EEPC India
-
ఇంజినీరింగ్ ఎగుమతుల్లో క్షీణత
కోల్‌కతా: ఇంజనీరింగ్ ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెల, జూలైలోనూ క్షీణతను చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం వరకు తగ్గి 8.75 బిలియన్ డాలర్లు (రూ.72,625 కోట్లు)గా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 76 శాతం వాటా కలిగిన 25 మార్కెట్లలో.. 14 దేశాలకు ఎగుమతులు జూలైలో క్షీణించాయి. రష్యాకు ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 123.65 మిలియన్ డాలర్ల (రూ.1025 కోట్లు) విలువ మేర ఎగుమతులు రష్యాకు వెళ్లాయి. క్రితం ఏడాది ఇదే నెలలో రష్యాకు ఇంజనీరింగ్ ఉత్పత్తులఎగుమతులు 55.65 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జూలై నెలలో అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతులు 10 శాతం మేర క్షీణించి 1.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాకు సైతం ఈ ఉత్పత్తుల ఎగుమతులు 10 శాతం తగ్గి 198 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) విడుదల చేసింది. ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎగుమతులు క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం తెలిసిందే. చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుండడం మన ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను ఇతర మార్కెట్లలోకి వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా అభిప్రాయపడ్డారు. ‘‘2022 డిసెంబర్ నుంచి వరుసగా ఎనిమిది నెలల పాటు ఎగుమతులు క్షీణించడం అన్నది అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలో ఉందని తెలియజేస్తోంది. భారత ఎగుమతిదారులు ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాలకు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకునేందుకు ఇది ఒక అవకాశం’’అని గరోడియా సూచించారు.0000 -
భారత ఎగుమతుల్లో అమెరికాకే ఎక్కువ!
కోల్‌కతా: భారత్ నుంచి మే నెలలో ఎగుమతుల పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉందని ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల మండలి ఈఈపీసీ తెలిపింది. చైనాకు గత నెలలో భారత్ నుంచి ఎగుమతులు 52 శాతం తగ్గినట్టు పేర్కొంది. భారత ఇంజనీరింగ్ ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 25 ఎగుమతి మార్కెట్లలో 18 మార్కెట్లకు సానుకూల వృద్ధి నమోదైనట్టు ప్రకటించింది. ‘‘మే నెలలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 9.79 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2021లో మే నెల ఎగుమతులు 8.62 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది’’అని ఈఈపీసీ తెలిపింది. ఐరన్ ఓర్, స్టీల్, స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులు 16 శాతం పెరిగి 2.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికాకు ఎగుమతులు 63 శాతం పెరిగి 1.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చైనాకు ఎగుమతులు 52 శాతం తగ్గి 217 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 452 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనాలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలవుతుండడం గమనార్హం. -
అమెరికా ‘షట్‌డౌన్’తో భారత్ ఎగుమతులకు దెబ్బ
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత(షట్‌డౌన్)తో భారత్ ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యయాలు, బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో సోమవారం అర్ధరాత్రి నుంచే షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెల్త్‌కేర్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ బడ్జెట్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడంతో ఆమోదం పొందలేదు. దీనివల్ల కీలకమైన రక్షణ తదితర అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాల మూసివేతకు దారితీసింది. బడ్జెట్ నిధుల విడుదల ఆగిపోవడంతో... 8 లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలేక తప్పనిసరిగా వాళ్లు సెలవుపై విధులను బహిష్కరించాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘షట్‌డౌన్‌తో భారత్ ఎగుమతులకు దెబ్బే. అమెరికాలోని పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాల నిలిపివేత ప్రభావమే దీనికి ప్రధాన కారణం’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. షట్‌డౌన్ భారత్‌కు ప్రతికూల పరిణామమని, మన ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఇంజనీరింగ్ ఎగుమతిదారుల సంఘం ఈఈపీసీ ఇండియా అభిప్రాయపడింది. అమెరికా ఉద్యోగులు విధుల బహిష్కరణతో.. పోర్టులు, కార్గో సంబంధ నియంత్రణ అనుమతులు నిలిచిపోనున్నాయని, కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఆపేస్తారని పేర్కొంది. కాగా, అమెరికా ‘షట్‌డౌన్’వల్ల భారత్ ఐటీ, ఐటీఈఎస్ రంగంపై తక్షణం ప్రభావం ఉండకపోవచ్చనినాస్కామ్ పేర్కొంది. ఫార్మా ఎగుమతిదార్లూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, షట్‌డౌన్ అనేది ఎక్కువకాలం కొనసాగితే అక్కడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని.. మన ఐటీ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది.