కోల్‌కతా: ఇంజనీరింగ్ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపయ్యాయి.
123.65 మిలియన్ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది.
ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000
Comments
Please login to add a commentAdd a comment