న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత(షట్‌డౌన్)తో భారత్ ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యయాలు, బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో సోమవారం అర్ధరాత్రి నుంచే షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెల్త్‌కేర్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ బడ్జెట్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడంతో ఆమోదం పొందలేదు. దీనివల్ల కీలకమైన రక్షణ తదితర అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాల మూసివేతకు దారితీసింది. బడ్జెట్ నిధుల విడుదల ఆగిపోవడంతో... 8 లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలేక తప్పనిసరిగా వాళ్లు సెలవుపై విధులను బహిష్కరించాల్సిన పరిస్థితి తలెత్తింది.
‘షట్‌డౌన్‌తో భారత్ ఎగుమతులకు దెబ్బే. అమెరికాలోని పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాల నిలిపివేత ప్రభావమే దీనికి ప్రధాన కారణం’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. షట్‌డౌన్ భారత్‌కు ప్రతికూల పరిణామమని, మన ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఇంజనీరింగ్ ఎగుమతిదారుల సంఘం ఈఈపీసీ ఇండియా అభిప్రాయపడింది. అమెరికా ఉద్యోగులు విధుల బహిష్కరణతో.. పోర్టులు, కార్గో సంబంధ నియంత్రణ అనుమతులు నిలిచిపోనున్నాయని, కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఆపేస్తారని పేర్కొంది. కాగా, అమెరికా ‘షట్‌డౌన్’వల్ల భారత్ ఐటీ, ఐటీఈఎస్ రంగంపై తక్షణం ప్రభావం ఉండకపోవచ్చనినాస్కామ్ పేర్కొంది. ఫార్మా ఎగుమతిదార్లూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, షట్‌డౌన్ అనేది ఎక్కువకాలం కొనసాగితే అక్కడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని.. మన ఐటీ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది.
అమెరికా ‘షట్‌డౌన్’తో భారత్ ఎగుమతులకు దెబ్బ
Published Wed, Oct 2 2013 2:46 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement