'మా దేశాన్ని రేప్ చేయడానికి చైనాను అనుమతించం'
వాషింగ్ టన్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ల తరఫున ముందజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆ దేశం తమ దేశాన్ని రేప్ చేసిందని అన్నారు. దఫోర్ట్ వేయిన్, ఇండియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమెరికా వాణిజ్య లోటును గురించి చెబుతూ చైనాతో పోల్చి ప్రసంగించారు. 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా వాణిజ్యాన్ని చైనా దెబ్బతీస్తోందన్నారు. యూఎస్ వాణిజ్యంపై చైనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున 'రేప్' పదాన్ని ట్రంప్ ఉపయోగించారు. చైనాతో పోల్చితే యూఎస్ ఎక్కువ శక్తి వంతమైన దేశం అని తెలిపారు. చైనాపై తమకు ఎలాంటి కోపంలేదన్నారు. ఇంతకు ముందున్న నాయకుల అసమర్థత వల్లే అమెరికా వాణిజ్యం ఇలా తయారైందన్నారు.