవరి మధ్య ఈ విలువ 46.7 బిలియన్ డాలర్లు. కరెంట్ ఖాతా లోటు కట్టడి... వాణిజ్యలోటు తగ్గడం కరెంట్ ఖాతా లోటుకు (క్యాడ్) సానుకూలాంశం. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ వాణిజ్య రుణాలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్. ఇదెంత ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకు అంత ప్రమాదం. రూపాయి విలువ కదలికలపై సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 50 బిలియన్ డాలర్ల లోపునకు తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) భావిస్తోంది. -
ఎగుమతుల మందగమనం
డిసెంబర్: భారత ఎగుమతుల వృద్ధి వేగం తగ్గింది. డిసెంబర్లో ఈ రేటు కేవలం 3.49%గా నమోదయ్యింది. ఇది 6 నెలల కనిష్ట స్థాయి. విలువ పరంగా చూస్తే డిసెంబర్లో ఎగుమతులు విలువ 26.34 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు పడిపోవడం మొత్తం వృద్ధి స్పీడ్ తగ్గడానికి కారణమని వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు తెలిపారు. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 25.45 బిలియన్ డాలర్లు. దిగుమతులు ఇలా.. ఇక డిసెంబర్ నెలలో దిగుమతులు 15.25% పడిపోయాయి. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 43.05 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ 2013 డిసెంబర్లో 36.48 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు మొత్తంగా ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు డిసెంబర్లో 10.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2012 ఇదే నెలలో ఈ లోటు 17.6 బిలియన్ డాలర్లు. బంగారం, వెండి ఎఫెక్ట్ దిగుమతులు భారీగా తగ్గడం, దీనితో వాణిజ్యలోటు తగ్గడం వంటి అంశాలపై బంగారం, వెండి మెటల్స్ ప్రభావం పడింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి దిగుమతి సుంకాల పెంపుసహా ప్రభుత్వం కొనసాగిస్తున్న పలు కఠిన చర్యల నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులు డిసెంబర్లో కేవలం 1.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2012 ఇదే నెలలో ఈ విలువ 5.6 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఈ దిగుమతుల రేటు 69 శాతం పడిపోయిందన్నమాట. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలాన్ని చూస్తే బంగారం, వెండి దిగుమతుల విలువ 30 శాతానికి పైగా పడిపోయాయి. 2012 ఇదే కాలంలో ఈ విలువ 39.2 బిలియన్ డాలర్లయితే 2013 ఇదే నెలల్లో ఈ విలువ 27.3 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఇక చమురు దిగుమతులు 1.1 శాతం వృద్ధితో 13.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 9 నెలల్లో: కాగా ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎగుమతులు 5.94 శాతం వృద్ధితో 217 బిలియన్ డాలర్ల నుంచి 230 డాలర్లకు పెరిగాయి. దిగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.55 శాతం క్షీణత(-)తో 364 బిలియన్ డాలర్ల నుంచి 340.37 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొమ్మిది నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 2.6శాతం పెరుగుదలతో 124.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు రహిత వస్తువుల దిగుమతుల విలువ 11.1శాతం పడిపోయి 215.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం (2012-13) మొత్తంలో దేశం మొత్తం ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 491 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190 బిలియన్ డాలర్లు. 2013-14లో భారత్ ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు. -
ఎగుమతులు రయ్..
న్యూఢిల్లీ: మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థకు కొండంత ఉపశమనం కలిగిస్తూ... వాణిజ్య లోటు భారీగా దిగొచ్చింది. సెప్టెంబర్‌లో ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ పుంజుకోవడం, దిగుమతులు అనూహ్యంగా క్షీణించడంతో వాణిజ్య లోటు 30 నెలల కనిష్టానికి పడిపోయింది. 60 శాతంపైగా దిగొచ్చి కేవలం 6.76 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమైంది. ప్రధానంగా బంగారం, వెండి, ముడిచమురు దిగుమతులు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదం చేసింది. 2011, మార్చిలో వాణిజ్య లోటు 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మళ్లీ ఇంత కనిష్ట స్థాయికి దిగిరావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం, కాగా, ఈ ఏడాది ఆగస్టులో వాణిజ్య లోటు 10.9 బిలియన్ డాలర్లు . కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... సెప్టెంబర్‌లో దేశ ఎగుమతుల విలువ 27.68 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.15 శాతం వృద్ధి చెందాయి. ఇక దిగుమతులు ఏకంగా 18.1 శాతం క్షీణించి 34.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా, వాణిజ్య లోటు భారీగా తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కూడా కళ్లెం పడేందుకు దోహదం చేయనుంది. గత కొద్ది నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులతో, మహా పతనాన్ని చవిచూసిన రూపాయి విలువ స్థిరీకరణకు కూడా చేదోడుగా నిలవనుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ నుంచి చూస్తే డాలరుతో రూపాయి మారకం విలువ 15 శాతం పైగానే పడిపోవడం తెలిసిందే. తొలి ఆరు నెలల్లోనూ ఎగుమతుల్లో వృద్ధి... ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో కూడా దేశ ఎగుమతులు వృద్ధిబాటలోనే ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.14 శాతం ఎగబాకి.. 152.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 1.8 శాతం తగ్గుముఖం పట్టి.. 232.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో వాణిజ్య లోటు 13 శాతంమేర క్షీణించి 80.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ... దేశ ఎగుమతులకు వెన్నుదన్నుగా ఉన్న ఇంజనీరింగ్ ఉత్పత్తులు సానుకూల వృద్ధితో పయనిస్తున్నాయి. సెప్టెంబర్‌లో 15.2% ఎగబాకి... 5.2 బిలియన్ డాలర్లకు చేరాయి. రత్నాభరణాల ఎగుమతులు సెప్టెంబర్‌లో 8.31 శాతం తగ్గాయి. 3.79 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. ఏప్రిల్-సెప్టెంబర్‌లో కూడా 8.7 శాతం తగ్గుముఖంతో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. టెక్స్టైల్స్, ఫార్మా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సెప్టెంబర్‌లో మెరుగైన వృద్ధిని కనబరచడం విశేషం. ఏప్రిల్-సెప్టెంబర్‌లో ముడిచమురు దిగుమతులు 3.58% పెరిగి 82.87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు ఇదే వ్యవధిలో 4.55 శాతం తగ్గి.. 149.35 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ చర్యలు ఫలితాలిస్తున్నాయి: రావు బంగారం దిగుమతుల కట్టడితో పాటు నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులపై నియంత్రణ చర్యలు వాణిజ్యలోటు తగ్గుదలకు చేదోడుగా నిలుస్తున్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావు వ్యాఖ్యానించారు. గణాంకాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చర్యలను ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని, దీంతో రానున్న కాలంలో రూపాయి మారకం విలువ బలోపేంతం అయ్యేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది(2013-14)లో 325 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాకారమవుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోపక్క, అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్) ప్రభావం భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని రావు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్లు ఖుషీ...: వాణిజ్య లోటు భారీగా దిగిరావడం, మరోపక్క ఎగుమతులు రెండంకెల వృద్ధితో కొనసాగుతుండటంపట్ల పారిశ్రామిక వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. దీనివల్ల క్యాడ్‌కు కళ్లెం పడటంతో పాటు రూపాయి విలువ కూడా 60 స్థాయిలో స్థిరీకరణకు దోహదం చేయనుందని అభిప్రాయపడ్డాయి. తాజా వాణిజ్య గణాంకాలు ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా కనబడుతున్నాయని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు.ఈ ఏడాది దేశ ఎగుమతులు 350 బిలియన్ డాలర్లను తాకొచ్చని, వాణిజ్యలోటు 150 బిలియన్ డాలర్ల దిగువకు తగ్గుముఖం పట్టొచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. దీంతో క్యాడ్‌ను కూడా 70 బిలియన్ డాలర్లకు(3.7శాతం) కట్టడి చేసేందుకు అవకాశం ఉందన్నారు. బంగారం దిగుమతులకు కళ్లెం... క్యాడ్(మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికి పోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసం)ను ఎగదోయడంలో ప్రధానంగా నిలుస్తున్న బంగారం దిగుమతులకు ఎట్టకేలకు కళ్లెం పడింది. దిగుమతుల సుంకం పెంపు ఇతరత్రా ప్రభుత్వ, ఆర్బీఐ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సెప్టెంబర్‌లో దేశంలోకి దిగుమతైన బంగారం, వెండి విలువ 0.8 బిలియన్ డాలర్లకు పడిపోవడం దీనికి నిదర్శనం. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే(4.6 బిలియన్ డాలర్లు) వీటి దిగుమతులు ఏకంగా 80% క్షీణించడం గమనార్హం. ఇక ముడిచమురు(క్రూడ్) దిగుమతులు కూడా ఈ సెప్టెంబర్‌లో 6% దిగొచ్చి 13.19 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో బంగారం, వెండి దిగుమతులు 8.7% పెరిగి 23.1 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(జీడీపీలో 88.2 బిలియన్ డాలర్లు) క్యాడ్ ఎగబాకడం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో క్యాడ్ ఆందోళనకరంగా 4.9%కి దూసుకెళ్లడం గమనార్హం. -
ఎగుమతులు ఓకే..
న్యూఢిల్లీ: గతకొన్ని నెలలుగా కుంటుపడిన దేశ ఎగుమతులు అకస్మాత్తుగా వృద్ధిబాటలోకి వచ్చాయి. ఒకపక్క ఆర్థికవ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ... జూలైలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.64 శాతం ఎగబాకాయి. రెండేళ్లలో ఇదే అత్యధిక స్థాయి వృద్ధిరేటు కావడం గమనార్హం. మొత్తంమీద గత నెలలో 25.83 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2011 సెప్టెంబర్ నెలలో 35 శాతం ఎగుమతుల వృద్ధి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఏడాది మే(-1.1%), జూన్(-4.6%) నెలల్లో ఎగుమతులు తిరోగమనంలో కొనసాగడం తెలిసిందే. తగ్గిన దిగుమతులు...: ఇక జూలై నెలలో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.2 శాతం తగ్గి 38.1 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం(వాణిజ్య లోటు) జూన్‌లో మాదిరిగానే 12.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు శాంతించడంతో వాణిజ్యలోటు ఎగబాకకుండా అడ్డుకట్టపడేందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది జూలైలో 4.4 బిలియన్ డాలర్ల విలువైన పసిడి, వెండి దిగుమతికాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 34 శాతం తగ్గి 2.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే ఈ ఏడాది జూన్‌లో 2.4 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోలిస్తే జూలై పెరగడం గమనార్హం. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనకరంగా ఎగబాకుతున్న నేపథ్యంలో పుత్తడి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచగా... ఆర్బీఐ కూడా నియంత్రణ చర్యలను తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక కనిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బంగారం, ముడిచమురు దిగుమతుల జోరే దీనికి ప్రధానకారణంగా నిలిచింది. మరోపక్క, అధిక క్యాడ్, వాణిజ్యలోటు ప్రభావంతో డాలరుతో రూపాయి విలువ కూడా రోజుకో కొత్త కనిష్టాలకు పడిపోతోంది. తాజాగా 61.80 స్థాయిని తాకింది కూడా.ఏప్రిల్-జూలైలోనూ...: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై.. 4 నెలల వ్యవధిలోకూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1.72% పెరిగి 98.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 2.82 శాతం తగ్గాయి. 160.7 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. వాణిజ్యలోటు 62.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరింత పుంజుకుంటాయ్: రావు ఎగుమతుల పెంపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహకాలు త్వరలోనే ఫలితాలిస్తాయని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వడ్డీ సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలవల్ల రానున్న నెలల్లో ఎగుమతులు మరింత పుంజుకోనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాన్, దూర ప్రాచ్య దేశాలకు ఎగుమతులు మెరుగుపడుతుండటం దీనికి ఆసరాగా నిలవనుందన్నారు. గతేడాది 300.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వం ఈ ఏడాదిలో 10 శాతం ఎగుమతుల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.