డిసెంబర్‌లో 38 బిలియన్ డాలర్లు
దిగుమతులు 5% అప్; 59.95 బిలియన్ డాలర్లు
22 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు పరిమితం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో స్వల్పంగా ఒక్క శాతం తగ్గి 38.01 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా దిగుమతులు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌లో పెట్రోలియం, రత్నాభరణాలు, రసాయనాల ఎగుమతుల వృద్ధి నెమ్మదించింది. అయితే, జౌళి, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా నమోదయ్యాయి.
మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఎగుమతుల గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్ తెలిపారు. వాణిజ్య గణాంకాలను సమగ్రంగా విశ్లేషించే విదంగా కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫాంను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా వాణిజ్యానికి సవాళ్లతోపాటు కమోడిటీలు, లోహాల ధరల్లో హెచ్చుతగ్గులే ఎగుమతుల క్షీణతకు దారి తీసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 1.6 శాతం పెరిగి 321.71 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.15 శాతం పెరిగి 532.48 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 189.74 బిలియన్ డాలర్ల నుంచి 210.77 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇతర వివరాల్లోకి వెళ్తే..
→ డిసెంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 29 శాతం క్షీణించి 4.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
→ ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ఏకంగా 35.11 శాతం పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. 24 నెలల్లో ఇది గరిష్ట స్థాయి.
→ బంగారం దిగుమతులు 55 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులు 211 శాతం పెరిగి 421.91 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
→ సేవల రంగం ఎగుమతులు 31.63 బిలియన్ డాలర్ల నుంచి 32.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
→ సవరించిన గణాంకాల ప్రకారం 2024 నవంబర్‌లో ఎగుమతులు 5 శాతం తగ్గి 32.03 బిలియన్ డాలర్లకు క్షీణించగా, దిగుమతులు 16 శాతం పెరిగి 63.86 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 31.83 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్‌లో పసిడి దిగుమతులను 9.84 బిలియన్ డాలర్లకు సవరించారు.
→ డిసెంబర్‌లో అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు భారత్ అత్యధికంగా ఎగుమతులు చేయగా .. చైనా స్విట్జర్లాండ్, థాయ్‌ల్యాండ్, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment