ఎగుమతులు ఓకే, కానీ.. | Indian exports rise for 12th straight month, grow 10.29% in August | Sakshi
Sakshi News home page

ఎగుమతులు ఓకే, కానీ..

Published Sat, Sep 16 2017 1:11 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

ఎగుమతులు ఓకే, కానీ..

ఎగుమతులు ఓకే, కానీ..

► ఆగస్టులో 10% పైగా వృద్ధి
► ఆందోళనలో వాణిజ్య లోటు 11.65 బిలియన్‌ డాలర్లుగా నమోదు


న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతుల వృద్ధి ఆగస్టులో 10.29 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయి వృద్ధి రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ఆగస్టులో ఎగుమతుల విలువ 23.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజ నీరింగ్, కెమికల్స్‌ ఎగుమతులు ఇందుకు సానుకూలంగా నిలిచాయని వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. అయితే హస్తకళలు, రత్నాలు ఆభరణాలు, పండ్లూ, కూరగాయల ఎగుమతులు తగ్గాయి.

దిగుమతుల్లో భారీ వృద్ధి...
ఇక ఆగస్టు నెలలో దిగుమతులూ భారీగా పెరిగాయి. ఈ విలువ 21.02 శాతం పెరుగుదలతో 35.46 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11.65 బిలియన్‌ డాలర్లకు చేరింది. జూలైలో ఈ విలువ 11.40 బిలియన్‌ డాలర్లుకాగా, గత ఏడాది ఇదే నెలలో 7. 71 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

పసిడి దెబ్బ...
దిగుమతులు భారీగా పెరిగి, వాణిజ్యలోటు కొంత ఆందోళన కలిగించడానికి బంగారం అధిక దిగుమతులూ కారణంగా నిలిచాయి. పసిడి దిగుమతులు దాదాపు 69 శాతం పెరిగి 1.88 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక మొత్తం దిగుమతుల వాటాలో చమురు దిగుమతులు 14.22 శాతం పెరిగి 7.75 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఎగుమతులు 8.57 శాతం పెరిగి 118.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు  26.63 శాతం పెరిగి 181.71 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనితో వాణిజ్యలోటు ఈ కాలంలో 63.14 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

క్యాడ్‌ భారం
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం– కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 2.4 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో భారీగా 14.3 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు పెరిగి ఏర్ప డిన  అధిక వాణిజ్యలోటు దీనికి కారణం. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్‌ 0.4 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కూడా క్యాడ్‌ ఇప్పటికన్నా తక్కువగా 0.6 శాతంగా (3.4 బిలియన్‌ డాలర్లు) నమోదయ్యింది.

ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్‌. క్యాడ్‌ ఎంత పెరిగితే అంతమేర ఆ దేశం ఇతర దేశాలకు రుణగ్రస్త దేశంగా మారుతుంది. ఇది ఆ దేశం మారక విలువ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. నాలుగేళ్లక్రితం ఇలాంటి సమస్యే వచ్చినప్పుడు కేంద్రం పసిడి దిగుమతులపై కఠిన నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement