వాషింగ్టన్:ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పనిగంటల పెంపు వ్యాఖ్యల వివాదం అమెరికాను తాకింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ బిలియనీర్ ఇలాన్‌మస్క్ ఈ విషయంలో నారాయణమూర్తి కంటే చాలా అడుగులు ముందుకు వేశారు. తాను తన డీవోజీఈ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఏకంగా వారానికి 120 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని అందుకే పౌరులు చెల్లిస్తున్న పన్ను సొమ్ము వృథా అవుతోందని మస్క్ తెలిపారు. ఈ మేరకు మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై డీవోజీఈ చేస్తున్న ఆడిట్‌లో సంచలన విషయాలు బయట పడుతున్నాయని, ప్రజల డబ్బు ఎలా దుర్వినియోగమవుతోందో తెలుస్తోందని మస్క్ అన్నారు.
DOGE is working 120 hour a week. Our bureaucratic opponents optimistically work 40 hours a week. That is why they are losing so fast. https://t.co/dXtrL5rj1K
— Elon Musk (@elonmusk) February 2, 2025
అయితే డీవోజీఈ ఆడిట్‌లపై ఉద్యోగుల సంఘాలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా బ్యూరోక్రసీని సమర్థవంతంగా తయారుచేసేందుకు ట్రంప్ డీవోజీఈ చీఫ్‌గా మస్క్‌ను నియమించిన విషయం తెలిసిందే.
కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తితో పాటు ఎల్‌అండ్‌టీ చీఫ్ సుబ్రమణియన్ తదితరులు ఎక్కువ పనిగంటల విధానమే మేలని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. అయితే భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే మాత్రం 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment