exports decline
-
భారత్‌కు ‘వాణిజ్య లోటు’ భయాలు!
న్యూఢిల్లీ: భారత్‌కు వాణిజ్యలోటు సవాళ్లు తలెత్తుతున్నాయి. ఎగుమతులు నవంబర్‌లో అసలు పెరగకపోగా, 4.85 శాతం క్షీణించి (2023 ఇదే నెలతో పోల్చి) 32.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతులు భారీగా 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఆల్‌టైమ్ హై 32.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వంట నూనెలు, ఎరువులు, పసిడి వెండి దిగుమతులు భారీగా పెరగడం మొత్తం వాణిజ్యలోటు తీవ్రతకు దారితీసిందని వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. → పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. → క్రూడ్ ఆయిల్ దిగుమతులు సమీక్షా నెల్లో 7.9 శాతం పెరిగి 16.11 బిలియన్ డాలర్లకు చేరాయి. → పెట్రోలియం ప్రొడక్టుల దిగుమతులు 50 శాతం తగ్గి, 3.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. → జౌళి, ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్స్, ఫార్మా, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు బాగున్నాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య ఇలా.. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31గా నమోదయ్యాయి. దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనితో వాణిజ్యలోటు 202.42 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 170.98 బిలియన్ డాలర్లు. కాగా, ఎనిమిది నెలల్లో పసిడి దిగుమతులు 49 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లకు ఎగశాయి. సేవల రంగం ఇలా.. నవంబర్‌లో సేవల ఎగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 28.11 బిలియన్ డాలర్ల నుంచి 35.67 బిలియన్ డాలర్లకు చేరాయి. -
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి 0.2 శాతం ఎగుమతులు తగ్గినట్లు కస్టమ్స్ డేటా ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే ముడి ఖనిజాల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉంది. దాదాపు 17 అరుదైన ఖనిజాలను ఆ దేశం రవాణా చేస్తుంది. ఈమేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డేటా వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.2024 ఏప్రిల్‌లో చైనా ఎగుమతులు: 4,566 టన్నులు.2023 ఏప్రిల్‌లో ఎగుమతులు: 4,574 టన్నులు2024 మార్చిలో ఎగుమతులు: 4,709.6 టన్నులు 2024 మొదటి నాలుగు నెలల్లో మొత్తం ఎగుమతులు: 18,049.5 టన్నులుఏడాదివారీగా పెరుగుదల: 10 శాతం2024 ఏప్రిల్‌లో చైనా దిగుమతి చేసుకున్న ఖనిజాలు: మార్చితో పోలిస్తే 32.5% తగ్గి 13,145.9 టన్నులకు చేరుకున్నాయి.2024 మొదటి నాలుగు నెలల కాలంలో దిగుమతులు మొత్తం 18.1% తగ్గి 48,842.5 టన్నులుగా నమోదయ్యాయి.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. చైనా ప్రపంచవ్యాప్తంగా 70 శాతం అరుదైన ఖనిజాలను కలిగి ఉంది. 90 శాతం మైనింగ్ రిఫైన్డ్ అవుట్‌పుట్ సామర్థ్యం చైనా సొంతం. చైనా ఎగుమతిచేసే అరుదైన ఖనిజాలతో లేజర్లు, సైనిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు , విండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుచైనా ఇలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తుంటే సమీప భవిష్యత్తులో వీటితో తయారయ్యే వస్తువుల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయంగా ఖనిజాల అన్వేషణ జరిపి వాటిని వెలికితీసే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఈనెల 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఎగుమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి సరఫరాను మెరుగుపరిచేందుకు, ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. -
కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో క్షీణత
ముంబై: కట్, పాలిష్డ్ వజ్రాల (సీపీడీ) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం తగ్గి 17.2 బిలియన్ డాలర్లుగా (రూ.1.42 లక్షల కోట్లు) ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, యూరప్ వంటి కీలక వినియోగ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో డిమాండ్ తగ్గిన విషయాన్ని ప్రస్తావించింది. ‘‘2022–23 ద్వితీయ ఆరు నెలల నుంచి సీపీడీల ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో చూసినా (ఏప్రిల్–ఆగస్ట్) ఎగుమతులు 31 శాతం తక్కువగా నమోదయ్యాయి’’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రానున్న నెలల్లో ఎగుమతులు సీక్వెన్షియల్‌గా (క్రితం నెలతో పోలి్చనప్పుడు) పెరగొచ్చని పేర్కొంది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరానికి 22 శాతం తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డైమండ్ల డిమాండ్‌లో చైనా వాటా 10–15 శాతంగా ఉంటుంది. చైనా మార్కెట్లో ఈ డిమాండ్ ఇంకా చెప్పుకోతగినంతగా పుంజుకోలేదు‘‘అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సాక్షి సునేజా తెలిపారు. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాలు చాలా తక్కువ ధరలో లభిస్తుండడం కూడా అధిక పోటీకి కారణమవుతున్నట్టు చెప్పారు. గరిష్ట స్థాయిలో ముడి వజ్రాల ధరలు ముడి వజ్రాల ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయని ఇక్రా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ధరలు 15 ఏళ్ల మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, మైనింగ్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే గడిచిన రెండేళ్ల కాలంలో ధరలు పెరగడానికి దారితీసినట్టు వివరించింది. ప్రస్తుతం డిమాండ్ తగ్గినప్పటికీ రష్యా నుంచి ముడి వజ్రాల సరఫరా తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన అల్రోసా పీజేఎస్సీ మైనింగ్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో ఇతర మైనింగ్ సంస్థల నుంచి అదనపు సరఫరా రాకపోవడం ధరలకు రెక్కలు వచి్చనట్టు వివరించింది. పాలిష్డ్ వజ్రాల ధరలపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల మధ్యస్థ స్థాయి కంటే 15–20 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనికి తోడు డిమాండ్‌పై ఒత్తిళ్లు, కస్టమర్లకు ధరల పెంపును బదిలీ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడంతో, వజ్రాల కంపెనీల లాభాల మార్జిన్లు 0.4 శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేసింది. నిల్వలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఎగుమతిదారులకు వెసులుబాటు 2024 జూన్ వరకూ ఆర్ఓడీటీఈపీ స్కీమ్ వర్తింపు ఎగుమతిదారుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆర్ఓడీటీఈపీ స్కీమ్ (స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పథకాన్ని 2024 జూన్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సెపె్టంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం, 10,342 పైగా ఎగుమతి వస్తువులు ఈ పథక ప్రయోజనాల కిందకు వస్తున్నాయి. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన పథకం ఇది. వస్తువుల తయారీ– పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించే పన్నులు, సుంకాలు, లెవీల వాపసు కోసం ఉద్దేశించినది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనివ్వనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఇంజినీరింగ్ ఎగుమతుల్లో క్షీణత
కోల్‌కతా: ఇంజనీరింగ్ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 123.65 మిలియన్ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది. ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000 -
క్యూ1లో ఆటోమొబైల్ ఎగుమతులు డౌన్
ముంబై: భారత ఆటోమొబైల్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది. ► ఈ జూన్ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్–జూన్ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి. ► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. ► యుటిలిటీ వెహికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి. ► త్రీవీలర్ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి. ► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్ ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
మేలో తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు
ముంబై: రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 11 శాతం తగ్గాయి. రూ.22,693 కోట్ల విలువైన ఎగమతులు నమోదయ్యాయి. 2022 మే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ.25,413 కోట్లుగా ఉంది. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీఏఈపీసీ) ఈ వివరాలు వెల్లడించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు 12 శాతానికి పైగా తగ్గాయి. వీటి విలువ రూ.14,190 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ రూ.16,154 కోట్లుగా ఉండడం గమనార్హం. ల్యాబ్‌లో తయారైన వజ్రాల ఎగుమతుల విలువ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం తగ్గి రూ.1,986 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్, మే నెలల్లో వీటి ఎగుమతుల విలువ రూ.2,500 కోట్లుగా ఉంది. మే నెలకు సంబంధించి బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 7 శాతానికి పైగా పెరిగి రూ.5,705 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.5,318 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో రూ.1,173 కోట్లు విలువ చేసే వెండి ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.3,729 కోట్లతో పోలిస్తే 68 శాతం క్షీణించాయి. -
ఎగుమతులు.. మూడో నెలా మైనస్
న్యూఢిల్లీ: ప్రపంచ, దేశీయ తాజా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతి, దిగుమతి గణాంకాలు అద్దం పడుతున్నాయి. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ఎగుమతులు వరుసగా మూడవ నెల ఫిబ్రవరిలోనూ వృద్ధిలేకపోగా క్షీణతనే నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల విలువ 8.8 శాతం పడిపోయి, 33.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల్లోనూ 8.21 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. 2022 ఇదే నెలతో పోల్చితే ఈ విలువ 55.9 బిలియన్ డాలర్ల నుంచి 51.31 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వెరసి అధికారిక గణాంకాల ప్రకారం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 17.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య... 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య 11 నెలల్లో వస్తు ఎగుమతులు 7.5% పెరిగి, 406 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే కాలంలో దిగుమతులు 18.82% పెరిగి 653 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 247 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లు తాకాయి. 2022-23లో ఈ విలువను అధిగమిస్తున్నామన్న హర్షాతిరేకాలు భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ)సహా సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ► 11 నెలల్లో పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ గూడ్స్, బియ్యం, రెడీ మేడ్ దుస్తుల ఎగుమతులు పెరగ్గా, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాభరణాలు, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్, ప్లాసిక్, లినోలియం ఎగుమతులు క్షీణించాయి. ► పసిడి దిగుమతులు ఇదే కాలంలో భారీగా పడిపోయి, 45.12 బిలియన్ డాలర్ల నుంచి 31.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు 11 నెలల్లో 140.67 బిలియన్ డాలర్ల నుంచి 193.47 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
మన ఎగుమతులపై అంతర్జాతీయ సవాళ్ల ప్రభావం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, మాంద్యం పరిస్థితుల ప్రభావం భారత ఎగుమతులపై ఉండడం సహజమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో బలహీనత ఉండొచ్చన్నారు. అదే సమయంలో సేవల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్టు అభివర్ణించారు. టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు (ద్రవ్యోల్బణం) ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత మన దేశ ఎగుమతులు అక్టోబర్ నెలకు ప్రతికూల జోన్‌కు వెళ్లడం గమనార్హం. 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జ్యుయలరీ, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీ మేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఫార్మా, మెరైన్, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య లోటు సైతం 26.91 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం 33 శాతం పెరిగి 437 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
ఆరోనెలా అగాధంలోనే ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా ఆరవ నెల ఆగస్టులోనూ క్షీణతలోనే కొనసాగాయి. 2019 ఆగస్టుతో పోల్చిచూస్తే, 12.66 శాతం క్షీణించి 22.70 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ ధోరణి దీనికి ప్రధాన కారణం. ఇక దేశీయంగా కూడా తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితులను సూచిస్తూ, దిగుమమతులు 26 శాతం క్షీణించాయి. విలువలో 29.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 6.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... * పెట్రోలియం, తోలు, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాలు, ఆభరణాలు ఎగుమతుల్లో క్షీణత నమోదయ్యింది. * పసిడి దిగుమతులు మాత్రం దాదాపు మూడురెట్లు పెరిగి 3.7 బిలియన్ డాలర్లకు చేరాయి. 2019 ఆగస్టులో ఈ విలువ 1.36 బిలియన్ డాలర్లు. * 5 నెలల్లో 20.72 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య చూస్తే, ఎగుమతులు 26.65 శాతం క్షీణతతో 97.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 43.73 శాతం క్షీణతతలో 118.38 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 20.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. (ఫ్లిప్‌కార్ట్‌లో 70వేల ఉద్యోగాలు ) -
మళ్లీ ‘జారుడు బల్ల’పై ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో మళ్లీ పడిపోయాయి. 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు. ఈ విలువ –2.15 శాతం క్షీణించింది. మార్చి (–0.66 శాతం) తరువాత ఎగుమతులు క్షీణతలోకి జారడం ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగితే, దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) మరింత తీవ్రమై, డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు కూడా అనిశ్చితిగా ఉండడం ఇక్కడ గమనార్హం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ♦ సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్ డాలర్లు. 2017 ఇదే నెలలో ఈ విలువ 28.56 బిలియన్ డాలర్లు. ♦ దిగుమతులు 10.45 శాతం పెరిగాయి. విలువ రూపంలో 37.9 బిలియన్ డాలర్ల నుంచి 41.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. ♦ సెప్టెంబర్‌లో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 13.98 బిలియన్ డాలర్లు. గడచిన ఐదు నెలల్లో ఇది కనిష్టస్థాయి. చమురు ధరలు తీవ్ర స్థాయిలో ఉన్నా... వాణిజ్యలోటు తగ్గడం గమనార్హం. ♦ సెప్టెంబర్‌లో ఎగుమతులకు సంబంధించి మంచి వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో పెట్రోలియం ప్రొడక్టులు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్, ఔషధ రంగాలు ఉన్నాయి. ♦ ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య ఎగుమతుల విలువలో 12.54% వృద్ధి నమోదయ్యింది. దిగుమతుల్లో వృద్ధి 16.16 శాతం. ఇక ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వాణిజ్యలోటు 94.32 బిలియన్ డాలర్లు. ఆందోళన అక్కర్లేదు...: కేంద్రం ‘2017 సెప్టెంబర్‌లో హై బేస్ ఎఫెక్ట్ వల్ల 2018 సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ తగ్గినట్లు గణాంకాలు వచ్చాయి. 2017 సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అసాధారణ రీతిలో 26%గా నమోదయ్యింది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు గడువు ముగింపు నేపథ్యంలో జరిగిన భారీ ఎగుమతులు దీనికి కారణం. తాజా గణాంకాలను తాత్కాలికమైన ధోరణిగానే పరిగణించవచ్చు. ఎగుమతులు మళ్లీ మంచి వృద్ధి రేటుకు చేరుకోవడం ఖాయం. అక్టోబర్ నుంచే ఈ పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో వృద్ధి ధోరణి మున్ముందూ కొనసాగుతుంది’ అని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. -
ఎగుమతుల క్షీణత ఆగింది
• వృద్ధి నిదానంగానే: నిర్మలా సీతారామన్ • వాణిజ్య సమాచారంతో డాష్‌బోర్డ్ ప్రారంభం న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణత ఆగిపోయిందని, వృద్ధి మాత్రం నిదానంగా ఉండవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాబోయే నెలల్లో ఎగుమతుల తీరు ఎలా ఉంటుందున్న విలేకరుల ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... ‘ప్రస్తుతం ఎగుమతుల క్షీణత ఆగిపోయిందన్నది స్పష్టం. నిలకడైన వృద్ధి కోసమే చూస్తున్నాం. ఎగుమతుల్లో వృద్ధి నిదానంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉంటుంది’ అని చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల సమస్త సమాచారం విదేశీ వాణిజ్య సమాచారానికి సంబంధించిన డాష్‌బోర్డ్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ విండో ద్వారా అంతర్జాతీయంగా భారత్ స్థానం ఏంటి, భారత్ నుంచి ఏ దేశం సరుకులను దిగుమతి చేసుకుంటోంది, దేశం నుంచి అన్ని రకాల ఎగుమతులు, దిగుమతులు, పోర్టులు, ప్రాంతాల వారీగా ఇలా సమస్త సమాచారం ఇక్కడ లభ్యమవుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత రెండు సంవత్సరాల డేటాను అందుబాటులో ఉంచినట్టు ఆమె చెప్పారు. దేశీయ ఎగుమతులు, దిగుమతులు, ఈ రెండింటి మధ్య వాణిజ్యంలో తేడా తదితర వివరాలను విశ్లేషణ విధానంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంలో భాగంగానే ఈ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. ఈ సంపూర్ణ సమాచారం ఆధారంగా దేశం నుంచి ప్రత్యేకంగా ఓ దేశానికి జరిగే ఎగుమతులు, దిగుమతుల సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చన్నారు. ఈ డాష్‌బోర్డ్ ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ఎగుమతి దారుల సమాఖ్య, పరిశోధకులు, విశ్లేషకులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టుల నుంచి జరిగే లావాదేవీల సమాచారాన్ని అవి మాన్యువల్‌గా పంపుతున్నాయని, దీంతో నెల తర్వాత సంబంధిత వాణిజ్య వివరాలను విడుదల చేస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. చాలా పోర్టులు డిజిటైజేషన్ కావాల్సి ఉందన్నారు. ఇందుకు సమయం పడుతుందని, త్వరలోనే రియల్‌టైమ్ డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.